మెప్పించి ఒప్పించాల్సిన చోట…

సామ దానంమాని కేవలం దండోపాయంతోనే ప్రజలను నిరోధిస్తామన్నట్లుగా ఉంది రాష్ట్ర ప్రభుత్వ పనితీరు. ప్రజల సౌకర్యంకోసం, ప్రజల మద్దతుతో చేపడుతున్న పనులకు సంబంధించి , ఆ ప్రజలు నష్టపడకుండా చూడాల్సిన ప్రభుత్వం ఆ విషయంలో జాప్యంచేస్తుండాన్ని ప్రశ్నించినందుకు వారిని చితక బాదడమన్నది నిజంగా బాధాకరం . తమ ప్రాంతంకోసం, తమ ఊరికోసం చేపడుతున్న ప్రాజెక్టుల్లో తమ భూమిని సర్కార్‌కు అప్పగించడం ద్వారా ఇక్కడి భూములు సస్యశ్యామలమవుతాయన్న ఆనందంతో తమ జీవన ఆధారాన్ని వదులుకుంటున్నవారి రక్తాన్ని ప్రభుత్వం కళ్ళచూడడం దారుణం. వాళ్ళేమి గొంతమ్మ కోరికలు కోరడం లేదు. న్యాయబద్దంగా, చట్టబద్దంగా ప్రభుత్వం ఇచ్చిన హామీనే అమలు చేయమంటున్నారు. తరతరాలుగా భూమినే నమ్ముకుని బతుకుతున్న అనేక మంది తమ సర్వస్వాన్ని వొదులుకుని ప్రభుత్వం అందించే సహాయ, సహకారాలకోసం గత పన్నెండు ఏళ్ళుగా చకోర పక్షుల్లా ఎదురుచూస్తున్నారు. దశాబ్దాలుగా తమ గోడు పట్టించుకోకపోవడంతో కాలుతున్న కడుపుతో ఆందోళన చేపడితే అర్థరాత్రి అదమరిచి నిద్రించే సమయంలో అరెస్టులుచేసి, ఎవరిని ఎక్కడికి తీసుకెళుతున్నారో తెలియకుండా వ్యాన్‌లో ఎక్కించుకుని పోతే పాపం ఆ కుటుంబాల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకుంటేనే భయమేస్తుంది.

వారేమీ తమ భూములు ఇవ్వడానికి వెనుకాడలేదు. ఇచ్చిన భూములను వెనక్కు ఇవ్వమని అడగడం లేదు. తాము భూమి కోల్పోయినా ఆ భూముల్లో చేపట్టిన ప్రాజెక్టు జలకళను సంతరించుకుంటే చూసి ఆనందించాలనుకున్న రైతాంగానికి ఇప్పుడు మిగిలింది కన్నీరే. ప్రభుత్వాలు చేపట్టిన ప్రాజెక్టులు పూర్తి అయినా భూ నిర్వాసితులకు పరిష్కారం లభించకపోవడమన్నది కొత్తదేమీకాదు. అందుకే గౌరవెల్లి ప్రాజెక్టు భూ నిర్వాసితులు తమకు న్యాయపరంగా ప్రభుత్వం అందజేస్తానన్న పరిహారం, ఇతర సదుపాయాలను అందజేసిన తర్వాతే ట్రయల్‌ ‌రన్‌ ‌లాంటి కార్యక్రమాలను చేపట్టుకోవాలని డిమాండ్‌ ‌చేస్తూ ఆందోళన బాట పట్టారు. ఈ విషయంలో వారిని ఒప్పించి, మెప్పించాల్సిన ప్రభుత్వం పోలీసులను ఉసిగొల్పడంతో ఇప్పుడక్కడ యుద్ధ వాతావరణం నెలకొంది. గత రెండు రోజులుగా ఒక పక్క పోలీసుల అండదండలతో ప్రజాప్రతినిధులు, మరో పక్క భూ నిర్వాసితుల మధ్య ఘర్షణ వాతావరణం కొనసాగుతున్నది. ఈ ఘర్షణలో అటు పోలీసులకు, ఇటు భూ నిర్వాసితులకు దెబ్బలు తగిలాయి. ఒకరిద్దరు మహిళలు స్రృహ కోల్పోవడంతో వారితోపాటు మరో పదకొండు మందిని దవాఖానాలో చేర్చాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ విషయం ఇప్పుడు రాష్ట్రంలో హాట్‌ ‌టాపిక్‌గా మారింది. వాస్తవానికి ఇది చాలా చిన్న విషయమే అయినప్పటికీ ఇరువర్గాల పట్టుదలలు ఉద్రిక్తతకు దారితీసింది.

సిద్ధిపేట జిల్లా అక్కన్నపేట మండలం గౌరవెల్లి గ్రామంలో అర్థరాత్రి జరిగిన ఈ సంఘటనకు ప్రభుత్వం ప్రాజెక్టులో ట్రయల్‌ ‌రన్‌ ‌చేపట్టేందుకు ప్రయత్నించడం ప్రధానకారణమైంది. వాస్తవంగా గౌరవెల్లి ప్రాజెక్టుకోసం తమ భూములను త్యాగం చేసిన నిర్వాసితులకు ప్రభుత్వం ఇస్తానన్న నష్టపరిహారం పూర్తిస్థాయిలో చేరలేదు. ఈ విషయంలో చాలా కాలంగా గ్రామస్తులు ఆందోళన బాట పట్టారు. ప్రభుత్వం పలు దఫాలుగా వారితో చర్చించి, ఇచ్చిన హామీమేరకు అన్నివిధాలుగా అదుకుంటామని వారికి హామీ ఇచ్చింది. తాజాగా జిల్లా కలెక్టర్‌ ‌కార్యాలయంలో దీనిపై జరిగిన సమావేశంలో హుస్నాబాద్‌ ఎంఎల్‌ఏ ‌సతీష్‌ ‌కూడా తమ ప్రభుత్వం భూనిర్వాసితులకు న్యాయం చేస్తుందని, ఒక్క పైసకూడా బాకీలేకుండా అంతా చక్కబెడుతామని హామీ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ప్రాజెక్టు పనులు 95 శాతం పూర్తి అవడంతో అక్కడ ట్రయల్‌ ‌రన్‌ ‌చేపట్టాలని అధికారులు అభిప్రాయపడ్డారు. అప్పటికే ఆరు నెలలుగా దీక్షలు చేపట్టిన గౌరారం భూనిర్వాసితులు అధికారులను అడ్డుకోవడమే ఈ వివాదానిక కారణమయింది.

అధికారులకు మద్దతుగా అధికార పార్టీకి చెందిన స్థానిక ప్రజాప్రతినిధులు రావడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. అక్కడ తోపులాట, దాడుల వరకు వెళ్ళింది. దీంతో పోలీసుల జోక్యం అనివార్యంగా మారింది. గొడవను అదుపు చేసేందుకు పోలీసులు లాఠీలు ప్రయోగించడంతో చాలామంది గాయపడ్డారు. పోలీసులు కేవలం లాఠీలేకాకుండా రోకలిబండ లాంటి మారణాయుధాలతో దాడిచేశారని సిపిఐ నేత నారయణ లాంటివారు విమర్శిస్తున్నారు. ఈ ఘర్షణలో భూ నిర్వాసితుల్లో కొందరిని పోలీసులు అరెస్టు చేసి తీసుకువెళ్ళడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. కేవలం నష్టపరిహారం సంపూర్ణంగా చెల్లించిన తర్వాతే పనులు చేసుకోవాలని నిరోధించినందుకే పోలీసులు అర్థరాత్రి నానా భీబత్సం చేయడం పట్ల ప్రతిపక్షాలన్నీ ప్రభుత్వ చర్యను తీవ్రంగా విమర్శిస్తున్నాయి. అతి చిన్న సమస్యను ప్రభుత్వం భూతద్దంలోపెట్టి చూపిస్తోందని ఆ పక్షాలు ఆరోపిస్తున్నాయి. భూనిర్వాసితుల్లో సుమారు అయిదు వందల మంది ఉపాధి తదితర అంశాలు పరిష్కారం కాలేదని, మరి కొందరికి డబుల్‌ ‌బెడ్‌ ‌రూం విషయంలో ఇంకా స్పష్టత లేదని, ఆర్‌ అం‌డ్‌ ఆర్‌ ‌ప్యాకేజీ తదితర చిన్న విషయాలను పరిష్కరించకుండా, పెండింగ్‌లో పెట్టి తెల్లవారు జామున మూడున్నర గంటలకు భీబత్సం చేయాల్సిన అవసరమేంటని ఆపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాయి. గోటితో పోయేదాన్ని గొడ్డలివరకు తెచ్చుకోవడమంటే ఇదే ..

prajatantra newstelangana updatestelugu kavithaluTelugu News Headlines Breaking News NowToday HilightsWhere to persuadeతెలుగు వార్తలు
Comments (0)
Add Comment