- ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళి అర్పించిన లోకేశ్
- హారతి ఇచ్చి తిలకం దిద్దిన భార్య బ్రాహ్మణి
హైదరబాద్,జనవరి25: ఈనెల 27 నుంచి ఏపీలో ’యువగళం’ పాదయాత్రకు సిద్ధమవుతున్న టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బుధవారం హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. తొలుత ఇంటి వద్ద లోకేశ్ తన తల్లిదండ్రులు చంద్రబాబు, భువనేశ్వరి, అత్తమామలు బాలకృష్ణ, వసుంధర కాళ్లకు నమస్కరించి వారి ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం ఆయన సతీమణి నారా బ్రహ్మణి హారతిచ్చారు. ఆ తర్వాత లోకేశ్ ఎన్టీఆర్ ఘాట్‌కు వెళ్లారు.
తాత ఎన్టీఆర్‌కు పుష్పాంజలి ఘటించారు. అనంతరం ఎన్టీఆర్ ఘాట్ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి కడపకు బయలుదేరారు. ఎన్టీఆర్ ఘాట్‌కు లోకేశ్ వెళ్లే సమయంలో పెద్ద ఎత్తున యువత ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ టిడిపి అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్, సీనియర్ నేత కంభంపాటి రామ్మోహన్‌రావు పాల్గొన్నారు.