పతనపుటంచున ప్రపంచ ప్రజాస్వామ్యం

“2006 ‌తరువాత ప్రజాస్వామ్య విస్తరణ ఆగిపోయి, తిరోగమన దిశలోకి మారింది. ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యం, రాజకీయ స్వేచ్ఛను గణించే ‘‘ఫ్రీడమ్‌ ‌హౌస్‌’’ ‌తన 2018 వార్షిక నివేదికలో 2006 నుండి వరసగా 12 సంవత్సరాలు 113 దేశాలలో స్వేచ్ఛ స్వాతంత్రాలు క్షీణించాయని పేర్కొంది. అదేవిధంగా ఎకనామిక్‌ ఇం‌టెలిజెన్స్ ‌యూనిట్‌ ‌కూడ తన ప్రజాస్వామ్య సూచికలో ‘‘ఈ సంవత్సరాలలో ప్రపంచ ప్రజాస్వామ్యం అత్యత దురావస్థకు చేరుకుందని ప్రకటించింది. ‘‘ప్రజాస్వామ్య తరంగం ఒక శక్తివంతమైన అధికార సంస్థ ద్వారా మందగింపబడడంతో పాటు, ప్రపంచం ప్రజాస్వామ్య మాంద్యంలోకి జారిపోయింది’’ అని 2008లోనే డైమండ్‌ ‌హెచ్చరించాడు.”

గత సంవత్సరం జూన్‌లో రష్యా అధ్యక్ష్యుడు వ్లాదిమిర్‌ ‌పుతిన్‌ ఉదారవాద ప్రజాస్వా మ్యాన్ని ప్రస్తుతం ‘‘వాడుకలో లేని అంశం’’ అని సంబో ధించినప్పుడు ప్రజాస్వామ్య దేశాలన్ని ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాయి. 2001 నుండి ప్రపంచ వ్యాప్తంగా నిరంకుశ ప్రభుత్వాలు అధికారంలోకి రావడం పెరిగి, ప్రజాస్వామ్య భావనలు క్షీణించడం ఉదారవాదులను ఖచ్చితంగా ఆందళనకు గురి చేసే విషయమే. ఎన్నికలకు సంబంధించిన రాజకీయ హింస, అశాంతి చాలా దేశాల్లో ప్రబలంగా పెరిగి ప్రజాస్వామ్యం మనుగడను ప్రశ్నార్థకంగా మార్చివేశాయి. దీర్ఘకాలంలో ప్రజాస్వామ్య సమాజాలను నిర్మించే అవకాశాన్ని హింస అత్యధికంగా ప్రభావితం చేస్తుంది. నిజానికి రెండవ ప్రపంచ యుద్ధం తరువాత నుండే ప్రజాస్వామ్యం కఠినమైన పరీక్షను ఎదుర్కొంటోంది. యునైటెడ్‌ ‌స్టేట్స్‌కు బలమైన ప్రజాస్వామ్య సాంప్రదాయం ఉన్నప్పటికీ స్థానికవాదంతో ఓటరు అణచివేత పోకడలతో ఉదారవాద భావనలను నియంత్రిస్తోంది. నిజానికి, యు.ఎస్‌ ‌రాజకీయ నాయకుల ప్రవర్తన ఇతర దేశాలలో నిరంకుశ పాలకుల ప్రవర్తన మధ్య పెరుగుతున్న సమాంతరాల గురించి రాజకీయ విశ్లేషకులు ప్రపంచాన్ని మొదటి నుండి హెచ్చరిస్తూనే ఉన్నారు. టర్కీలో తాయిప్‌ ఎర్డోగాన్‌, ‌హంగేరిలో విక్టార్‌ ఓర్బన్‌, ‌రష్యాలో పుతిన్‌, ‌బ్రెజిల్‌లోని జైర్‌ ‌బోల్సోనారో, భారతదేశంలో నరేంద్ర మోడీ అమెరికా ప్రదర్శనా ప్రభావానికి లోనైన ‘నయా’ ప్రజాస్వామికవాదులు. వాస్తవానికి సోవియట్‌ ‌యూనియన్‌ ‌పతనం తరువాత సృష్టించబడిన 90 శాతం ప్రజాస్వామ్యాలు ఇప్పుడు విఫలమయ్యాయి.

గోథెంబర్గ్ ‌యూనివర్సిటి, వి-డెం సంస్థ సంయుక్తంగా విడుదల చేసిన డెమోక్రసి-2020 నివేదిక అనేక దిగ్భ్రాంతికరమైన విషయాలను వెలువరించింది. ప్రపంచ వ్యాప్తంగా 2009లో 54 శాతం ఉన్న ప్రజాస్వామ్య దేశాల సంఖ్య 2019 నాటికి 49 శాతానికి పడిపోవడం ఉదారవాద భావనల పతనానికి ప్రత్యక్ష ఉదాహరణ. ప్రజాస్వామ్య లక్షణాల క్షీణత పెరిగి, ప్రపంచం చాలా వేగంగా నిరంకుశీకరణకు గురైతున్నట్టు ఈ గణాంకాలు చెబు తున్నాయి. 2001 తరువాత మొదటి సారిగా నిరంకుశ ప్రభుత్వాలు మెజారి టీలో ఉన్నాయి. 92 దేశాలు ప్రస్తుతం నిరంకుశ పాలకుల ఏలుబడిలో ఉన్నాయని ఈ గణాంకాలు నిరూ పిస్తున్నాయి. అంతేకాకుండా ప్రపంచ జనాభాలో దాదాపు 35% మంది నిరంకుశ దేశాలలో నివసిస్తున్నారు. అంటే దాదాపు 2.6 బిలియన్‌ ‌ప్రజలు అన్నమాట. యూరోపియన్‌ ‌యూనియన్‌ ‌లోని హంగరి ఇప్పుడు పూర్తి స్థాయి నియంతృత్వ దేశంగా రూపుదిద్దుకోవడం ఇతర యూరోపియన్‌ ‌దేశాలను కలవరపెట్టే అంశం.  ప్రధాన జి-20 దేశాలు, ప్రపంచంలోని అన్ని ప్రాంతాలు నిరంకుశీకరణకు గురైతున్నాయి. గణనీయమైన జనాభా కలిగిన ప్రధాన ఆర్థిక వ్యవస్థలైన  బ్రెజిల్‌, ఇం‌డియా, అమెరికా, టర్కీ దేశాలు ఆటోక్రాటైజేషన్కు లోనై ప్రపంచ సైనిక, ఆర్థిక, రాజకీయ వ్యవస్థ మీద తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. లాటిన్‌ అమెరికా 1990 ల ప్రారంభంలో చివరిసారిగా నమోదు చేయబడిన స్థాయికి చేరుకుంది. తూర్పు ఐరోపా, మధ్య ఆసియాలు సోవియట్‌ అనంతర స్థాయిలో ఉన్నాయి. హంగరీ, టర్కీ, వెనిజులా దేశాలు నిరంకుశ పాలనను కొనసాగిస్తూ ఉదారవాదానికి తూట్లు పొడుస్తున్నాయి. వీటినే అనుసరిస్తున్న ఫిలిప్పీన్స్, ‌పోలాండ్‌, ‌మయన్మార్‌ ‌లు ప్రజాస్వామ్య విలువలకు మంగళం పాడి జాతి ప్రక్షాళనకు పూనుకుని కొత్త వ్యవస్తల స్థాపనకు నాంది పలికాయి. ఆ దురాగతాలను ప్రశ్నించిన జర్నలిస్టులను జైలులో పెట్టాయి. పశ్చిమ ఐరోపా అంతటా మితవాద ప్రజాదరణ పట్ల నమ్మకం గలవారు, దీర్ఘకాలిక అణచివేత దృక్పథం నేపథ్యంలో అక్కడి యువత ప్రజాస్వామ్యంపై విశ్వాసం కోల్పోతున్నట్లు అనిపిస్తుంది. ఐరోపాలో ప్రస్తుత పరిస్థితి 1970 ప్రారంభ కాలపు ఏకాభిప్రాయాల విచ్ఛిన్నతతో పాటు, రాజకీయ ఆర్థిక వ్యవస్థలు క్షీణించిన ప్రజాస్వామ్య సంక్షోభపు పరిస్థితిని పోలి ఉంది. ఐరోపా అంతటా ప్రజాస్వామ్య సూత్రాలకు బలమైన మద్దతు ఎంత విస్తృతంగా ఉందో, అదేవిధంగా యూరోపియన్‌ ‌పౌరులలో ప్రజాస్వామ్యం పట్ల అసంతృప్తి కనబడుతోంది.

ఈ ఏడాది జనవరిలో వర్జీనియాలోని రిచ్మండ్‌లో చేసిన శాంతి యుత నిరసనలు అమెరికా ప్రజాస్వామ్య కొత్త పోకడలపై ప్రపంచవ్యాప్తంగా చర్చనీ యాంశంగా మారింది. గడి చిన యాభై సంవత్సరాలలో దేశంలో అతి తక్కువ నిరుద్యోగ రేటును సాధించినప్పటికినీ, డోనాల్డ్ ‌ట్రంప్‌ ‌కాలంలో అమెరికా బడ్జెట్‌ ‌లోటు 4% నుండి 5.5% కి పెరిగింది. ప్రజా స్వామ్య సంక్షోభం ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా సర్వ సాధారణమైన అంశంగా మారడం ఉదారవాద భావాల అణచివేతకు ప్రతీకగా మారింది. అమెరికన్‌ ‌ప్రజాస్వామ్యం మూడు విభిన్నమైన, అనుసంధాన సంక్షోభాలను ఎదుర్కొంటుంది. ప్రజాస్వామ్య నిబంధనలు, విలువలపై కొనసాగుతున్న దాడి మొదటిది కాగా,  ప్రజాస్వామ్య వ్యవస్థ పట్ల ప్రజలు అనుకూల ప్రతిస్పందనలు కోరుకుంటుండగా వారి ప్రయోజనాల పట్ల స్పందించడానికి ప్రభుత్వం సుముఖంగా లేదనే భావన ప్రారంభం కావడం రెండవది. ఇక బీజింగ్‌, ‌మాస్కోలలో అధికార శక్తుల దాడి పెరిగిపోవడం మూడవ సంక్షోభం. ప్రజాస్వామ్య సమాజాలలోకి చేరుకో వడానికి, అంతర్గత ఉద్రిక్తతలను పెంచడానికి, అనైతిక రంగాల ప్రభా వాలను రూపొందించడానికి కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగంచడం మొదలైంది. లారీ డైమండ్‌ ‌రాసిన ‘ఇల్‌ ‌విండ్స్ : ‌సేవింగ్‌ ‌డెమోక్రసీ ఫ్రమ్‌ ‌రష్యన్‌ ‌రేజ్‌, ‌చైనీస్‌ ఆం‌బిషన్‌ అం‌డ్‌ అమెరికన్‌ ‌కాంప్లిసెన్సి’ పుస్తకంలో ప్రస్తుతం అమెరికా సరైన దిశలోనే పాలించ బడుతున్నప్పటికినీ ట్రంప్‌ ‌కాలంలో అమెరికా నిరంకుశీకరణకు లోనైన అంశాన్ని కొట్టివేయలేమన్నారు.

ఎన్నికల విధానంలో నాణ్యత లోపించి, ప్రపంచవ్యాప్తంగా భావ ప్రకటనా స్వేచ్ఛ, మీడియాపై యథేచ్చ దాడులు  తీవ్రతరమయ్యాయి. రెండేళ్ల క్రితం 19 దేశాలలో ఈ దాడులు ప్రభావవంతంగా ఉండగా ప్రస్తుతం ఈ సంఖ్య 31 కి చేరుకోవడం ప్రపంచ వ్యాప్తంగా భావప్రకటన స్వేచ్ఛకు గల భయంకర పరిస్థితికి అద్దం పడు తున్నాయి. అంతేకాకుండా గత కొద్ది కాలంగా 16 దేశాలలో సార్వత్రిక ఎన్నికల సూచిక గణనీయంగా పడిపో యింది. ఇవన్ని కూడ భవిష్యత్తులో నిరంకుశ ప్రభుత్వాల స్థాపనకు సూచికలు మాత్రమే కాదు, ప్రజాస్వామ్యానికి ప్రమాద ఘంటికలు కూడా. నిరంకుశ దేశాలలో విద్యా స్వేచ్ఛ గత పదేండ్లలో 13% పడిపోయి దారుణ వాతావరణం సృష్టించబడింది. శాంతియుత సమావేశాలకు అనుమతి నిరాకరించబడి, నిరసన తెలిపే హక్కు సగటున 14%కు పడిపోయింది. బ్రెజిల్‌, ‌పోలాండ్‌ ‌వంటి దేశాలలో నిరంకుశ అనుకూల ప్రదర్శనలు జరిగి రాజకీయ హింస పెరిగిపోవడం ప్రజా పాలనపై ప్రతికూల ప్రభావాన్ని చూపే అంశాలు. ప్రజాస్వామ్య అనుకూల దేశాలలో నిరసనల వాటా 2009 లో 27% ఉండగా, 2019 లో 44% కి పెరిగింది. పౌర స్వేచ్ఛ పరిరక్షణ కోసం పౌరులు వీధుల్లో నిరసన తెలపడం వ్యక్తి స్వేచ్ఛాకాంక్షను ప్రతిబింబిస్తుంది. ప్రజాస్వామ్యం నిర్మాణం కోసం మిలియన్ల కొద్ది ప్రజాసమీకరణ జరగి, ప్రజాస్వామ్యం పట్ల తమ నిబద్ధతను ప్రదర్శించేందుకు పౌరులు ముందుకు వచ్చారు. 2019లో బొలీవియా, పోలాండ్‌, ‌మలావి వంటి 29 ప్రజాస్వామ్య దేశాలలో నిరంకుశీకరణకు వ్యతిరేకంగా ప్రజలను సమీకరించి పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు చేశారు. అదేవిధంగా ఈ సెగ తగిలి అల్జీరియా, హాంకాంగ్‌, ‌సుడాన్‌ ‌వంటి దేశాలలో కూడ ఉదారవాద ప్రదర్శనలు విజయవంతం కావడం విశేషం.

భారత ప్రధాని నరేంద్ర మోడీ నేతృ త్వంలోని భారతీయ జనతా పార్టీ ప్రపం చంలోని అతిపెద్ద ప్రజా స్వామ్యాన్ని దెబ్బతీసే సెక్టేరియన్‌ ‌విభజనలను సృష్టిస్తున్నదని మొదటి నుంచి అపవాదును మూట కట్టుకుంది. ఆర్థిక వ్యవస్థ మందగించినప్పటికీ గత మేలో బిజెపి హిందూ-జాతీయవాద ఎజెండాను అనుసరిస్తూ పార్లమెంటరీ మెజారిటీని పెంచుకుంది. గత సంవత్సరం ఆమోదించబడిన పౌరసత్వ చట్టం, ముస్లీంలు కానట్టైతే దీర్ఘకాలిక వలసదారులకు భారతీయులుగా పౌరసత్వం పొందడం సులభం చేస్తుంది. పౌరుల రిజిస్టర్‌ను సృష్టించాలని మోడీ కోరుకుంటున్నారు. ఇది పౌరసత్వానికి ఆధారాలను అందించడానికి భారతీయులను నియంత్రిస్తుంది. చాలామంది ముస్లింలకు అవసరమైన పత్రాలు లేవు కాబట్టి, సమస్య ఉత్పన్నమయ్యి వారాల పాటు కొనసాగిన నిరసనలకు దారితీసింది. అంతే కాకుండా ప్రతిపక్షాల అస్తిత్వం కరువై, మీడియా పౌర సమాజం గొంతు నొక్కబడుతున్న కారణంగా భారతదేశం తన ప్రజాస్వామ్య దేశ హోదాను కోల్పోయే దశకు చేరుకుంది. ప్రభుత్వాన్ని విమర్శించే గొంతుకలను అణచివేయడం, బెది రించడం ప్రస్తుతం భారతదేశంలో సర్వసాధారణంగా మారింది అనే అభిప్రాయం ఉంది.

ప్రపంచవ్యాప్తంగా  ప్రజాస్వామ్యానికి పెరుగుతున్న ప్రమాదం గురించి డైమండ్‌ ‌తన పుస్తకంలో అత్యంత ఆందోళనకరమైన అంశంగా హెచ్చరించారు. ప్రపంచంలోని ప్రతి ప్రాంతంలో నిరంకుశవాదులు తమ పట్టును పెంపొందించుకుంటుండగా, ప్రజాస్వామ్యవాదులు ఆత్మరక్షణలో పడిపోయారు. పోటీ రాజకీయాలకు, స్వేచ్ఛా భావ వ్యక్తీకరణకు కాలం చెల్లిపోయిన పరిస్థితులు దాపురించడం ఉదారవాదులను తీవ్ర ఆందోళనకు గురిచేసే అంశం. పరిపక్వ ప్రజాస్వామ్యాలలో అసహనం అభివృద్ది చెంది పనికిరాని సంస్థలుగా మారుతున్నాయి. అభివృద్ధి చెందుతున్న ప్రజాస్వామ్య దేశాలు అవినీతిలో మునిగిపోతూ, చట్టబద్ధత కోసం పెరుగుతున్న బాహ్య బెదిరింపులకు వ్యతిరేకంగా పోరాడుతున్నాయి. అధికార పార్టీ నాయకులు నిర్వచనకు అందని ఫాసిజానికి లోనవుతూ అధికారంలో ఉన్నన్నాళ్ళు ప్రజాస్వామ్య వ్యతిరేకులుగా మారడం ప్రస్తుతం ప్రపంచంలో నడుస్తున్న నయా ట్రెండు. ఇది భవిష్యత్తులో మానవాళికి ప్రమాదకరంగా పరిణమించబోతోన్న అంశం. ప్రచ్ఛన్న యుద్ధం ప్రత్యక్ష నేపథ్యంలో ప్రజాస్వామ్య పెట్టుబడిదారీ నమూనా, దాని పోటీదారుపై ఖచ్చితంగా విజయం సాధించిందని విశ్లేషించవచ్చు. తరువాతి సంవత్సరాల్లో, ప్రజాస్వామ్య దేశాల సంఖ్య 1974లో 46 ఉండగా, 1990లో 76 కి, 2000 నాటికి 120 కి పెరిగింది. అదేవిధంగా ప్రపంచంలోని స్వతంత్ర దేశాల శాతం 30 నుండి 63 శాతానికి పెరిగింది. ఆటుపోట్లతో సమానంగా పెరుగుతున్న ఆర్ధిక పురోగతి ప్రజాస్వామీకరణకు ప్రతీకగా మారిందని ప్రఖ్యాత రాజకీయ శాస్త్రవేత్త శామ్యూల్‌ ‌హంటింగ్టన్‌ ‌తన గ్రంథమైన ‘‘ది థర్డ్ ‌వేవ్‌: ‌డెమోక్రటైజేషన్‌ ఇన్‌ ‌ది లేట్‌ ‌ట్వంటియత్‌ ‌సెంచురి’’లో పేర్కొన్నాడు. కొత్తగా అభివృద్ధి చెందుతున్న ఈ ప్రజాస్వామ్య దేశాలు ఆచరణలో చాలా అనైతికమైనప్పటికీ, ప్రపంచంలో ప్రజాస్వామ్య పురోగతి, రాజకీయ హక్కులు, పౌర స్వేచ్ఛలచే కొలవబడిన ‘‘స్వేచ్ఛా స్థాయి విస్తరణలలో స్థిరమైన గణనీయమైన  సమాంతర స్థానం కలిగి ఉంది’’ అని డైమండ్‌ ‌వాదించారు. అయితే 2001 నుంచి ప్రజాస్వామ్య పాలనా పద్దతులు పతనం చెందడం ఇక్కడ ప్రపంచాన్ని భయోత్పాతానికి గురిచేసే అంశం. ప్రపంచంలో మార్కెట్‌ ఆధారిత ప్రజాస్వామ్య సమాజాన్ని విస్తరించి, బలోపేతం చేయడం తమ ఉద్దేశమని 1993లో ఐక్యరాజ్యసమితిలో చేసిన ప్రసంగంలో నాటి అమెరికా అధ్యక్షుడు బిల్‌ ‌క్లింటన్‌ ‌ప్రకటించాడు.

2006 తరువాత ప్రజాస్వామ్య విస్తరణ ఆగిపోయి, తిరోగమన దిశలోకి మారింది. ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యం, రాజకీయ స్వేచ్ఛను గణించే ‘‘ఫ్రీడమ్‌ ‌హౌస్‌’’ ‌తన 2018 వార్షిక నివేదికలో 2006 నుండి వరసగా 12 సంవత్సరాలు 113 దేశాలలో స్వేచ్ఛా స్వాతంత్రాలు క్షీణించాయని పేర్కొంది. అదేవిధంగా ఎకనామిక్‌ ఇం‌టెలిజెన్స్ ‌యూనిట్‌ ‌కూడ తన ప్రజాస్వామ్య సూచికలో ‘‘ఈ సంవత్సరాలలో ప్రపంచ ప్రజాస్వామ్యం అత్యత దురావస్థకు చేరుకుందని ప్రకటించింది. ‘‘ప్రజాస్వామ్య తరంగం ఒక శక్తివంతమైన అధికార సంస్థ ద్వారా మందగింపబడడంతో పాటు, ప్రపంచం ప్రజాస్వామ్య మాంద్యంలోకి జారిపోయింది’’ అని 2008లోనే డైమండ్‌ ‌హెచ్చరించాడు. ఉదారవాద దేశాలలో నిరంకుశ పాలనలు వేళ్ళూనుకొనడానికి కారణాలేంటి? ప్రచ్ఛన్న యుద్ధానంతరం ప్రపంచ ఆశయాలకు వ్యతిరేకంగా నిరంకుశ ప్రభుత్వాలు తమ సొంత దేశాలలో పట్టు సడలించలేదు. అయితే వారు దాని నుండి లాభం పొందినందున ఉదారవాద అంతర్జాతీయ క్రమంతో మరింత రాజీ పడ్డారు. సాంకేతిక అభివృద్ధిని కూడ నిరంకుశవాదులు తమకు అనుకూలంగా మలుచుకున్నారు. నేటి నిరంకుశ పాలకులు తమ ప్రజలను గతంలో కంటే ఎక్కువ స్థాయిలో పర్యవేక్షించే సామర్థ్యాన్ని పొందడమే కాకుండా, ప్రజాస్వామ్య ఎన్నికలకు అంతరాయం కలిగించడానికి విదేశీ సంస్థలలోకి చేరే సామర్థ్యాన్ని సంపాదించారు.

2018 సూచిక ప్రకారం ప్రపంచంలో అత్యంత ప్రజాస్వామ్య దేశంగా నార్వే ఉండగా, ఉత్తర కొరియా చివరి స్థానంలో ఉంది. స్వతంత్ర దేశాల సంఖ్య పెరిగేకొద్దీ యుద్ధ సంభావ్యత తగ్గిపోతుంది. అదే సమయంలో శ్రేయస్సు వ్యాప్తి చెంది అంతర్జాతీయ సంబంధాలు బలపడతాయి. అయితే ప్రస్తుత పరిస్థితులలో ప్రజాస్వామ్య, ఉదార భావనల పరిరక్షణ ప్రస్తుతం ప్రపంచం ముందున్న అతిపెద్ద సవాలు. ప్రస్తుతం ప్రజాస్వామ్యం సంక్షోభ స్థితిలోకి నెట్టి వేయబడినప్పటికినీ రాజకీయ ఉదారవాదం విలువ ఎప్పటికీ ప్రకాశిస్తూనే ఉంటుంది. ఎందుకంటే ఇది సహనం, హక్కుల జ్ఞానోదయ సూత్రాలపై స్థాపించబడిన వ్యవస్థ. వ్యక్తిస్వేచ్చకై ప్రస్తుతం ఆర్మేనియా, ట్యునీషియా, సుడాన్‌ ‌వంటి దేశాలలో నినదిస్తున్న నిరసన గళాలు పుతిన్‌ ‌ప్రకటనను తప్పు అని నిరూపిస్తున్నాయి. ప్రజలు స్వేచ్ఛ, సమానత్వాన్ని కోరుకునేంత కాలం ఉదారవాద ప్రజాస్వామ్యానికి అంతం లేదు. ప్రపంచం మరింత ప్రజాస్వామ్య భవిష్యత్తును కోరుకుంటోంది.

జయప్రకాశ్‌ అం‌కం

 

Comments (0)
Add Comment