చుండూరు మారణకాండ

“నిజానికి చుండూరు మారణకాండ చాలా దుర్మార్గమైన, అమానుషమైన హత్యాకాండ, హిందు సమాజం, ముఖ్యంగా రెడ్డి కులస్తులు, ఇంత క్రూరంగా ప్రవర్తిస్తారా అని ఊహించడానికి కూడా వీలుగానంత ఘోరంగా సంఘటన అది. అక్కడ దళితులను చంపడం మాత్రమే కాదు. ము­క్కలు ము­క్కలుగా నరికారు. గోనె సంచుల్లో నింపారు. కాలువలో విసిరేశారు. సమీపంలోని గుంటూరులో కలెక్టర్‌ కార్యాలయం ఉంది. పోలీసు సూపరింటెండెంట్‌ కార్యాలయం ఉంది. ఎవరూ ఏ పనీ చేయలేదు. అక్కడ ఏమి జరుగుతున్నదో కనుక్కోవడానికి కూడా జిల్లా యంత్రాంగం, గూఢచార యంత్రాంగం ఏమీ పని చేయలేదు.”

ఒకసారి కొత్త దాసు ఆబిడ్స్‌లో  కొన్ని దుకాణాల మీద దాడి చేసి అద్దాలు పగలగొట్టాడు. పోలీసులు ఆ విధ్వంసకాండ అయిపోయేదాకా అక్కడికి రానేలేదు. అక్కడికి రాబోయిన  పోలీసు వ్యాను టైరు పంక్చర్‌ అయింది . ఆ సంఘటన తర్వాత గజ్జెల మల్లారెడ్డి ‘‘దొంగలు పడ్డ ఆరు నెల్లకు కుక్క వె­రిగినట్టు కాదు, దొంగలు పడ్డ సమయానికి కుక్కకు దొడ్డికి వచ్చినట్టు’’ అని రాశాడు. ఆ మాదిరిగా, చుండూరు మారణకాండ జరుగుతుంటే పోలీసులు అటువైపు వెళ్లడానికి ఏ ప్రయత్నమూ  చేయలేదు.

నా సొంత అనుభవం నుంచి మరొక ఘటన చెబుతాను. పోలీసులు నేరాలు జరిగే విషయం తెలిసినప్పుడు కూడా ఎత నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తారో, ఎట్లా ఆలస్యం చేస్తారో నేను ప్రత్యక్షంగా చూసిన ఘటన అది. ఇక్కడ మా ఇంటి ముందు  ఒక ఇల్లు ఉంది. అది ఒక కోర్టు అమీను ఇల్లు. ఆయన చనిపోయినాడు. ఆయన కొడుకు ఆ ఇంటిని కొట్లుగా మార్చి కిరాయికి ఇచ్చి బతుకుతున్నాడు. కిరాయికి ఉన్న వాళ్లు ఖాళీ చేయమని అనడంతో సమస్య వచ్చింది. ఇంటి యజమాని డేవిడ్‌ రాజ్‌ అని సికింద్రాబాద్‌లో పేరు మోసిన రౌడీకి ఆ కిరాయిదారులను ఖాళీ చేయించే పని అప్పజెప్పాడు. పవర్‌ ఆఫ్‌ అటార్నీ రాసి ఇచ్చాడు. ఆ డేవిడ్‌రాజ్‌ వచ్చి ఆ కిరాయి ­కు ఉన్న వాళ్లను బెదిరించడం మొదలుపెట్టాడు. గ్యాంగుతో కలిసి వచ్చి వీళ్ల మీద దౌర్జన్యం మొ­దలుపెట్టాడు. కొంత భయానక వాతావరణం తయారు చేసి పెట్టాడు. కిరాయిదార్లందరూ వణికిపోతున్నారు. ఎందుకంటే ఈ డేవిడ్‌ రాజ్‌ ఒక్కటేసారి ఏడుగురిని చంపేశాడు. నా మిత్రుడు, న్యాయవాది చల్లా రామకృష్ణారెడ్డి వల్ల కోర్టులో కేసు కొట్టుడుబొయిందనుకోండి.

నేనతణ్ని పిలిచి ‘‘ఇదంతా కుటుంబాలు ఉండే ప్రాంతం, నువ్విక్కడ ఇట్లా అల్లరి చేయడం బాగుండదు’’ అని చెప్పాను. డీజీపీకీ ఫోన్‌ చేసి చెప్పాను. అది పై నుంచి ఈ ప్రాంతం సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ దాకా వచ్చింది. ఆ సీఐ అంటాడుగదా, ‘‘ఆ ప్రాంతానికి పోవలసినంతగా లా అండ్‌ ఆర్డర్‌ సిచ్చువేషన్‌ రైపెన్‌ కాలేదు సార్‌’’ అని. రైపెన్‌ కావడం అంటే ఏమిటి? తలకాయలు పగలడమా? పగిలిన తర్వాత పోలీసులు వచ్చి చేసేదేముంది?
అదీ పోలీసుల వైఖరి. లా అండ్‌ ఆర్డర్‌ సిచ్చువేషన్‌ రైపెన్‌ అయి ­, హత్యలు దౌర్జన్యాలు అన్నీ అయి­పోయి­నాకనే వస్తారు.

అట్లా చుండూరులో కూడా దళితులను చంపి, ము­క్కలుగా నరికి, గోనె బస్తాల్లో కూరి, కాలువలో పడేసినాక పోలీసులు అక్కడికి వచ్చారు. ఇప్పుడు విచారణ మొదలైంది. యాభై మందినో అరవై మందినో సాక్షులను విచారించడం ఇటీవలే అయిపోయింది . ఆ కేసులో ఎన్ని మెలికలు వేస్తున్నారంటే ఆ వాదనలన్నీ సిగ్గులేని వాదనలు. ‘‘చుండూరు బాధితులు క్రైస్తవులు గనుక వాళ్లను షెడ్యూల్డ్‌ కాస్ట్‌ అని గుర్తించడానికి వీల్లేదు. అందువల్ల ఎస్‌.సి. ఎస్‌టి అట్రాసిటీస్‌ చట్టం వర్తించదు’’ అని ఒక వాదన. కోర్టులలో మా వకీళ్లం సిగ్గులేకుండా వాదనలు పెడతాం. జడ్జీలు కూడా చానా ఓపిగ్గా వింటారు. దళితుడు క్రిస్టియానిటీ లోకో, బుద్దిజం లోకో మారితే దళితుడు కాకుండా పోతాడు. వెంటనే ఫార్వర్డ్‌ కాస్ట్‌ అయి­పోతాడు అని ఒక తర్కం. ఇంతగా అంతరాలను పెంచిపోషించే వ్యవస్థ ఎప్పటికైనా ఎట్లా ప్రజాస్వామికం అవుతుంది. ఎప్పటికైనా ఎట్లా న్యాయబద్ధం అవుతుంది. అనే ప్రశ్నలు వస్తాయి.

ఒక సారేమో క్రిస్టియన్లు కాబట్టి ఆ చట్టం వర్తించదు అని వాదన పెట్టారు. అది ఒక ఆరు నెలలు సాగదీయడానికి పనికి వచ్చింది. అది అయిపోయిన తర్వాత, విచారణ చుండూరులోనే జరగాలి అని ఒక దరఖాస్తు వస్తే జిల్లా జడ్జి సరే అని ఉత్తర్వులిచ్చాడు. ఇక జిల్లా జడ్జికి మమ్మల్ని వినకుండా, ఇటువంటి ఉత్తర్వులిచ్చే అధికారంలేదు అని మరొక వివాదం లేవదీసినారు. ఆ వాదన వచ్చినప్పుడు నేను ఆ కోర్టులోనే ఉన్నాను. వాదనలకు వచ్చినప్పుడు నేనే వాదించాను. రెడ్డప్ప రెడ్డి ఉన్నాడు. అది ఒక అధికారిక ఉత్తర్వు గనుక మీరు ఒప్పుకోవలసిందేనండీ అన్నాను. కానీ ఆయన నాకు వ్యతిరేకంగా తీర్పిచ్చినాడు. మళ్లీ హైకోర్టు చుండూరులోనే విచారణ జరగాలని రెండోసారి తీర్పు ఇచ్చింది. అప్పుడు కూడా మళ్లీ దాన్ని మార్చమని కోరితే, అప్పుడు కూడా నేను వాదించి ఆ పిటిషన్‌ను కొట్టేయించాను. మొ­త్తానికి చెప్పవచ్చిందేమంటే, ఒక దళిత వర్గం మీద, ఒక వెనుకబడిన వర్గం మీద, ఒక మైనారిటీ సమూహం మీద ఒక కేసు వస్తే, దాని న్యాయపరమైన వివాదపు స్వభావమే పూర్తి భిన్నంగా ఉంటుంది. అది ఒక అడుగు ముందుకుపోదు. దాన్ని పోనివ్వరు.

చట్ట విశ్లేషణ
కారంచేడు తర్వాతనే, ఇటువంటి అత్యాచారాలు జరుగుతున్నాయి. వీటిని అరికట్టాలి అని ఒక చట్టం ప్రవేశపెట్టినారు. కాని దాన్ని విశ్లేషించేవాడు. వ్యాఖ్యానించేవాడు. అమలు చేయవలసిన వాడు పెద్ద కులాలకు చెందిన వాడు. ఇక కుల తారతమ్యాల మీద ఆధారపడి విశ్లేషణే జరుగుతుంది. అసలు విశ్లేషణ అట్లా ఉండకూడదు. గతంలో అట్లా ఉండేది కాదు. ఇప్పుడట్లా ఉంటోంది. ఒక సమస్యను కనిపెడతాం. దీన్ని పరిష్కరించడానికి, అరికట్టడానికి ఒక చట్టం చేస్తాం. మరి ఆ చట్టం విశ్లేషించేటప్పుడు, ఆ సమస్యను, ఆ మూల కారణాన్ని దృష్టిలో ఉంచుకోని విశ్లేషణ చేయాలా, అసలు ఆ సమస్యను పక్కన పెట్టి చట్టాన్ని మన ఇష్టం వచ్చినట్టు విశ్లేషణ చేయాలా? సమస్యను పక్కనపెట్టి ఆ చట్టాన్ని భాషాపరంగా, వ్యాకరణపరంగా అర్థం చేసుకోవడం మొ­దలుపెట్టినామంటే, ఆ చట్టం ముందుకు పోనే పోదు.

-కె.జి. కన్నబిరాన్‌
ఆత్మకథాత్మక సామాజిక చిత్రం
అక్షరీకరణ :ఎన్ .వేణుగోపాల్
prajatantra newstelangana updatesThe Chunduru massacreToday Hilightsతెలుగు వార్తలు
Comments (0)
Add Comment