యవుసం యేం గావాలె!….

‘‘ఇను బేతాళ్‌!‌సొంతింట్ల చేయి తిప్పుకునుడే యెరుక లేక కాట గల్శిన చేయి ఇప్పడు రైతులెన్క పొంటి కానచ్చుడు ఇచ్చంత్రమే!దేశంల లొట్టపీసు అమ్ముకునేటందుకు యేం మిగిలి లేవు.దబూమి కింద గనులొడిశినయి బూమి మీ సర్కార్‌ ఆస్తిపాస్తులొడిశినయి. బూమి ఒక్కటే ఇగ మిగిలింది.గది రైతుల తాననున్నది.రైతును బూమికి దూరం జేశే అబియాన్‌ ‌కోసమే మూడు చట్టాలచ్చినయి. గీ దేశంల చట్టాల మీద కోర్టుకు పోకుంట చట్టం జేస్తె అది కాన్రాని కోర్ట్ ‌మూడు చట్టాలు కానచ్చి గాటిని పక్కకు బెట్టినమని కతలు పడ్తాంది..అని జెప్పుకుంట నడ్వ బట్టిండు..నడ్వ బట్టిండు..”

డిల్లీ తొవ్వల పొంటి సల్లటి ఇగంల రొండు కోట్ల మంది రైతులుంటె ఇనుపగోడల మద్దెనున్న ఏలికలకు బొక్కల్లల్ల వణుకు రాబట్టింది.ఇగంల రైతులుంటె ఇండ్లల్లున్న ఏలికలెందుకు వణుకబట్టిండ్లనేదే ఇచ్చంత్రం.ఈ దేశాన్ని ముక్కలు జేశి బజాట్న అమ్ముకోబట్టిండ్లని ఏలికల మీద సైరనూది రైతులు యుద్ధం మొదలు జేశిండ్లు.రైతునాగం జేశి,యవుసాన్ని బొందలబెట్టే చట్టాల రద్దు కోసం జేశే పోరుకు దేశమంత మాగనే సాత్‌ ఇయ్యబట్టింది. రైతు జేశేటి పోరు ఈ దేశచరిత్ర కొత్తరాతలు రాయనున్నదిదన్న ఆశలతోని జనం జెండ కింద జేరబట్టిండ్లు. . పార్లమెంట్‌ ‌బంగ్లా కొత్తదే గని, గది కూలిపోయే కాలం అచ్చిందన్నట్టే రైతు ధర్నా బూకంపమోలిగె అదిలియ్య బట్టింది.కార్పొరేట్‌ ‌యెదురు దాడి యెనుకపోటు తీర్గుంటదన్న యెరుక లేనిదేం గాదు. రైతు పోరు మీద సర్కార్‌ అడ్డగోలు కతలల్లి దేశమంత ఎంతగనం జల్లినా రైతులెవ్వలు యెనుకడుగు యేశెటట్టు కొడ్తలేదు.కోర్టులు ఈ మద్దెన జెప్పే తీర్పులన్ని ఎటు మొగాన మొగ్గు జూపుతానయో తెల్వంది గాదు. ఛలో!మూడు రైతుచట్టాలను గట్టు మీద బెట్టినం.ముచ్చట్లకు రమ్మని కోర్టు జెప్పుడు రైతులు ఇసుమంత సుత లెక్కలకు తీసుకునెటట్టులేదు. మాట ముచ్చట కోసం కోర్ట్ ‌పెద్దరికం ఇచ్చినోళ్ళు పెయినిండ కాషాయం బూసుకున్నోళ్ళేనని అందరికి సమజయితనే వుండె!తొమ్మిది మాట్ల మాట ముచ్చట్లు జేశి సర్కార్‌ ‌రైతులడిగే గా ఒక్కటి ఇశిపెట్టి ఇంకేదంటె గది చేశేటందుకు తయారనబట్టె!చట్టాలు రద్దు జేసుడొక్కటే మాగ్గావాలని జెపుతాంటె సర్కార్‌ ‌చెవుమీద పేను బారుతలేదాయె!

గీ ఇగురం దేశ దేశాలెరుకైంది గని మన దేశం మీడియోళ్ళకు మాత్రం యెరుకైతలేదు!యెందుగ్గావచ్చనేది అందరికి కుల్లం కుల్ల మాగనే యెరుకె.మీడియా ముక్కుకు గట్టుకునే మాస్క్ ‌లు కండ్లకు సూత గట్టుకుంటాంది.నాయమంటె గంతలు గట్టుకోవాలె!గది రివాజైంది.మరి నాలుగో కంబం మీడియా కండ్లకేమయిందుల్లా!సమజయితలేదు.కండ్లు మాగున్నయి గని కండ్లుండగనె సాలుతదా!ఆయిమనేటి సూపుండాలె!ఎదురుంగా కానచ్చేయివుంటయి,కానచ్చి,కాన్రాకుంటుండేటియుంటయి.సాటుంగ దాసుకునేటియుంటయి.కండ్లుండి సుత కాన్రానియుంటయి.దేశంల ఏమయోతాందో యెవలికన్నకానత్తాందా! మనిషెందురుంగ మనిషి కాన్రాని ఇగంల రైతులు ధర్నా జేయవట్టిండ్లు. ఇగం గాదుగని మీడియోళ్ళ కండ్లల్ల ఇషం పూసుకున్నరు గిట్ల గావచ్చేమో!రైతులు,వాళ్ళ తిప్పలు,ధర్నాజులుస్‌ ‌లు కానత్తలేదు.

ఆడోళ్ళు,పిలగాండ్లనేసుకోని గాళ్ళు ధర్నా జేశేది యెందుక్కానత్తలేదో యేందో!మీడియోళ్ళ కండ్లకు కార్పొరేట్‌ ‌కామెర్లచ్చినయని అనుకోవట్టిండ్లు.అన్ని తీర్ల మీడియా అమ్ముడు పోయెటందుకు ముందుకచ్చినంక కార్పొరేట్లు కోట్లల్ల రేట్లుబెట్టి కొనుడో లెక్కనా!అనబట్టిండ్లు.కండ్లండ్ల తామర్లు మొలిశినోళ్ళకు గాళ్ళంత ఖలిస్తానీ తీవ్రవాదుల తీర్గ కానత్తాండ్లు.ఇంకోలికి తిండి తిప్పలు పడే రైతులు బిరియాని,పిజ్జా,బర్గర్లు తింటానట్టు కానత్తాంది.సూశేటియవే కండ్లు గని యెవలికి కాన్రానియి సుత కానత్తయి.రైతులు ముందుమాగనేవున్నరుగని, గాళ్ళెనుకపొంటి పతి పక్షాలు కూసోని యెగేశినట్టు కొడ్తాంది.ఇంకోల్ల కండ్ల సూపు దేశాలు దాటినయి.రైతులెనుక చైనా,పాకిస్తాన్‌ ‌దేశాలున్నట్టు కానత్తాంది.’’గిదేం లేదుల్లా!పంజాబ్‌ ‌రైతులే గని ఇంకెవలు కానత్తలే’’రంటరు. మనుషులందరికి కండ్లొక్క తీర్గె వున్నంక సూపు తీరొక్క తొవ్వెందుకు తొక్కబట్టె! సూపు లెనుకున్న ఇకమతులేంటియి!?

‘‘బలం మాదే!బల్గం మాదే! మేమే తోపులం!’’ అని మీసం దిప్పిన నియంతల రాజ్జాలు సుత కూలిపోయినయన్న ఇగురం యాదుండాలె! కార్పొరేట్‌ ‌సేట్ల సేవలెక్కువై ఏలికలు కాట్లె కలిశే దినాలు దగ్గర వడ్డయి.గుడారాలేసుకోని కూసున్న రైతులకు డిల్లీబంగ్లాలే వణుకబట్టినై..మునుపెన్నడు జూడని రైతుల మడిమ దిప్పని పోరు, దేశ చరిత్రల రైతులు గజ్జుమనిపిచ్చేటి అవ్వల్‌ ‌దర్జా పోరు డిల్లీల మొదలైంది గని దేశమంత అలుముకున్నది. రైతన్నలు యవుసాన్ని మంట్లె బెట్టె మూడు చట్టాలను రద్దు జేయమంటాండ్లే గని ఇంకేమన్న అడుగబట్టిండ్లా!నెలన్నర దాటినా అగకుండా ధర్నా నడువబట్టింది రైతుల ధర్నా మీద దేశప్రజలకు తప్పడు కతలు జెప్పేసోషల్‌ ‌మీడియాల లచ్చల మంది కాషాయ సంఘసేవకులుతిప్పలు పడబట్టిండ్లు.మీడియాను. సోషల్‌ ‌మీడియాను గుప్పిట్లె బెట్టుకోని గోబెల్సోని తీర్గ కతలు వడుడు చర్చలు పేరుతోని రైతు సంఘాల్ని చీలికలు పేలికలు చేయాలనుకున్న యవారం యెల్లెలుకల పడ్డది.

పూవు గుర్తు ఏలికలు ఆకరికి ఏ ఉద్దెమానికి సమాధి కట్టాల్నన్నా యేం తేవాల్నో దాన్నే ముందుకు తెచ్చిండ్లు.గంతలు గట్టుకోని జెప్పే నాయాన్నే కార్పొరేట్లు సుత నమ్ముకున్నరుమూడు చట్టాలు పక్కకు బెట్టి, నాయం తేల్చటానికి నల్గురు పెద్ద మనుషుల చేతులల్ల బెట్టింది. గా నల్గురికి నల్గురు రైతు చట్టాలు శాందారుగున్నయి,గీటిని జరూరుగ అమలు జేయాలని జెప్పినోళ్ళేనాయె!గిసొంటోళ్ళతోని రైతులు ఎసొంటి మాట ముచ్చట జేశేది లేదని కుల్ల జెప్పిండ్లు.నల్గురిట్ల ఓ పెద్దమనిషి కండువ తీశి నాకద్దని పెద్దరికం ఇశిపెట్టి ఎనుకకుబొయిండు. మిగిలిన ముగ్గురు తోని జరిగే నాయంల తామరపూలు పూసుడే గని ఇంకోటి లేదని రైతులు బరాబరి జెప్పబట్టిండ్లు.

‘‘కడుపుల ఇషం నాలికెన తియ్యనంటె’’ గిదేనుల్లా! యవుసం మీద బతికే ప్రజలెక్కువున్న దేశంల రైతు బతుకులమీద కార్పొరేట్‌ ‌కండ్లు వడ్డయి.గాళ్ళ సూపు బరాబరున్నది.రైతును దోసుకునే దళారోళ్ళను అర్సుకోవాలె గని కంచె శేను మేశినట్టు సర్కారే దళారోళ్ళబజాయి పెద్ద దళారి యేషం గడితె ఎవలికాడబొయి యేడ్వాలె! ఆరేండ్ల సంది కానచ్చిన కాడికి దేశం మూలమూలనున్న సర్కార్‌ ‌సంస్థలను అడ్డికి పావుశేరు లెక్కన కార్పొరేట్లకమ్మి దేశాన్ని ఆగం జేశిండ్లని లెక్కలెరుకున్నోళ్ళు నెత్తీనోరు గొట్టుకోని జెప్పబట్టిండ్లు.జెప్పినోళ్ళను జెప్పెటోళ్ళను లోపటేశే పని షురు జేసుడైతాండె!మాటముచ్చట మీద కావలి కాసుకుంట దేశమంత తాళం తలుపుల్లేని జేల్‌ ‌కానా జేశేటి రాజ్జెం సంపదను సృష్టించే రైతు మీద పడుడు ఇచ్చంత్రం గాదు. జనం కొనుగోలు శక్తిని దెబ్బతీశే పని యేదైనా దేశానికి అరిష్టమే! రైతును యవుసానికి దూరం జేశే చట్టాలు రద్దు కోసం రైతత్తిన జెండా కింద దేశ ప్రజానీకం చేరిక పెరిగెతీరు కొడ్తాంది. దేశమంత గటు మొగాన అడుగేత్తాంది.

‘‘సూడ్రా !బయ్‌!ఇ‌క్రమార్క్’’! ‘‘ఇప్పటిదాంక యింటివి గదా! రైతులు బిరియాని తినుకుంట దావత్‌ ‌కోసం డిల్లీ కచ్చినట్టు గొడ్తాందనిగాళ్ళెనుక పొంటి చేయి సాత్‌ ‌దారి వున్నద పాకిస్తాన్‌,ఆఇస్తాన్‌, ఇఇస్తాన్లు, చైనోళ్ళు మోపైండ్లనని సర్కార్‌ అనబట్టింది నిజమేనా యేంది!? సర్కార్‌ ‌రైతు మంచికోసం జేశిన చట్టాలమీద రైతుల లొల్లెందుకైతాందినా ప్రశ్నలకు జవాబులుగనుక జెప్పక పోతె రైతు ఉద్దెమం యెనుకున్న ఖలిస్తాన్నువ్వేనని లీకుడిసుడే! పైలంఅని యెప్పటి తీర్గనే బెదిరిచ్చేటి బేతాళుని శవాన్ని బుజాన్నేసుకొని ‘‘ఇను బేతాళ్‌!‌సొంతింట్ల చేయి తిప్పుకునుడే యెరుక లేక కాట గల్శిన చేయి ఇప్పడు రైతులెన్క పొంటి కానచ్చుడు ఇచ్చంత్రమే!దేశంల లొట్టపీసు అమ్ముకునేటందుకు యేం మిగిలి లేవు.దబూమి కింద గనులొడిశినయి బూమి మీ సర్కార్‌ ఆస్తిపాస్తులొడిశినయి. బూమి ఒక్కటే ఇగ మిగిలింది.గది రైతుల తాననున్నది.రైతును బూమికి దూరం జేశే అబియాన్‌ ‌కోసమే మూడు చట్టాలచ్చినయి. గీ దేశంల చట్టాల మీద కోర్టుకు పోకుంట చట్టం జేస్తె అది కాన్రాని కోర్ట్ ‌మూడు చట్టాలు కానచ్చి గాటిని పక్కకు బెట్టినమని కతలు పడ్తాంది..అని జెప్పుకుంట నడ్వ బట్టిండు..నడ్వ బట్టిండు.
– ఎలమంద, తెలంగాణ

ElamandaFarmers protestNew agricultural policytelanganavikramarka
Comments (0)
Add Comment