- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజాకంటక పాలన..
- సాగు చట్టాలపై కెసిఆర్ వైఖరి ఎందుకు మారింది
- బంద్‌లో భాగంగా ఆందోళనలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజాకంటక పరిపాలనందిస్తూ ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు ఎనుముల రేవంత్ రెడ్డి విమర్శించారు. అఖిలపక్షం ఆధ్వర్యంలో ఇచ్చిన భారత్ బంద్‌లో భాగంగా ఆయన సోమవారం పీర్జాదిగూడ ఉప్పల్ బస్‌డిపో సమీపంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ..కేంద్ర, రాఫ్ట్ర ప్రభుత్వాలు ప్రజలను శాశ్వత భానిసలుగా మార్చేందుకు కంకణం కట్టుకున్పాయని ఆరోపించారు. వ్యవసాయ రంగాన్ని సర్వ నాశనం చేసేందుకు మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక నల్ల చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ డిల్లీ సరిహద్దుల్లో ఎనిమిది నెలలుగా దేశానికి అన్నం పెడుతున్న రైతన్నలు దీక్ష చేస్తున్నా మోడీకి ఏ మాత్రం పట్టడం లేదని ధ్వజమెత్తారు. వారిలో 400 మంది రైతులు మృత్యువాత పడ్డా పట్టించుకున్న పాపాన పోలేదని ఆయన తీవ్రంగా విరుచుపడ్డారు. రైతుల గోడు వినని మోడీ సర్కార్ ఆదానీ, అంబానీల మేలు కోసం ప్రభుత్వాల ఆస్తులు అమ్మేందుకు సిద్ధమయ్యిందని ఆరోపించారు.
గుజరాత్ నుంచి వొచ్చిన మోడీ, అమిత్‌షాలు దేశాన్ని అమ్మి రూ. 6 లక్షల కోట్లు పోగు చేయాలని చూస్తున్నారని, ఆదానీ, అంబానీలు ప్రభుత్వ ఆస్తులు కొనేందుకు సిద్ధమయ్యారన్నారు. దేశంలో కొరోనా టీకా ఇచ్చేందుకు సైతం స్వప్రయోజనాలకు పాకులాడుతున్నారని విమర్శించారు. నాడు తెల్లదొరలకు వ్యతిరేకంగా స్వతంత్య్ర సంగ్రామం, జాతీయోద్యమం నిర్వహించి పారదోలిన విధంగా నేడు మోడీ సర్కార్ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేసి పారదోలాల్సిన సమయం ఆసన్నమయ్యిందన్నారు. గతంలో రైతు చట్టాలను వ్యతిరేకించిన కేసీఆర్ ఆధ్వర్యంలోని టీఆర్ఎస్ సర్కార్ డిల్లీకి వెళ్లిన వెంటనే ఎందుకు మాట మార్చిందో తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. మోడీని చూస్తేనే కేసీఆర్‌కు చలిజ్వరం వొస్తుందని అందుకే భారత్ బంద్‌లో పాల్గొనకుండా డిల్లీలో మోడీతో కలిసి విందులో పాల్గొన్నారని విమర్శించారు. కేంద్రం ఇస్తానని చెప్పిన ఏడాదికి కోటి ఉద్యోగాలతో పాటు తెలంగాణ వొస్తే ఇంటికో ఉద్యోగం హామీలు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు. నిరుద్యోగులను మోసం చేయడం మోడీ, కేసీఆర్‌లు ఒకటేనని ఆరోపించారు. బిష్వాల్ కమిషన్ నివేదిక ప్రకారం ఇప్పటికే తెలంగాణలో 1.90 లక్షల ఉద్యోగ స్థానాలు ఖాళీగా ఉన్నాయన్నారు. గత 7 సంవత్సరాలలో ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వకుండా రాష్ట్ర సర్కార్ నిరుద్యోగులను నట్టేట ముంచుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కూతరు కవిత, బందువు వినోద్‌రావు ఎన్నికల్లో ఓడిపోతే వారిలో ఒకరు ఎమ్మెల్సీ, మరొకరిని ప్రణాళికసంఘం ఉపాధ్యక్షుడిగా అవకాశం కల్పించిన కేసీఆర్‌కు నిరుద్యోగుల గోస కానరావడం లేదని ధ్వజమెత్తారు.
నిరుద్యోగులందరు కేసీఆర్ చిత్రపటాలకు భీరు, బ్రాందీలతో అభిషేకాలు చేయాలని ఎద్దేవా చేశారు. సీపీఐ రాఫ్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్తులను కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టేందుకు మోడీ సర్కార్ పన్నాగం పన్నిందని విరుచుపడ్డారు. రైతులు తమ హక్కుల సాధనకు దీక్షలు చేపడితే కేంద్ర ప్రభుత్వం కళ్లప్పగించి చూస్తుందన్నారు. ఇప్పటికే విమానాశ్రయాలు, ఓడ రేవులు, ఆర్టీసీ, బీఎస్ఎన్ఎల్ వంటి ప్రభుత్వ ఆస్తులను తెగనమ్మి 6 లక్షల కోట్టు సేకరించేంందుకు మోడీ ప్రభుత్వం ప్రణాలిక సిద్దం చేసిందని దుయ్యబట్టారు. మాజీ ఎంపీ అజీజ్ పాష మాట్లాడుతూ దేశంలో 18 రాజకీయ పార్టీలు, 6 రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో చేపడుతున్న ఈ బంద్ ప్రజా బంద్ అని అన్నారు. మోడీ అవలంబిస్తున్న రైతు, ప్రజా వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా మరిన్ని ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. సభ అనంతరం రోడ్డుపై బైఠాయించిన వాహనాల రాకపోకలు అడ్డుకున్న రేవంత్ రెడ్డితో సహా పలువురు నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి ఉప్పల్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
అంతకు పోలీసులు, అఖిలపక్షం నాయకుల మద్య జరిగిన తోపులాటలో అరుణోదయ సాంస్రతిక సమాఖ్య అధ్యక్షురాలు విమలక్క కొద్ది సేపు స్పృహ కోల్పోయారు. అయితే కార్యకర్తలు సపర్యలు చేయడంతో ఆమె తేరుకున్నారు. కాంగ్రెస్ పార్టీ మేడ్చల్ నియోజకవర్గం కో-ఆర్డినేటర్ తోటకూర వజ్రేష్ యాదవ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పీవోడబ్లు అధ్యక్షురాలు సంద్య, అరుణోదయ సాంస్రతిక సమాఖ్య అధ్యక్షురాలు విమలక్క, సీపీఐఎంఎల్ (ఎన్డీ) రాష్ట్ర కార్యదర్శి రాయల చంద్రశేఖర్, సీపీఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కార్యదర్శి రాజేష్, టీడీపీ మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం ఇంచార్జ్ కందికంటి అశోక్‌కుమార్ గౌడ్, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు డీజీ నర్సింగ్ రావు, సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు కోమటి రవి, నాయకుడు చింతల యాదయ్య, సీపీఐ రాష్ర కార్యదర్శి వర్గ సభ్యుడు ఎన్. బాలమల్లేష్, డీసీసీ మేడ్చల్ అధ్యక్షుడు నందికంటి శ్రీధర్‌లతో పాటు అఖలపక్ష పార్టీలకు చెందిన నాయకులు పలువురు పాల్గొన్నారు.