సంతాపం తెలిపిన సిఎం కెసిఆర్, మంత్రులు
తెలంగాణ ఉద్యమకారుడు డాక్టర్ కొల్లూరి చిరంజీవి (74) సోమవారం తెల్లవారుజామున కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న చిరంజీవి గచ్చిబౌలిలోని ఎఐజి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో పరిస్థితి విషమించి సోమవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. తెలంగాణ తొలి, మలి ఉద్యమాల్లో చిరంజీవి చురుకుగా పాల్గొన్నారు. చిరంజీవి మృతిపై సిఎం కెసిఆర్, మంత్రులు కెటిఆర్, హరీశ్ రావు, ఈటల, ఎంఎల్ సి కల్వకుంట్ల కవితతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు సంతాపం తెలిపారు. ఆయన కుటుంబానికి సానుభూతి ప్రకటించారు.
చిరంజీవి వైద్యానికి అయ్యే ఖర్చును ఆయన కుటుంబం భరించలేని పరిస్థితుల్లో ఉందని తెలుసుకున్న మంత్రి కెటిఆర్ సిఎం సహాయ నిధి నుంచి రూ.10 లక్షల రూపాయలను మంజూరు చేయించారు. ఈ మొత్తాన్ని మంత్రి ఈటల రాజేందర్ ఆసుపత్రికి వెళ్లి ఆయన కుటుంబానికి అందించారు. తెలంగాణ తొలి తరం ఉద్యమకారుడు డాక్టర్ కొల్లూరి చిరంజీవి మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. డాక్టర్‌గా ఉన్నత చదువులు చదివి సమాజం కోసం బతికిన చిరంజీవి జీవితం ఆదర్శనీ యమన్నారు.
ఆయన కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. డాక్టర్ కొల్లూరి చిరంజీవి మృతి తెలంగాణకు తీరని లోటు అని ఆర్థిక మంత్రి హరీష్ రావు అన్నారు. కాకతీయ మెడికల్ కాలేజీ విద్యార్థిగా ఉన్న సమయంలో, విద్యార్థులందరినీ కూడగట్టి 1969 ఉద్యమంలో చిరంజీవి కీలకపాత్ర పోషించారని మంత్రి పేర్కొన్నారు.