పిల్లలకు టీకా… తల్లిదండ్రులదే బాధ్యత

  • రాష్ట్రవ్యాప్తంగా 1014 కేంద్రాల్లో అందుబాటులో టీకాలు
  • 28 రోజుల తరువాత రెండో డోసు
  • ప్రైవేట్‌ ‌హాస్పిటల్స్‌లోనూ టీకాకు అనుమతి
  • వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్‌ ‌రావు
  • 15 నుంచి 18 ఏళ్ల వయసు పిల్లలకు కొరోనా వ్యాక్సినేషన్‌ ‌ప్రారంభించిన మంత్రి

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర ప్రతినిధి : తల్లిదండ్రులంతా పిల్లలకు విధిగా వ్యాక్సిన్‌ ‌వేయించాలనీ, ఆ బాధ్యత తల్లిదండ్రులదేనని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి టి.హరీష్‌ ‌రావు స్పష్టం చేశారు. పిల్లలకు టీకా వేయించేందుకు కళాశాలల యాజమాన్యాలు కూడా బాధ్యత తీసుకోవాలని సూచించారు. సోమవారం రాష్ట్రంలో 15 నుంచి 18 ఏళ్ల వయసు పిల్లలకు కొరోనా వ్యాక్సినేషన్‌ ‌ప్రారంభమైంది. హైదరాబాద్‌ ‌బంజారాహిల్స్‌లోని పీహెచ్‌సిలో హరీష్‌ ‌రావు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో చదివే పిల్లలందరికీ టీకాలు వేయించాలనీ, ప్రైవేటు హాస్పిటల్స్‌లోనూ టీకాలకు అనుమతి ఇచ్చినట్లు చెప్పారు. 12 కార్పొరేషన్‌లలో ఆన్‌లైన్‌, ఇతర ప్రాంతాలలో వాక్‌ ఇన్‌ ‌పద్దతిలో టీకాలు ఇస్తున్నామనీ, నాలుగు రోజుల తరువాత పరిస్థితుల ఆధారంగా ఆన్‌లైన్‌ ‌రిజిస్ట్రేషన్‌పై మరోసారి నిర్ణయం తీసుకుంటామన్నారు.

బర్త్ ‌సర్టిఫికెట్‌, ఆధార్‌, ‌కాలేజీ ఐడీ కార్డు ఉన్నా రిజిస్ట్రేషన్‌కు సరిపోతుందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1014 కేంద్రాలలో టీకాలు అందుబాటులో ఉన్నాయనీ, ముందుగా ఆన్‌లైన్‌ ‌ద్వారా రిజిస్ట్రేషన్‌ ‌చేసుకున్న వారికి టీకాలు ఇస్తున్నట్లు తెలిపారు. మొదటి డోసు తీసుకున్న తరువాత 4 వారాలకు రెండో డోసు ఇస్తామని స్పష్టం చేశారు. కొరోనా థర్డ్‌వేవ్‌ను ఎదుర్కునేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా సిద్ధంగా ఉందనీ, ప్రభుత్వ హాస్పిటల్స్‌లో అన్ని రకాల మందులు, సదుపాయాలు కల్పించినట్తు చెప్పారు. 21 లక్షల హోమ్‌ ఐసోలేషన్‌ ‌కిట్లు అందుబాటులో ఉంచామనీ, ప్రైవేటు హాస్పిటల్స్‌కు వెళ్లి డబ్బులు ఖర్చు చేసుకోవద్దని సూచించారు. కోవిడ్‌ ‌టీకాలపై ఎలాంటి అపోహలు అవసరం లేదనీ, వ్యాక్సిన్‌ ‌తీసుకుంటే రక్షణ కవచంలా పని చేస్తుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో తాజాగా కొరోనా, ఒమిక్రాన్‌ ‌కేసులు పెరుగుతున్నాయనీ, కొరోనా లక్షణాలుంటే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. కోవిడ్‌ ‌కేసులు పెరుగుతున్న దృష్ట్యా పూర్తి స్థాయిలో సన్నద్ధంగా ఉండాలని వైద్యారోగ్య శాఖ అధికారులకు సూచించారు.

సూర్యాపేట మెడికల్‌ ‌కళాశాల ఘటనపై నివేదిక అందాక చర్యలు
ఇదిలా ఉండగా, సూర్యాపేట మెడికల్‌ ‌కళాశాలలో విద్యార్థిపై ర్యాగింగ్‌ ‌జరిగిన విషయంపై మంత్రి హరీష్‌ ‌రావు స్పందించారు. ఈ విషయం తన దృష్టికి వొచ్చిందనీ, దీనిపై డీఎంఈ అధ్యక్షతన విచారణ కమిటీ ఏర్పాటు చేశామనీ, నివేదిక ఆధారంగా ఘటనకు బాధ్యులపై తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో ఇలాంటి ఘటనలు జరుగకుంటా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ర్యాగింగ్‌ అనేది నిషేధమనీ, ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని ఈ సందర్భంగా మంత్రి హరీష్‌ ‌రావు స్పష్టం చేశారు.

Finance and Health MinisterHealth Minister harish raoprajatantra newstelangana updatesతెలుగు వార్తలు
Comments (0)
Add Comment