World Health Day: కొరోనా విశ్వ మహమ్మారి ముంగిట ప్రజారోగ్యం..!

నేడు ‘ప్రపంచ ఆరోగ్య దినం’

విశ్వ మహమ్మారి విలయతాండవానికి విలవిల్లాడుతున్న ప్రపంచ మానవాళి ఆరోగ్యానికి సరైన ఔషధ చికిత్సలు అందుబాటులో లేకపోవడంతో, బయట పడటానికి మార్గాన్వేషణ యజ్ఞంలో ఆరోగ్య పరిరక్షణ నిపుణులు నిమగ్నమై ఉన్నారు. రెండవ వేవ్‌ ‌భారత్‌ను కుదుపేస్తున్న అకాలంలో కొరోనాతో సహజీవనానికి సిద్ధం కావాలని, వైరస్‌ ‌విధించిన నియమనిబంధనలను తూచా తప్పకుండా పాటించాలని, టీకాను విధిగా తీసుకోవాలని సూచించడం మాత్రమే కోవిడ్‌-19 ‌కట్టడికి ఏకైక మార్గమని తెలుస్తున్నది. నేటికి ప్రపంచవ్యాప్తంగా 131 మిలియన్ల కేసులు నమోదుకాగా, అందులో 2.85 మిలియన్ల మరణాలు రికార్డు అయ్యాయి. భారత్‌లో 12.5 మిలియన్ల కరోనా కేసులు బయటపడగా, 1.65 లక్షల మరణాలు నమోదు అయినాయి. ఇండియాలో అత్యధికంగా 93 వేలకు పైగా కొత్త కరోనా కేసులు నమోదు కావడం ఆందోళన రేకెత్తిస్తున్నది. విశ్వ ఆరోగ్య పరిరక్షణకు సంబంధించిన అవగాహన, ఆలోచనల్ని మరో సారి మననం చేసుకోవడానికి 1948లో ఐరాస తీసుకున్న తీర్మానం ప్రకారం ప్రపంచ ఆరోగ్య సంస్థ సౌజన్యంతో 1950 నుండి ప్రతి ఏటా ఐరాస సభ్యదేశాల్లో డబ్ల్యూహెచ్‌ఓ ‌వ్యవస్థాపక దినమైన 07 ఏప్రిల్‌ ‌రోజున ‘ప్రపంచ ఆరోగ్య దినం (వరల్డ్ ‌హెల్త్ ‌డే)’ నిర్వహించు కోవడం ఆనవాయితీగా వస్తున్నది. ఐరాస నిర్వహించే 09 అధికారిక ప్రపంచ ప్రజారోగ్య సంబంధ వేదికల్లో ప్రపంచ ఆరోగ్య దినం ప్రధానమైందని తెలుసుకోవాలి.

అన్ని ఐశ్వర్యాల్లోకి ప్రథమమైనది సంపూర్ణ ఆరోగ్యమే అని మనకు తెలుసు. వ్యక్తి శారీరక, మానసిక మరియు భావోద్వేగ సంతులిత జీవన స్థితినే అసలైన ఆరోగ్యమని ఐరాస నిర్వచించింది. కాలానుగుణంగా ప్రపంచం ఎదుర్కొంటున్న ప్రజారోగ్య సమస్యలు, సవాళ్ళకు సమయానుకూలంగా సూచనలు, సలహాలు మరియు హెచ్చరికలను చేయడానికి ప్రపంచ ఆరోగ్య దినం వేదిక ఉపయోగపడుతోంది. ఈ ఏడాది ‘ప్రపంచ ఆరోగ్య దినం-2021‘ నిర్వహించుకుంటున్న వేళ మానవాళిని కుదిపేస్తున్న కరోనా వైరస్‌ ‌కల్లోలానికి ఎదురొడ్డి నిలవడం, కోవిడ్‌-19 ‌మన దరికి రాకుండా చూసుకోవడనేది మన చేతుల్లోనే ఉందని ప్రపంచ వైద్యరంగం ప్రకటిస్తున్నది.

కరోనా మహమ్మారి విజృంభనతో మానవాళి ఆర్థిక చక్రం మందగించడం, ఉద్యోగ ఉపాధులు తగ్గి పోవడం, వేతన కోతలు అమలు కావడం, పేదరికం పెరగడం, పోషకాహారలోపాలతో ప్రాణాలు గాల్లో దీపాలుగా మారిపోయిన దీనస్థితిలో మానవ సమాజం ఉన్నది. వ్యక్తి ఆరోగ్య పరిరక్షణకు కావలసిన ప్రధమ ఔషధం సంపూర్ణ అవగాహన మాత్రమే అని గమనించాలి. ప్రపంచ ఆరోగ్య దినం-2021 నినాదంగా ‘సరళమైన, ఆరోగ్యకర ప్రపంచ సమాజ నిర్మాణం (బిల్డింగ్‌ ఏ ‌ఫేయిరర్‌, ‌హెల్తీయర్‌ ‌వరల్డ్)’ అనబడే అంశాన్ని తీసుకున్నారు.

మన దేశంలో ఆరోగ్య పరిరక్షణకు సవాళ్ళుగా ఆర్థిక వెనకబాటుతనం, గృహ/ఆవాస పరిసరాల అపరిశుభ్రత, అవిద్య, ఉపాధి లేమి, అధిక జనాభా, సామాజిక/ఆరోగ్య అసమానతలు, పేదరికం, లింగ అసమానతలతో మహిళాలోకం నలిగి పోవడం, ఆరోగ్య పట్ల అవగాహనా లేమి, పర్యావరణ గాలి/నేల/జల కాలుష్యం, సురక్షిత నీటి కొరత, ఆహార అభద్రత, వైద్య సదుపాయాల కొరత లాంటి పలు సమస్యలు నిలుస్తున్నాయి. దశాబ్దాలుగా మానవ సమాజాన్ని వెంటాడుతున్న మానసిక అనారోగ్యం, మాతాశిశు సంక్షేమ సవాళ్ళు మరియు వాతావరణ మార్పులు ముఖ్యమైన ఆరోగ్య అంశాలుగా గుర్తించారు. ఇండియాలో సాధారణ ఆరోగ్య సమస్యలుగా కాన్సర్‌, ‌వంధ్యత్వం, కంటి శుక్లాలు, పుట్టుకతో వచ్చే అనారోగ్యాలు, వినికిడి సమస్యలు, మధుమేహం, గుండె జబ్బులు, అంటువ్యాధులు, శ్వాసకోశ సమస్యలు, టిబి, విరోచనాలు, బిపి, స్థూలకాయం లాంటివి గుర్తించబడ్డాయి.

వ్యక్తిగత ఆరోగ్య పరిరక్షణకు పోషకాహారం, క్రమశిక్షణ కలిగిన జీవనశైలి, శారీరక వ్యాయామం, శారీరక శుభ్రత, దురవాట్లు లేక పోవడం, మానసిక ప్రశాంతతకు సదాలోచనలు చేయడం లాంటివి వస్తాయని మరువరాదు. ఆరోగ్యవంతులే అభివృద్ధి రథాన్ని పరుగులెత్తించే రథసారధులని గమనించాలి. ప్రాణం ఉంటేనే జీవితమని, జీవితంలో ఆరోగ్యమే మహాభాగ్యమని భావించి మన ఆరోగ్యన్ని మనమే కాపాడుకుందాం. ఆరోగ్య భారత నిర్మాణంలో మన వంతు కర్తవ్యంగా సామాజిక దూరాలు, మాస్కుల ధారణలు, సానిటైజర్‌తో చేతులు శుభ్రం చేసుకోవడం మరియు అర్హులు అందరూ టీకా వేయించుకోవడం తప్పక పాటిదాం.

డా: బుర్ర మధుసూదన్‌ ‌రెడ్డి
జాతీయ ఉత్తమ అధ్యాపక ఆవార్డు గ్రహీత , విశ్రాంత ప్రధానాచార్యులు, ప్రభుత్వ డిగ్రీ పిజీ, కళాశాల
కరీంనగర్‌ – 99497 00037
prajatantra newstelugu articlestelugu special storiesworld health day
Comments (0)
Add Comment