‌సంఘర్షణ ఫలమే సాఫల్యం

నా సాఫల్యం మాత్రమే..
స్పష్టంగా కనిపించు సమాజానికి..
దాని తెర వెనుక జగన్నాటక..
సంఘర్షణ మాత్రం తెలియదు కదా !

సదా సంఘర్షనతో సంసారమే..
జీవన సాఫల్య సంతోష ఫలం
ఎదురీదుతున్న చేప పిల్లలే..
బోధిస్తాయి బోలెడు జీవిత పాఠాలు !

ఏకాగ్రత కొరవడిన పని..
శ్వేదం చిందించని శ్రమ..
లక్ష్యం ఎరుగని పయనం..
ఓటమిని ఖాయం చేస్తాయి సుమా !

తెగిన పాదరక్ష గుండెలో..
మోల దిగితేనే దక్కును మర్యాద
నొప్పిని సహించని చెప్పు..
చిరునామా చెత్త కుప్పే అవును కదా !

చాక్‌మార్‌తో చెక్కిన పెన్సిల్‌ ‌ముళ్ళే..
చకచక రాస్తుంది తలరాతల్ని..
కదలని పంఖా, గోడ గడియారాలు..
స్క్రాప్‌తో చేయాల్సిందే అయిష్ట దోస్తీ !

నీటిలో మునిగితేనే కదా..
శ్వాస విలువ అనుభవమయ్యేది
సమస్యల్లో తడి ముద్దైన తనువే..
వ్యక్తిత్వ మెరుపులతో  మెరిసేది !

రాస్తే కలం సిరా అయిపోద్దేమో..
అక్షరాలయితే నిలుచు కలకాలం
వయసు ముదిరితే జీవితం కరుగుద్ది..
గత ఘనతలయితే నిలబడు సర్వదా !

మానవ విలువలు పలుచనైతే..
రాక్షసత్వం రాజ్యమేలుతుంది
నిర్లక్ష్య దెయ్యం జీవన సాఫల్యతను..
మింగేసి అంనంత దూరం చేస్తుంది !

కుండీలో బంధించిన మ్నెక్క..
బోన్సాయి చెట్టు కాగలదేమో కాని..
నీడనిచ్చే మహావృక్షం కాలేదెప్పుడు..
కంచెలోని బతుకు బోన్సాయి చెట్టే కదా !

చీకటి ఆవలి తీరాన వెలుగులు
రాత్రి వెంటే ఉషోదయ పరుగులు
ప్రయత్నంతోనే ప్రగతి రథ పయనాలు
సంఘర్షణ ఆవల తథ్యం సాఫల్యాలు !

– మధుపాళీ, కరీంనగర్‌ – 9949700037

Comments (0)
Add Comment