- మరో ముగ్గురి అరెస్ట్ ..ఇమిగ్రేషన్ అధికారుల సమాచారంతో విచారణ
- సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ వెల్లడి
బోధన్ పాస్‌పోర్టు కుంభకోణంలో ఓ ఎస్సై, ఏఎస్సైలతో పాటు మరో ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ తెలిపారు. గత నెల బంగ్లాదేశ్‌కి చెందిన ముగ్గురు ప్రయాణికులు పాస్‌పోర్ట్‌లు అనుమానాస్పదంగా ఉన్నాయని ఇమిగ్రేషన్ అధికారుల సమాచారం తో విచారణ చేస్తే నకిలీ పత్రాలు ద్వారా పాస్‌పోర్టులు పొందినట్లు గుర్తించినట్లు వివరించారు. 72 పాస్‌పోర్ట్‌లు ఇలా నకిలీ పత్రాలతో పొందారని వివరించారు. బోధన్ నుంచి దుబాయ్‌కి వెళ్లే ప్రయత్నం చేయగా దొరికిపోయారని చెప్పారు. మొత్తం ఈ కేసులో 8 మందిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. ఈ కేసులో పురోగతిని మంగళవారం సీపీ వి•డియాకు వివరించారు.
వీరిలో ఇద్దరు పోలీస్ అధికారులు ఉన్నారని.. వారిలో ప్రధాన నిందితుడు నీతై దాస్ అలియాస్ సంజీబ్ దుట్ట అని సీపీ సజ్జనార్ తెలిపారు. ఆయనే అందరికీ పాస్‌పోపోర్టులు ఇప్పించారని తెలిపారు. ఈ పాస్‌పోర్ట్ కుంభకోణంలో ఎస్సై మల్లేశ్‌రావు, ఏఎస్సై అనిల్ కుమార్‌ను అరెస్ట్ చేశామని వివరించారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారని.. వారి కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. బోధన్‌లో 7 చిరునామాతో మొత్తం 72 పాస్‌పోర్ట్‌లు పొందారని, బోధన్ ఒకే అడ్రస్‌పై 37 పాస్‌పోర్ట్‌లు తీసుకున్నారని వివరించారు. ఈ కేసులో ఇద్దరు పోలీసులు కూడా ఎలాంటి పరిశీలన చేయకుండా క్లియరెన్స్ ఇచ్చారని సజ్జనార్ చెప్పారు. ప్రధాన నిందితుడు రూ.10 వేల నుంచి 30 వేల వరకు ఒక్కో పాస్‌పోర్ట్ కోసం డబ్బులు తీసుకున్నారు.
పశ్చిమ బెంగాల్లో ఉన్న ఆధార్కార్డ్లను మార్చి బోధన్ చిరునామాతో ఆధార్ కార్డ్‌లు దరఖాస్తులో పెట్టారని వివరించారు. పశ్చిమబెంగాల్ నుంచి 60 ఆధార్ కార్డులు తీసుకున్నట్లు విచారణలో తేలిందని తెలిపారు. వీసా, పాస్‌పోర్ట్‌లు పొందడమే కాదు.. అక్రమంగా 72 మందిలో 19 మంది మన దేశం వదిలివెళ్లారని, మిగిలిన వారు ఎక్కడ ఉన్నారు అనేది లోతుగా విచారణ చేస్తున్నట్లు వెల్లడించారు. 72 మంది పాస్‌పోర్ట్, ఆధార్ కార్డ్‌లు రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసినట్లు సీపీ సజ్జనార్ చెప్పారు.