- జయంతి వేడుకల్లో జడ్పి ఛైర్పర్సన్ రోజాశర్మ
సిద్ధిపేట : ఇతర భాషలపై మోజుతో మాతృభాషను విస్మరించేవారిని కాళోజీ కంటే గొప్పగా ఎవరు హెచ్చరిస్తారు. జనం భాషకు కాళోజీ కలం జై కొట్టిందనీ.. అందుకే ఆయన జయంతి ‘తెలంగాణ భాషాదినోత్సవం’ అయిందనీ సిద్ధిపేట జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ వేలేటి రోజా రాధాకృష్ణశర్మ అన్నారు. గురువారం ప్రజాకవి కాళోజీ జయంతిని పురస్కరించుకుని సిద్ధిపేట జిల్లా పరిషత్ కార్యాలయంలో జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ రోజాశర్మ, సిఈవో, టిఆర్ఎస్ పార్టీ నాయకుడు వేలేటి రాధాకృష్ణశర్మ తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రోజాశర్మ మాట్లాడుతూ…తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి దాత. నిజాం అరాచక పాలనకు వ్యతిరేకంగా పోరాడిన సమరయోధుడు. కాళోజీ సంస్మరణార్థం తెలంగాణ ప్రభుత్వం ఆయన జన్మదినమైన సెప్టెంబర్-9ని ‘ తెలంగాణ భాషాదినోత్సవం’ గా ప్రకటించింది.‘ఎవని భాషను వాడు రాయాలె, మాట్లాడాలి’ అన్న కాళోజీ మాతృభాష స్ఫూర్తి తెలంగాణ సాంస్కృతిక ఉద్యమానికి దిక్సూచిగా నిలిచిందన్నారు.
‘పుట్టుకు నీది చావు నీది..బతుకంతా దేశానికి’ అని నినదించిన కాళోజీ జీవితం తెలంగాణ భాషా సాహితీ సేవ దిశగా సాగిందన్నారు. ‘ప్రజాకవి’ అన్నది కాళోజీ రచనల విశిష్టతను, ఔన్నత్యాన్ని చాటుతుందనీ, ప్రజా సమస్యల పట్ల సమగ్ర దృష్టి.. న్యాయం, సత్యం కోసం నిరంతర పోరాటం వల్ల ఆయన జీవితంలోని ప్రతి దశలో ప్రజాదరణ పొందారనీ కొనియాడారు. తెలంగాణ మాండలికంలోని మాధుర్యాన్ని ప్రపంచానికి తెలియచెప్పిన భాషాకోవిదుడు కాళోజీ…తన కవిత్వంలో స్వరాష్ట్ర ఆకాంక్షను తెలంగాణ ప్రజల్లో రగిలించిన ప్రజాకవి జన్మదినోత్సవాన్ని తెలంగాణ భాషాదినోత్సవంగా జరుపుకోవడం గర్వకారణమనీ జడ్పి ఛైర్పర్సన్ రోజాశర్మ అన్నారు. ఈ కార్యక్రమంలో రైతుబంధు సభ్యుడు మేడికాయల వెంకటేశం, జడ్పి డిప్యూటి సిఈవో, జడ్పి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.