రాజకీయ పార్టీల్లో సంక్షోభాన్ని లేపిన అయిదు రాష్ట్రాల ఫలితాలు

గెస్ట్ ఎడిట్
మండువ రవీందర్ రావు

తాజాగా వెలువడిన అయిదు రాష్ట్రాల ఫలితాలు ఒక విధంగా రాజకీయపార్టీల్లో సంక్షోభాన్ని కలిగించాయనే చెప్పాలె. ఈ ఫలితాలు వెలువడిన తర్వాత పలు రాజకీయ పార్టీల్లో అంతర్ఘత విబేధాలు బయటపడుతున్నాయి. కొన్ని పార్టీల్లో అభిప్రాయబేధాలు బహిర్ఘతం కాకపోయినా లోలోపల ఏదో జరుగుతున్నదన్న సంకేతాలు వినిపిస్తున్నాయి. దేశ రాజకీయాలను పరిశీలించినప్పుడు జాతీయ స్థాయిలో కనిపించేవి ప్రస్తుతం అధికారంలో ఉన్న బిజెపి, దాని ప్రతిపక్షమైన కాంగ్రెస్‌ ‌పార్టీలు మాత్రమే. కాంగ్రెస్‌ ‌పార్టీ పరిస్థితి గందరగోళంలో పడింది. కేంద్రంలో పదవి కోల్పోయినప్పుటినుండి ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో ఒకటి, రెండు చోట్ల తప్ప ప్రతీ దగ్గర ఓటమిని చవిచూడాల్సి వస్తోంది. దీంతో అది జాతీయ స్థాయినుండి ప్రాంతీయ స్థాయి పార్టీగా మారుతూ వస్తున్నది. దీంతో ఆ పార్టీలోని సీనియర్‌ ‌నాయకులు మొదలు, సామాన్య కార్యకర్తల వరకు నిరాశ, నిస్రృహకు గురి అవుతున్నారు. అందుకు పార్టీకి సరైన దశ, దిశ చూపించే నాయకత్వ లోపమేనన్న విషయాన్ని అందరూ గ్రహించారు.

దేశానికి ఎంతో సేవ చేయడమేకాకుండా, దేశంకోసం తమ ప్రాణాలను కూడా పోగొట్టుకున్న ‘గాంధీ’ కుటుంబమే ఇంతకాలంగా పార్టీకి మార్గదర్శకం చేస్తూ వస్తోంది. కాని నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్‌ ‌గాంధీ ఉన్ననాటి పరిస్థితులు ఇప్పుడు లేవు. దేశంలో ఇప్పుడు అనేక పార్టీలు పుట్టుకొచ్చాయి. ప్రజలంతా అభివృద్ధి వైపు చూస్తున్నారు. ఈ దశలో కాంగ్రెస్‌ ‌పార్టీ పూర్వంలా స్థబ్దంగా ఉండే పరిస్థితులులేవు. దానికి తగినట్లు పార్టీలో అంతర్ఘత విభేదాలు నిత్యకృత్యమైనాయి. ప్రతీ రాష్ట్రంలో ఏదో విధమయిన విభేదాలతో పార్టీ చిన్నాభిన్నమవుతున్నది. కేంద్ర స్థాయిలో గత మూడేళ్ళుగా పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకునే పరిస్థితిలో ఆ పార్టీలేదు. పార్టీ అధ్యక్షుడిగా ఎవరుండాలన్న విషయాన్నే ఆ పార్టీ తేల్చుకోలేకపోతున్నది. గాంధీ కుంటుంబానికి లాయల్టీగా ఉన్నవారు… పార్టీకి నూతన నాయకత్వం అవసరమనేవారుగా ఇప్పుడాపార్టీ రెండు వర్గాలుగా విభజన జరిగిందనే చెప్పాలె. ఇది మరింత ముదురితే పార్టీయే రెండుగా చీలిపోయే ప్రమాదంకూడా లేకపోలేదు. నాయకత్వంపై అసంతృప్తిగా ఉన్న నేతలు ఇప్పటికే రెండు మూడు సార్లు సమావేశాలు జరిపారు. తాము సమావేశమై జరిపిన చర్చల సారాంశాన్ని పార్టీ అధినేత సోనియాగాంధీకి లిఖిత పూర్వకంగా అందజేశారుకూడా. అందులో ప్రధానంగా ఇప్పటివరకు గాంధీ కుటుంబం చేసిన సేవలు చాలని, పార్టీ మరింత దిగజారకముందే సమర్ధుడైన నాయకుడికి పగ్గాలు అప్పగించాలన్నది సారాంశం.

పార్టీలో సీనియర్‌ ‌నాయకులంతా కలిసి ఏర్పడిన జి 23లో ఈ సమావేశాలనాటికి మరికొందరు కూడా కలిసి రావడం చూస్తుంటే వారు చేసిన డిమాండ్ల పట్ల సోనియాగాంధీ అనుకూలంగా నిర్ణయాలు తీసుకోని పక్షంలో గతంలో లాగా కాంగ్రెస్‌ ‌రెండుగా విడిపోయే ప్రమాదమైతే కనిపిస్తున్నది. బిజెపితో భేదాభిప్రాయాలుండి భావసారూప్యత గత పార్టీలతో చర్చించి ఒక కూటమిని ఏర్పాటుచేసుకుంటే తప్ప రానున్న ఎన్నికల్లో బిజేపిని ఎదుర్కోలేమన్న అభిప్రాయాలనుకూడా జి23 సమావేశం సోనియాగాంధీకి సూచించింది. ఇదిలా ఉంటే తెలంగాణలోని అధికార పార్టీలో కూడా అసంతృప్తి పవనాలు వీస్తున్నాయి. ఆ పార్టీలో చాలా సీనియర్‌ ‌నాయకులు తమ పట్ల పార్టీ చూపిస్తున్న ఉదాసీన వైఖరికి వారు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికే చాలా కాలం ఎదురు చూసిన వారు త్వరలో ఏదో ఒక నిర్ణయం తీసుకునే ఉద్దేశ్యంగా ఇటీవల సమావేశాలు జరిపారు.

ఉద్యమకారులను కాదని, ఇతర పార్టీలనుండి నాయకుల వలుసలను పార్టీ అధిష్టానం ప్రోత్సహించింది. దాంతో ఇప్పుడాపార్టీ ఓవర్‌ ‌క్రౌడ్‌గా మారింది. అందరినీ సంతృప్తి పర్చడమన్నది కష్టసాధ్యమైనపని. అలా అని నాయకులనేవారు చేతులు ముడుచుకుని కూర్చోవడం జరుగని పని. ముఖ్యంగా ఒక ప్రాంతానికి ప్రాతినిథ్యం వహిస్తున్న తమను కాదని, మరో పార్టీ నుండి వచ్చిన వ్యక్తులకు అక్కడే ప్రాధాన్యత ఇవ్వడాన్ని వారు తట్టుకోలేకపోతున్నారు. అలాంటి వారిలో మహబూబ్‌నగర్‌ ‌జిల్లాకు చెందిన జూపల్లి కృష్ణారావు, ఖమ్మం జిల్లాకు చెందిన తుమ్మల నాగేశ్వర్‌రావు ఉన్నారు. వీరిద్దరుకూడా తెలంగాణ ప్రభుత్వంలో మంత్రిపదవులు నిర్వహించినవారు కావడం విశేషం. అలాగే ఖమ్మం జిల్లాకే చెందిన మరో నాయకుడు, మాజీ ఎంపి పొంగులేటి శ్రీనివాసరెడ్డికూడా మంతనాలు జరిపినవారిలో ఉన్నట్లు తెలుస్తున్నది. ఇలా ఉంటే అసంతృప్తి సమావేశాలు నిర్వహించకపోయినా కొన్ని జిల్లాల్లో ఒకే నియోజకవర్గానికి చెందిన నాయకులమధ్య ఏర్పడ్డ భేదాభిప్రాయాలు వచ్చే ఎన్నికల నాటికి ముదిరి పాకాన పడేట్టుగానే ఉన్నాయి.

రాష్ట్ర కాంగ్రెస్‌ ‌పార్టీ పరిస్థితికూడా అలాంటిదే. పార్టీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డిని ఎంపిక చేసిననాటినుండి ఇక్కడ విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. కొందరు రాజీనామాలు చేస్తామని బెదిరిస్తుంటే, మరికొందరు పార్టీని వీడిపోయేందుకు సిద్దమవుతున్నారు. తాజగా ఆ పార్టీ ఎంఎల్‌ఏ ‌కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇదే విషయాన్ని బలపరుస్తున్నాయి. రేవంత్‌రెడ్డి నాయకత్వంపై తీవ్ర విమర్శలు చేసిన ఆయన పార్టీ వీడే విషయంలో త్వరలోనే నిర్ణయం తీసుకుంటానని, కార్యకర్తల సమావేశంలో చెప్పడం చూస్తుంటే గతంలో ఆయన అన్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కూడా ఇదే విధమైన అసంతృప్తిని నిత్యం వ్యక్తం చేస్తూ వచ్చారు. ఇప్పుడు ఈ సోదరులిద్దరు ఒకే నిర్ణయం తీసుకుంటే నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్‌కు గడ్డుపరిస్థితే ఏర్పడుతుందనుకుంటున్నారు.

political partiesprajatantra newsprovoked a crisistelangana updatestelugu kavithaluToday Hilightsతెలుగు వార్తలు
Comments (0)
Add Comment