బీజేపీ తన పదేళ్ల వైఫల్యాలను కప్పిపుచ్చేందుకు తెరపైకి తాజా ‘జుమ్లా’లు

వారి మ్యానిఫెస్టోలో మొత్తం అబద్ధాలు..వంచనలు
 తారాస్థాయికి చేరిన నిరుద్యోగ ప్రస్తావనే లేదు
 రైతుల ఆదాయం రెట్టింపు కాలేదు కానీ..తగ్గిపోయింది
 అధికారంలోకి వొస్తే ఎంఎస్‌పికి చట్టబద్ధత
 రాష్ట్రానికి బీజేపీ అన్యాయాలపై బీఆర్‌ఎస్‌ మౌనం
 ఆ రెండు పార్టీలను రాష్ట్ర ప్రజలు తిరస్కరిస్తారు
 కాంగ్రెస్‌ ‘మిషన్‌ తెలంగాణ-15’ సాధిస్తుంది
 మిర్యాలగూడ బహిరంగ సభలో మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి

మిర్యాలగూడ, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 16 : రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాల్లో కనీసం 15 స్థానాల్లో కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించడం ద్వారా ‘మిషన్‌ తెలంగాణ-15’ లో విజయం సాధిస్తుందని పౌరసరఫరాలు, నీటిపారుదల శాఖ మంత్రి కెప్టెన్‌ ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. మంగళవారం నల్గొండ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని కోదాడ, హుజూర్‌నగర్‌ మండలాల్లో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ఎన్‌.పద్మావతి, నల్గొండ అభ్యర్థి రఘువీరారెడ్డితో కలిసి పాల్గొన్నారు. కోదాడ, హుజూర్‌నగర్‌లో జరిగిన పార్టీ సమావేశాల్లో ప్రసంగించిన ఆయన అనంతరం మిర్యాలగూడలో జరిగిన భారీ బహిరంగ సభలో ్నత్తమ్‌ మాట్లాడుతూ…రాష్ట్ర ప్రయోజనాలకు రెండు పార్టీలు ద్రోహం చేశాయని, బీజేపీ, బీఆర్‌ఎస్‌లను ప్రజలు తిరస్కరిస్తారని అన్నారు. తెలంగాణలో బీఆర్‌ఎస్‌ ఔచిత్యాన్ని కోల్పోయిందని, ఇక లోక్‌సభ ఎన్నికల్లో వోట్లు అడిగే నైతిక హక్కు బీజేపీకి లేదని అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో తాజా ‘జుమ్లా’లతో సామాన్య ప్రజలను మోసం చేసేందుకు బీజేపీ మరో ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గత రెండు దఫాలుగా ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందన్నారు. ఈసారి కూడా బీజేపీ సరికొత్త వాగ్దానాలు చేసి ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తుందని ఉత్తమ్‌ విమర్శించారు. బీజేపీ జాతీయ మేనిఫెస్టోలో అబద్ధాలు, వంచనలతో నిండి ఉన్నందున సామాన్యులకు అందించేది ఏమీ లేదని ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అన్నారు. అందులో దేశవ్యాప్తంగా నిరుద్యోగం తారాస్థాయికి చేరిందన్న ప్రస్తావన లేదన్నారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి 2014లో ప్రధాని మోదీ అధికారంలోకి వొచ్చారని, ఆ లెక్కన ఇప్పటికి కనీసం 18-20 కోట్ల ఉద్యోగాలు సృష్టించి ఉండాలని, అయితే, మోదీ పాలనలో ప్రభుత్వ రంగ యూనిట్ల నుండి 2 లక్షల ఉద్యోగాలు సహా దాదాపు 15-16 కోట్ల ఉద్యోగాలు కోల్పోయామన్నారు. బీజేపీ మేనిఫెస్టోలో నిరుద్యోగం ప్రస్తావన లేదని ఆయన అన్నారు.

కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 30 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయడమే కాకుండా కోట్లాది ఉద్యోగాలు కల్పిస్తామని కాంగ్రెస్‌ పార్టీ తన ‘న్యాయ పత్ర’లో హామీ ఇచ్చిందని ఆయన అన్నారు. దేశవ్యాప్తంగా రైతులకు బీజేపీ ద్రోహం చేస్తుందని మంత్రి ఆరోపించారు. 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని ఇచ్చిన హామీపై ప్రధాని మోదీ, ఇతర బీజేపీ నేతలు ఎందుకు మౌనంగా ఉన్నారని ఆయన అడిగారు. వాగ్దానానికి భిన్నంగా కేంద్ర ప్రభుత్వం నుంచి మద్దతు లభించకపోవడంతో రైతుల ఆదాయం తగ్గిపోయిందని, కార్పొరేట్‌ రంగానికి మేలు చేసేందుకు తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను మోదీ ప్రభుత్వం రద్దు చేయాల్సి వొచ్చిందని గుర్తు చేశారు. తమ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర(ఎంఎస్‌పి) కల్పించాలని కోరుతూ లక్షలాది మంది రైతులు నిరసనలు చేసినప్పటికీ, బిజెపి వారి డిమాండ్‌ను పూర్తిగా విస్మరించిందని, కాంగ్రెస్‌ పార్టీ తన మేనిఫెస్టోలో ఎమ్మెస్పీకి చట్టపరమైన హామీని ఇస్తుందని ఆయన చెప్పారు. దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణం అంశాన్ని బీజేపీ నిర్లక్ష్యం చేయడాన్ని ఆయన ఖండిరచారు.

నిత్యావసర వస్తువుల ధరలు గణనీయంగా పెరిగాయని, గత పదేళ్లలో ఇంధన ధరలు రెండిరతలు పెరిగాయని ఉత్తమ్‌ మండిపడ్డారు. ఈ సమస్యను పరిష్కరించడానికి బదులుగా, బిజెపి తన మ్యానిఫెస్టోలో దాని ప్రస్తావనే లేదన్నారు. అదే విధంగా 2022 నాటికి దేశంలోని ఇళ్లు లేని వారందరికీ ఇళ్లు మంజూరు చేస్తామని మోదీ ప్రభుత్వం హామీ ఇచ్చిందని, అయితే ఈ పథకం అమలు కాలేదని, ముఖ్యంగా తెలంగాణలో ఏ పేద కుటుంబానికి మోదీ ప్రభుత్వం నుంచి ఇల్లు రాలేదన్నారు. గత పదేళ్లలో రాష్ట్రాన్ని పూర్తిగా విస్మరించిన బీజేపీకి తెలంగాణలో వోట్లు అడిగే నైతిక హక్కు లేదని ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అన్నారు. 2014లో ఆంధప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఇచ్చిన హామీలను బీజేపీ ప్రభుత్వం నెరవేర్చలేదని, ఆ పార్టీ కనీసం వాటిని ఆమోదించలేదని ఆయన అన్నారు. వరంగల్‌లో రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ, బయ్యారంలో స్టీల్‌ ప్లాంట్‌, ఎన్‌టీపీసీ ద్వారా 4,000 మెగావాట్ల విద్యుత్‌ ప్లాంట్‌, గిరిజన విశ్వవిద్యాలయం అమలు కాలేదని అన్నారు.

ఆంధప్రదేశ్‌లో గిరిజన విశ్వవిద్యాలయం కార్యరూపం దాల్చిందని, బీజేపీ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా తెలంగాణలో ఇంకా ప్రారంభం కాలేదన్నారు. 50 లక్షల ఉద్యోగాల కల్పనకు హైదరాబాద్‌ సమీపంలో కాంగ్రెస్‌ నేతృత్వంలోని గత యుపిఎ ప్రభుత్వం ఆమోదించిన ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ ఇన్వెస్ట్‌మెంట్‌ రీజియన్‌(ఐటిఐఆర్‌)ను బిజెపి ప్రభుత్వం రద్దు చేసిందని ఆయన అన్నారు. అదే విధంగా ఆంధప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం తెలంగాణ, ఆంధప్రదేశ్‌ రెండు రాష్ట్రాల్లోనూ ఎయిమ్స్‌ ఏర్పాటును తప్పనిసరి చేసిందన్నారు. అయితే దేశవ్యాప్తంగా 16 ఎయిమ్స్‌కు గాను 14 ఎయిమ్స్‌కు కేటాయించిన నిధుల్లో 50 శాతం పైగా కేంద్రం విడుదల చేసిందని,  తెలంగాణ ఎయిమ్స్‌కు కేవలం కొంతమేర మాత్రమే నిధులు విడుదలయ్యాయన్నారు. బీజేపీ ఇన్ని అన్యాయాలు చేస్తుంటే బీఆర్‌ఎస్‌ మాత్రం మూగ ప్రేక్షకుడిలా ఉండిపోయిందని, మోదీ సర్కార్‌కు అన్ని విధాలా అండగా ఉందని ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రజలు బీజేపీ, బీఆర్‌ఎస్‌లను తిరస్కరిస్తారని, రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాల్లో కనీసం 15 స్థానాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థుల గెలుపు ఖాయమని ఆయన అన్నారు.

Comments (0)
Add Comment