‘‌స్థానికత’ మీద సాము ..!

“తెలంగాణ వ్యతిరేకులు, ఆంధ్రా పార్టీలతో తమ ఆకాంక్షలకు వ్యతిరేకంగా జత కడితే అంగీకరించేది లేదని రాష్ట్ర సాధనే ధ్యేయంగా ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె చంద్రశేఖర్‌ ‌రావును కూడా 2009 ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించారు. మలి దశ ఉద్యమ సందర్భంలో ..తెలంగాణ జెఏసి ఆవిర్భావం మొదలు…రాష్ట్రం ఏర్పడే వరకు పలు ఉద్యమాల్లో ముందు వరుసలో నిలిచి..ఉద్యమకారులకు అత్యంత సన్నిహితుడయిన ప్రొ. కోదండరామ్‌ను కూడా 2018 అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు పార్టీతో జత కట్టినందుకు అంగీకరించలేదు. తెలంగాణ ప్రాంతంలో ఆంధ్ర పార్టీలకు గానీ ..ఆ ప్రాంతం నుంచి వొచ్చిన నాయకులకు స్థానం ఉండదని 2009, 2018 ఎన్నికల్లో వోటరు స్పష్టమయిన తీర్పునిచ్చారు.”

దేవులపల్లి అజయ్‌
‌దక్కన్‌.‌కామ్

ప్రపంచీకరణ, సరళీకృత ఆర్థిక విధానాల నేపథ్యంలో ఈ రోజు ప్రపంచం ఒక కుగ్రామమయింది. అయినా అమెరికా లాంటి అగ్ర దేశంలో సైతం స్థానికత అంశం ఇంకా రగులుతూనే ఉన్నది. అందుకు ఉదాహరణ ఇటీవల ఆ దేశ అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికలు. స్థానికత, స్థానిక పౌరులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ప్రధాన అంశంగా ఎన్నికల బరిలో దిగిన..ఓడిపోయిన డొనాల్డ్ ‌ట్రంప్‌కు ఆ దేశ పౌరుల నుంచి లభించిన ఆదరణ అనూహ్యం. పరిస్థితులు ఎంత దూరం వెళ్ళాయంటే..అమెరికా అధ్యక్ష అధికారం భవనం పై దాడుల దాక …! ఈ ఎన్నికల్లో రిపబ్లికన్‌ ‌పార్టీ మరియు డెమొక్రాట్ల మధ్య జరిగిన హోరాహోరీ పోరులో డెమొక్రాట్ల అభ్యర్థి బిడెన్‌ అధ్యక్షునిగా …అమెరికాలో స్థిరపడ్డ ప్రవాస భారతీయురాలు కమల హారీస్‌ ఉపాధ్యక్షురాలిగా బొటాబొటి ఆధిక్యతతో విజయం సాధించారు. ప్రవాస భారతీయురాలు కమల హారీస్‌ అమెరికా దేశ ఉపాధ్యక్షురాలుగా ఎన్నిక కావడం మన దేశంలోని అధిక శాతం ప్రజలకు గౌరవంగా అనిపించింది. కొందరు బహిరంగంగా సంతోషం వ్యక్తం చేస్తే ..కొందరో లోలోపల ఆనంద పడ్డారు. కానీ అమెరికా దేశంలో మాత్రం శ్వేత జాతికి చెందని ఒక ఆసియా అమెరికా మహిళా ఆ దేశ చరిత్రలో తొలి సారి ఉపాధ్యక్షురాలిగా ఎన్నిక కావడం హర్షం వ్యక్తం చేయగా ..కొందరు ఆమె స్థానికతపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందిందని అంచనాలున్న అమెరికా లాంటి అగ్ర దేశంలో కూడా స్థానికత అంశం రగులుతూనే ఉన్నది …ప్రపంచీ కరణ, సరళీకృత ఆర్థిక విధానాలు వివిధ దేశాలకు వ్యాపార, వాణిజ్య రంగాలకు దర్వాజాలు తెరిచి ఉండవొచ్చు…..ఉద్యోగ, ఉపాధి అవకాశాలు విస్తృతంగా విస్తరించి ఉండవొచ్చు…కానీ అదే సమయంలో పరాయి దేశస్థులు లేదా ఇతర ప్రాంతం వాళ్లు తమ అవకాశాలను దెబ్బతీస్తున్నారని స్థానికులు ఆందోళన చెందడం సమంజసమే. సమయం..సందర్భాన్ని బట్టి రాజకీయ పార్టీలు స్థానిక అంశాన్ని..ప్రజల మనోభావాలను తమకు అనుకూలంగా మలుచుకోవడం గమనిస్తున్నాం..!

తమ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, వనరులు, నీళ్లు, నిధులు ఉమ్మడి ఆంద్ర రాష్ట్రంలో కోల్పోయామని..ప్రత్యేక రాష్ట్రంగా ఉన్న తెలంగాణ ప్రాంతంను బలవంతంగా ఆంధ్రాలో విలీనం చేశారని..విడిపోవడానికి జరిగిన 60 సంవత్సరాల ఉద్యమం మన కళ్ళ ముందున్నది..చరిత్రలో లిఖించబడింది ..! 1969 ఉద్యమం, మలిదశ ఉద్యమ చరిత్రలోకి లోతుగా పోకుండా..కేవలం స్థానికత, వలస పాలన అంశంపై అధ్యయనం చేస్తే తెలంగాణ ప్రజలు వలస పాలనకు వ్యతిరేకంగా స్థానికతకు ఇచ్చిన ప్రాధాన్యత 2004 ఎన్నికల నుంచి 2018 సార్వత్రిక ఎన్నికల వరకు ఆసక్తికర అంశాలు గమనించవొచ్చు. 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావం తరువాత 2004 సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ అంశం ప్రాధాన్యతను సంతరించుకుంది. రాష్ట్ర సాధనే ధ్యేయం నినాదంతో కె. చంద్ర శేఖర్‌ ‌రావు స్థాపించిన తెలంగాణ రాష్ట్ర సమితితో వంద సంవత్సరాల చరిత్ర గలిగిన కాంగ్రెస్‌ ‌పార్టీ పొత్తు పెట్టుకుని అధికారంలోకి రాగలిగింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా అధికార తెలుగు దేశం పార్టీ తెలంగాణ ప్రాంతంలో కేవలం 12 స్థానాలకు పరిమితం కాగా..కాంగ్రెస్‌, ‌టీఆరెస్‌ల కూటమి 80 స్థానాలకు పైగా కైవసం చేసుకోగలిగింది. తెలంగాణ ప్రజలు తెలంగాణ రాష్ట్ర సమితిని తమ సొంత పార్టీగా, స్థానిక పార్టీగా అక్కున చేర్చుకుని.. ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్‌ ‌పార్టీని కూడా ఆదరించారు. అప్పటినుంచే తెలంగాణలో చంద్రబాబు నాయకత్వంలోని తెలుగు దేశం పార్టీని ఇక్కడి ప్రజలు ఆంధ్ర పార్టీగానే గుర్తిస్తున్నారు. తమ ప్రాంతానికి చెందని పార్టీని గానీ, నాయకుణ్ణి గాని తెలంగాణ ప్రజలు అంగీకరించడం లేదు.

తెలంగాణ ప్రాంతంలో పార్టీ పరిస్థితిని, ప్రజల భావోద్వేగాలను గమనించిన చంద్రబాబు లేఖ రూపంలో రాష్ట్ర విభజన అనుకూలమంటూ…2009 సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితితో పొత్తు పెట్టుకుని …రాష్ట్ర విభజనను తీవ్రంగా వ్యతిరేకించిన భారత కమ్యూనిస్ట్ ‌పార్టీ(మార్క్సిస్టు)తో కలిసి మహాకూటమి పేరుతో బరిలోకి దిగింది. ఆ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయం ప్రకటించుకున్న తెలంగాణ రాష్ట్ర సమితికి ప్రజలు ఆ పార్టీ కర్తవ్యాన్ని గుర్తు చేశారు. తెలంగాణ వ్యతిరేకులు చంద్రబాబు, సిపీఎంలతో టీఆర్‌ఎస్‌ ‌పొత్తు తెలంగాణ ప్రజలు జీర్ణించుకోలేక పోయారు. తమ ఆకాంక్షను తెలంగాణ రాష్ట్ర సమితికి వ్యతిరేకంగా వోటు వేసి వ్యక్తపరిచారు. పొత్తులో భాగంగా 45 స్థానాల్లో పోటీ చేసిన టీఆర్‌ఎస్‌ 9 ‌స్థానాలు మాత్రమే గెలవగలిగింది. పరాయి పార్టీలు, వలస నాయకులతో పొత్తు పెట్టుకుంటే ఎంతటి వారయినా తమకు ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేశారు. 2006 కరీంనగర్‌ ‌లోక్‌సభ ఉప ఎన్నికల్లో 2 లక్షల ఆధిక్యతతో విజయం సాధించిన కె చంద్రశేఖర్‌ ‌రావు..2009 మహబూబ్‌ ‌నగర్‌ ‌లోక్‌సభ స్థానానికి పోటీ చేసి కేవలం 4 వేల వోట్ల ఆధిక్యతతో గెలిచారు. పార్టీ అధ్యక్ష పదవికి కె చంద్రశేఖర్‌ ‌రావు రాజీనామా చేసే దాకా పరిస్థితులు దారితీసాయి.

గత రెండు దశాబ్దాల్లో జరిగిన ప్రతి ఎన్నికల ఫలితాలు తెలంగాణా వాదం ఎంత బలంగా ఉందో నిరూపించాయి. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండున్నర సంవత్సరాల సమయమున్నది. రాష్ట్ర విభజనను వ్యతిరేకించిన డా. వైఎస్‌ ‌రాజశేఖర్‌ ‌రెడ్డి కుమార్తెగా తెలంగాణ ప్రజలు ఆమెను తిరస్కరిస్తారా…లేక తెలంగాణా కోడలు అని ఆదరిస్తారా..కాలం నిర్ణయిస్తుంది ..!

రాష్ట్ర ఆవిర్భావం తరువాత..2014లో జరిగిన ఎన్నికల్లో తెలంగాణ తెచ్చిన పార్టీగా తెలంగాణ రాష్ట్ర సమితికి 64 స్థానాలు, ఇచ్చిన కాంగ్రెస్‌ ‌పార్టీకి 40 పై స్థానాలలో విజయం చేకూర్చి ..తెలుగు దేశంను ఆంధ్ర పార్టీగా, ప్రాంతేతర పార్టీగా, వలస నాయకత్వం పార్టీగానే గుర్తించి కేవలం 4 నియోజకవర్గాలకు మాత్రమే పరిమితం చేశారు ప్రజలు. అధికారంలోకి వొచ్చిన తెలంగాణ రాష్ట్ర సమితి కొత్త రాష్ట్రంలో తన రాజకీయ పునాదులను పటిష్టం చేసుకోవడానికి ప్రతిపక్షాలను నిర్వీర్యం చేసే కార్యక్రమంలో తీవ్ర విమర్శలను ఎదుర్కుంది. తెలంగాణ ఉద్యమాన్ని..రాష్ట్ర విభజనను..చంద్రబాబు భజన చేసిన వారిని తమ పార్టీలోకి ఆహ్వానించి ఉన్నత పదవులు కట్టబెట్టి ఒక వర్గం ఉద్యమకారుల ఆగ్రహానికి గురయింది..ఇంకా గురవుతునే ఉన్నది..! తెలంగాణ ద్యమంలో ముందు వరుసలో నిలిచిన తెలంగాణ జాయింట్‌ ‌యాక్షన్‌ ‌కమిటీ చైర్మన్‌ ‌ప్రొ. కోదండరామ్‌ ఇం‌టి పైన పోలీసులు అర్ధ రాత్రి దాడి చేయడం కెసిఆర్‌ ‌ప్రభుత్వం ఉద్యమకారుల సానుభూతిని పూర్తిగా కోల్పోయింది. ఆ సంఘటన జరిగిన కొన్ని నెలలకు..కోదండరాం జెఏసి చైర్మన్‌ ‌పదవిని వొదిలి..తెలంగాణ జనసమితిని స్థాపించారు. 2019లో జరగవలసిన రాష్ట్ర ఎన్నికలను ఆరు నెలల ముందుగానే జరిగేలా..శాసన సభ రద్దుకు మొగ్గు చూపి ..ప్రజామోదం కోసం 2018 నవంబర్‌లో ముందస్తు ఎన్నికల కోసం కె చంద్రశేఖర్‌ ‌రావు సిద్ధమయ్యారు. 2018 అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో టీఆర్‌ఎస్‌ అధినేత కె చంద్రశేఖర్‌ ‌రావు అనేక సార్లు అసహనానికి గురయ్యారు.

‘ఈ అతే మన కొంపముంచు తున్నది..’ అంటూ ఆగ్రహానికి గురయ్యారు. హైదరాబాద్‌లో జరగవలసిన బహిరంగ సభను విరమించుకున్నారు. 2018 ఎన్నికల్లో టీఆరెస్‌ ‌వోటమి తప్పదని రాజకీయ విశ్లేషకులు భావించారు. కానీ.. 2018 ముందస్తు ఎన్నికల్లో తెలంగాణ ప్రజల తీర్పు ..2009 ఎన్నికల్లో తెలంగాణ వోటరు తీర్పు ప్రతిబింబిస్తుంది…! తెలంగాణ రాష్ట్ర సమితికి వ్యతిరేకంగా..తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్‌ ‌పార్టీ..తెలంగాణ ఉద్యమ బ్రాండ్‌ అం‌బాసిడర్లలో ముందు వరుసలో నిలిచే ప్రొ. కోదండరామ్‌ ‌జన సమితి..ఆంధ్ర నాయకుడు, రాష్ట్ర విభజన వ్యతిరేకి చంద్రబాబు నాయుడు తెలుగు దేశం పార్టీతో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మహా కూటమిగా ఏర్పడడం తెలంగాణ వోటరుకు ఆమోదయోగ్యం కాలేదు. తెలంగాణ రాష్ట్ర సమితికి 89 అసెంబ్లీ స్థానాలలో భారీ ఆధిక్యతలతో విజయం చేకూర్చారు. వలస పాలనకు వ్యతిరేకంగా ఉద్యమించిన తెలంగాణ ప్రజలు .. వలస నాయకత్వాన్ని కానీ..ఆంధ్రా పార్టీలను గానీ అంగీకరించేది లేదని భారీ మెజారిటీలతో మరోసారి తెలంగాణ రాష్ట్ర సమితికి పట్టం కట్టారు. తెలంగాణ వ్యతిరేకులు, ఆంధ్రా పార్టీలతో తమ ఆకాంక్షలకు వ్యతిరేకంగా జత కడితే అంగీకరించేది లేదని రాష్ట్ర సాధనే ధ్యేయంగా ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె చంద్రశేఖర్‌ ‌రావును కూడా 2009 ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించారు. మలి దశ ఉద్యమ సందర్భంలో ..తెలంగాణ జెఏసి ఆవిర్భావం మొదలు…రాష్ట్రం ఏర్పడే వరకు పలు ఉద్యమాల్లో ముందు వరుసలో నిలిచి..ఉద్యమకారులకు అత్యంత సన్నిహితుడయిన ప్రొ. కోదండరామ్‌ను కూడా 2018 అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు పార్టీతో జత కట్టినందుకు అంగీకరించలేదు. తెలంగాణ ప్రాంతంలో ఆంధ్ర పార్టీలకు గానీ ..ఆ ప్రాంతం నుంచి వొచ్చిన నాయకులకు స్థానం ఉండదని 2009, 2018 ఎన్నికల్లో వోటరు స్పష్టమయిన తీర్పునిచ్చారు.

ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి దివంగత డా వై.ఎస్‌. ‌రాజశేఖర్‌ ‌రెడ్డి పట్ల తెలంగాణ ప్రాంతంలో ప్రజలకు ఇప్పటికీ అభిమానం ఉన్నది. ఆయన వ్యక్తిగతంగా సమైక్య వాది..రాష్ట్ర విభజనకు వ్యతిరేకి..ఇందులో రెండవ అభిప్రాయం ఎవరికీ లేదు..తెలంగాణ ప్రజలకు అసలే లేదు..అయినా అయన పట్ల ప్రజలకు అమితమయిన అభిమానం. ఆయన జీవించి ఉన్న కాలంలో…ఉద్యమం ఉధృతంగా ఉన్న సమయంలో కూడా వైఎస్‌ఆర్‌ అభిమాన సంఘాలు తెలంగాణ ప్రాంతంలో చురుకుగా పనిచేసాయి. ఆయన మరణాన్ని తట్టుకోలేక కొంత మంది గుండె ఆగి చనిపోగా..మరి కొందరు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. దివంగత ముఖ్యమంత్రి డా. వైఎస్‌ ‌రాజశేఖర్‌ ‌రెడ్డి కుమార్తె వైఎస్‌ ‌షర్మిల గత రెండు నెలలుగా తెలంగాణాలో రాజకీయ పార్టీ ప్రారంభించడానికి సన్నాహాలు ముమ్మరం చేశారు. రేపు..శుక్రవారం..ఖమ్మంలో బహిరంగ సభలో పార్టీ పేరు, కార్యక్రమాలు ప్రకటించనున్నారు. రాజకీయ పార్టీ పెట్టడం ఆమెకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు …భారత పౌరురాలిగా ఆమె ఎక్కడయినా ..ఎప్పుడయినా రాజకీయ పార్టీని పెట్టుకోవొచ్చు. తెలంగాణలో పార్టీ పెట్టడానికి షర్మిల చెబుతున్న అర్హత తాను తెలంగాణా కోడలునని ..! స్థానికురాలినని తెలియజేయడానికి షర్మిల తాను తెలంగాణ కోడలు అని గుర్తు చేస్తున్నారు.

ఈనాటి రాజకీయాల్లో …వ్యాసం ప్రారంభంలో చెప్పినట్లు …స్థానికత ప్రాధాన్యత అంశం ..! పక్క వార్డు వ్యక్తి తమ వార్డులో ఎన్నికల్లో పోటీ చేస్తే స్థానికేతరుడు అని ముద్ర వేసే రోజులు ఇవి ..! పది సంవత్సరాలు బెంగాల్‌ ‌ముఖ్యమంత్రిగా పని చేసి, ప్రస్తుత ఎన్నికల్లో నంది గావ్‌ ‌నుంచి పోటీ చేస్తున్న మమతా బెనర్జీని స్థానికేతరాలుగా ప్రచారం చేస్తున్నారు. అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హరీస్‌ను స్థానికత అంశం వెంటాడింది. జాతీయ కాంగ్రెస్‌ ‌పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధీని పౌరసత్వ అంశం రాజకీయ ప్రత్యర్థులకు సుదీర్ఘ కాలం ఎన్నికల అంశం అయింది. షర్మిల మద్దతుదారులు ఉదహరిస్తున్న తమిళ నాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితను కూడా స్థానికత అంశం వెంటాడింది. పైన పేర్కొన్న వారు ఎవరు కూడా సొంత పార్టీ ప్రారంభించి అధికారంలోకి రాలేదు..సుదీర్ఘ కాలంగా స్థానికంగా రాజకీయాల్లో ఉన్న పార్టీల్లో సభ్యులై..అంచెలంచెలుగా అధికారానికి చేరువయ్యారు. స్థానికేతరాలు షర్మిల ఏకంగా సొంత పార్టీని స్థాపించి ..రాజన్న రాజ్యం తెస్తానని ప్రజల ముందుకొస్తున్నారు …! గత రెండు దశాబ్దాల్లో జరిగిన ప్రతి ఎన్నికల ఫలితాలు తెలంగాణా వాదం ఎంత బలంగా ఉందో నిరూపించాయి. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండున్నర సంవత్సరాల సమయమున్నది. రాష్ట్ర విభజనను వ్యతిరేకించిన డా. వైఎస్‌ ‌రాజశేఖర్‌ ‌రెడ్డి కుమార్తెగా తెలంగాణ ప్రజలు ఆమెను తిరస్కరిస్తారా…లేక తెలంగాణా కోడలు అని ఆదరిస్తారా..కాలం నిర్ణయిస్తుంది ..!

daccandevulapally ajaysharmila party updates
Comments (0)
Add Comment