చైనా సైన్యం బలమెంత..?

‘ అమెరికా.. చైనా.. బిలియనీర్లకి ప్రపంచంలో వున్నా వనరులన్నీ కావాలి.. అందుకోసం అవసరం అయితే యుద్ధం చేయటానికి కూడా సిద్ధం… అందుకోసం మితిమీరిన సైన్యం కావాలి. దీన్ని వ్యతిరేకించే గళాలు ప్రపంచ వ్యాపితంగా వున్నాయి.. మనం నిర్ణయించుకోవాలి ప్రమాదకర బలవంతులని చూసి వారిలాగా తయారు అవుదామా..? లేక ప్రమాదకర బలవంతులు లేని ప్రపంచ నిర్మాణానికి పాటు పడదామా..? అనేది ప్రజలం మనం నిర్ణయించుకోవాలి…. ‘

అరుణ ,జర్నలిస్టు ,న్యూ దిల్లీ

ప్రపంచం మొత్తంగా 2,095 మంది సంపన్నబిలియనీర్లలో  అమెరికాలో అత్యధికంగా  614 ఆ తర్వాత 456 మంది  చైనాలో వున్నారు. కోల్పోవటానికి ఏమి లేని వారికి సైన్యం అవసరం ఉంటుందా..? ఉండదు..అదే సమయంలో కోల్పోవటానికి బిలియన్లు వున్నవారికి సైన్యం తప్పకుండా కావాలి.. మరి వారు సైన్యాన్ని ఏ విధంగా నిర్మిస్తారో చూద్దాం.. ప్రపంచ సైన్యంలో అమెరికా..రష్యా తర్వాత శక్తివంతమైన సైనం చైనాది.. మనం ప్రస్తుతం చైనాతో తలపడుతున్నాం. చైనా కంపెనీలు మన రోడ్లు కట్టి మన నుంచి డబ్బు సంపాదిస్తున్నాయి..మన కార్పొరేట్ సంస్థలు చైనా నుంచి తక్కువ ధరకి ముడిసరుకు కొని మన జవాన్ల కోసం బులెట్ ప్రూఫ్ జాకెట్లు తయారు చేస్తున్నాయి.మరోవైపు భారత  శ్రామిక ప్రజలు.. చైనా శ్రామిక ప్రజలు..సైన్యంగా అవతరించి ఒకరిని మరొకరు చంపుకునే యుద్ధం అనే దురదృష్ట చిత్ర నిర్మాణానికి భారత్.. చైనా.. ప్రభుత్వాలు చాలా ఎక్కువ ఖర్చుపెడుతున్నాయి..ప్రస్తతం మన కన్నా ఆర్ధికంగా శక్తివంతమైన చైనా.. సైన్యం కోసం ఎంత  ఖర్చు పెడుతున్నదో చూద్దాం.. 2050 సరికి చైనా సైన్యాన్ని ప్రపంచంలోనే అతి శక్తివంతమైన సైన్యంగా రూపొందించడం నా లక్ష్యం అని చైనా అధ్యక్షుడు షి జింపింగ్ ప్రకటించారు. చైనా సైన్యంలో ఉన్న ఐదు విభాగాలను తిరుగులేని విభాగాలుగా తీర్చిదిద్దడం చైనా కల అని చైనా అధ్యక్షుడు షి జింపింగ్ ప్రకటించారు. చైనా ఈ కల వెనుక ఉన్న ఒకే ఒక కారణం మొత్తం ఏషియాలో.. పసిఫిక్ రీజన్ లో చైనా రారాజుగా ఉండాలి. ఈ లక్ష్యం కోసం చైనా సైన్యాన్ని ప్రపంచంలోనే బలమైనదిగా మార్చుతున్నారు చైనా అధ్యక్షుడు షి జింగ్ పింగ్ . ప్రపంచ ప్రొడక్షన్ హబ్ గా మారిన చైనా తన ప్రయోజనాలను కాపాడుకోవడానికి..ప్రపంచ యుద్ధమే గనుక వస్తే ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు కలిగిన దేశంగా చైనా ఉండటానికి.. ప్రపంచ యుద్ధం జరిగితే గెలవడానికి.. అన్ని విధాల చైనా తన సైన్యం శక్తి సామర్థ్యాలను పెంచుకుంటున్నది. షి జింగ్పింగ్ చైనా సైన్యాన్ని వరల్డ్ క్లాస్ సైన్యంగా మలచడంలో ప్రపంచానికి ప్రమాదకరమైన అన్ని రకాల ప్రయత్నాలు సమర్థవంతంగా చేస్తున్నారు.

 చైనా సైన్యం చరిత్ర కూడా చాలా ఆసక్తి కరం..
1949 అక్టోబర్ ఒకటవ తారీఖున మావో నేతృత్వంలో రిపబ్లిక్ ఆఫ్ చైనా ఏర్పడింది. మావో అధికారంలోకి వచ్చాక చైనా సివిల్ వార్ లో మావో సైన్యం  రెడ్ ఆర్మీ పేరు, పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ అయ్యింది. దీన్నే పిఎల్ఏ గా కూడా పిలుస్తారు. ఏ దేశమైనా తన సైన్యాన్ని ఏర్పర్చుకున్న అప్పుడు ఆదేశ పేరుతో సైన్యాన్ని ఏర్పాటు చేస్తుంది. ఉదాహరణకు భారత సైన్యం, బ్రిటిష్ సైన్యం, అమెరికా సైన్యం ఇలా కానీ చైనా మాత్రం పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ అన్న పేరు తన సైన్యానికి పెట్టింది. ఏ దేశ సైన్యం అయినా ఆ దేశాన్ని నడిపే ప్రజలు ఎన్నుకున్న  నాయకత్వానికి జవాబుదారిగా ఉంటుంది. చైనా ఆర్మీ మాత్రం సివిల్ వార్ సమయంలో చైనా కమ్యూనిస్టు పార్టీ నేతృత్వంలో నడిచింది కనుక, చైనా సైన్యం నేటికి కూడా అక్కడి కమ్యూనిస్టు పార్టీకి జవాబుదారిగా ఉంటుంది. చైనా సైన్యం మావో సమయం నుంచి నేటి వరకు చైనా కమ్యూనిస్టు పార్టీ సైన్యంగా కొనసాగుతున్నది.
2004 డిసెంబర్ లో చైనా అధ్యక్షుడు హు జింటావు కొత్త యుగంలో చైనా సైన్యం పాత్ర ఏ విధంగా ఉండాలి, అన్న విషయంపై ప్రసంగం చేశారు. ఇందులో ఆయన చెప్పిన దాని ప్రకారం చైనా సైన్యంకి నాలుగు ముఖ్య కర్తవ్యాలు వున్నాయి. మొదటిది చైనా కమ్యూనిస్టు పార్టీ నేతృత్వంలో ఉన్న ప్రభుత్వాన్ని బలపరచాలి.రెండవది చైనా దేశ ప్రయోజనాల కోసం దేశ సార్వభౌమాధికారాన్ని, దేశ సరిహద్దులను, దేశంలో అంతర్గతంగా భద్రతను చైనా సైన్యం  పరిరక్షించాలి.మూడు చైనా జాతీయ ఇంట్రెస్ట్ లను కాపాడాలి. నాలుగు విశ్వశాంతిని కాపాడటంలో చైనా సైన్యం సహాయం చేయాలి.
చైనా సైన్యం పిఎల్ఎ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది..?
 చైనా సైన్యం పిఎల్ఏ 5 శాఖలుగా విభజించబడింది. ఎయిర్ ఫోర్స్, నావికాదళం, భూతల సైన్యం, రాకెట్ ఫోర్స్, స్ట్రాటజిక్ సపోర్ట్ ఫోర్స్, ఈ ఐదు శాఖల కమాండ్ కమ్యూనిస్టు పార్టీ సెంట్రల్ మిలటరీ కమిషన్ చేతిలో ఉంటుంది. దీని చైర్మన్ షి  జింపింగ్. చైనా సైన్యాన్ని 1990కి ముందు 1990 తర్వాత అని విభజించి..నిర్వచించాలి. ఎందుకంటే 1990కి ముందు చైనా దగ్గర  అత్యుత్తమ ఆయుధాలు లేవు. చైనా మిలటరీ ఆఫీసర్లు ట్రైన్డ్ కూడా కాదు. చైనా సైన్యంలో విపరీతమైన లంచగొండితనం కూడా ఉండేది అని చెబుతారు. దీనికి కారణం  1978లో డెంగ్ జవ్ పింగ్ చైనా అధ్యక్షుడిగా ఉన్నారు. ఇతని ఫోకస్ చైనా ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచటం. దీనికోసం చైనా అధ్యక్షుడిగా డెంగ్ జవ్ పింగ్  చైనా సైన్యాన్ని. వ్యాపార రంగంలోకి దించారు. ఈ సమయంలో చైనా సైన్యం ఇల్లు.. భూమి..అమ్మేది చైనా సైన్యం నేరుగా నైట్ క్లబ్బులు, ఔషధ రంగం నిర్వహించటం, ఉండేది. ఈ సమయంలో పిఎల్ఏ కేవలం సైన్యంలా కాకుండా ఒక వ్యాపార సంస్థగా తయారయ్యింది.
1990లో జియంగ్ జైమెన్ అధ్యక్షుడు అయిన తర్వాత చైనా సైన్యం పిఎల్ఏ ముఖచిత్రం మారింది. 1993 నుంచి 2003 వరకు జియంగ్ జైమెన్ అధ్యక్షుడుగా కొనసాగారు. ఇతను చైనా సైన్యం  పిఎల్ఏ వ్యాపార కార్యకలాపాలలో దిగటం వలన అవినీతి మురికి కూపంగా వుంది అని  గమనించారు. 1998లో పిఎల్ఏ వ్యాపార కార్యకలాపాలు ఆపేయలని నిర్ణయించారు. ఈ నిర్ణయం చైనా సైన్యాధిపతులుకు ఎక్కడ కోపం తెప్పిస్తుందో అని మీ బడ్జెట్ పెంచుతాం అని చైనా అధ్యక్షుడు  జియంగ్ జైమెన్ చెప్పారు. అప్పటి నుంచి నేటి వరకు చైనా సైన్యాన్ని ఆధునీకరించడానికి అని చెప్పి అత్యధికంగా చైనా ప్రభుత్వం సైన్యానికి అత్యధికంగా నిధులు వెచ్చిస్తున్నది.
చైనా డిఫెన్స్ బడ్జెట్ యెంత..?
2000లో చైనా సైన్యం బడ్జెట్ 30 బిలియన్ల డాలర్లు.ఇది 2012లో 160 బిలియన్ డాలర్లు అయ్యింది. 2010 నుంచి 2018 వరకు గమనిస్తే చైనా సైన్యం బడ్జెట్ 86% పెరిగింది. ఈ ట్రెండు ఇలాగే కొనసాగితే 2035 వరకు అమెరికా డిఫెన్స్ బడ్జెట్ కన్నా చైనా డిఫెన్స్ బడ్జెట్ అధికం అవుతుంది . అంటే రానున్న 30 ఏళ్లలో చైనా సైన్యం ప్రపంచంలోనే శక్తి వంతమైన సైన్యంగా  తయారవుతుంది.
చైనా సైన్యం ప్రస్తుత శక్తి సామర్ధ్యాలు 
26 లక్షల బలగాలు చైనా సొంతం అని చెబుతున్నారు ప్రపంచ డిఫెన్స్ నిపుణులు   . 3210 మిలటరీ ఎయిర్ క్రాఫ్ట్స్.. 3500 మిలటరీ ట్యాంకర్లు..33,000 ఆయుధాలు నిండిన మిలటరీ వాహనాలు..2650 రాకెట్ ప్రొజెక్టర్స్..777 నేవీ ఫీల్డ్స్..74 సబ్ మెరైన్ లు..36 డిస్ట్రాయర్ లు.. 290 న్యూక్లియర్ వార్ హెడ్స్ చైనా సమకూర్చుకున్నది అని అంచనా. 500 నుంచి ఐదున్నర వేల కిలో మీటర్లు దూరం  దూసుకుపోగల బ్యాలెస్టిక్ అండ్ క్రూజ్ మిస్సైల్ చైనా సైన్యం దగ్గర ఉన్నాయి. సంఖ్యా పరంగా చూసినప్పుడు, ఆయుధాల పరంగా చూసినప్పుడు, అమెరికా సైన్యం కన్నా, చైనా సైన్యం చిన్నది. అందుకే చైనా అమెరికా కన్నా అత్యాధునికమైన బ్యాలెస్టిక్ మిసైల్స్.. హైపర్ సోనిక్   మిస్సైల్..వంటి ప్రమాదకర ఆయుధాలు సమకూర్చుకున్నది. ప్రపంచ దేశాలు మిలటరీ సమాజ వినికిడి ప్రకారం.. ప్రపంచ  డిఫెన్స్ నిపుణుల ప్రకారం.. అమెరికా దగ్గర  11 యుద్ధ ఎయిర్క్రాఫ్ట్ బలగాలు ఉంటే చైనా దగ్గర కేవలం 2 యుద్ధ ఎయిర్ క్రాఫ్ట్ బలగాలు ఉన్నాయి. ఈ బలహీనతను అధిగ మించటానికి అమెరికా యుద్ధ ఎయిర్ క్రాఫ్ట్ లను ధ్వంసం చేయగల ఆధునిక ప్రమాదకర మిసైల్స్ చైనా సైన్యం తయారు చేసుకుంది.
ఇది గమనించిన అమెరికా రక్షణ సంస్థ  పెంటగాన్ చూస్తూ కూర్చోలేదు. ఫలితంగా అమెరికా 2019 ఆగస్టులో ఇంటర్మీడియట్ రేంజ్ న్యూక్లియర్ ఫోర్సెస్ అనే సంధి నుంచి బయటకొచ్చింది. ఈ సంధి కోల్డ్ వార్ సమయంలో అమెరికా.. రష్యా.. దేశాలు చేసుకున్నాయి. ఈ సంధి ప్రకారం ఈ రెండు దేశాలు 500 నుంచి ఐదున్నర వేల కిలోమీటర్ల దూరం వరకు దూసుకుపోగల మిసైల్స్ తయారు చేయకూడదు. చైనా ఈ సంధిలో లేదు. అందుకే ఈ రేంజ్ మిసైల్స్ తయారు చేసుకున్నది. అమెరికా భద్రతా విభాగం పెంటగాన్ కు మిసైల్స్ తయారీలో చైనా కన్నా బాగా వెనుకబడి ఉన్నాము అని ఎప్పుడైతే అనిపించిందో.. అప్పుడు ఇంటర్మీడియట్ రేంజ్ న్యూక్లియర్ ఫోర్సెస్ సంధి నుంచి అమెరికా  బయటకి వచ్చేసింది. ఇప్పుడు అమెరికా కూడా 500 నుంచి ఐదున్నర వేల కిలోమీటర్ల దూరం వరకు దూసుకుపోగల మిసైల్స్ తయారు చేసుకుంటున్నది.
  అమెరికా సైన్యం కన్నా చైనా బలహీనం..? 
అంతర్జాతీయ డిఫెన్స్ నిపుణుల ప్రకారం, ఆధునిక యుద్ధాలకు చైనా సైన్యం ధీటైన జవాబు చెప్పే అంతగా ఇంకా ఎదగలేదు. చైనా ప్రస్తుత కమాండర్స్ ట్రైనింగ్ ఇంకా మెరుగు పరచవలసిన ఉన్నది.  చైనా సైన్యానికి గ్రౌండ్ జీరోలో కంబాట్ అనుభవం తగినంత లేదు. ఎందుకంటే చైనాకి సొంత దేశంలో సివిల్ వార్ చేసిన అనుభవంతో పాటుగా చైనాకి కేవలం నాలుగు యుద్ధాల అనుభవం మాత్రమే వున్నది. చైనా 1950 నుంచి  1953 వరకు కొరియన్ వార్ చేసింది.1962 లో భారత్ తో యుద్ధం, 1969లో రష్యాతో, 1979లో వియత్నాంతో  సరిహద్దు గొడవతో  చైనా యుద్ధం చేసింది. దీనికి మించి చైనా సైన్యం యాక్టివ్ యుద్ధంలో లేదు. అమెరికా లాగా ప్రతిదేశములో పెద్దన్న పేరుతో జొరబడి, ఆయా దేశాల వనరులు కొల్లగొడుతూ.. ఆయా దేశాలకి యద్ధంలో సహాయం చేస్తూ..అమెరికా తరహా శాంతి ప్రయత్నాలు చేయలేదు..ఇకపై ఈ పనులు చేయటానికి చైనా ఉత్సాహ పడవచ్చు. అది వేరే చర్చ.. ప్రస్తుతం  చైనా అనుసరిస్తున్న స్ట్రాటజీ వేరు. భారతదేశం సరిహద్దుల్లో.. ఇతర దేశాల సరిహద్దుల్లో.. దొంగచాటుగా చొరబడటం.. సముద్రాలలో ఇతర దేశాల నావలను ముంచి వేయడం.. ఇతర దేశాల విమానాలను వెంబడించడం వాటిని ఛిద్రం చేయటానికి ప్రయత్నించటం వంటివి చైనా సైన్యం చేస్తుంది. ఇది చైనా ఓ స్ట్రాటజీ ప్రకారం చేస్తున్నది అని ప్రపంచ డిఫెన్స్ ఎక్స్పర్ట్ అంచనా వేస్తున్నారు. కంబాట్ యుద్ధ అనుభవం తక్కువ ఉన్న నేపథ్యంలో చైనా తన కన్నా తక్కువ శక్తి స్థాయి దేశాలతో యుద్ధం గెలవగలదు. ప్రస్తుతం అమెరికాతో యుద్ధం గెలిచే పరిస్థితిలో చైనాకి లేదు అయితే చైనా తక్కువ స్థాయిలో లేదు అని చెబుతూ తన పరిధి పెంచుకోటానికి తనకన్నా శక్తి తక్కువ దేశాలతో చైనా తలపడటం చేస్తున్నది.
చైనా తన స్ట్రాటజీతో సాధిస్తున్న విజయమెంత..?
హు జింతావు అధ్యక్షుడు కొనసాగుతున్నప్పుడు,2006లో  అమెరికా భద్రతా విభాగం పెంటగాన్  ఒక రిపోర్టు రాసింది. ఆ రిపోర్టు లో అమెరికా సైన్యంతో తలపడే అంత శక్తి సామర్థ్యాలు చైనా సైన్యంకి మాత్రమే ఉన్నాయి అని పెంటగాన్ రాసింది. ప్రపంచంలో చైనా శక్తి వంతమైన దేశంగా ఎదుగుతున్నది అదే తరహాలో చైనా సైన్యం కూడా శక్తి వంతమవుతున్నది. 2010 ఏషియా సమ్మిట్ లో చైనా డామినేషన్ మీద అన్ని దేశాలు ప్రశ్నించాయి.  దీనిమీద చైనా విదేశాంగ శాఖ మంత్రి యాంగ్ జీహెచి సమాధానం ఏమంటే.. “చైనా అత్యంత పెద్ద దేశం.. మిగతా దేశాలన్నీ చిన్న చిన్నవి ఈ సత్యాన్ని అందరూ గమనికలో ఉంచుకుంటే మంచిది”.. అని చెబుతూ ఆయన ఏషియా సమ్మిట్ లో చైనా డామినేషన్ మరింత పెంచి చూపించారు. ఇది ఇలా కొనసాగుతూ 2013లో షి జింగ్పింగ్ చైనా అధ్యక్షుడు అయ్యారు.. ఈయన పనితీరు మన కళ్ళ ముందు వున్నది. అమెరికా.. చైనా.. బిలియనీర్లకి ప్రపంచంలో వున్నా వనరులన్నీ కావాలి.. అందుకోసం అవసరం అయితే యుద్ధం చేయటానికి కూడా సిద్ధం… అందుకోసం మితిమీరిన సైన్యం కావాలి. దీన్ని వ్యతిరేకించే గళాలు ప్రపంచ వ్యాపితంగా వున్నాయి.. మనం నిర్ణయించుకోవాలి ప్రమాదకర బలవంతులని చూసి వారిలాగా తయారు అవుదామా..? లేక ప్రమాదకర బలవంతులు లేని ప్రపంచ నిర్మాణానికి పాటు పడదామా..? అనేది ప్రజలం మనం  నిర్ణయించుకోవాలి.
and the People's Liberation ArmyChina Defense BudgetMao's army was the Red Army's name in the Chinese Civil Warwhat is China army strength
Comments (0)
Add Comment