- దుర్గమ్మగా దర్శనమిచ్చిన అమ్మవారు
- అమ్మవారి సేవలో మంత్రి వెల్లంపల్లి, డిజిపి
విజయవాడ,అక్టోబర్ 13 : ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బుధవారం నాటికి 7వ రోజుకు చేరుకోగా అమ్మవారు దుర్గాదేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. దీంతో అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు కొండపైకి పోటెత్తారు. తెల్లవారుజాము నాలుగు గంటల నుంచే క్యూలైన్ల మార్గంలో భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు. లోక కంఠకుడైన దుర్గమాసురుడిని వధించి దుర్గాదేవీ స్వయంగా ఇంద్రకీలాద్రి అవతరించినట్లు ఆలయ చరిత్ర చెబుతోంది. దుర్గతులను పోగొట్టే దుర్గాదేవి అవతారాన్ని దర్శించుకుంటే సద్గతులు సంప్రాప్తిస్తాయని భక్తుల విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దుర్గాదేవి అలంకారంలో ఉన్న దుర్గమ్మను మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస రావు బుధవారం దర్శించకున్నారు. దర్శనానంతరం మంత్రి మాట్లాడుతూ.. ’అమ్మవారి కృపా కటాక్షాలు, ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని ఆకాంక్షించా. మంగళవారం మూలా నక్షత్రం రోజున లక్ష మందికి పైగా మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. నిన్న అధిక సంఖ్యలో భక్తులు వచ్చినా చివరి భక్తుడి వరకు దర్శనం కల్పించాము.
అందుకు సహకరించిన రెవెన్యూ, పోలీస్ అధికారులకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను’ అని మంత్రి వెల్లంపల్లి అన్నారు. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దుర్గాదేవి అలంకారంలో ఉన్న అమ్మవారిని డీజీపీ గౌతమ్ వాంగ్ బుధవారం దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం అనంతరం వేదపండితులు ఆశీర్వచనం పొందారు. దర్శనానంతరం డీజీపీ మాట్లాడుతూ.. దసరా నవరాత్రులలో అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉంది. చిన్న చిన్న పొరపాట్లు జరుగుతాయి. వాటిని భక్తులు పెద్ద మనసుతో క్షమించాలి.
దసరా శరన్నవరాత్రిలో పోలీసుల పాత్ర చాలా కీలకమైంది. విధి నిర్వహణ నిర్వహిస్తున్న పోలీసులందరికీ నా కృతజ్ఞతలు. దసరా నవరాత్రి ఉత్సవాలలో పోలీసులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను సీపీ బత్తిన శ్రీనివాసులు ముందుండి జరిపించడం చాలా సంతోషకరంగా ఉంది’ అని డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. ఇదిలావుంటే దసరా శరన్నవరాత్రులు జరుగుతున్న ఇంద్రకీలాద్రిపై అపచారం చోటుచేసుకుంది. అమ్మవారికి సమర్పించేందుకు శ్రీకాళహస్తి నుండి ఆలయ సిబ్బంది సారే తీసుకు వచ్చింది. అయితే సారేను అర్చకులు భక్తులు నడిచే నేలపై ఉంచారు. భక్తులు నడిచే మార్గంలో సారె, పూజా సామాగ్రి ఉంచడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.