కోవిడ్‌ అం‌తం.. ఎక్కడుంది వ్యూహం !

  • ఆదమరిస్తే మళ్ళీ తలెత్తే మహమ్మారి ఇది
  • కొత్త రూపుతో రోజుకో పెనుసవాలు

‘ది వైర్‌’ ‌కథనం
ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్ ,ఆగస్ట్ 25: ‌ప్రపంచ చరిత్రలోనే అత్యంత భయానకమైన మారణ హోమాన్ని సృష్టించింది కోవిడ్‌ ‌మహమ్మారి. కేవలం రెండు సంవత్సరాల వ్యవధిలోనే లక్షల మంది మరణించారు. వేలాది కోట్లు ఆవిరైపోయాయి. ధనిక, పేద, సంపన్న అన్న తేడా లేకుండా అన్ని దేశాలను మృత్యువలయంలా చుట్టేసిన ఈ మహమ్మారిని పూర్తి స్థాయిలో మానవాళి అంతు చేయగలుగుతుందా? లేక మానవాళి అంతే ఇది చూస్తుందా? వైద్య పరిభాషలో చెప్పాలంటే వైరస్‌ అన్నదానికి చావు లేదు. అది ఎదో రూపంలో ఎక్కడో అక్కడ వికటాట్టహాసం చేస్తూనే ఉంటుంది. కోవిడ్‌ ‌మహమ్మారిని ఎదుర్కునే విషయంలో ప్రపంచ దేశాలన్నీ వైద్య పరిజ్ఞానాన్ని పరస్పరం అందించుకుంటూ ముందుకు వెళితే తప్ప ఈ మహమ్మారిని మట్టుబెట్టడం సాధ్యం కాదు. తాత్కాలికంగా టీకాలు వేసి వైరస్‌ ‌సమసిపోయిందనుకుంటే, అది మళ్ళీ తలెత్తదని ధీమాగా కూర్చుంటే మరోసారి డీలా పడటం ఖాయం. స్వేచ్ఛాయుత వాతావరణానికి అలవాటు పడిన ప్రపంచ ప్రజలు ఈ మహమ్మారిని సృష్టిస్తున్న మారణహోమాన్ని భరిస్తున్నారే తప్ప ఆంక్షలను, లాక్‌ ‌డౌన్‌లను తట్టుకోలేకపోతున్నారు.

అందుకే ప్రపంచ దేశాలన్నీ కూడా కోవిడ్‌ ‌కేసులు, ఆంక్షల మధ్య సమతూకం సాధనకు ప్రయత్నిస్తున్నాయి. అమెరికా, బ్రిటన్‌ ‌వంటి దేశాలలో కొత్తగా వేల సంఖ్యలో కేసులు పుట్టుకొస్తున్న ఆంక్షలను, పరిమితులను పూర్తిగా ఎత్తేశారు. చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలన్నట్లుగా న్యూజిలాండ్‌ ‌మాత్రం కేసులు స్వల్పనగానే ఉన్నా స్వల్పకాల లాక్‌ ‌డౌన్‌ ‌విధించి వాటిని కట్టడి చేసింది. గత ఇరవై నెలలుగా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌తో పాటు అనేక తూర్పు ఆసియా దేశాలు కోవిడ్‌ అం‌తు చూడటమే ఆశయంగా కఠిన విధానాలను చేపట్టాయి. ఇందులో భాగంగానే సరిహద్దుల్లో నియంత్రణలు, లాక్‌ ‌డౌన్‌లు ఇబ్బడి ముబ్బడిగా విధించాయి. ఆ చర్యల ఫలితంగా వైరస్‌ ‌వ్యాధిగ్రస్తుల సంఖ్య అలాగే మరణాలు తగ్గాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆర్ధికంగా తీవ్రస్థాయిలో ఎలాంటి కష్ట నష్టాలు చవి చూసినా మానవ మనుగడే ముఖ్యమన్న భావనతో ఈ దేశాలు కఠినంగానే వ్యవహరించాయి.

అన్ని చోట్లా మాస్కులను ధరించడంతో పాటు కోవిడ్‌ ‌నిబంధనలను ఎక్కడా ఉల్లంఘించడానికి వీలు లేదని కఠినంగానే చర్యలు చేపట్టాయి. ఇక న్యూజీలాండ్‌ ‌వంటి దేశాలైతే కోవిడ్‌ ‌నిర్మూలనను ఓ నిరంతర వ్యూహంగా అమలు చేయాలని సంకల్పిస్తున్నాయి. ఎన్ని కఠిన చర్యలు చేపట్టినా ఎప్పటికప్పుడు కొత్త రూపుతో వికటాట్టహాసం చేస్తున్న ఈ వైరస్‌ను శాశ్వతంగా మట్టుబెట్టడం సాధ్యమా? అన్ని దేశాల లక్ష్యం ఇదే అయినప్పటికీ ఈ మహమ్మారి మాత్రం ఏ మూలనో పంజా విసురుతూ దావానలంలా వ్యాపిస్తూనే వొస్తుంది. అనేక దేశాలలో ఈ వైరస్‌ ‌వ్యాప్తి పూర్తి స్థాయిలో సమసిపోలేదు. ఎక్కడైతే కేసులు ఎక్కువగా ఉన్నాయో, ఎక్కడైతే విధానపరమైన నిర్లక్ష్యం కనిపిస్తుందో అక్కడి నుంచే వైరస్‌ ‌ప్రయాణం మొదలవుతుంది. కొత్త రూపు, కొత్త తీవ్రతతో వేలాదిమంది ప్రాణాలు కబళిస్తుంది. ప్రపంచీకరణ పుణ్యమా అని అన్ని దేశాలు లాభపడ్డాయి. సరిహద్దులు చెరిపేసి సంపదల ద్వారాలు తెరిచాయి. ఈ ప్రపంచీకృత వాతావరణంలో ఏ దేశాన్ని ఏకాకిని చేసే వీలు ఉండదు. ఇప్పుడు అదే పరిస్థితి కోవిడ్‌ ‌వ్యాప్తికి అత్యంత తీవ్ర స్థాయిలోనే కారణమైంది. ప్రపంచ పర్యాటకులను ఎలా నిరోధించజాలమో వారు తెచ్చే వైరస్‌ను కూడా ఆపలేం. వియత్నాం, థాయిలాండ్‌, ‌దక్షిణ కొరియా వంటి దేశాలలో కోవిడ్‌ ‌పూర్తిగా సమసిపోయిందని భావించారు. కానీ ఇప్పుడు ఆ దేశాల్లో పర్యాటకుల పుణ్యమా అని కోవిడ్‌ ‌వైరస్‌ ‌మళ్ళీ పడగెట్టింది.

ఒకే రూపంలో ఉన్న దాన్ని మట్టు బెట్టగలం కానీ సవాలుకు ప్రతి సవాలుగా కొత్త రూపాన్ని సంతరించుకునే వైరస్‌లను పూర్తిగా నిర్మూలించడం సాధ్యం కాదు. ఇప్పటికే మూడు రకాల వైరస్‌లు పుట్టుకు వొచ్చాయి. అల్ఫా వైరస్‌ అన్నది యాభై నుంచి వంద శాతం వరకు పూర్తి శక్తితో వ్యాపించే అవకాశం ఉన్నది. 2019 చివరి దశలో తలెత్తిన మాతృక వైరస్‌ ‌కంటే కూడా ఇది అత్యంత ప్రాణాంతకం. ఇక అల్ఫాను మించిన శక్తి తాజాగా పచార్లు కొడుతున్న డెల్టా వైరస్‌ ‌రకానికి ఉంది. ఆల్ఫా కంటే కూడా యాభై శాతం ఎక్కువగా వ్యాప్తి చెందే శక్తి ఈ వైరస్‌కు ఉంది. వైరస్‌ ఎం‌త తీవ్రంగా వ్యాపిస్తే అంతగానూ అణచివేత చర్యలు తప్పవు. ఏ మాత్రం లక్షణాలు లేకపోయినా ఈ వైరస్‌ ‌లేదని భావించడానికి వీలు లేదని అంటున్నారు. అలాంటప్పుడు దీనిని గుర్తించి వ్యాప్తిని అరికట్టడం ఎలా సాధ్యం. అలాగని వొదిలేస్తే ఈ వైరస్‌ ఓ ‌రిజర్వాయర్‌గా మారి మళ్ళీ పెను విలయాన్నే సృష్టిస్తుంది. ఇలా లక్షణాలు కనిపించని కోవిద్‌ ‌వ్యాధిగ్రస్తుల వల్లే ఎదో దశలో ఈ వ్యాధి మళ్ళీ పుట్టుకొస్తుంది. మళ్ళీ మారణహోమం సృష్టిస్తుంది. ఏ విధంగా చూసినా కూడా ఇది ముందుకు వెళ్లలేని, చేతులు ముడుచుకు కూర్చోలేని పరిస్థితి. ఇప్పటికే అనేక దేశాలలో కోవిడ్‌ ‌పేరిట విధించిన లాక్‌ ‌డౌన్లతో జనం విసుగెత్తిపోయారు. ప్రభుత్వాలు లాక్‌ ‌డౌన్‌ ‌విధిస్తున్నాయి తప్ప వైరస్‌ను పూర్తిగా అంతం చేయగలిగాయా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

టీకాలతో సరా?
కోవిడ్‌ ‌వైరస్‌ ‌వ్యాప్తిని నిరోధించేందుకు అనేక రకాలుగా టీకాలు తెరపైకి వొస్తున్నాయి. ఈ టీకాల పనితీరు ఎంత? అవి ఎంత మేరకు వైరస్‌ ‌వ్యాప్తిని అరికట్టగలుగుతాయన్న సందేహాలు ఉన్నప్పటికీ వీటివల్ల జనంలో భయం పోయింది. అయితే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ ‌వంటి దేశాలలో పూర్తి స్థాయిలో టీకా కవరేజీ జరగకపోవడం అన్నది ఆ దేశాల నిర్లిప్తతకు నిదర్శనంగా భావించాల్సి ఉంటుంది. అక్కడా విధానపరమైన పట్టు సడలడం వల్లే వైరస్‌ ‌కొత్త రూపుతో మళ్ళీ తలెత్తింది. ఎవరు ఎన్ని చర్యలు చేపట్టినా, ఎంతగా వైద్యపరమైన అభివృద్ధిని సాధించినా టీకాలన్నవి వైరస్‌ ‌వ్యాప్తిని అరికడతాయే తప్ప దాని పుట్టుకను నిరోధించలేవు. మొత్తం ప్రపంచ ప్రజలందరికీ టీకాలు వేయగలిగితే తప్ప ఈ వ్యాధి వ్యాప్తిని అరికట్టలేం. ఈ విషయంలో ఏ మాత్రం ఉదాసీన వైఖరిని అవలంభించిన ఎక్కడ తప్పటడుగు వేసినా కూడా వైరస్‌కు ఆజ్యం పోసినట్లే అవుతుంది. ఒకప్పుడు పొంగు వ్యాధిని టీకాల ద్వారా ఎలా అరికట్ట గలిగామో అదే స్థాయిలో ఈ టీకాల కార్యక్రమాన్ని నలుదిశలా విస్తరించాలి. అలాంటప్పుడే వైరస్‌ ‌నుంచి రక్షణ అన్నది వైద్యుల భావన. అయితే ఈ టీకా అన్నది ఎంత కాలం శరీరంలో పని చేస్తుంది అన్నది కూడా సమాధానం లేని ప్రశ్న. పైగా ఈ టీకా పంపిణీ పూర్తి స్థాయిలో ఇంతవరకు జరుగలేదు. అందరికీ టీకాలు వేయడం అసాధ్యమేనని ఇప్పటికిప్పుడైతే సాధ్యం కాదన్నది నిపుణల అంచనా. ఇలాంటి పరిస్థితుల్లో తమ ప్రాంతంలో వైరస్‌ ‌లేదు కాబట్టి తాము సురక్షితమని భావించడానికి ఎక్కడా వీలు లేదు. అన్ని దేశాలు కూడా వాస్తవిక దృక్పథంతో ఈ తుది సమర వ్యూహాలను రూపొందించుకోవాలి. ప్రస్తుతానికి అయితే టీకాలను అందరికీ అందుబాటులోకి తేవడం అన్నది ప్రాధాన్యత కలిగిన అంశం అయితే అంతిమంగా ఈ వైరస్‌ను అంతం చేయడం పైనే అన్ని దేశాలు దృష్టిపెట్టాలి. ఇది సమగ్ర వ్యూహంతో సమష్టి కృషితోనే సాధ్యమయ్యే ఫలితం.

Kill Corona Virusprajatantra newsstrategyTelangana news updatestelugu short newstelugu vaarthalutoday breaking updates
Comments (0)
Add Comment