శ్రీశైలం,జూలై 24 : ఆషాఢ పౌర్ణమిని పురస్కరించుకొని శ్రీశైలం శ్రీభ్రమరాంబాదేవి అమ్మవారికి శాకంబరీ ఉత్సవాన్నీ ఆలయ అధికారులు నిర్వహించారు. ఇందుకోసం అవసరమైన సుమారు 4వేల కేజీలకు పైగా వివిధ రకాల ఆకుకూరలు, కూరగాయలను, వివిధ రకాల ఫలాలను అమ్మవారి ఆలయానికి అలంకరించడం జరిగింది. దేవస్థానం సూచనల మేరకు పలువురు దాతలు వీటిని విరాళంగాసమర్పించారు. వంగ,బెండ, దొండ, కాకర, చిక్కుడు, గోరుచిక్కుడు, మునగ, సొర, బీర, గుమ్మడి, బంగాళదుంప, కందదుంప, క్యాప్పికమ్ (బెంగుళూరు మిరప), క్యాబేజీ, బీన్స్, క్యారెట్, అరటి మొదలైన వివిధ రకాల కూరగాయలు, తోటకూర,పాలకూర, మెంతికూర, చుక్కకూర, మొదలైన పలురకాల ఆకుకూరలు, పుదిన, కరివేపాకు, కొత్తిర లాంటి సుగంధ పత్రాలు, కమల, బత్తాయి, ద్రాక్ష, ఆపిల్, అరటి,్గ •నాపిల్ మొదలైన పలురకాల ఫలాలు, నిమ్మకాయలు, బాదంకాయలు మొదలైన వాటిని ఈ ఉత్సవానికై అమ్మవారి ఆలయానికి అలంకరించారు. అదే విధంగా ఈ ఉత్సవంలో భాగంగానే శ్రీ భ్రమరాంబాదేవి వారికి విశేషపూజలు జరిపించారు.
ఈ ఉత్సవంలో శ్రీ అమ్మవారి మూలమూర్తిని వివిధ రకాల కూరగాయల తోనూ, ఆకుకూరలతోనూ, పలు రకాల ఫలాలతో విశేషంగా అలంకరించారు. అదేవిధంగా అమ్మవారికి విశేష పూజలు జరిపించారు. దేవాలయ ప్రాంగణాన్ని కూడా పలు రకాల ఆకుకూరలు, కూరగాయాలతో అలంకరించారు. ఈ ఉత్సవంలో భాగంగానే శ్రీ అమ్మవారి ఉత్సవమూర్తికి, ఆలయప్రాంగణంలోని రాజరాజేశ్వరి దేవికి, సప్తమాతృకలను, గ్రామదేవత అంకాళమ్మకు ప్రత్యేకపూజలు విశేషంగా శాకాలంకరణ చేసారు. అమ్మవారిని శాకాలతో అర్చించడం వలన అతివృష్టి, అనావృష్టి నివారించబడి, సకాలంలో తగినంత వర్షాలు కురిసి, పంటలు బాగా పండుతాయని, కరువుకాటకాలు నివారించ బడతాయిని పురాణాలు చెబుతున్నాయి. కాగా పూర్వం హిరణ్యాక్షుని వంశానికి చెందిన దుర్గముడు అనే రాక్షసుడు తన తపశ్శక్తితో వేదాలను అంతర్జానం చేశాడు. దాంతో యజ్ఞయాగాదులు నిలిచిపోయాయి. ఈ కారణంగా కరువుకాటకాలతో తీవ్రక్షామం ఏర్పడింది. అప్పుడు మహర్షులందరూ ఆదిపరాశక్తిని గురించి తపస్సు చేశారు. ఆ తపస్సుకు పరాశక్తి ప్రసన్నురాలై లోకరక్షణ కోసం దుర్గముడిని సంహరించి, వేదాలను రక్షించి వైదిక కర్మలను పునరుద్ధరింపజేసింది.