ప్రియ పయోధరమా!
ఈ సారి నీవు త్వరగా కరుణిస్తావంటే
రైతన్న వదనాన చిరు నవ్వు మెరిసింది,
వసుధమ్మ త్వరలోనే తన కడుపు పండుతుందని సంతసించింది.
ఆకులు రాల్చిన చెట్టు
మళ్ళీ చిగురిద్దామని,
సంతోషంగా తలలూపుతూ
జల్లుల్లో
సరిగంగ తానాలాడాలని వృక్షాలు,
ఒళ్ళింత తుళ్ళింత అయితే
తమ బెక బెకలతో సందడి చేయాలని
మండూకలు,
ప్రకృతంతా పచ్చగా పరవశిస్తుంటే
తమ గానామృతాన్ని వినిపించాలని
తూనీగలు,
ఒకటేమిటి?
నాక్కూడా నీ వలపులలో
తడిసి ముద్దైపోవాలని ఉంది.
కానీ నీ వెక్కడ? నీ కరుణేది?
మాపై నీ కెందుకంత చిన్నచూపు?
నీవు నల్లమబ్బై
కోడిగాలి బిగికౌగిలిలో పరవశించి
హర్షించకపోతే,
మా నయనాలు వర్షిస్తాయి.
ఇంతమంది
ఎదురుచూపుల రోదనా బాణాలు
గుచ్చుకొని నీవేమి సుఖపడతావు?
త్వరగా వచ్చేయి
ముత్తెపు నీటి బిందువులతో మము చేర.
వస్తావుగా!
– వేమూరి శ్రీనివాస్, 9912128967,
తాడేపల్లిగూడెం