- నెలాఖారులోపు డంప్, గ్రేవ్ యార్డు నిర్మాణాలు పూర్తి కావాలి
- ఆగస్టు 10లోపు రైతు వేదిక నిర్మాణాలు పూర్తి కావాలి
- స్థలం ఖాళీగా ఉండకుండా విరివిగా మొక్కలు నాటాలి
- గజ్వేల్ నియోజకవర్గ స్థాయి సమీక్షా సమావేశంలో మంత్రి హరీష్‌రావు వెల్లడి
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు గౌరవాన్ని నిలబెట్టేలా.. ప్రతీ మండలం అభివృద్ధిలో పోటీ పడాలని నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, అధికారులకు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌రావు దిశానిర్దేశం చేశారు. సిద్ధిపేట జిల్లా గజ్వేల్ ఐవోసి కార్యాలయ కాన్ఫరెన్స్ హాల్లో బుధవారం గడా ప్రత్యేక అధికారి ముత్యంరెడ్డి అధ్యక్షతన మంత్రి హరీష్‌రావు సమక్షంలో గజ్వేల్ నియోజకవర్గ స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ప్రతీ మండలం.. మరో మండలంతో అభివృద్ధిలో పోటీ పడి అగ్రభాగాన నిలవాలని, ఆ దిశగా ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పని చేయాలని మంత్రి కోరారు. జూలై 31లోపు డంప్, గ్రేవ్ యార్డులు, ఆగస్టు 10లోపు రైతు వేదిక నిర్మాణాలు పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. తెలంగాణకు హరితహారంలో ఇప్పటికే గజ్వేల్ నియోజకవర్గం ఆదర్శంగా నిలిచింది. ప్రతీ గ్రామంలో రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటాలని, రోడ్డుకు చుట్టుపక్కల మొక్కలు లేకుండా ఖాళీ స్థలం ఉండొద్దని అధికారులకు మంత్రి సూచించారు. 33/11కేవీ విద్యుత్ సబ్ స్టేషనులో నీటి సౌకర్యం ఉంటున్న దృష్ట్యా చెట్లను పెంచి ప్రకృతి వనాలుగా తీర్చిదిద్దాలని విద్యుత్ ఎస్ఈ కరుణాకర్ బాబుకు మంత్రి ఆదేశించారు. పల్లె ప్రకృతి వన ఏర్పాట్లకు స్థలాలను గుర్తించాలని, అన్నీ ప్రభుత్వ కార్యాలయాలలో.. ఎక్కడా స్థలం ఖాళీగా ఉండకుండా ప్రతీచోట విరివిగా మొక్కలు నాటి హరితహారం చేపట్టాలని అధికారిక వర్గాలకు మంత్రి ఆదేశించారు. వచ్చే ఏడాది నిర్వహించే హరితహారంలో మొక్కలు నాటాలంటే.. ఇళ్లలో సైతం స్థలం మిగలకుండా.. ఈ ఆరవ విడత హరిత హారంలోనే మొక్కలు నాటుదామని ఆ దిశగా అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పని చేయాలని మంత్రి సూచించారు. ఫల వృక్షాలు పెంచే విషయంలో మల్బరీ సాగుకు ప్రోత్సహం, ఈత వనాలు ఏర్పాట్లకు ప్రజలకు అవగాహన కల్పించాలని ఏంపీడీఓలకు మంత్రి ఆదేశించారు.
సీడ్ పంటలు ప్రోత్సహించాలని, గజ్వేల్ నియోజకవర్గ పరిధిలో చాలా సీడ్ కంపెనీలు ఉన్నాయని, ఆ కంపెనీలను సద్వినియోగం చేసుకోవాలని నియోజకవర్గ ప్రజాప్రతినిధులకు మంత్రి సూచించారు. పందిరి సాగు, మల్బరీ సాగు, చేపల చెరువు, ఇంకుడు గుంతలు, గ్రామ నర్సరీ నిర్వహణ, హరిత హారంలో నాటిన మొక్కల సంరక్షణ, ఈ యేడు హరిత హారంలో నాటాల్సిన మొక్కలు వాటి సంరక్షణ అంశాలపై మండలాల వారీగా ప్రజా ప్రతినిధులు, అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. మర్కుక్ మండలంలోని 16 గ్రామాల్లో డంప్ యార్డులు వినియోగంలోకి తెచ్చినందుకు ఎంపిడివో కౌసల్యను మంత్రి అభినందించారు. గ్రేవ్ యార్డులు, రైతు వేదిక నిర్మాణాలు ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని మంత్రిసూచించారు. వర్గల్ మండలంలోని 27 గ్రామాలకు కేవలం 5 గ్రామాల్లో డంప్ యార్డులు నిర్మాణం జరిగిందని, మండలంపై స్పెషల్ డ్రైవ్ చేపట్టి యుద్ధప్రాతిపదికన పూర్తి చేసేలా అధికారులు, ప్రజాప్రతినిధులు చొరవ చూపాలని మంత్రి ఆదేశం. గ్రేవ్ యార్డు-వైకుంఠ ధామం 16 పూర్తయ్యాయని, 13 వినియోగంలోకి వచ్చాయని, మిగతా పూర్తి చేయాల్సిందిగా అధికారులు, ప్రజాప్రతినిధులకు మంత్రి సూచన. మండలంలో క్లస్టర్ల వారీగా రైతు వేదిక నిర్మాణాలు చేపట్టాలని అధికారులకు మంత్రి ఆదేశించారు. తూప్రాన్, మర్కుక్ మండలంలోని అన్నీ గ్రామాల్లో డంప్ యార్డు నిర్మాణాలు పూర్తి చేసి, ఎర్రలు వేసి వర్మీ కంపోస్టు తయారు చేస్తున్నామని మండల అధికారులు సమీక్షలో మంత్రికి వివరించగా ఇరు మండలాల ఎంపిడివోలు చాలా అద్భుతంగా పని చేశారని మంత్రి ప్రశంసించారు. గజ్వేల్ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి 10 పడకల ఐసీయూ కేంద్రం, 5 యూనిట్ కలిగిన డయాలసిస్ కేంద్రం కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు వచ్చాయని, తొందరలోనే మంజూరు చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. ఈ సమీక్ష కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ వేలేటి రోజా రాధాకృష్ణ శర్మ, అటవీ అభివృద్ధి సంస్థ ఛైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, డిసిసిబి చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి, జిల్లా అడిషనల్ కలెక్టర్ ముజమ్మీల్ ఖాన్, ఆర్డీవో విజయేందర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, నియోజకవర్గంలోని ఆయా మండలాల ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
ఆధునాతన హంగులతో.. గజ్వేల్ పార్కును ఆధునీకరిస్తాం:
ఆధునాతన హంగులతో గజ్వేల్ పార్కును ఆధునీకరిస్తామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు చెప్పారు. సిద్ధిపేట జిల్లా గజ్వేల్-ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలో రూ. 1.20 కోట్ల వ్యయంతో పునరుద్దరించనున్న రాజీవ్ పార్కు అభివృద్ధి పనులకు బుధవారం మంత్రి హరీష్‌రావు శంఖస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ.. పార్కును అభివృద్ది చేయాలన్న సిఎం కేసీఆర్ ఆదేశాల మేరకు నిధులను మంజూరు చేయడం జరిగిందన్నారు. పార్కును వాస్తు ప్రకారం ఏర్పాటు చేయాలని, జాగింగ్, వాకింగ్, యోగా కేంద్రాలతో పాటు గజబౌలిలను ఏర్పాటు చేయాలని, చిన్నారులు ఆడుకునే విధంగా చిల్డ్రన్స్ పార్కును ఏర్పాటు చేయాలని మున్సిపల్ అధికారులకు సూచించారు.పార్కు పునరుద్ధరణకు మరింతగా అవసరమైన నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. ఇప్పటికే గజ్వేల్ మున్సిపాలిటీలో రూ.100 కోట్లతో యూజీడీ పనులను చేపట్టామని, యూజీడీకి అనుసంధానంగా 4 చోట్ల ఎస్టీపీలను ఏర్పాటు చేస్తున్నామని, ఆ పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. గజ్వేల్‌లో పునరుద్ధరణ చేస్తున్న పార్కు ఆధునాతన సౌకర్యాలతో.. ఆహ్లాదకరంగా ఉండేలా పార్కును తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. యూజీడీ పనులు తొందరగా పూర్తి చేయాలని, గజ్వేల్ లో నాలుగు ఎస్టీపీ, యూజీడీ పైపులైన్ల పనులు కూడా శరవేగంగా జరగాలని మున్సిపల్ అధికారులకు సూచించారు. కొరోనా నేపథ్యంలో అతిగా భయపడొద్దు. నిర్లక్ష్యంగా కూడా ఉండొద్దని, ప్రతి ఒక్కరూ మాస్కు తప్పనిసరిగా ధరించాలని, స్వీయ నియంత్రణ చాలా ముఖ్యమని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అవగాహన కల్పించారు. గోరు వెచ్చని వేడి నీళ్లు తాగాలని దీంతో కరోనాను నివారించి ఆరికట్టవచ్చని ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ మేరకు గురుకుల పాఠశాలలో చదివి ఇంటర్మీడియట్ లో ప్రథమ స్థానం పొందిన సౌజన్యను అభినందించి పుష్ఫగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ ఛైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి, జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ వేలేటి రోజారాణి, డిసిసిబి ఛైర్మన్ చిట్టి దేవేందర్‌రెడ్డి, జిల్లా గ్రంధాలయ సంస్థ ఛైర్మన్ లక్కిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి,గడా ప్రత్యేకాధికారి ముత్యంరెడ్డి, మునిసిపల్ ఛైర్మన్ రాజమౌళి, ఎంపిపి దాసరి అమరావతి శ్యాం, ఏఎంసి ఛైర్పర్సన్ మాదాసు అన్నపూర్ణ శ్రీనివాస్, ఆర్డీవో విజయేందర్‌రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.