అరాచక పాలనకు చమరగీతం పాడండి

పటాన్ చెరు,ప్రజాతంత్ర, నవంబర్ 16: ప్రధానమంత్రి మోదీ ఇచ్చే పైసలతో రాష్ట్రంలో డబుల్ బెడ్ రూంలు, ఆసుపత్రులు కట్టారని, నీళ్లు, నిధులు, నియమకాల పేరుతో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ఆయనకు మాత్రమే తప్ప ఎవరికీ ఉద్యోగాలు రాలేదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ మండిపడ్డారు. అరాచక పాలనకు చమరగీతం పాడి, ప్రజలంతా ధర్మం వైపు నిలబడి బీజేపీని గెలిపించండని అయన అన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ దొందు దొందేనని, రెండు పార్టీలు ప్రజలను మభ్యపెట్టి పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తుందని విమర్శించారు. గురువారం సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గం రామచంద్రాపురం పట్టణంలోని సండే మార్కెట్ లో బీజేపీ బహిరంగ సభకు ఎంపీ బండి సంజయ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అంతకుముందు పటాన్ చెరు పట్టణానికి హెలికాప్టర్ ద్వారా చేరుకున్న బండి సంజయ్, బీజేపీ అసెంబ్లీ అభ్యర్థి నందీశ్వర్ గౌడ్ తో కలిసి నేరుగా రామచంద్రాపురం లోని బీజేపీ రాష్ట్ర మహిళా కార్యదర్శి గోదావరి అంజిరెడ్డి ఇంటికి వచ్చి అసంతృప్తిగా ఉన్న వారితో మాట్లాడారు. ఎన్నికల ప్రచార సభకు గోదావరి అంజిరెడ్డితో కలిసి వెళ్లారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బీజేపీ సభలో పటాన్ చెరు బీజేపీ అసెంబ్లీ అభ్యర్థి నందీశ్వర్ గౌడ్ తో కలిసి బండి సంజయ్ మాట్లాడుతూ… స్థానిక ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి అధిష్టానానికి పైసలు ఇచ్చి, ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకున్నారని ఆరభించారు. మియాపూర్ నుంచి సంగారెడ్డి వరకు మెట్రోరైలు విస్తరణకు కృషి చేస్తామన్నారు. కేసీఆర్, కాంగ్రెస్ పార్టీలు కూర్చుని ఆరు గ్యారంటీ పథకాలు సృష్టించారన్నారు‌. సమర్ధ పాలన కేవలం బీజేపీతోనే సాధ్యమని అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు అధికారంలోకి వస్తే తెలంగాణ మరో శ్రీలంక అవుతుందన్నారు. పోడు భూముల కోసం, నిరుద్యోగుల కోసం కొట్లడితే మాపై కేసులు పెట్టారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నేతలు ఎవరికోసమైనా కొట్లాడి జైలుకు పోయారా అని ప్రశ్నించారు. బిసి ముఖ్యమంత్రి డిక్లరేషన్ చేసి బీజేపీ సంచలనం సృష్టించిందని, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం బీజేపీ గెలవాలన్నారు. కేసిఆర్ ను అల్లాతో పోల్చడాన్ని మీరే ఆలోచించుకోవాలని, కేసీఆర్ దారుసలాంకు సలాం చేయడు దారుకే సలాం చేస్తాడన్నారు. మైనారిటీలను కాంగ్రెస్, బీఆర్ఎస్ మోసం చేశాయని తెలిపారు. ఓటు బ్యాంకుగానే వారిని చూస్తున్నారన్నారు. హిందుత్వాన్ని కాపాడుకోవాలి, హిందు ధర్మం కాపాడుకోకపోతే పెను ప్రమాదం తప్పదన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ రజాకార్ల పాలన కొనసాగుతోందని చెప్పారు. 30వ తేదీన జరిగే అసెంబ్లీ పోలింగ్ లో కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి నందీశ్వర్ గౌడ్ కు అత్యధిక మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. కేసీఆర్ నిజాం నిరంకుశ పాలనకు చరమగీతం పాడాలంటూ సాలు దొర.. సెలవు దొర.. సాలు మహిపాల్.. సెలవు మహిపాల్ అంటూ బండి సంజయ్ నినాదాలిచ్చారు. అంతకుముందు పటాన్ చెరు బీజేపీ అసెంబ్లీ అభ్యర్థి నందీశ్వర్ గౌడ్ మాట్లాడారు. ఈ సమావేశంలో బీజేపీ ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
అరాచక పాలనకు చమరగీతం పాడండి
Comments (0)
Add Comment