టార్గెట్‌ ‌కాంగ్రెస్‌..!

“‌భూ సంస్కరణలకు ఆద్యునిగా దేశ చరిత్రలో పీవీ పేరు చిరస్థాయిగా నిలచిపోతే, సీఎం కేసీఆర్‌ ‌మాత్రం అందుకు పూర్తి భిన్నంగా రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన, రైతు బంధు పేరుతో కొందరు బడా భూస్వాములకు మాత్రమే ఆర్థికంగా లబ్ది చేకూర్చే కార్యక్రమాలను అమలు చేస్తుండటం గమనార్హం. అలాగే, మరోవైపు, పార్టీ పరంగా చూసినా పీవీ నిఖార్సైన సమైక్యతావాది కాగా, కేసీఆర్‌ ‌పచ్చి తెలంగాణా వాది. అసలు కేసీఆర్‌ ‌స్థాపించిన టీఆర్‌ఎస్‌ ‌పార్టీ పుట్టిందే ప్రత్యేక వాదం పైన. అలాంటిది  సీఎం కేసీఆర్‌ ‌పీవీ శత జయంతి ఉత్సవాలను ఆర్భాటంగా ఎందుకు నిర్వహిస్తున్నారనేది ఇప్పుడు అందరి మెదళ్లను తొలుస్తున్న ప్రశ్న.”

ఆ ‌పార్టీని ఇరుకున పెట్టేడమే కేసీఆర్‌ ‌లక్ష్యం
పీవీ శత జయంతి ఉత్సవాల నిర్వహణ వెనక వ్యూహమిదే
దేశానికి ఆర్థిక సంస్కరణల బాట చూపిన అపర మేధావి పీవీ
అయినా…పీవీని అవమానించిన కాంగ్రెస్‌ అధినాయకత్వం

తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఏ ‌నిర్ణయం తీసుకున్నా సంచలనమే. ఆయన తీసుకునే నిర్ణయాలు ఎప్పుడు ఎవరిని రాజకీయంగా దెబ్బ తీస్తాయో ఆయనకు ఏ విధంగా పొలిటికల్‌ ‌మైలేజీని పెంచుతాయో ఎవరికీ అంతుపట్టదు. పరిపాలనా పరంగా ఎలాంటి కార్యక్రమాలకు రూపకల్పన చేస్తారో రాజకీయంగానూ ఎవరూ ఊహించని విధంగా అడుగులు వేస్తారు. తాజాగా, బహుముఖ ప్రజ్ఞాశాలి, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని ఆయన తీసుకున్న నిర్ణయం రాజకీయంగా పెను సంచలనానికి దారితీసింది. ఈనెల 28 నుంచి ఏడాది పాటు పీవీ శత జయంతి ఉత్సవాలను కనీవినీ ఎరుగని రీతిలో నిర్వహించనున్నట్లు ప్రకటించి తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా జాతీయ స్థాయిలో చర్చకు తెరలేపారు. తెలుగు వాడిగా, దేశంలో ఆర్థిక సంస్కరణకు శ్రీకారం చుట్టిన పరిపాలనా దక్షునిగా, బహుబాషా కోవిదునిగా తెలుగు జాతి ఖ్యాతిని విశ్వమంతా వ్యాపింపజేసిన మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాలను నిర్వహించడం ఇక్కడ పెద్ద విషయమేమీ కానప్పటికీ రాజకీయంగానూ, సైద్ధాంతికంగానూ కేసీఆర్‌కు పీవీతో ఏ విధంగానూ భావ సారూప్యత లేకపోవడం విశేషం. భూ సంస్కరణలకు ఆద్యునిగా దేశ చరిత్రలో పీవీ పేరు చిరస్థాయిగా నిలచిపోతే, సీఎం కేసీఆర్‌ ‌మాత్రం అందుకు పూర్తి భిన్నంగా రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన, రైతు బంధు పేరుతో కొందరు బడా భూస్వాములకు మాత్రమే ఆర్థికంగా బ్ది చేకూర్చే కార్యక్రమాలను అమలు చేస్తుండటం గమనార్హం. అలాగే, మరోవైపు, పార్టీ పరంగా చూసినా పీవీ నిఖార్సైన సమైక్యతావాది కాగా, కేసీఆర్‌ ‌పచ్చి తెలంగాణ వాది.

అసలు కేసీఆర్‌ ‌స్థాపించిన టీఆర్‌ఎస్‌ ‌పార్టీ పుట్టిందే ప్రత్యేక వాదం పైన. అలాంటిది తెలంగాణ సీఎం కేసీఆర్‌ ‌పీవీ శత జయంతి ఉత్సవాలను ఆర్భాటంగా ఎందుకు నిర్వహిస్తున్నారనేది ఇప్పుడు అందరి మెదళ్లను తొలుస్తున్న ప్రశ్న. శత జయంతి ఉత్సవాలలో భాగంగా రామేశ్వరంలోని మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ ‌కలాం మొమోరియల్‌ ‌తరహాలో పీవీ సృతి చిహ్మాన్ని ఏర్పాటు చేయాలనీ, ఆయన గురించిన ప్రతీ విషయం ప్రజలకు తెలిసేలా కార్యక్రమాలు కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు సీఎం కేసీఆర్‌ ‌స్వయంగా ప్రకటించారు. అంతేకాకుండా పీవీకి దేశ అత్యున్నత పురస్కారమైన భారత రత్న బిరుదును ప్రదానం చేయాలని తానే స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీని కలసి విజ్ఞప్తి చేయనున్నట్లు సైతం ప్రకటించారు. అయితే, కాంగ్రెస్‌ ‌పార్టీలో గ్రామీణ స్థాయి నుంచి ఏకంగా దేశ ప్రధాని పీఠం అధిరోహించే వరకు ఎదిగిన పీవీకి సీఎం కేసీఆర్‌ అం‌దలం ఎక్కించడం వెనక కాంగ్రెస్‌ ‌పార్టీని ఇరుకున పెట్టే వ్యూహం స్పష్టంగా కనిపిస్తున్నదని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. పీవీని దేశ ప్రధానిని చేసింది కాంగ్రెస్‌ ‌పార్టీ అయినప్పటికీ అప్పటి ఆ పార్టీ అధి నాయకత్వం అయిష్టంగానే ఆయనను ప్రధాని పదవికి ఎంపిక చేశారని అప్పట్లో దేశవ్యాప్తంగా ప్రచారం జరిగింది. పార్లమెంటులో కాంగ్రెస్‌ ‌పార్టీకి సరైన బలం లేకుండానే ప్రధాని పదవిని స్వీకరించిన పీవీ తన రాజనీతిజ్ఞతతో మైనార్టీలో ఉన్న ప్రభుత్వాన్ని మెజార్టీ దిశగా నడిపించారు. అంతేకాకుండా అప్పటి వరకూ ఆర్థిక సంస్కరణల మాటే ఎరుగని దేశ ఆర్థిక రంగాన్ని తనదైన ప్రతిభతో ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టి దేశ గతిని ఒక్కసారిగా మార్చివేశారు. ఆర్థిక సంస్కర్తగా, భూ సంస్కరణల ఆద్యునిగా, విద్యా సంస్కర్తగా తన రాజనీతిని చాటుకున్నారు. అయితే, పీవీ తన ప్రతిభతో దేశమంతా పొగిడే స్థాయికి చేరుకోవడం ఆ పార్టీలోని పెద్దలకు ఏమాత్రం ఇష్టం లేదన్నది బహిరంగ రహస్యమే. ముఖ్యంగా దేశ చరిత్రలో ఐదేళ్లు ప్రధానిగా ఉండి సరైన గౌరవం దక్కని ఏకైక వ్యక్తి కూడా పీవీనే అని చెప్పొచ్చు.

ప్రధానిగా పీవీ సాధించిన విజయాలకు ఆయనకు కీర్తి ప్రతిష్టలు దక్కకుండా అడ్డుకున్నదనే అపప్రథను సైతం కాంగ్రెస్‌ ‌పార్టీ మూటగట్టుకున్నది. అన్నింటికంటే ముఖ్యంగా భారత దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్‌ ‌నెహ్రూ పూర్తిగా వ్యతిరేకించే ఆర్థిక సంస్కరణలను దేశంలో ప్రవేశపెట్టడమే కాకుండా వాటిని విజయవంతంగా అమలు చేయడం కూడా కాంగ్రెస్‌ అధినాయకత్వానికి నచ్చలేదని చెబుతారు. దీంతో పాటు పీవీ ప్రధానిగా ఉన్న సమయంలోనే బాబ్రీ మసీదు కూల్చివేత ఘటన జరిగింది. ఇందుకు పీవీ బీజేపీ హిందుత్వ వాది అనీ, బీజేపీకి అనుకూలంగా వ్యవహరించడం వల్లనే ఈ ఘటన చేసుకుందని ఇప్పటికీ కాంగ్రెస్‌ ‌నేతలు చెప్పుకుంటుంటారు. ఈ విషయాలన్నింటినీ దృష్టిలో ఉంచుకునే సీఎం కేసీఆర్‌ ‌పీవీకి శత జయంతి ఉత్సవాల పేరుతో అరుదైన గౌరవం ఇవ్వాలని నిర్ణయించి ఉంటారని పరిశీలకులు భావిస్తున్నారు. పీవీకి ఈ విధమైన గౌరవాన్ని ఆపాదించడం ద్వారా సొంత పార్టీ వ్యక్తిని కాంగ్రెస్‌ ‌పార్టీ అవమానపరిస్తే తామ ఆయనకు సముచిత గౌరవం కల్పించామని ప్రపంచానికి చాటిచెప్పడం కూడా కేసీఆర్‌ ‌తీసుకున్న నిర్ణయంలో ఓ భాగమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాకుండా, పీవీ మరణించిన రోజున ఆయన పార్థివ దేహాన్ని ఆగమేఘాల మీద హైదరాబాద్‌కు పంపి కాంగ్రెస్‌ ‌పార్టీ ఆయనను అవమానించిందని గతంలోనూ కేసీఆర్‌ ‌పలుమార్లు కాంగ్రెస్‌ ‌పార్టీపై విమర్శనాస్త్రాలు సంధించారు. ఇక తెలంగాణ అసెంబ్లీలో, మంత్రిమండలిలో పీవీకి భారతరత్న బిరుదు ప్రదానం చేయాలని ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదింపజేయడంతో పాటు తానే స్వయంగా ఆ తీర్మానాలను ప్రధాని నరేంద్ర మోదీకి అందిస్తానని చెప్పడం వెనక ఏడాది పాటు కాంగ్రెస్‌ ‌పార్టీ అసలు పీవీ పేరును ఎత్తే విధంగా చేయరాదన్నది పీవీ మన ఠీవీ పేరుతో సీఎం కేసీఆర్‌ ఏడాది పాటు పీవీ శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం అసలు రహాస్యమని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. పీవీ శత జయంతి ఉత్సవాల పేరిట సీఎం కేసీఆర్‌ ‌నిర్వహిస్తున్న కార్యక్రమాలతో ఆయన ఆత్మకు ఏ విధంగా శాంతి కలుగుతుందన్నది విశ్లేషకులు ప్రస్తుతం సంధిస్తున్న ప్రశ్న.

Comments (0)
Add Comment