నేడు టీఆరెస్‌ ‌ద్విదశాబ్డి ఉత్సవం…!

  • అదిరిపోయేలా గులాబీ ప్లీనరీ
  • 6 వేలకు పైగా ప్రతినిధులు
  • గులాబీ డ్రెస్‌ ‌కోడ్‌ ‌తప్పనిసరి
  • 10 వేలకు మందికి పైగా భోజనాలు ఏర్పాటు
  • పదోసారి టిఆర్‌ఎస్‌ ‌చీఫ్‌గా ఎన్నిక కానున్న కేసీఆర్‌
  • 7 ‌తీర్మానాలు చేయనున్న ప్లీనరీ
  • ప్రపంచ రికార్డు నెలకొల్పేలా కాంత్‌రిసా కాన్వాస్‌
  • ‌గులాబీమయమైన భాగ్యనగరం
  • ప్రతిపక్షాలకు ఘాటుగా ఆన్సర్‌ ‌చెప్పనున్న కేసీఆర్‌?

(ఎ.‌సత్యనారాయణరెడ్డి / ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి, హైదరాబాద్‌) : ‌టిఆర్‌ఎస్‌ ‌పార్టీ ద్విదశాబ్ది వేడుకలు మరికొన్ని గంటల్లోనే అంగరంగ వైభవంగా ప్రారంభం కానున్నాయి. ఈ వేడుకలకు భాగ్యనగరం ముస్తాబైంది. హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో పార్టీ ద్విదశాబ్ది వేడుకలను పురస్కరించుకుని నిర్వహించే ప్లీనరీకి పార్టీశ్రేణులు అదిరిపోయేలా ఏర్పాటు చేశారు. టిఆర్‌ఎస్‌ ‌పార్టీ ఆవిర్భవించి 20 ఏండ్లు పూర్తయిన సందర్భంగా ప్లీనరీని అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ప్లీనరీ సందర్భంగా నగరంలో దారిపొడువునా స్వాగత వేదికలు ఏర్పాటు చేయడంతో పాటు ధూంధాం కార్యక్రమాలు, బంజారా నృత్యాలతో స్వాగత కార్యక్రమాలు నిర్వహించనున్నారు. నగరంలో ఎటు చూసినా టిఆర్‌ఎస్‌ ‌పార్టీ ప్లెక్సీలు, బ్యానర్లే. ఒక మాటలో చెప్పాలంటే ఇప్పుడు భాగ్యనగరం గులాబీమయంగా మారింది. హైటెక్స్ ‌వేదికగా సోమవారం జరిగే ప్లీనరీకి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, పార్టీ ప్రతినిధులతో పాటు మొత్తం ఆరు వేల మంది తరలిరానున్నారు. కాగా, భోజనాలు మాత్రం 10 వేలకు మందికిపైగా ఏర్పాటు చేస్తున్నారు. పార్కింగ్‌ ‌నుంచి సభా వేదిక దాకా అన్ని ఏర్పాట్లు జరిగాయి. కొరోనా కారణంగా మూడేళ్ల పాటు ప్లీనరీ సమావేశాలు జరగలేదు. దీంతో ఈ సారి భారీ ఎత్తున ఏర్పాట్లు చేశాయి గులాబీ శ్రేణులు. ఈ సమావేశాల్లో పార్టీ అధ్యక్షుడి ఎన్నిక కూడా జరగనుంది. 10వ సారి కూడా కేసీఆర్‌ను పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకోవడం లాంఛనం కానుంది.

ప్లీనరీకి ఆహ్వానితులు మాత్రమే…
రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ ‌బిఆర్‌ అం‌బేద్కర్‌ ‌ప్రవచించిన బోధించు..సమీకరించు..పోరాడు అనే నినాద స్ఫూర్తితో సిఎం కేసీఆర్‌ ‌టిఆర్‌ఎస్‌ను మలిచారని పార్టీ వర్కింగ్‌ ‌ప్రెసిడెంటు కేసీఆర్‌ ‌పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక లక్ష్యంగా 20 ఏండ్ల క్రితం ఆవిర్భవించిన ఉద్యమ సంస్థ టిఆర్‌ఎస్‌ 14 ఏం‌డ్ల సుదీర్ఘ రాజకీయ పోరాటంలో రాష్ట్రాన్ని సాధించిందని చెప్పారు. ఏడేండ్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌నాయకత్వంలో దేశానికే దిక్సూచిగా అనేక కార్యక్రమాలను చేపట్టిందని వివరించారు. పార్టీ ఆవిర్భవించి 20 ఏండ్లు పూర్తయిన సందర్భంగా టిఆర్‌ఎస్‌ ‌ద్విదశాబ్ది ఉత్సవాలను అబ్బురపడే రీతిలో నిర్వహిస్తున్నామని చెప్పారు. అనేక ఆటుపోట్లను, సవాళ్లను ఎదుర్కుని సిఎం కేసీఆర్‌ ‌నాయకత్వంలో రాష్ట్రాన్ని శాంతియుత మార్గంలో సాధించినట్టు పేర్కొన్నారు. అహింసాయుత పద్ధతిలో, ప్రజాస్వామ్యయుతంగా పోరాడి ప్రజాస్వామ్య విలువలకే ఆదర్శంగా టిఆర్‌ఎస్‌ ‌నిలిచిందని చెప్పారు. రాష్ట్ర సాధన అనంతరం టిఆర్‌ఎస్‌ ‌పార్టీ దేశానికే దిక్సూచిలా అనేక కార్యక్రమాలను రూపొందించటం గర్వకారణమని పేర్కొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వ విధానాలను, ఇక్కడి పాలనను అనేక రాష్ట్రాల వారు ప్రశంసిస్తున్నారని తెలిపారు. కర్ణాటక, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల ప్రజలు, ప్రజాప్రతినిధులు తమకు తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు కావాలని, లేదంటే ఆ రాష్ట్రంలో తమను కలుపాలని కోరుకునేస్థాయికి ఎదగడమన్నది తెలంగాణకు గర్వకారణమని చెప్పారు. హైటెక్స్‌లో నిర్వహించనున్న టిఆర్‌ఎస్‌ ‌ఫ్లీనరీకి ఎంపికచేసిన ప్రతినిధులే రావాలని మంత్రి కేటీఆర్‌ ‌స్పష్టంచేశారు. ప్రతినిధులందరూ గులాబీ డ్రెస్‌కోడ్‌ను పాటించాలని సూచించారు. అన్ని జిల్లాల నుంచి వొచ్చే ప్రతినిధులకు ఏర్పాట్లు పకడ్బందీగా చేస్తున్నట్టు తెలిపారు. కోవిడ్‌ ‌నిబంధనలను పాటిస్తూ ప్లీనరీ ప్రాంగణంలో 6,500 మందికి, ప్రాంగణానికి బయట ప్రతినిధులతో వొచ్చే దాదాపు 4 వేల మందికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. ప్లీనరీ కమిటీల బాధ్యులు తక్కువ సమయంలోనే అద్భుతంగా పనిచేస్తున్నారని అభినందించారు. ప్లీనరీ ప్రాంగణానికి ప్రతినిధులంతా సోమవారం ఉదయం 10 గంటకల్లా చేరుకోవాలని కోరారు. 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక, అనంతరం 7 తీర్మానాలు, అధ్యక్షుడి ప్రసంగం ఉంటాయని పేర్కొన్నారు. తెలంగాణ ప్రయోజనాలే పరమావధిగా రాజకీయ తీర్మానాలుంటాయని వెల్లడించారు. హాజరయ్యే ప్రతినిధులు తమ పేర్ల నమోదు కోసం 35 కౌంటర్లు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. హైటెక్స్‌కు ఇరువైపులా 50 ఎకరాల స్థలంలో పార్కింగ్‌ ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు.

అధ్యక్షుడిగా కేసీఆర్‌ ఎన్నిక లాంఛనమే…


టిఆర్‌ఎస్‌ ‌పార్టీ అధ్యక్షునిగా సిఎం కేసీఆర్‌ ‌మరోసారి ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు. ఆయన ఒక్కరి పేరిటే మొత్తం 18 నామినేషన్లు దాఖలయ్యాయి. మరో అభ్యర్థి ఎవరూ నామినేషన్‌ ‌వేయలేదు. కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనలను అనుసరించి పార్టీ అధ్యక్ష పదవీకి ఈ నెల 17 నుంచి నామినేషన్ల పక్రియ ప్రారంభం కాగా….మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు… సిఎం కేసీఆర్‌ ‌పేరిట నామినేషన్లు దాఖలు చేశారు. హెచ్‌ఐసీసీలో జరిగే పార్టీ ప్లీనరీలో అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగనున్నాయి. నామినేషన్లన్నీ సిఎం కేసీఆర్‌ ‌పేరిటే ఉండటంతో…కేసీఆర్‌ ఎన్నిక లాంఛనమే కానున్నది. ఇదే వేదిక ద్వారా అధికారికంగా ప్రకటించనున్నారు.

ప్రపంచ రికార్డు నెలకొల్పేలా…
ఇప్పటికే గ్రేటర్‌ ‌గులాబీమయమైంది..హైదరాబాద్‌లోని ప్రధాన జంక్షన్లలో సిఎం కేసీఆర్‌ ‌నిలువెత్తు కటౌట్లు, సంక్షేమ పథకాలను వివరించే ఫ్లెక్సీలు వెలిశాయి.. ఈ ప్లీనరీలో ప్రపంచ రికార్డును నెలకొల్పడమే లక్ష్యంగా సరికొత్త ప్రయోగానికి సిద్ధమవుతున్నారు. 20 మీటర్ల వెడల్పు కాన్వాస్‌పై ప్రముఖ శాండ్‌ ఆర్టిస్ట్ ‌కాంత్‌ ‌రిసా..20 ఏండ్ల టిఆర్‌ఎస్‌ ‌ప్రస్థానాన్ని వివరిస్తూ చిత్రాలు గీశారు. ఇక కోట ద్వారాన్ని తలపించేలా భారీ ప్రవేశ ద్వారం..వివిధ రకాల థీమ్‌లతో ఎల్‌ఈడీ ధగధగలు..కళ్లకు కట్టేలా వేలాది ఫొటోలతో ఉద్యమ సారథి సిఎం కేసీఆర్‌ ‌జీవిత చరిత్ర.. ఏడేళ్ల పాలనలో జరిగిన అభివృద్ధి, సంక్షేమంపై ఫొటో ఎగ్జిబిషన్‌ను ప్లీనరీలో ఏర్పాటు చేయనున్నారు. 150 మీటర్ల వెడల్పు, 40 ఫీట్ల ఎత్తులో భారీ ప్రవేశ ద్వారం ఏర్పాటు చేస్తున్నారు. ఇక ప్లీనరికి వొచ్చే 6 వేల మంది టిఆర్‌ఎస్‌ ‌ప్రతినిధుల కోసం 29 రకాల ప్రత్యేక వంటకాలు సిద్ధం చేయనున్నారు.

ప్లీనరీతో టిఆర్‌ఎస్‌ ‌ప్రతిపక్షాల విమర్శలకు ఘాటుగా సమాధానం ఇవ్వనుందా?
టీఆర్‌ఎస్‌ ‌పార్టీ స్థాపించి 20 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పార్టీ ప్లీనరీని ఘనంగా నిర్వహించబోతున్నారు. అయితే, ఈ ప్లీనరీలో ఇటు హుజూరాబాద్‌ ఉప ఎన్నికకు, అటు ప్రతిపక్షాల విమర్శలకు చెక్‌ ‌పెట్టే అవకాశం కనిపిస్తోంది. గత సంవత్సర కాలంగా ప్రతిపక్షాలకు, టిఆర్‌ఎస్‌ ‌పార్టీకి మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. ప్లీనరీ వేదికగా అనేక ప్రశ్నలకు సిఎం కేసీఆర్‌ ‌పార్టీ అధ్యక్షుడి హోదాలో సమాధానం ఇచ్చే అవకాశం ఉందనీ సమాచారం. ప్రతిపక్షాలు కూడా గట్టిగానే కౌంటర్‌ ఇచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా, ప్లీనరీలో కార్యకర్తలను ఉద్దేశించి ఎక్కువ శాతం ప్రసంగించే అవకాశం ఉందనీ సమాచారం. ఎందుకంటే ఇక రెండున్నర సంవత్సరాలలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న తరుణంలో కార్యకర్తలు ఉత్సాహంగా పనిచేస్తేనే రానున్న ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ ‌విజయం సాధించే అవకాశం ఉంటుంది. మొత్తంగా ప్లీనరీలో టిఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఎటువంటి అంశాలను ప్రస్తావిస్తారనే దానిపై ఆసక్తి నెలకొంది.

CM KCRhuzurabad by-electionsprajatantranewstelugu newstelugu politicstrsTRS ‌Dwidashabdi festivalతెలుగు వార్తలు
Comments (0)
Add Comment