సద్బుద్ధి స్థిరం కావాలి

విధి ఆడే వింతనాటకం లో పావులు గా మారడం సహ జమేమో. కాని విధిని సైతం ధిక్కరించి,ఇతరుల మనోవేదనకు కారణమైన వారంతా ఈ భువిపై శాశ్వతంగా మిగిలిపోరు.వారంతా ఏదో ఒక రోజు కాలగర్భంలో కలసి పోక తప్పదు. చర్యకు ప్రతిచర్య ఉంటుందనేది శాస్త్ర సమ్మతం. మనం చేసే ప్రతీ పనికి మంచి చెడుల ఆధారంగా ప్రతి చర్యలుంటాయి. దుష్కృత్యాలకు ఫలితం తప్పదు. ఇది ఒక తరానికే పరిమితం కాదు. కొన్ని తరాలకు శాపం గా మారుతుందనే సత్యం చరిత్ర చెబుతున్నది.మనిషి ఎంతకాలం జీవించామన్నది కాదు,ఎంత గౌరవంగా జీవించామన్నదే ప్రధానం. నేటి సమాజంలో ఒకరిని మరొకరు పీక్కుతినే పరిస్థితులు ఏర్పడుతున్నాయి.

అగ్నికి ఆజ్యం తోడైనట్లుగా ఒకరి ఆవేదనకు మరెందరో కారణం కావడం ఎంతవరకు సబబు?  దేవుడున్నాడని నమ్మి,నిరంతరం దైవనామస్మరణ తో కాలం వెళ్లదీసే మనమందరం ఇతరుల ఆవేదనకు అకారణంగా కారకులమౌతున్నామా? ఒక్కసారి ఆలోచించాలి. మనం ఎందుకు జన్మించాము? జన్మించి చేస్తున్నదేమిటి?  మనుషులు మారాలి? మారిన మనుషులు ఎవరినీ ఉద్దరించనవసరం లేదు. ఎవరి బ్రతుకును వారు బ్రతికి, ఇతరులను కూడా బ్రతకనిచ్చే నూతన సమాజం ఏర్పడాలి. పశ్చాత్తాపంతో మారడం ఒక ఎత్తయితే, వైరాగ్యం తో మారడం మరొక అంశం. మొదటి మార్గమే శ్రేయస్కరం. మానవ తప్పిదాల వలన సకల జీవరాశులు  మహా ప్రళయం అంచున నిలబడి ఉన్నాయి.ఇకనైనా మన తప్పిదాలకు,ఘోరకృత్యాలకు విముక్తిలేదా? సకలాచరాచర జగత్తు ను విధ్వంసం చేసి, మానవుడు సాధించే దేమిటి? అనంత కోటి జీవరాశుల మనుగడ ప్రస్తుతం మానవ విచక్షణపై ఆధారపడి ఉంది. మన గమ్యం మంచి వైపే సాగాలి.సకల జగతి హర్షించాలి.

సన్మార్గంలో పయనిస్తూ, వ్యక్తిత్వంతో కూడిన గౌరవ ప్రదమైన జీవనం సర్వధా శ్రేయస్కరం.వంచన పరిత్యజించాలి. పరుష వాక్కులు,ఢాంబికం,అహం,స్వార్ధం, అవినీతి,హింస వంటి లక్షణాలను  విడనాడాలి.పుట్టి జనం మెచ్చేవిధంగా జీవించాలి.  ఇతరుల నిందావాక్యాలు హృదయశల్యమైనా భరించక తప్పదు.స్వార్ధం కోసం హింసించి, ఇతర  వ్యక్తుల సచ్ఛీలతను  చెడుగా చిత్రీకరించి, వారి గుణసంపదను అపఖ్యాతి పాలు చేయడం అత్యంత క్రూర,పాప ప్రక్రియ. దైవం మెచ్చని పాపకార్యాలకు ఉత్ప్రేరకం గా మారడం నీచాతినీచమైన ఉన్మాద క్రీడలో ఒక భాగం.మంచితనంతో జీవించి,ధర్మాన్ని రక్షించి, సత్యమనే సురక్షిత స్థానం పై నిలబడాలి. అప్పుడే మానవాళి మనుగడ సాగించగలదు. మారడమా? మరణించడమా అనేది మన విచక్షణపై ఆధారపడి ఉంది. ఆలోచనకు పదును పెట్టి సక్రమ జీవనానికి చేయూత నివ్వాలి.

– సుంకవల్లి సత్తిరాజు, 9704903463.

Comments (0)
Add Comment