‘‘ అష్టకష్టాల్లో అవసాన దశ’’

‘‘‌గతమంతా కష్టాలతో నిండిన జీవన కావ్యాలే! హృదయం చెమర్చి పెల్లుబికిన గేయాలే!!స్వేదంతో తనువంతా తడిసి,రక్త మాంసాలనే  మూలధనంగా వెచ్చించి, ఎముకల గూడైనా చలించక తపించి, కూటికోసం- గూటి కోసం అహరహం శ్రమించిన త్యాగమూర్తులు తుదకు అస్థిపంజరాల్లా, ప్రాణమున్న శవాల్లా  కొట్టుమిట్టాడుతున్నారు.గుక్కెడు గెంజికోసం పోరాడుతున్నారు. పిడికెడంత గుండెకు చిటికెడంత ఆత్మీయ స్పర్శ కోసం అలమటిస్తున్నారు. అయినా అది నిరాశే! కలలో సైతం దొరకని అత్యాశే!!’’

నేడు అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం

నడుస్తున్న చరిత్రలో వృదా్ధ ప్యానిది ఒక విషాద గేయం. ఒకప్పుడు వృద్ధాప్యానికి  ఒక గౌరవం ఉండేది. ప్రస్తుత పరిస్థితులు ఇందుకు విరుద్ధంగా ఉన్నాయి.వృద్దాప్యం అంటే నెరసిన జుట్టు,ముడతలు పడిన శరీరం కాదు. వృద్ధాప్యమంటే ఒక సుదీర్ఘ అనుభవాల సౌధం. అలాంటి అనుభవాల సౌధాన్ని కడదాకా పదిలంగా కాపాడుకోవాలి. ఎన్నో ఆశలతో,ఆకాంక్షలతో కనిపెంచి, పెద్ద చేసిన ‘‘పెద్దరికం’’ నవతరం చేతిలో నగుబాటు పాలై,అగచాట్లు పడుతున్నది. నడక నేర్పిన నాటితరం నడత చెడిన నేటితరం చేతిలో వంచనకు గురై అలమటిస్తున్నది.తపించిన మనసు, శ్రమించిన కాయం కొరగానిదై కాలగర్భంలో కలిసే జీవన సంధ్యా సమయం  ఆవేదన…అరణ్యరోదనతో అస్తమించడం అత్యంత ఘోరం.
గతమంతా కష్టాలతో నిండిన జీవన కావ్యాలే! హృదయం చెమర్చి పెల్లుబికిన గేయాలే!!స్వేదంతో తనువంతా తడిసి,రక్త మాంసాలనే  మూలధనంగా వెచ్చించి, ఎముకల గూడైనా చలించక తపించి, కూటికోసం- గూటి కోసం అహరహం శ్రమించిన త్యాగమూర్తులు తుదకు అస్థిపంజరాల్లా, ప్రాణమున్న శవాల్లా  కొట్టుమిట్టాడుతున్నారు. గుక్కెడు గెంజికోసం పోరాడుతున్నారు. పిడికెడంత గుండెకు చిటికెడంత ఆత్మీయ స్పర్శ కోసం అలమటిస్తున్నారు. అయినా అది నిరాశే! కలలో సైతం దొరకని అత్యాశే!! బ్రతుకు బండిని లాగి,అలసి సొలసి తనకంటూ ఏమీ  మిగుల్చుకోక, ఉన్నదంతా ఊడ్చి పెట్టి,అయోమయంగా దిక్కులు చూస్తే, పగిలిన అద్దంలో ప్రతిబింబం సైతం వెక్కిరించక మానదు. శిథిలమైన శరీరాన్ని గాంచి తనువంతా ముడతలు పడి, జవసత్వాలుడిగి, కర్రబోటుతో వృద్దాప్యపు బోటు నీడ్చే జన్మ ప్రదాతలకు జానెడు నెలవే కరువైంది!వృద్దాప్యమే బరువైంది! గుండె నిబ్బరమే కరువైంది!!
స్వేదాన్నే సంపదగా మార్చి, రక్తాన్నే ఇంధనం గా చేసి, సర్వం  సమకూర్చితే, పెరిగి పెద్దవారైన బిడ్డలంతా ఈసడించుకుని వెళ్లగొడితే, జవసత్వాలుడిగి, బిక్కచచ్చి,బావురుమని ఏడ్చింది వృద్దాప్యం. గుండెల్లో పెట్టుకుని పెంచిన బిడ్డలు పెరిగి పెద్దవారై,గుండెలపై  తన్నుతుంటే  వృద్ధాప్యం ఈసురోమని ఏడుస్తున్న నేపథ్యంలో మనసు లేని మనుషుల లోకం మారాలని  ఆశించడం కూడా అత్యాశే కాగలదు. కడదాకా కన్నీళ్ళే తోడురాగా, కండలన్నీ అరగదీసి కాయం కృశిస్తే, ఓపికంతా ఆవిరైతే, చెమట చుక్కలే నూనె చుక్కలై తమ బిడ్డల జీవితాలకు,ఆయువు నందిస్తే తుదకు మిగిలేది మూతి విరుపులు, ఈసడింపులు.కష్టాలతో కాయమంతా కరిగిపోయి,నలిగిపోతే చమురు లేని దీపం కొడిగట్టి ఆరిపోదా? మారుతున్న కాలంలో కరుణ కరువై,కష్టాలే శరణ్యమని శాసిస్తే ఆ శాసనమే వృద్దుల పాలిట శిలాశాసనంలా మారింది.కలలన్నీ కన్నీరై, కనుల వెంట ధారలా ప్రవహిస్తుంటే కనికరం లేని వర్తమానం కళ్ళప్పగించి చూస్తుంటే,వయోభారం వెంటాడి,వేధిస్తే గతకాలపు కష్టమంతా గతించిన చరిత్రలా పునరావలోకానికే కాని పట్టెడు మెతుకులకు కొరగాదు.
కనిపించని దైవాలను పూజిస్తూ, కనిపెంచిన ప్రత్యక్ష దైవాలకు ప్రత్యక్ష నరకం చూపిస్తున్న ఆధునిక నాగరికత్వంలో వృద్ధుల ఆవేదనలు  అరణ్య రోదనలా మారుతున్నాయి. జీవితపు చివరి మజిలీ వృద్ధాప్యం. ఎన్నో కష్టాల కడగండ్లను అధిగమించి, ఎన్నో బాధ్యతలు నెరవేర్చి, తమ సంతానాన్ని ఉన్నత స్థితికి తెచ్చి,అలసి సొలసి,ఆఖరి మజిలీ చేరుకున్న తరుణంలో తమ సంతానానికి బరువై, ఆలనా పాలనా కరువై, ఆదరణ పూజ్యమై  జీవశ్ఛవాల్లా అంతిమ శ్వాస కోసం ఎదురు చూస్తున్న వృద్ధతరం అంతులేని వెతలు వర్ణింపశక్యం కాదు. ఇది పూర్వ జన్మ ఫలమో,ఈ జన్మ  కర్మమో కాదు. కరెన్సీ కట్టలకు దాసోహమై,నైతిక విలువలు విసర్జించి, నయవంచన చేసే నరాధముల ఘోరకృత్యాలకు మరో కోణం వంచింప బడుతున్న  వృద్ధాప్యం. అకారణ మృత్యువు దాపురించి, అర్ధాంతరంగా తనువు చాలించక పోతే తప్ప,జన్మించిన ప్రతీ ఒక్కరూ వృద్దాప్యమనే జీవిత చివరి దశను స్ఫృశించక తప్పదు.  ఉడుకు రక్తంతో మిడిసి పడుతూ, యవ్వనంలో గర్వంతో ఎగసిపడే వారంతా ఏదో ఒకనాటికి వృద్ధాప్యపు అంచుకు చేరక తప్పదు.
గర్వభంగం పొందక తప్పదు. అయితే భావి గతులను ఊహించక,ఇదే శాశ్వత మని భ్రమించి,కనిపెంచిన తల్లిదండ్రులను ఈసడించుకుని, వృద్ధాప్యంలో వారిని నడి రోడ్లపై గెంటడం, వృద్ధాశ్రమాలకు అంకిత మివ్వడం నడుస్తున్న చరిత్రలో మరో అమానవీయ అధ్యాయానికి శ్రీకారం పలకడమే కాగలదు. పెంపుడు కుక్కలకిచ్చే ప్రాధాన్యత కని పెంచిన తల్లిదండ్రులకు లేకపోవడం అత్యంత దారుణమైన మానసిక దారిద్య్రం నుంచి పుట్టిన రుగ్మతగా భావించక తప్పదు.ఆకలితో అలమటిస్తున్న వృద్ధులైన జన్మప్రధాతలకు ఈసడింపులతో ఎంగిలి మెతుకులు వేస్తూ, తిట్ల దండకంతో నిత్య నరకాన్ని చవిచూపిస్తున్న యువత ధోరణి అత్యంత జుగుప్సాకరం. అయితే ఈ విశ్లేషణ కేవలం తల్లిదండ్రులను పట్టించుకోని వారికి మాత్రమే వర్తిస్తుంది. వృద్ధతరాన్ని నిర్లక్ష్యం చేస్తూ, మానవత్వాన్ని సిగ్గుపడేలా చేస్తున్న  అమానుషత్వం పోవాలి.మానవత్వం వెల్లి విరియాలి వృద్ధులను గౌరవభావంతో చూడాలి. మవృద్ధుల అనుభవ సారాంశాన్ని అనుభవ రాహిత్యంతో తృణీకరిస్తున్న వర్తమాన అనాగరిక,అనైతిక పోకడలను అరికట్టాలి. వృద్ధుల సంక్షేమం కోసం,వారు పడుతున్న బాధలను గుర్తించిన ఐక్యరాజ్య సమితి వృద్ధులను గౌరవించే లక్ష్యంతో ప్రతీ ఏటా అక్టోబర్‌  1‌వ తేదీన అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవంగా పాటిస్తున్నది.
సంవత్సరంలో   ఒక రోజు లాంఛనంగా వృద్ధులను గౌరవిస్తూ ఫోటోలను ఫోజులిచ్చే సంస్కృతి మారాలి. వృద్ధుల ను గౌరవించాలనే నిజమైన  ఆలోచన హృదయం నుండి పెల్లుబికాలి.వృద్ధులు అనుభవాలకు గుర్తులు. వృద్ధులు రేపటి చరిత్రకు నేటి సజీవ సాక్ష్యాలు.జీవిత సారాంశాన్ని ఒడిసి పట్టుకుని,భావి తరాలకు వారసత్వ సంపదగా మిగిలే  వృద్ధుల సుదీర్ఘ జీవిత అనుభవ సారాంశం  వెలకట్టలేనిది.ఎలా జీవించాలో,ఎలా జీవిస్తే ఈ సమాజం హర్షిస్తుందో  తెలియచెప్పే వృద్ధతరం పెద్దరికానికి ప్రతిరూపం. అలాంటి పెద్దలను అవసాన దశలో వదిలించుకోవడానికి ప్రయత్నించడం అత్యంత అమానుషం.

సుంకవల్లి సత్తిరాజు,
తూ.గో.జిల్లా, ఏపీ
9704903463.
prajatantra newstelangana updatestelugu kavithaluTelugu News Headlines Breaking News NowToday Hilightsతెలుగు వార్తలు
Comments (0)
Add Comment