చారిత్రాత్మక పోరాటానికి ఏడాది

  • ఢిల్లీ సరిహద్దుల్లో మార్మోగిన రైతునినాదాలు
  • మద్దతు ధర నిర్ణయించాలని డిమాండ్‌

కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల నిరసనకు ఏడాది పూర్తయిన సందర్భంగా శుక్రవారం ఢిల్లీ సరిహద్దులు రైతుల ఆందోళనలతో మార్మోగాయి. మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంటామని గత వారం ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించడాన్ని రైతు సంఘాలు స్వాగతిస్తున్నాయని, అయితే చట్టాలను అధికారికంగా రద్దు చేసి ఇతర డిమాండ్లను నెరవేర్చే వరకు తమ నిరసనను విరమించేది లేదని రైతులు ఈ సందర్భంగా ముక్తకంఠంతో చెప్పారు. నిరసనకు ఒక సంవత్సరం సందర్భంగా ఢిల్లీ సరిహద్దులో శుక్రవారం భారీ సభ నిర్వహించారు.

ఢిల్లీ చలో కార్యక్రమంలో వేలాది సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. వ్యవసాయ పంటలకు కనీస మద్ధతు ధర ఇచ్చేలా చట్టపరమైన హామితో సహా తమ డిమాండ్లు నెరవేరే వరకు రైతుల ఆందోళన కొనసాగుతుందని భారతీయ కిసాన్‌ ‌యూనియన్‌ (‌బీకేయూ) నాయకుడు రాకేష్‌ ‌తికాయత్‌ ‌చెప్పారు. భారత్‌లోని ప్రతి రాష్ట్రం, ప్రతి జిల్లా, ప్రతి గ్రామానికి విస్తరించిన ప్రపంచ వ్యాప్తంగా, చరిత్రలో అతిపెద్ద, సుదీర్ఘమైన నిరసన ఉద్యమం 12 నెలల వ్యవధిలో ఉద్యమంలో కోట్లాది మంది ప్రజలు పాల్గొన్నారని సంయుక్త కిసాన్‌ ‌మోర్చా(ఎస్‌కెఎమ్‌) ‌తెలిపింది.

ఈ ఉద్యమంతో మూడు వ్యవసాయ వ్యతిరేక చట్టాల రద్దుకు ప్రభుత్వం నిర్ణయం, క్యాబినెట్‌ ఆమోదం మాత్రమే కాకుండా రైతుల కోసం, సామాన్య పౌరుల కోసం, దేశం కోసం అనేక విజయాలను సాధించిందని పేర్కొంది. ప్రాంతీయ, కులమత విభజనలకు అతీతంగా రైతులకు ఏకీకృత గుర్తింపును ఈ ఉద్యమం సృష్టించిందని పేర్కొంది. దీంతో దేశంలో ప్రజాస్వామ్యం, లౌకికవాదం మరింత బలపడందని ఎస్‌కెఎమ్‌ ‌పేర్కొంది. నేడు సింగు సరిహద్దులో ఎస్‌కెఎమ్‌ ‌సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో తదుపరి కార్యాచరణపై రైతు సంఘాలు నిర్ణయం తీసుకుంటాయని ఒక ప్రకటనలో రైతు సంఘం నాయకులు తెలిపారు. అయితే రైతుల ఆందోళనలతో దేశ రాజధానిలోని పలు సరిహద్దు పాయింట్ల వద్ద భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేసినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు.

ఆందోళనకారులు సరిహద్దులు దాటేందుకు ప్రయత్నించినా, అల్లర్లు సృష్టించినా కఠినంగా వ్యవహరిస్తామని పోలీసు అధికారులు తెలిపారు. ఏడాది కాలంగా రైతులు సింగు, తిక్రీ, ఘాజీపూర్‌ ‌ప్రాంతాల్లో క్యాంపులు వేసి నిరసన కార్యక్రమాలు సాగిస్తున్నారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన నిరసనల సందర్భంగా రైతులపై నమోదైన కేసులను ఉపసంహరించుకోవాలని, లఖింపూర్‌ ‌ఘటనకు సంబంధించి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్‌ ‌మిశ్రాను తొలగించి, అరెస్టు చేయాలని డిమాండ్‌ ‌చేయనున్నట్లు రైతులు తెలిపారు.

'farmer assuranceprajatantra newsstruggletelangana updatestelugu kavithaluToday HilightsYear of historic
Comments (0)
Add Comment