రాజ్యాంగం ఆశయాలకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి

  • ప్రగతిభవన్‌లో ఘనంగా గణతంత్ర వేడుకలు
  • జెండా ఆవిష్కరించిన సిఎం కెసిఆర్‌

‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జనవరి 26 : 74వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం సీఎం కేసీఆర్‌ ‌ప్రగతి భవన్‌లో జాతీయ పతాకావిష్కరణ చేశారు. జాతిపిత మహాత్మా గాంధీ, రాజ్యాంగ నిర్మాత డా. బీఆర్‌ అం‌బేద్కర్‌ ‌చిత్రపటాలకు పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా వారు దేశానికి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. సమాఖ్యగా వర్ధిల్లుతున్న భారత దేశంలో ఫెడరల్‌ ‌స్ఫూర్తి పరిఢవిల్లుతూ, న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం మూలస్తంభాలుగా పాలన సాగినప్పుడు మాత్రమే దేశంలో సంక్షేమం విలసిల్లి, మరింత ప్రగతి పథంలో పయనిస్తుందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. విభిన్న పూలతో కూడిన పుష్పగుచ్ఛం మాదిరి విభిన్న సామాజిక, సంస్కతులు, సంప్రదాయాలు, భాషలు, ఆచారాలతో భిన్నత్వంలో ఏకత్వాన్ని పొదిగి ఉండటమే భారతదేశ ప్రధాన లక్షణమని పేర్కొన్నారు.

భారతదేశాన్ని సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా ప్రకటించు కుంటూ మనకు మనం సగర్వంగా సమర్పించుకున్న పవిత్ర రాజ్యాంగాన్ని ప్రతీ పౌరుడు క్షుణ్ణంగా అవగాహన చేసుకుని, ఆ ఆశయాలను సాధించేందుకు మరింతగా కృషి చేయాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. సమానత్వంతో కూడిన సమర్థ, ప్రజాస్వామిక పాలన ద్వారానే దేశ రాజ్యాంగం ఆశించిన లక్ష్యం పరిపూర్ణంగా సిద్ధిస్తుందని తెలిపారు. సర్వసత్తాక, గణతంత్ర, ప్రజాస్వామిక దేశంగా భారత్‌లో రాజ్యాంగబద్ధ పాలనకు అంకురార్పణ జరిగిన ఈ రోజు దేశ పౌరులందరికీ పండుగ దినమని పేర్కొన్నారు. రాజ్యాంగ నిర్మాతల కృషిని ప్రజలు సదా స్మరించుకుంటారని తెలిపారు. కార్యక్రమంలో మంత్రులు వేముల ప్రశాంత్‌ ‌రెడ్డి, సత్యవతి రాథోడ్‌, ‌మల్లారెడ్డి, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌ ‌రెడ్డి, నవీన్‌ ‌రావు, శంభీపూర్‌ ‌రాజు, మధుసూధనా చారి, సీఎస్‌ ‌శాంతి కుమారి, డీజీపీ అంజనీ కుమార్‌, ‌తదితరులు పాల్గొన్నారు.

Comments (0)
Add Comment