అవయవ దానాలపై అవగాహన అవసరం

నేడు ప్రపంచ అవయవదాన మార్పిడి దినోత్సవం

సమకాలీన వైద్యశాస్త్రం సాధించిన అద్భుతమైన ఆవిష్కరణ అవయవ మార్పిడి పద్ధతి. అవయవ మార్పిడి ద్వారా దాతల శరీరం నుంచి సేకరించిన అవయవాలను అవయవ లోపాలతో బాధపడుతున్న రోగులకు అమర్చి, వారికి స్వస్థత కలిగించే విధానం నానాటికీ పురోగతి సాధిస్తున్నది. అవయవ దాతల సంఖ్య కూడా అవసరాలకు తగినంతగా కాకపోయినా, నెమ్మదిగా అధికం అవుతున్నది. అన్ని దానాల కన్నా అవయవ దానం గొప్పదనే నగ్న సత్యాన్ని దాతలు అర్థం చేసుకుంటున్నారు. మానవుడు మృతి చెందాకే శరీరం నుంచి అవయవాలు సేకరిస్తారు కనుక, చనిపోయాక కూడా ఇతరుల జీవితాల్లో వెలుగులు నింపే సదావకాశాన్ని అవయవదానం కల్పిస్తు న్నదన్న వాస్తవం గురించి అవగాహన దాతలకు ఏర్పడుతున్నది. దాతల మరణంతో వారి వారి శరీరాలతో పాటే శరీర అవయవాలు కనుమరుగు కాకుండా, వారి అవయవాలు ఇతరులకు ఉపయోగ పడడంలో, అంతకు మించిన తృప్తి మరొకటి ఉండదు. ఈ పరమ సత్యాన్ని గ్రహించి, ప్రస్తుతం ఎందరో తమ అవయవాలకు దానం చేయడానికి ముందుకొస్తున్నారు. ఈ అవగాహన పెంచేందుకే జూన్‌ 25‌న ప్రపంచ అవయవదాన మార్పిడి దినోత్సవం జరుపుకొంటారు. అవయవ మార్పిడితో ఎవ్వరైనా కొత్త జీవితాన్ని తిరిగి పొందే అవకాశం ఉంటుంది. మరణించిన వ్యక్తి జీవితం అక్కడితో ఆగకుండా, మరణించిన వ్యక్తి మరికొంత మందికి ప్రాణమిచ్చి జీవిస్తూనే ఉన్నాడు.

ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తులకు అవయవ దానాలను అమర్చి వారి ప్రాణాలను కాపాడు తున్నారు. అవయవ మార్పిడి వల్ల ఎంతో మంది ప్రాణాలను కాపాడటం సాధ్యం అవుతుంది. కళ్లు, మూత్ర పిండాలు, ఊపిరి తిత్తులు, చర్మం, ఎముక, గుండె కవాటాలు, కార్నియో, సిరలు ఇలా ఎన్నో అవయవ దానాల వల్ల మార్పిడి చేయవచ్చు. బ్రెయిన్డెడ్‌ అయ్యేవారి శరీరాలను వెంటనే దానం చేస్తే ఇతరులకు అమర్చవచ్చు. ఒక్కదాతతో 8 మంది ప్రాణాలను రక్షించవచ్చని వైద్యులు చెబుతున్నారు. ప్రతి సంవత్సరం 5 లక్షలకుపైగా ప్రజలు వారి ముఖ్య అవయవాల వైఫల్యం కారణంగా మరణిస్తున్నట్లు ఓ నివేదిక తెలుపు తున్నది. కాలేయ వ్యాధి కారణంగా 2లక్షల మంది మరణిస్తున్నారు. గుండె జబ్బుల కారణంగా 50,000 మంది గుండెలు ఆగి పోతున్నాయి. అంతే కాకుండా, 1.5లక్షల మంది కిడ్నీ మార్పిడి కోసం ఎదురు చూస్తున్నారు, కాని వారిలో 5,000 మందికి మాత్రమే దాతల సహకారం లభిస్తున్నది. బతికున్నప్పుడు కూడా కొన్నింటిని దానం చేయొచ్చు..కిడ్నీ, ఎముకమజ్జ, రక్తం, కాలేయంలో కొంత భాగం, ఊపిరి తిత్తుల్లో కొంతభాగం, పాంక్రియాస్‌ ‌లో కొంతభాగం ఇవ్వొచ్చు. అయితే ఇందులో ఎవరెవరికి ఏవేవీ అమరుతాయో వాటిని మాత్రమే వైద్యలు అమర్చడానికి నిర్ణయిస్తారు. రక్తం గురించి… అది వారి గ్రూపులను బట్టి ఏ వ్యక్తికి సరిపోతుందో వారికే దానం చేస్తారు. ఎముకమజ్జ, కాలేయం, ఊపిరితిత్తులు వంటివి కొన్ని రక్త సంబంధీకులకు చాలా పనికొస్తాయి. సహజ మరణం చెందిన వ్యక్తిలో పనికొచ్చే అవయవాలు..కళ్లు, గుండె వాల్వ్ ‌లు, చర్మం, ఎముకలు, కార్టిలాజ్‌, ‌నరాలు. అదే బ్రెయిన్‌ ‌డెడ్‌ అయిన వ్యక్తిలో పనికొచ్చే అవయవాలు..కిడ్నీలు, కాలేయం, ఊపిరితిత్తులు, పాంక్రియాస్‌, ‌చిన్నపేగు, స్వరపేటిక, చేతులు, యుటెరస్‌, అం‌డాలు, కళ్లు, చర్మం, ఎముకలు, కార్టిలాజ్‌, ‌నరాలు, కాలి వేళ్లు, చేతి వేళ్లు, మధ్య చెవి ఎముకలు.

అవయవాలు అమర్చేందుకు ఎంత సమయం పడుతుందంటే..
ఊపిరి తిత్తులు, గుండె 6 గంటలలోపు, మూత్రపిండాలు 48 గంటల లోపు, నేత్రాలు 4 గంటలలోపు, కాలేయం 12 గంటల లోపు, క్లోమం 24 గంటల లోపల సమయం కావాలి. ఆరోగ్యవంతంగా ఉన్న ప్రతి ఒక్కరూ అవయవ దానాలు చేయొచ్చు. వయస్సు, ఆరోగ్యం, జాతితో సంబంధం లేకుండా అందరూ తమను తాము అవయవ కణజాల దాతలుగా భావించవచ్చు. దాతగా ఉండటానికి…వయసు ఏదైనా కొత్తగా పుట్టినవారు, సీనియర్‌ ‌సిటిజన్లు కూడా అవయవ దాతలు కావచ్చు. అనారోగ్యంతో ఉన్న వ్యక్తి కూడా మరణం తరువాత అవయవాలను లేదా కణ జాలాలను దానం చేయ గలుగుతారు. వైద్యులు అవయవాలను పరిశీలించి, దానం చేయడానికి తగినదా కాదా అని నిర్ణయిస్తారు. స్వచ్చంధ సంస్థలు, కొంత మంది అభ్యుదయ వాదులు మాత్రమే అవయవాలను దానం చేసేందుకు ముందుకు వస్తున్నారు. ప్రజల్లో ఇంకా చైతన్యం, అవగాహన పెరగాల్సిన అవసరం ఉంది. అవయవ దానాలు, వాటి మార్పిడిలపై ప్రభుత్వాలు, స్వచ్చంధ సంస్థలు ఇంకా అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
– రామ కిష్టయ్య సంగన భట్ల…
9440595494

Today is World Organ Transplant Day
Comments (0)
Add Comment