సమస్యల వలయంలో బిఆర్‌ఎస్‌

ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది అధికార భారత రాష్ట్ర సమితి (బిఆర్‌ఎస్‌)‌ని సమస్యలు చుట్టుముడుతున్నాయి. ఒక పక్క సొంత పార్టీలో నాయకుల మధ్య విభేదాలు, విపక్షాల దాడులతో ఆ పార్టీ ఉక్కిరిబిక్కిరవు తున్నది. మరో పక్క ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వాని కి అపకీర్తిని తెచ్చేవిధంగా వెలుగుచూస్తున్న లీకేజీలు, స్కామ్‌ ‌లతో బిఆర్‌ఎస్‌ ‌దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని, అధికార పార్టీని లిక్కర్‌ ‌స్కామ్‌ ‌గుక్కతిప్పుకోకుండా చేస్తోంది. లిక్కర్‌ ‌స్కామ్‌ ‌వెలుగుచూసినప్పుడు ఆ పార్టీ అధినాయకుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా అయిన కెసిఆర్‌ ‌కూతురు ఎంఎల్సీ – కవిత ప్రమేయంపై మొదట్లో కొట్టిపారేసినా, రెండు సార్లు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ‌డైరెక్టరేట్‌ ‌నుండి నోటీసులు అందుకోవడంతో విచారణ పరిణామాలేవిధంగా ఉండబోతాయన్న దానిపైన బిఆర్‌ఎస్‌ ‌తీవ్ర ఆందోళనలో ఉంది.

ఎనిమిది నెలల్లో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రతిపక్షాల ప్రచారానికి ఇది ప్రధాన అస్త్రంగా మారే అవకాశాలు లేకపోలేదు. గత నెలలో ఇంటి వద్ద ఒకసారి విచారించగా, రెండవ సారి దిల్లీ లో కవితను ఈడీ అధికారులు విచారించారు. ఈ విచారణ నేపథ్యంలో ఎలాంటి పరిస్థితిని ఎదుర్కోవాల్సి వొస్తుందోనని నిజంగానే బిఆర్‌ఎస్‌ ‌భయపడిందనే చెప్పాలె. పలవురు రాష్ట్ర మంత్రులు, పార్టీలోని ముఖ్యనాయకులు ముందస్తుగానే హస్తిన చేరుకోవడం, మిత్రపక్షంగా మారిన ఆప్‌ ‌పార్టీ నేతలనందరినీ కూడదీయటం లాంటి పరిణామాలు చూస్తే కవితను అరెస్టు చేస్తారేమో.. ఒక వేళ ఆరెస్టు చేస్తే దాన్ని ఎలా ప్రతిఘటించాలన్న ఆందోళన ఆ పార్టీలో కనిపించింది. కాగా ఈ నెల 16న మరోసారి హాజరుకావాల్సిందిగా ఈడీ ఇచ్చిన నోటీసుకు తేదీ వాయిదా కోరిన కవితకు 20వ తేదీన హాజరు కావాలంటూ మరో నోటీసిచ్చింది ఈడీ.. అయితే ఈ విషయంలో సుప్రీంకోర్టును ఆశ్రయించిన కవిత 24న కోర్టు పరిశీలన అనంతరం హాజరవుతానని తన న్యాయవాదితో ఈడీ కి సమాచారమిచ్చింది.

మొత్తం మీద కవిత ప్రమేయం పైన ఏమితేలనుందోగాని, ఈ లోగా ప్రతిపక్షాల విమర్శలు ఆ పార్టీకి శరాఘాతాలవుతున్నాయి. ఇదిలా ఉంటే ప్రశ్నాపత్రాల లీకేజీ రాష్ట్ర ప్రభుత్వం పరువు తీసింది. ఎంతో రహస్యంగా, గుప్తంగా ఉండాల్సిన ప్రశ్నాపత్రాలు లీకవడం తో అధికార పక్షమంతా తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అసలే ఎన్నికల సమయం కావడంతో విపక్షాలకు మంచి అయుధం చేతికి చిక్కినట్లైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఆ పక్షాలు దుమారమే లేపాయి.కాదు కూడదని చెప్పుకునే అవకాశం అధికార పక్షానికి గాని, అధికారులు గాని లేకుండా పోయింది. ఇప్పటికైతే సిట్‌ ‌విచారణకు అప్పగించి రాజకీయ వేడిని కొంత తగ్గించినప్పటికీ, వాస్తవంగా దీనివెనుకున్న పెద్దలెవరన్నది బయటపెట్టాలని ఆ పక్షాలు డిమాండ్‌ ‌చేస్తున్నాయి. తామెంతో శ్రమతో పరీక్షలు రాస్తే, అధికారుల నిర్లక్ష్యం తమ భవిష్యత్‌కు విఘాతాన్ని కలిగిస్తోందని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇప్పటికే అనేక సమస్యలతో సతమతమవుతున్న రాష్ట్ర ప్రభుత్వం పైన పై రెండు సంఘటనలు మూలిగే నక్కపైన తాటి పండులా తయారైంది. ఉద్యోగ, ఉపాధి విషయంలో గత ప్రభుత్వాలు చేసిన తప్పిదాలనే ఈ ప్రభుత్వం కూడా చేస్తోంది. చాలాకాలంగా ఉద్యోగ అవకాశాలు లేక ఇబ్బంది పడుతున్న నిరుద్యోగులకు వొచ్చిన అవకాశం కూడా చిక్కుముడిగా మారడంతో నిరుద్యోగుల్లో తీవ్ర నిరాశ ఏర్పడింది. ఇదిలా ఉంటే ఉద్యోగులు, పెన్షనర్లు కూడా తీవ్ర అసంతృప్తి కనబరుస్తున్నారు.

పదవీ విరమణ తర్వాత ప్రశాంత జీవనం గడుపాల్సిన పెన్షర్ల పరిస్థితి దయనీయంగా మారింది. వృద్ధాప్యంలో మరో ఆదాయ మార్గంలేక మొదటి తారీఖున వొచ్చే పెన్షన్‌ ‌డబ్బులకోసం ఎదురు చూసే వీరికి తీవ్ర నిరాశ ఎదురవుతున్నది. ఆర్థిక వెసులుబాటు దృష్ట్యా ప్రభుత్వం ఒక్కో జిల్లాకు ఒక్కో తేదీన పెన్షన్లను మంజూరు చేయడంతో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఒకటవ తేదీన అందాల్సిన పెన్షన్లు దాదాపు పది నుండి పదిహేను తేదీ వరకు ఆగాల్సిన పరిస్థితి కొనసాగుతున్నది. అలాగే వారి డియర్‌నెస్‌ ‌రిలీఫ్‌ (‌డిఆర్‌) అలవెన్స్‌కూడా ప్రతీనెల కాకుండా, రెండు మూడు నెలలుగా పెండింగ్‌లో ఉండడంతో తీవ్ర అసంతృప్తికి గురవుతున్నారు. దీనికి తోడు ఎన్నికల హామీలను నెరవేర్చలేదంటూ విపక్షాలు రోజూ ఏదో ఒక సమస్యను ఎత్తిచూపుతూ విరుచు పడుతున్నారు. ధర్నాలు, రాస్తారోకోలు నిత్యకృత్యమైనాయి. గత ఎన్నికల సమయంలో వ్యవసాయదారులకు లక్ష రూపాయల రుణమాఫీ అంటూ చేసిన ప్రకటన ఇంతవరకు పూర్తిగా నిలుపుకోలేదని, కౌలు రైతులను పట్టించుకోవడం లేదని, ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి అధ్వానంగా ఉందని, ధరణితో రైతులు అవస్థలను ఎత్తిచూపుతూ గత కొంతకాలంగా విపక్షాలు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడుతున్న విషయం తెలిసిందే. గత ఎన్నికల్లో తాము అధికారంలోకి వొచ్చిన వంద రోజుల్లోనే నిజాం షుగర్‌ ‌ఫ్యాక్టరీని తెరిపిస్తామని, ఇప్పుడేమో అది ముగిసిన అధ్యాయమనడాన్ని ఆ పక్షాలు తీవ్రంగా ఆక్షేపిస్తున్నాయి. వీటికి తోడు స్వీయపార్టీలో కుమ్ములాటలు ఆ పార్టీకి మరింత ఇబ్బందికరంగా మారాయి. ఎంఎల్‌ఏలకు, ఎంఎల్‌సీలకు గిట్టడంలేదు.

ఎంపీలు ఎంఎల్‌ఏల మద్య పొసగటంలేదు. గ్రామ పంచాయితీ మహిళా సర్పంచ్‌లపై ఎంఎల్‌ఏల పెత్తనంచేయడం, నిధులు రాకుండా ఇబ్బంది పెట్టడం, మహిళలు పార్టీ మారడానికో, పదవి వదులుకోవడానికో సిద్దపడే వరకు వొస్తున్నాయి. చేపట్టిన అభివృద్ది పనులకు బిల్లులు చెల్లించడంలేదని అటు కాంట్రాక్టర్లు, ఇటు సర్పంచ్‌లు ఆత్మహత్య ప్రయత్నాలు చేపడుతున్నారు. ఇటీవల కాలంలో ప్రేమ హత్యలు రాష్ట్రాన్ని కుదిపేస్తున్నాయి.. భూ కుంభకోణాలకు లెక్కేలేదు. వీటన్నిటిని చూస్తే ఒక విధంగా పాలనపై బిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వానికి పట్టు తప్పుతున్నదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అటు ఎన్నికలు, ఇటు రాజకీయ, ప్రజా సమస్యలు సుడిగుండంనుండి బిఆర్‌ఎస్‌ ఏవిధంగా బయటపడుతుందో మరి.

Comments (0)
Add Comment