అరిషడ్వర్గాలపై జయమే విజయదశమి ఫలం

విజయదశమి అంటే కేవలం దుర్గామాతను కొలిచే ఉత్సవం మాత్రమే కాదు. సకల శుభప్రదాయకమైన పర్వదినంగా హిందూధర్మం అనుష్టిస్తుంది. అనేకానేక శుభకార్యాలు.. కార్యరూపం దాల్చిన విజయవంతం అయిన శుభ ఘడియలు విజయదశమి పర్వదినం నాడే అని చారిత్రక పౌరాణిక ఉదంతాలు తెలియ జెబుతాయి. వ్యక్తిత్వ గుణధాముడ్కెన రాముడు.. దుర్లక్షణాలకు దుర్గుణాలకు దశముఖ ప్రతీకగా ఉన్నటువంటి రావణుని సంహరించిన సుముహూర్తం కూడా విజయదశమి నాడే అని మనకు తెలుసు. అందుకు గుర్తుగానే.. విజయదశమి పర్వదినం నాడు దేశవ్యాప్తంగా రావణ సంహారం ఎంతో వేడుకగా నిర్వహిస్తారు. అజ్ఞాత వాసంలో నిద్రాణంగా ఉండిపోయిన తమ లోని శక్తులను పునరుజ్జీవింపజేయడానికి ప్రతీకగా.. పాండవ వీరులు దాచి ఉంచిన ధనుర్బాణాలను తిరిగి చేపట్టి.. శత్రుభీకరమైన సమరసింహనాదాలతో ఉత్తర గోగ్రహణాన్ని నెగ్గిన రోజు కూడా ఇదేనంటారు. అందుకే వారు ఆయుధాలను దాచి ఉంచిన శమీవృక్షపు పూజకూడా ఇవాళ విశిష్టతల్లో ఒకటి.

గాలి, నీరు. నిప్పు, నేల, నింగి – పంచ భూతాత్మకమైన ఈ ప్రకృతి మానవ సృష్టి కాదనీ, దీనికి హేతువు సర్వవ్యాపకమైన ఆ పరబ్రహ్మ తత్వమేననే సత్యం అందరికీ తెలిసిందే. ఈ సమస్త జగత్తును నడిపేది మానవాతీతమైన ఒక అద్భుత మహాశక్తి. ‘సర్వఖల్విద్వం బ్రహ్మ’ అని కూడా అంగీకరించక తప్పదు. ఆ మహాశక్తిని ఆదిపరాశక్తిగాను, జగజ్జననిగాను ఆరాధించే సంప్రదాయం విశ్వజనీనం. భారతీయ సంస్కృతి ఆర్ష సంప్రదాయంలో అశ్వయుజ మాసంలో హస్తా నక్షవూతంతో కూడిన శుద్ధపాడ్యమి నుండి నవమి వరకు తొమ్మిది రోజులు జగన్మాతను ఆదిపరాశక్తిని నవదుర్గలుగా లోకరక్షయిక శక్తులుగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపంలో ఆరాధిస్తాం. నిజానికి ఈ నవశక్తులు శివ స్వరూపాలే. అందుకే వీరిని శివశక్తులు అని కూడా అంటాం. వర్షరుతువు తర్వాత వచ్చే శరదృతువులో ఈ మహోత్సవం వస్తుంది. కనుక దీనికి ‘శరన్నవరాత్రులు’ అని పేరు. అశ్వయుజ మాసపు శుక్లపక్షంలో పాడ్యమినాడు హస్తా నక్షత్రమున్న శుభదినాన శరన్నవరాత్రుల పూజ ప్రారంభించడం అత్యుత్తమ ఫలాన్నిస్తుందని మార్కండేయ పురాణం చెప్తోంది.

తొమ్మిది రోజులలో మొదటి మూడు రోజులు సరస్వతి రూపాన్ని అరిషడ్వర్గాలను జయించడానికి, సిరిసంపదలు పొందడానికి, విద్యాజ్ఞానం కోసం ఆరాధిస్తారు. ఆ జగన్మాత అశ్వయుజ శుద్ధ పాడ్యమి మొదలు నవమి వరకు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రాక్షసుని, ఒక్కొక్క రూపంలో వధించిన కారణంగా ఆ పరాశక్తి తొమ్మిది రూపాలలో పూజలందుకుంటుంది. ఈ నవాంశ దేవీ పూజలు కుమారీ పూజలుగా మొదట అగస్త్య మహర్షి భార్య లోపముద్ర చేసిందని పురాణాలు చెప్తున్నాయి. ఆశ్వయుజ మాసం శుక్ల పక్షం దశమినాటికి శ్రవణా నక్షత్రం కలవడమే విజయవంతమైనదని పురాణాలు చెబుతాయి. ఇతరత్రా పట్టింపులు ఏమీ లేకుండానే విజయదశమి పర్వదినంనాడు ఏ కార్యాన్ని ప్రారంభించినా అందులో విజయం తథ్యం అని పెద్దలు చెబుతారు. విజయదశమి పర్వదినంలో ప్రధానంగా రెండు అంశాలు మనకు స్ఫురిస్తాయి. ఒకటి రావణ సంహారం అయితే రెండు శమీపూజ.  అజ్ఞాతవాసంలో ఉన్న పాండవులు.. తమ ఆయుధాలను జమ్మిచెట్టుపై ఉంచారు. వారు తిరిగి ఆయుధాలను ధరించిన రోజు ఇది. శమీవృక్షం రూపంలోని ‘అపరాజిత’ దేవినిపూజించి పాండవులు అజ్ఞాతంలోంచి తిరిగి యోధులుగా కార్యక్షేత్రంలోకి ఉరికి, కౌరవసేనలపై విజయం సాధించిన రోజు ఇది.
రాముడు కూడా రావణ వధ ముగించి శమీ పూజ చేసిన తర్వాత అయోధ్యకు పయనమైనట్టు పురాణాలు చెబుతాయి. మనలోని అంత:శ్శత్రువులపై నిత్యమైన విజయాన్ని సాధించే ధ్కెర్యస్థైర్యాలను ప్రసాదించమని మనం విజయదశమి నాడు వేడుకోవాలి. బాహ్యశత్రువును జయించే ముందు.. అంత:శ్శత్రువులను జయించడం అవశ్యం. అజ్ఞాతంలోని పాండవులు దాచిఉంచిన ఆయుధాలంటే.. అవి మనలో నిద్రాణంగా ఉండే అంత:శక్తులకు ప్రతీకలు. కాలప్రభావం, పరిస్థితుల ప్రభావం.. కారణాలు ఏమైనా కావొచ్చు.
మనను అలక్ష్యం, బద్ధకం, నిస్పృహ, వైరాగ్యం, వైమనస్యం వంటివి ఆవరించి.. కార్యవిముఖులను చేసే పరిస్థితులు ఏదో ఒకసారి తటస్థిస్తూనే ఉంటాయి. వీటినుంచి మనల్ని జాగృతం చేసి.. విజయోత్సాహాన్ని ఉద్దీపింపజేసి.. కార్యక్షేత్రంలోకి ఉపక్రమింపజేసేదే విజయదశమి.

ఇంతకూ ఆ శత్రువులెవరో చెప్పలేదు. అరిషట్వర్గాలనే ఆరు దుర్గుణాలే.. ప్రతి మనిషికీ అంత:శ్శత్రువులు. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు. ఏ వ్యక్తి.. ఏ పరాజయానికి చేరుకున్నా సరే.. ఆ పతన ప్రస్థానం మూలాలు ఈ ఆరింటిలో ఒక చోట ఉంటాయంటే అతిశయోక్తి కాదు. అందుకే ఈ ఆరుగురు శత్రువుల మీద గెలవడం మనకు అవసరం.  నిత్య ప్రాత:స్మరణీయమైనదిగా ఆదిత్యహృదయాన్ని పఠించినా, సర్వశుభ- సకల విజయ ప్రదాయనిగా శమీవృక్షాన్ని పూజించినా.. మనలోని అంత:చేతన అరిషట్వర్గాలపై విజయాన్ని నిబద్ధతతో లక్ష్యించాలి. వీటిని జయించిన వారికి ఇక శత్రువులంటూ ఉండరు. శత్రువే లేనివాడికి సకల విజయాలూ… సర్వశుభాలూ నిత్యం సమకూరుతుంటాయి. నవ రాత్రులు మూడు ప్రాధమిక లక్షణాలైన తామస, రజస, సత్వ గుణాలకు అనుగుణంగా వర్గీకరించ బడ్డాయి. మొదటి మూడు రోజులు తామసికమైనవి, వాటికి ప్రతీకలు తీవ్రమైన దుర్గ, కాళి దేవతలు. తరువాతి మూడు రోజులు లక్ష్మికి సంబంధించినవి – కోమలమైనదే కానీ ధన, వస్తు, కనక, వాహనాలకు ఆధారమైన దేవి. ఆఖరి మూడు రోజులు సరస్వతి కోసం ఉద్దేశించబడినవి. అదే సత్వ గుణం. అది జ్ఞానం, జ్ఞానోదయానికి సంబంధించినది.

మనలోని అంత:చేతనకు అరిషట్వర్గాలపై విజయోస్తు!
సర్వులకు సకల శుభ కాముకులకు కల్యాణమస్తు!!
 నందిరాజు రాధాకృష్ణ – 98481 28215

Comments (0)
Add Comment