నాటి స్వాతంత్య్ర ఉద్యమాలు దేశభక్తికి గీటురాళ్ళు

ఆంగ్లేయుల అరాచక విభజన వాదం భారతీయులను ఎన్నో విధాలుగా వేధించింది.మన స్వేచ్ఛా స్వాతంత్య్రాలను హరించి,సుదీర్ఘ కాలం వ్యాపారం పేరుతో ఈస్ట్ ఇం‌డియా కంపెనీ కర్కశపాదాల క్రింద నలిగిపోయి, తర్వాత నల్లచట్టాల తెల్లపాలకుల
వలస పాలనతో భారతదేశం అనేక విధాలుగా స్వేచ్ఛ స్వాతంత్య్రాలకు దూరమై,ఆర్ధికంగా,సాంస్కృతిక పరంగా అణగద్రొక్కబడింది. భారతదేశానికి అడుగుపెట్టిన తెల్లదొరలు, భారతీయుల అమాయకత్వాన్ని, అనైక్యతను ఆసరాగా చేసుకొని, ‘‘విభజించి,పాలించు’’ అనే సిద్ధాంతంతో దేశ ప్రజల మధ్య  వర్గవైషమ్యాలను రెచ్చగొట్టి,మతాల మారణహోమాన్ని సృష్టించి దేశాన్ని ఏకచ్ఛత్రాధిపత్యంగా సుధీర్ఘ కాలం పాలించారు. భారతీయ వనరులను కొల్లగొట్టి తమ సంపాదనకు భారతదేశాన్ని పావుగా చేసుకుని  ప్రజల,ధన,మాన,ప్రాణాలతో చెలగాటమాడి, అత్యంత హేయమైన పద్దతిలో దేశాన్ని ఛిన్నాభిన్నం భిన్నం చేసారు.
తుఫాకీ గొట్టాలతో ఆంగ్లేయులు ఒక వైపు,సాంప్రదాయ ఆయుధాలతో భారతీయులు మరో వైపు పోరుబాట సాగించడం జరిగింది.అసమంజసమైన అన్యాయమైన  దమననీతితో  తెల్లదొరలు తమ ఏలుబడిలో కోట్లాది మంది గొంతులను నులిమి, ఎదురుతిరిగిన వారిని నిర్బంధాలకు గురిచేస్తున్న నేపథ్యంలో భారతదేశానికి బ్రిటీషు కబంధ హస్తాలనుండి, విముక్తి కలిగించి స్వేచ్ఛావాయువులందించడానికి అనేక మంది మహనీయులు ముందుకు వచ్చారు. స్వాతంత్య్ర సంగ్రామంలో అలుపెరుగని పోరు సల్ఫి అమరులైనారు. భారత దేశ స్వాతంత్య్రానికి జరిగిన ఉద్యమాలు కోకొల్లలు. వీటిలో క్విట్‌ ఇం‌డియా ఉద్యమం, సహాయ నిరాకరణోద్యమం, ఖిలాపత్‌ ఉద్యమం,ఉప్పు సత్యాగ్రహం, సుభాష్‌ ‌చంద్రబోస్‌ ‌సాయుధపోరాటం, సిపాయిల తిరుగుబాటు మొదలైనవి అత్యంత  ప్రముఖమైనవి. అయితే వీటిలో పలు ఉద్యమాలు వివిధ కారణాల వలన విఫలమైనాయి. అయితే కొన్ని  ఉద్యమాలు విఫలమయినా ఆ ఉద్యమాల స్ఫూర్తి అంతిమంగా  స్వాతంత్య్రానికి  విశేషంగా సహకరించాయని చెప్పడంలో అతిశయోక్తి లేదు. వాటిలో చెప్పుకోదగ్గ ప్రముఖ ఉద్యమం ‘క్విట్‌ ఇం‌డియా’’ ఉద్యమం.
రవి అస్తమించని  బ్రిటీషు సామ్రాజ్యపు   దాస్యశృంఖలాల నుండి  భారతజాతికి విముక్తి కల్పించాలనే ధ్యేయంతో  క్విట్‌ ఇం‌డియా ఉద్యమం మహాత్మాగాంధీ నేతృత్వంలో 1942, ఆగష్టు 8 వ తేదీన బోంబే లో ప్రారంభించబడింది. బ్రిటీష్‌ ‌వారి తుపాకీ గుళ్ళకు బెదరకుండా, వారి గుండెలదిరేలా సాగిన  క్విట్‌ ఇం‌డియా మహోద్యమం  భారత స్వాతంత్య్ర పోరాట చరిత్ర లో  ఒక చెరగని ముద్ర వేసింది. ఎంతో మంది స్వాతంత్య్ర సమరయోధులు,ప్రజలు స్వాతంత్య్ర కాంక్షతో స్వచ్ఛందంగా ఈ ఉద్యమం లో పాల్గొన్నారు.మహాత్మాగాంధీ రూపకల్పన లో సాగిన  క్విట్‌ ఇం‌డియా ఉద్యమం తెల్లదొరల అహాన్ని అణచింది. కీలెరిగి వాత పెట్టమన్న చందంగా  రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో జరిగిన ఈ ఉద్యమం తెల్లదొరలను భయకంపితులను చేసింది.
క్విట్‌ ఇం‌డియా ఉద్యమాన్ని అణచి వేసే క్రమంలో మహాత్మాగాంధీ తో సహా పలువురు ప్రముఖులను, లక్షలాది మంది ప్రజలను ఎలాంటి విచారణ లేకుండా సుధీర్ఘ కాలం నిర్భంధంలో ఉంచారు. స్వాతంత్య్ర సంగ్రామంలో ప్రధాన భూమిక వహిస్తున్న భారత జాతీయ కాంగ్రెస్‌ ‌ను చట్ట విరుద్దమైన సంస్థ గా బ్రిటీషు ప్రభుత్వం ప్రకటించింది. ప్రముఖులందరినీ జైళ్లలో నిర్భంధించినా, కుల,మతాలకతీతంగా ప్రజల్లో ఉవ్వెత్తున ఎగసిన స్వాతంత్య్ర కాంక్ష బ్రిటీషు వారికి ముచ్చెమటలు పట్టించింది.’’డూ ఆర్‌ ‌డై నినాదం’’ విస్తృత ప్రాచుర్యం పొందింది. కొన్ని సంస్థలు,పార్టీలు క్విట్‌ ఇం‌డియా ఉద్యమాన్ని వ్యతిరేకించాయి.జాత్యహంకార దేశాలతో రెండవ ప్రపంచ యుద్ధం లో పోరాడుతున్న బ్రిటీషువారికి ఆ సమయంలో షరతులు విధించి,వారి అసహాయ స్థితినుంచి స్వాతంత్య్రం సంపాదించాలనే దుగ్ధ తమకు లేదని గాంధీ ప్రకటించడంతో  చాలా మంది గాంధీతో విబేధించి,సుభాష్‌ ‌చంద్రబోస్‌’’ అజాద్‌ ‌హింద్‌ ‌ఫౌజ్‌’’  ‌భావజాలం,సాయుధ పోరాటం  పట్ల ఉత్తేజితులైనారు. అనేక కారణాల వల్ల క్విట్‌ ఇం‌డియా ఉద్యమం నీరుగారిపోయింది. బ్రిటీషువారు సామదానదండోపాయాలతో ఉద్యమాన్ని అణచి వేసారు. అయితే’’ ఆజాద్‌ ‌హింద్‌ ‌ఫౌజ్‌’’ ‌ద్వారా సుభాష్‌ ‌చంద్రబోస్‌ ‌తెల్లదొరలపై సమర శంఖం పూరించాడు. ‘‘కంటికి కన్ను- పంటికి పన్ను’’ అనే రీతిలో బ్రిటీషు దొరలకు ముచ్చెమటలు పట్టించాడు.
జర్మనీ,బ్రిటన్‌ ‌ల మధ్య సాగిన యుద్ధం వలన బ్రిటన్‌ ‌కు అనేక చికాకులు తలెత్తాయి. ఆర్ధికంగా దెబ్బతిన్నది. భారత్‌ ‌లో బ్రిటీషు వారి పట్ల పెరుగుతున్న తీవ్రవ్యతిరేకతను అణచి వేయడం సాధ్యం కాదని, ఇక ఎంతో కాలం భారత దేశాన్ని తమ గుప్పిట్లో పెట్టుకోలేమనే స్ఫృహ కలగడంతో క్రిప్స్ ‌రాయబారంతో భారతీయులకు స్వాంతన చేకూర్చాలనే ప్రయత్నం కూడా విఫలమైనది.సర్‌ ‌స్టాఫోర్డ్  ‌క్రిప్స్  ‌బ్రిటన్‌ ‌ప్రధాని వినిస్టన్‌ ‌చర్చిల్‌ ‌మంత్రి వర్గంలో  లేబర్‌ ‌పార్టీ కి చెందిన వ్యక్తి. అతను భారత స్వాతంత్య్రానికి మద్దతుదారుడైనప్పట్టికీ ‘‘క్రిప్స్ ‌మిషన్‌’’ ‌లో ఒక సభ్యుడుగా, చర్చిల్‌ ‌కాబినెట్లో మంత్రిగా ఉండడం వలన  భారతదేశానికి పూర్తిగా అనుకూలించలేకపోవడంతో’’ క్రిప్స్ ‌రాయబారం’’ విఫలమయింది.క్రిప్స్ ‌రాయబారం విఫలమైనా, బ్రిటీషు వారి ద్వంద్వనీతి అవగతమైనా మనలోని అనైక్యత ఈ  సదవకాశాన్ని నీరుగార్చింది. భారత స్వాతంత్య్ర కోసం సాగిన క్విట్‌ ఇం‌డియా ఉద్యమం సజావుగా సాగలేదు.
సైద్ధాంతిక వైరుధ్యాల నడుమ  గాంధీ చేపట్టిన క్విట్‌ ఇం‌డియా ఉద్యమం కూడా  సరైన మద్దతు లేక విఫలమైనది. అయితే బ్రిటీషు వారి పాలనలో శాశ్వత బానిసత్వం అనుభవించడం కంటే పోరాడి చావడమే మేలనే ‘‘డూ ఆర్‌ ‌డై’’ నినాదం ప్రజల మస్తిష్కాలకు  చేరింది. క్విట్‌ ఇం‌డియా ఉద్యమం వైఫల్యం చెందినప్పటికీ ఆ ఉద్యమ స్ఫూర్తి తో అనేక ఉద్యమాలు బయలు దేరి, అంతిమంగా భారత స్వాతంత్య్రానికి బాటలు వేసింది. అందుకే క్విట్‌ ఇం‌డియా ఉద్యమానికి చరిత్రలో ఒక ప్రముఖ స్థానం ఏర్పడింది. లక్ష్యసాధనలో  మన ప్రయత్నాలు ఒక్కోసారి విఫలమైనా, పరాజయం నుండే విజయాలు ప్రాప్తిస్తాయన్న సందేశం క్విట్‌ ఇం‌డియా ఉద్యమం మనకందించింది.  క్విట్‌ ఇం‌డియా ఉద్యమం గురించి నేటి విద్యార్థులకు,యువతకు అవగాహన కలిగించాలి. చరిత్రాత్మక క్విట్‌ ఇం‌డియా  ఉద్యమ స్ఫూర్తిని స్ఫురణకు తెచ్చేవిధంగా చరిత్రపుస్తకాల్లో ప్రాచుర్యం కల్పించాలి.
పునాదులు లేని భవనాలు నిలబడలేవు. చైతన్యం లేని సమాజం వలన ఒరిగేది శూన్యం. హృదయంలో లేని   దేశభక్తి అర్దరహితమైనది. యువతలో దేశభక్తి వెల్లి విరియాలి. దేశభక్తి లోపించిన యువత భవితను నిర్మించలేదు. రేపటి కోసం శ్రమించని యువతరం, స్వార్ధం తో నిండిన వ్యవస్థలు వర్తమానంలోనే జీవిస్తాయి గాని గతం నుండి స్పూర్తిని పొందలేవు, భవిష్యత్తుకు బాటలు వేయలేవు. ‘కలసి ఉంటే కలదు సుఖం’ అనే ఆర్యోక్తి ని పెడచెవిన పెట్టి,తాత్కాలిక ప్రయోజనాలకోసం జీవించే జనాలున్నంత కాలం ఏ దేశమైనా పురోగతి సాధించలేదు. స్వార్ధమే పరమార్ధం గా భావించి, బ్రిటిషు వారి చెంత దాష్ఠీకం చేస్తూ, మన వారే మనకు వెన్నుపోటు పొడిచిన ఫలితంగానే భారతదేశానికి స్వాతంత్య్రం సిద్ధించడంలో జరిగిన ఆలస్యానికి మూలకారణం.సుదీర్ఘ నిరీక్షణానంతరం భారతదేశానికి స్వాతంత్య్రం లభించినా,అందుకోసం నాటి మన నాయకులు పడిన తపన, శ్రమ చరిత్ర పుటల్లోకి జారిపోయింది.
నాటి స్వాతంత్య్ర సంగ్రామం అందించిన ప్రేరణ నేటి తరానికి కొరగాకుండా పోయి, నిస్తేజంగా,నిర్వీర్యంగా మారిపోయింది. నాటితరం నాయకుల త్యాగాలను గుర్తించలేని జనం ఇంకా కులాల కుమ్ములాటలతో,మతాల మధ్య వైషమ్యాలతో అనైక్యతను ప్రదర్శిస్తూ,తెల్లదొరలు దేశంలో వదలి పెట్టిన అవశేష జాఢ్యాలతో సమైక్యతకు తూట్లు పొడుస్తున్నారు. ఇకనైనా మేల్కొనాలి. నాటి మన వీరుల నిస్వార్థ త్యాగాలను అవగతం చేసుకోవాలి. దేశభక్తిని నరనరాన నింపుకోవాలి. అవినీతికి తావులేని,ఆర్ధిక అంతరాలు లేని భారత దేశాన్ని నిర్మించుకోవాలి. క్విట్‌ ఇం‌డియా ఉద్యమ సందేశాన్ని పునరావలోకనం చేసుకుని, సమైక్య భారతం కోసం పాటు బడాలి. బలమైన ఆర్ధిక వ్యవస్థను నిర్మించుకుని అందరికీ అవకాశాలను కల్పించి, ఆర్ధిక వ్యత్యాసాలు లేని  భారత జాతి నిర్మాణానికి కృషిచేయాలి.

సుంకవల్లి సత్తిరాజు.
           9704903463.
Comments (0)
Add Comment