హార్మోనులు అసమతుల్యత వల్లనే థైరాయిడ్..! మే 25 ప్రపంచ థైరాయిడ్ డే 

మానవ శరీరంలో జీవక్రియలు ముఖ్యంగా అంతర్గత గ్రందులపై ఆదారపడి ఉంటాయి. గ్రంధులు అన్ని సమన్వయము తో పని చేస్తాయి.  ఈ జీవక్రియలను నియంత్రించడంలో థైరాయిడ్ గ్రంధి లేదా అవటు గ్రంధి చాలా కీలకమైనది. మనిషి పుట్టినప్పటినుంచి మరణం వరకు  శరీరంలో జరిగే మార్పులలో, థైరాయిడ్ గ్రంధి ప్రముఖ పాత్ర వహిస్తుంది. ప్రపంచంలో చాలా మంది థైరాయిడ్ సమస్యతో బాధపడుతూ , తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతి సంవత్సరం మే 25న ‘థైరాయిడ్ దినోత్సవం” ను నిర్వహిస్తున్నారు. ఈ రోజున దీనిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరాన్ని గుర్తించి అవగాహన పెంచడానికి ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఈ థైరాయిడ్ సమస్యకు ప్రధానకారణం శరీరంలో హార్మోనులు అసమతుల్యత. ప్రతి 100మంది మదుమేహ వ్యాదిగ్రస్తులలో  20నుంచి 30 మందికి ఈ థైరాయిడ్ సమస్య వస్తుంది.

థైరాయిడ్ లో ఉండే కణాలు రక్తం నుంచి అయోడిన్ ను గ్రహించి టైరోసిస్ అనే అమైనో ఆసిడ్ తో పాటు మరి కొన్ని ఎంజైములు థైరాయిడ్ హార్మోన్లు టి3, టి4, వంటివి ఉత్పత్తి చేస్తాయి. మన శరీరాన్ని చురుకుగా ఉంచడానికి తోడ్పడతాయి . టి3, టి4,హార్మోన్లు శరీరంలోని కొన్ని ప్రధానమైన జీవక్రియలకు దోహదపడుతుంది. టి3, టి4,హార్మోన్ల మోతాదు రక్తంలో తగ్గితే కొన్ని సంకేతాలు పిట్యూటరీ గ్రంధికి చేరి అక్కడి నుంచి టీ.ఎస్.హెచ్. హార్మోను ఎక్కువగా విడుదల అయ్యేలా చేస్తుంది. దాని వల్ల రక్తంలో టీ.ఎస్.హెచ్. మోతాదు పెరుగుతుంది ఒకవేళ రక్తం లో టీ.ఎస్.హెచ్.  హార్మోన్ల మోతాదు పెరిగితే పిట్యూటరీ గ్రంధి నుంచి వచ్చే టి.ఎస్.హెచ్ మోతాదు తగ్గుతుంది. దీనితో ఆ గ్రంథికి సంబంధించిన సమస్య వస్తుంది

ఎప్పుడైతే థైరాయిడ్  హార్మోన్స్ లెవల్స్ ఎక్కువగా, లేదా తక్కువగా  ఉంటాయో, ఆ సమయంలో ఆరోగ్యాని సంబంధించి అనేక ఆరోగ్యసమస్యలను ఎదుర్కోవల్సి వస్తుంది. ప్రపంచంలో చాలామంది హైపో థైరాయిడిజమ్ లక్షణాలతో బాధపడుతున్నారు. థైరాయిడ్ గ్రంధి  మన గొంతు పరిమాణంను బట్టి బటర్ ఫ్లై (సీతాకోకచిలుక) ఆకారంలో ఉంటుంది. శరీరంలో హార్మోన్లను ఉత్పత్తి చేయడంలో ఇది కీలకపాత్ర పోషిస్తుంది. ఈ హార్మోన్స్ మెటబాలిజం(జీవక్రియలు)పై ప్రభావం చూపుతాయి. ఒకవేళ ధైరాయిడ్ గ్రంధి  సరైన మొత్తంలో హార్మోన్లను ఉత్పత్తి చేయలేకపోతే.. దాన్ని హైపోథైరాయిడిజంగా, అదే ఎక్కువగా ఉత్పత్తిఅయితే  ‘హైపర్ థైరాయిడిజం” అని లేదా ‘థైరో ట్యాక్సీ కోసిన్”గా పరిగణిస్తారు. థైరాయిడ్ గ్రంధి వాపు వస్తే దానిని ‘గాయిటర్” అని అంటారు. హైపో థైరాయిడిజం వలన జలుబు చేయడం, కళ్ల సమస్యలు, బరువు పెరగడం, తొందరగా అలసట, జుట్టు పొడిబారడం, గొంతు బొంగురు పోవడం, శరీరంలో కొలస్ట్రాల్‌ పెరగడం, చెమట తక్కువగా రావడం, మహిళలకు రుతుక్రమం సమయంలో బ్లీడింగ్‌ ఎక్కువ అవడం వంటి లక్షణాలు ఏర్పడుతాయి. రెండవది హైపర్‌ థైరాయిడిజం, ఇది వచ్చినప్పుడు గొంతు వద్ద థైరాయిడ్‌ గ్రంధి వాపు వస్తుంది.  బరువు తగ్గి పోవడం, అపరిమితంగా తినడం, గుండె ఎక్కువ కొట్టుకోవడం, ప్రతి చిన్న విషయానికీ ఆందోళన చెందడం, కళ్లు ముందుకు చొచ్చుకు రావడం, తరచూ డయేరియాకు గురికావడం, ఎముకలు బలహీనమవ్వడం, జుట్టు రాలిపోవడం, మహిళలో రుతుస్రావ సమయంలో బ్లీడింగ్‌ తగ్గిపోవడం వంటి  లక్షణాలు కనిపిస్తాయి. 30 సంవత్సరాలు వయసు పైబడిన ప్రతిఒక్కరు, ఊబకాయం కలిగినవారు, గొంతు క్రింద వాపు గాయిటర్ ఉన్నవారు, షుగరు ఉన్నవారు, ఎత్తు సరిగా ఎదగని మరియు ఎక్కువ బరువు ఉన్న పిల్లలు, నెలసరి సమస్యలు కలవారు, పిల్లలు కలగని దంపతులు, చర్మం పై తెల్ల మచ్చలు కలిగిన వారు తప్పకుండా థైరాయిడ్ టెస్ట్ చేయించుకోవాలి

ముఖ్యంగా థైరాయిడ్ సమస్య ఎక్కువగా మద్య వయసు వారిలో  లేదా వయసు పెరిగిన ఆడవాళ్లలో వస్తుంది. ప్రధానంగా గర్భిణులలో థైరాయిడ్‌ నిర్ధారణ పరీక్ష రెండు మూడు సార్లు చేయాల్సి ఉంటుంది. థైరాయిడ్‌ సమస్య ఉన్నట్లైతే గర్భిణులకు గర్భస్రావమయ్యే ముప్పు ఉండటమే కాకుండా పుట్టబోయే పిల్లలు కూడా అనారోగ్య సమస్యలతో పుట్టే అవకాశముంది. గర్భిణులలో హైపో థైరాయిడిజం తరచూ కనిపించే సమస్య. పుట్టబోయే బిడ్డల క్షేమం కోసం గర్భిణీలంతా థైరాయిడ్‌ పరీక్ష విధిగా చేయించుకోవాల్సి ఉంటుంది. గర్భందాల్చిన నాటి నుంచి కాన్పు అయ్యే వరకు కనీసం రెండునుంచి మూడుసార్లు అయినా థైరాయిడ్‌ పరీక్ష చేయించుకోవాల్సి ఉంటుంది.

థైరాయిడ్ గ్రంధి బలహీన పడితే, హైపోథైరోయిడిజం వస్తుంది. వీళ్ళు జీవితాంతం థైరాక్సిన్ మందు వేసుకోవలసి ఉంటుంది. ప్రతి 6 నెలలకు ఒకసారి టీ.ఎస్.హెచ్. పరీక్ష చేయించుకుంటూ, సరియైన మోతాదు లో మందులు  వేసుకోవలసి ఉంటుంది.మందులు మానివేస్తే మళ్ళీ జబ్బు తిరగ పెడుతుంది. మందులు ఆప కూడదు.థైరాయిడ్ లక్షణాలను, సంకేతాలను తెలుసుకోవడం చాలా అవసరం. థైరాయిడ్‌కు సంబంధించిన లక్షణాలు కనిపించగానే వైద్యులను సంప్రదించాలి. టి. 3, టి – 4, టీ.ఎస్.హెచ్., స్వరపేటిక పరీక్షలు చేయించుకోవాలి. స్వరపేటిక వాపు వచ్చిన వారికి ఆల్ట్రాసౌండ్‌, నీడిల్‌ బయాప్సి ద్వారా నిర్థారణ చేస్తారు. మరికొందరికి థైరాయిడ్  గాయిటర్ ,  గుండె సంబందిత సమస్యలు , నాడీసంబందిత సమస్యలు , సంతాన సమస్యలు , పుట్టుకలో లోపాలు  వంటి సమస్యలకు  దారితీయవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ థైరాయిడ్ లక్షణాలపై అవగాహన కల్పించుకోవడం చాలా అవసరం. థైరాయిడ్ జబ్బుకు ఆహారానికి సంబంధం లేదు. అన్ని ఆహారపదార్థాలు తినవచ్చు. పత్యం ఏమి లేదు. ఒక్క ఉప్పు విషయంలో కళ్ళు ఉప్పు వాడకూడదు. అయోడిన్ కలిగిన  ఉప్పు మాత్రం వాడాలి. సముద్ర చేపల్లో ఉండే మాంసకత్తులు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి . రోజుకో గుడ్డు క్రమం తప్పకుండా తీసుకొంటే జీవక్రియలు సాఫీగా సాగుతాయి.మనం తీసుకునే ఆహారం లో ఎక్కువగా క్యారట్, బీట్ రూట్, పైనాపిల్ , కొత్తిమీర, పదార్థాలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఇవి థైరాయిడ్ సమస్యలకు చక్కని మందు లాగా పనిచేస్తుంది. థైరాయిడ్ పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకూ ఎవరికైనా రావచ్చు తల్లికి ఉంటే, బిడ్డకు కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పుట్టిన వెంటనే తల్లికి ఉన్నట్లయితే థైరాయిడ్ పరీక్షలు చేసి చికిత్స ప్రారంభిస్తే ఫలితం ఉంటుంది. లేదంటే పిల్లల్లో మెదడు ఎదగకపోవడం, వంటి సమస్యలు వస్తాయి. పెద్దవాళ్ళు కూడా రకరకాల సమస్యలను ఎదుర్కొంటారు. డాక్టర్ గారి సలహా ప్రకారం  నిరంతరం మందులు వాడటం అవసరం. మనమందరం థైరాయిడ్ గురించి తెలుసుకొని, సరిగా వైద్యం చేసుకుంటూ, ఈ అపోహలన్నింటినుంచి దూరంగా ఉంటూ, ఆనందంగా మన ఆరోగ్యాన్ని కాపాడుకొందాం.నేటి జీవనశైలికి సంబంధించిన పొరపాట్లు థైరాయిడ్ సమస్యలకు దారి తీస్తాయి. మానవ జీవక్రియల నియంత్రణలో కీలక పాత్ర పోషించే ఈ థైరాయిడ్ సమస్య వచ్చిందని ఈ పరీక్షల ద్వారా తెలుసుకొని మందులు వాడడం చాలా మంచిది. అశ్రద్ధ చేస్తే జీవక్రియలన్నీ సక్రమంగా పనిచేయవు. వైద్యుల సలహా మేరకు మందులు వాడటం శ్రేయస్కరం.(ఇది కేవలం అవగాహన కొరకు మాత్రమే ఉద్దేశించబడినది)

నెరుపటి ఆనంద్,

జీవశాస్త్రం  ఉపాధ్యాయులు, ఉన్నత పాఠశాల టేకుర్తి,

 9989048428.

 

thyroid..May 25..harmones
Comments (0)
Add Comment