ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు శుభాకాంక్షలు
అన్నాచెల్లెళ్లు…అక్కా తమ్ముళ్ల ఆత్మీయ బంధానికి ప్రతీకైన రక్షాబంధన్ కోసం తోడబుట్టువులు ఏడాదంతా ఎదురుచేసే పండగ ఇదని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. వారి మధ్య బంధాన్ని మరింత పరిపుష్టం చేసే ప్రత్యేకమైన పండగరోజు ఇది. భారతీయ సంస్క•తి, సంప్రదాయాలను, కుటుంబ విలువలను ప్రతిబింబించే పండుగగా రాఖీపౌర్ణమిని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అభివర్ణించారు. ప్రపంచమంతా గొప్పగా చెప్పుకునే భారతదేశ ఉమ్మడి కుటుంబ వ్యవస్ద, విలువలు, ప్రాచీన జ్ఞానాన్ని ఒక తరం నుంచి మరో తరానికి అందించడంతో పాటు, కుటుంబ సభ్యులకు ఒక సామాజిక భద్రతను కలిగించే గొప్ప ఉత్సవం రాఖీపండగా ఆయన పేర్కొన్నారు.
ప్రేమ , పరస్పర గౌరవం, త్యాగం, బాధ్యతలను కలగలుపుకుని జరుపుకునే పండుగ ఇదని వెంకయ్యనాయుడు అన్నారు. ‘రక్ష అంటే సోదరులు, సోదరీమణుల బంధాన్నిపరిరక్షించేదని అర్థం. సోదరులపై చెడు ప్రభావం పడకుండా రక్షను(రాఖీ) సోదరీమణులు సోదరుల చేతికి కడతారు. దీనికి ప్రతిగా సోదరికి ఎలాంటి ఆపద వచ్చినా కాపాడతానని సోదరుడు ప్రమాణం చేస్తాడు. అందుకే మన దగ్గర రాఖీ కడుతున్నప్పుడు నువ్వునాకు రక్ష, నేను నీకు రక్ష. మనమిద్దరమూ కలిసి మనదేశానికి రక్ష అని పరస్పరం చెప్పుకుంటారు. అదీ రక్షాబంధనంలో ఉన్నగొప్పదనం’ అని ఆయన వివరించారు.