మల్కపల్లి కౌలు రైతు కుటుంబం సామూహిక ఆత్మహత్య ఘటనలో ఎవరి బాధ్యత ఎంత?

మార్చి 25వ తేదీని మంచిర్యాల జిల్లా, కాసిపేట మండలం, మల్కపల్లి గ్రామం ఇంక ఎప్పటికీ మర్చిపోలేకపోవచ్చు. తమ కళ్ళ ముందు రోజూ కనిపించే ఆ కుటుంబం కలిసికట్టుగా ఆత్మహత్య చేసుకుంటుందని ఎవరూ ఊహించి ఉండకపోవచ్చు. వ్యవసాయంలో నష్టం వచ్చి, అప్పులపాలై.. ఆ దిగులుతో పురుగులమందు తాగి ఒక్కరొక్కరుగా చనిపోయిన రైతుల గురించి వింటూ, చూస్తూ వచ్చారు గానీ, ఇలా కుటుంబం మొత్తం చనిపోవటం ఆ ఊరి వారందరినీ కలచివేస్తోంది. ఇది కేవలం ఆ ఊరికి మాత్రమే సంబంధించిన అంశం మాత్రమేనా? ఆ కుటుంబం సామూహిక చావుతో ముడిపడిన అంశాలేమిటి? వారిని చావు వరకూ తరిమిన అంశాల్లో వారి బాధ్యత ఎంత? సమాజం బాధ్యత ఎంత? ప్రభుత్వాల బాధ్యత ఎంత? రాజకీయ పార్టీల బాధ్యత ఎంత?

వాస్తవానికి తెలంగాణలో కౌలు వ్యవసాయమే ప్రధానం. కౌలు మీద ఆధారపడిన రైతుల కుటుంబాలు లక్షల్లో వున్నాయి. కానీ ఈ అంశాన్ని ప్రభుత్వం పట్టించుకోదు. వారికి ఏ మద్దతు వ్యవస్థను అందించదు. అసెంబ్లీ సాక్షిగా కౌలురైతులను గుర్తించే ముచ్చటే లేదని ముఖ్యమంత్రి కేసిఆర్‌ ‌గారు ప్రకటించిన విషయం అందరికీ గుర్తుండే వుంటుంది. ప్రాంతాన్ని బట్టి కౌలు ధరలు ఉంటున్నాయి. ఒక్కో ఎకరానికి ఎనిమిది నుంచీ పదిహేను వేల వరకూ కూడా కౌలు ధర పలుకుతోంది. నీటి సౌకర్యం వుంటే మరింత ఎక్కువ. భూమి స్వంతదారులకు తప్పించి కౌలురైతులకు రైతుబంధు పథకం వర్తించదు. అంటే భూమి యజమానులకు రెండు విధాలుగా లాభం. ఒకటి ప్రభుత్వం నుంచీ వచ్చే రైతుబంధు పథకంతో పాటు ఆ భూముల మీద ఇచ్చే రుణ సదుపాయాన్ని కూడా ఉపయోగించుకోవచ్చు. మరోపక్క అదే భూమిని కౌలుకి ఇవ్వడం ద్వారా మరికొంత మొత్తాన్ని తమ ఖాతాలో వేసుకోవచ్చు. ఎవరీ భూమి స్వంతదారులు? వారెందుకు వ్యవసాయం చేయటం లేదు? అనే ప్రశ్నలు తప్పనిసరిగా వేసుకోవాలి. అత్యధికశాతం మంది ఉద్యోగాల రీత్యా, ఇతర వ్యాపారాల రీత్యా గ్రామాలను వదిలి సమీప పట్టణాల్లో, నగరాల్లో, ఇతర రాష్ట్రాల్లో, విదేశాల్లో వుంటున్నవాళ్ళు. వాళ్లు స్వంతంగా వ్యవసాయం చేయటం లేదు కానీ తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే రైతుబంధు పథకం వీరి ఖాతాలోకే వెళుతుంది. వాస్తవంగా సాగుభారం మోసే కౌలురైతులకు ఏ సాయం అందటం లేదు. జరిగిన విషాదఘటన మీద మల్కపల్లి గ్రామస్తులు కొంతమందితో మాట్లాడటం ద్వారా సేకరించిన అంశాలు ఇలా ఉన్నాయి:

‘ ‘ఆయనకి సొంత బూమి లేదు. అంతా కౌలుకి పట్టుడే. పదేళ్ల సంది పత్తి ఏసుకుంటా వస్తున్నడు. అప్పులయినయి. ఎకరానికి ఎనిమిది వేలు, పదివేలు భూమిని బట్టి కౌలుకి తీసుకుండు. పోయిన మార్చ్ ‌నెలలోనే బిడ్డ పెండ్లి చేసిండు. అది మరింత అప్పు అయింది. ఈ అప్పులతో ఏమనిపించిందో ఏమో ఇంట్లో నలుగురూ చనిపోయిన్రు.’’

‘‘మా ఊరే గాదు, మొత్తం మండలం అంతా పత్తే పెడతరు. మా మంచిర్యాల జిల్ల అంతా ఇట్లనే. ఏరే పంటలే లెవ్వు. కందులు లెవ్వు, పెసలు లెవ్వు, జొన్నలు లెవ్వు, మక్కలు లెవ్వు, ఏం లెవ్వు. అంతా పత్తే. ఇంతకు ముందు పండించేది కానీ పత్తి మొదలయిన తర్వాత అంతా పాయె. ఎకరానికి నాలుగైదు కింటాల్లు వచ్చినా లాభమే అనుకుంటా ఏసుకుంటం.’’ ‘‘పోయిన సంవత్సరం, ఈ సంవత్సరం పంట చానా తక్కువ దిగుబడి వచ్చింది. పెట్టుబడి కూడా ఎల్లలే. దానితో ఆయనకీ ఇరవై లక్షలపైనే అప్పు అయింది. ఈ ఇరవై ఐదో తారీక్కి ఎవరికో ఇవ్వాల్సి వుండేనంట! ఇవ్వలేకపోయిండు. సచ్చిపోయిండు. బిడ్డని నాలుగు రోజుల ముందు తోలకొచ్చిండు ఇంటికి. బిడ్డ డిగ్రీ వరకూ చదువుకుంది. అప్పుచేసి పెళ్లి చేసిండు. ఈయన పెద్దగా ఎవరితోనూ కలిసే మనిషి కాదు. నిలబడి పని చేయించెటోడు గానీ ఆయనే దిగి పనిచేసే మనిషి కాదు. అన్నీపైసలు పెట్టి చేయించాల్సిందేనాయె. మనం నడుం వంచి పనిచేయకుండా ఎవసాయం నడవది. అయితే ఆయనకు చాతకాదు. కొంచం ఇంటర్‌ ‌వరకూ చదువుకున్నోడే. కొడుకు చిన్నోడు. భార్య ఇల్లు చూసుకునేది. అంతో ఇంతో ఆమె కూడా పొలం పని చేసేది. బిడ్డ పెండ్లికి ఆరు లక్షలు కట్నం వొప్పుకుండు. ఇంకా రెండు లక్షలు ఇవ్వాల్సి వుండే. పెండ్లి మంచిగా ఫంక్షన్‌ ‌హాల్లో గ్రాండ్‌ ‌గా చేసిండు. అన్నీ అప్పులయినయి. ఆ బిడ్డకు ఇంకో రెండు మూడేళ్ల తర్వాత పెండ్లి చేసినా ఏమీ కాకపోయే. ఏదో తొందరగా చెయ్యాలే అని సూసిండు. మస్తు అప్పులయినయి. ఏమనుకున్నారో మరి నలుగురూ, తెల్లారేసరికి సచ్చిపోయిన్రు. మస్తు బాధవుతున్నది తలచుకుంటే. తెల్లారితే అందరం కనిపించుకుంటా తిరిగెటోల్లమే. గోరం జరిగిపోయింది. నిద్రపట్టడం లేదు మా వూర్లో ఎవరికీ.’’

‘‘ఒక్క కుటుంబంలో నలుగురూ ఒకేసారి పోవడం అంటే ఇదే మొదలు. ఎంత బాధ అనిపిస్తది. ఇప్పటివరకూ పెండ్లాం పిల్లలను ఇడిసిపెట్టి ఒక్కడు పురుగుల మందు తాగింది ఇన్నంగానీ ఇట్ల ఎప్పుడూ ఇనలే. కుటుంబానికి కుటుంబమే పోయింది. మా మండలంలో జీర్ణించుకోలేకపోతున్నాం. ఎవరెవరో వస్తున్నరు. రాజకీయ పార్టీల వాళ్లు వస్తున్నరు. మాట్లాడుతున్నారు. ఎవరొచ్చి ఏం ఫాయిదా, పాపం అందరూ చనిపోయినంక.’’

‘‘కౌలుకి పట్టినోల్లు అందరూ మిత్తికి డబ్బులు తేవల్సిందే. సొంత డబ్బు లేదు. ఈన ముప్పై ఎకరాలన్నా లేకుండా కౌలుకి ఎప్పుడూ చేయలే. ముప్పై ఎకరాలంటే కౌలుకి కనీసం రెండు లక్షల నలభై వేలు కావాలె. అది కూడా టూ పర్సంట్‌ ‌వడ్డీకి తెవాల్సిందే. ఇవికాక ట్రాక్టరోళ్లకు, కైకిలోల్లకు, పత్తి ఇత్తనాలకు, మందులకు అన్నిటికీ అప్పు తెచ్చి చేయాల్సిందేనాయె. ఇప్పుడు ఇంట్రెస్ట్ ‌లేందే పైస లేదాయే. ఇంట్రెస్ట్ ‌లేకుండా ఒక్క పైస పుట్టదు. ఎవరి దగ్గర పరిచయం వుంటే వాళ్ల దగ్గర తెచ్చేది. ఇప్పుడు ఆల్లంతా మొత్తుకుంటాండ్రు. మేమింత ఇచ్చినం, కైకిలికి పోయి కూడబెట్టుకున్నవి మిత్తి వస్తుందని ఇచ్చినం అంటున్నరు. ఆళ్ల గోస ఆళ్ళది.’’ ‘‘ఈనకు ఇల్లుంది, కొన్ని టేకి చెట్లున్నయి. అవి అమ్మితే కొన్ని తీర్చొచ్చు గానీ ఇప్పుడు ఎవరు పూనుకోవాలే! వాళ్ల అన్న, వదిన వున్నరు గానీ ఆ కుటుంబం వేరు కదా! ఆ ఇల్లు, చెట్లు అమ్మి ఎక్కడన్నా బతకాల్సి వుండే, ఇట్ల చేసుకున్నరు. ఇంటిముందికి వచ్చి పైసల్‌ ‌కట్టమని ఎవ్వరైతే అడగలే. ఒక్కరు కూడా అట్ల రాలే. అంతా ఫోన్‌ ‌కాంటాక్ట్ ‌లోనే నడిచింది. ఈనకు సొంత భూమి లేదు కాబట్టి రైతుబంధు లాంటివి ఏమీ రావు. పట్టా బూమి సొంతది వుంటే మొదటి పంటకు ఎకరాకు ఐదువేలు చొప్పున కేసీఆర్‌ ఇస్తుండు. కౌలురైతుకు ఈ పథకం లేదు. కౌలురైతులు కూడా అడుగుతున్నరు కానీ ఇవ్వటం లేదు. ప్రభుత్వం ఈ నిర్ణయం ఎందుకు తీసుకుందో ఏం చెప్పగలుగుతం, అది వాళ్ల నిర్ణయం. ఏమైనా మా వూర్లో ఇలా జరగటం మాకు మస్తు బాదైతాంది.’’వ్యవసాయం చేయని భూయజమానులకు రైతుబంధు ఇవ్వడం ఆపేసి, ఆ సాయాన్ని   కౌలు రైతులకు అందంచటం వల్ల సమస్యను కొంతవరకూ పరిష్కారించ వచ్చిని, రైతు ఆత్మహత్యల కుటుంబాలతో గత పదిహేను సంవత్సరాలుగా పనిచేస్తున్న రైతుస్వరాజ్యవేదిక    కన్వీనర్‌     ‌కొండల్‌ ‌రెడ్డి   అభిప్రాయపడ్డారు

ఈ కౌలురైతు దంపతులు జంజీరాల రమేష్‌, ‌పద్మలకు తమ ఎదిగిన పిల్లలతో సహా ప్రాణాలు తీసుకోవాల్సిన కష్టం ఏమొచ్చిందనేది ఆయన రాసి పెట్టిన ఉత్తరంలోనే వుంది. ఇజ్జత్‌ ‌పోతే బతకలేం అనుకోవడం ఏమిటి? బతకటానికి లేని ధైర్యం బలవంతంగా ప్రాణాలు తీసుకోవటానికి ఎలా వచ్చింది? చనిపోవటానికి ముందు కారణాలు వివరిస్తూ వాళ్లు రాసిన ఉత్తరం తెలంగాణ సమాజానికి ఏం చెబుతోంది? రైతులు వ్యక్తులుగా ఆత్మహత్యలు చేసుకోవడమే అతిపెద్ద సామాజిక సమస్య అనుకుంటే, ఇప్పుడు కుటుంబాలుగా ఆత్మహత్యలు చేసుకోబోయే గడ్డుకాలం సమీపిస్తోందా? ఈ కుటుంబం దానికి దారి చూపించిందా? రైతు ఆత్మహత్యలు తెలంగాణ రాష్ట్రంలో అత్యంత సహజమైన విషయం కాబట్టి, వీటిని అధికార యంత్రాంగం, ప్రభుత్వం పట్టించుకోకపోవచ్చు. పైగా ఎప్పుడూ వల్లెవేసినట్టు రైతుల వ్యక్తిగత సమస్యలే వీటికి కారణం అని చేతులు దులుపుకోవచ్చు. మామూలుగా అయితే బతికివున్న భార్యను ‘నువ్వే నీ భర్త చావుకు కారణం, అతనికి మనశ్శాంతి లేకుండా గొడవపడ్డావు కాబట్టి మీ ఆయన చచ్చిపోయాడు’ అని అవమానించడానికి ఇక్కడ పాపం వారికి అవకాశం లేకుండా అయిపోయింది! ఎందుకంటే కుటుంబంలో వున్న నలుగురూ చనిపోయారయ్యే మరి! వున్న నలుగురూ చనిపోయారు కాబట్టి ఈ చావుల గురించి కుటుంబం నుంచీ అడిగేవారు కానీ, ఎక్స్ ‌గ్రేషియా కోసం అర్ధించేవారు కానీ ఎవరూ ఉండరని సంతోషపడవచ్చు కూడా! ఈ విషయాలను పక్కనపెడితే, కుటుంబం మొత్తం బలవంతంగా ప్రాణాలు తీసుకోవడానికి దారితీసిన కారణాల గురించి సమాజం మాట్లాడాల్సిన అవసరాన్ని గుర్తిస్తే మున్ముందు జరగబోయే వాటిని కొన్నైనా ఆపటానికి ఒక మార్గం ఏర్పడుతుంది. మొదటిది: బతుకుతెరువు కోసం ఈ కుటుంబం తమకు స్వంత భూమి లేకపోయినా గానీ వ్యవసాయాన్నే నమ్ముకుంది. దానికోసం తన శక్తికి మించి భూమిని కౌలుకు తీసుకుని గత కొన్ని సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తోంది. ఇక్కడ కౌలురైతుల కోసం ప్రభుత్వ మద్దతువ్యవస్థ ఎందుకు లేదనేది ప్రధానమైన ప్రశ్న? తెలంగాణలో జరుగుతున్న రైతు ఆత్మహత్యల్లో అత్యధిక శాతం కౌలురైతులదే! దీనికి సమాధానం ముఖ్యమంత్రిగారే ఇవ్వాలి. రెండు: అప్పుచేసి మరీ ఆడపిల్లల పెళ్లి చేయాల్సిన పరిస్థితి ఎందుకు పెరుగుతోంది? కట్నాల జాడ్యం ఎందుకు తీవ్రమవుతోంది. దీనికి పరిష్కారం ఆలోచించవలసిన బాధ్యత సమాజానికి లేదా? కట్నాన్ని, ఘనంగా పెళ్లిని కోరిన అవతలి కుటుంబానికి ఈ కుటుంబం చావుకి సంబంధించి ఏ బాధ్యతా లేదా? డిగ్రీ వరకూ చదివించిన ఆడపిల్లను మరింత ఉన్నత చదువుల వైపుగా, తమ కాళ్ళమీద తాము నిలబడే విధంగా ఎందుకు ప్రోత్సహించలేకపోతున్నారు? మూడు: ‘మధ్యతరగతి కాబట్టి ఇజ్జత్‌ ‌పోతే బతకలేం’ అనే అక్కరలేని భావనలోకి కుటుంబాలని నెడుతున్న భావజాలం ఎంత ప్రమాదకరంగా మారుతోందో అర్థంకావటం లేదా? ఇవన్నీ ఒకదానికొకటి సంబంధంలేని విషయాలుగానే ఇంకా కనిపిస్తున్నాయా!? మల్కపల్లి వంటి విషాద ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే మనందరం ఏం చేయాలన్నదే అసలు ప్రశ్న.

Comments (0)
Add Comment