సంక దు:ఖం

రోజు నడిచే బాటే
కొత్తగా పలకరించింది.
ఈ పొద్దు కొన్ని దారిద్ర్య సుక్కలు
మిణుకు మిణుకు మంటూ దు:కపు భాషలో
అర్దిస్తున్నవి…
కొన్ని వలస సంక బరువులు
నాలుగురోడ్ల చౌరస్తా లో
అనధికార ట్రాఫిక్ పని చేస్తుండ్రు..
సంక బరువు దించనికి…

అన్ని కాళ్ళు గమ్యం చేరాలని
గుర్రాళ్ళ పరిగెట్టేవే..
అడ్డొస్తే మాటల ధూళి కాస్త ముఖంపై దులిపేవే..
కానీ
ఒక్క” కానీ “సంక బరువు దింపే
ప్రయత్నంలో అన్ని దిక్కులు
పగటి కలువలైతాయి..
అయినా..
సంక బాల్యపు అరుపులు
శబ్ద కాలుష్యం లో ఇంకిపోయి
రాతి గుండె కరుణ ఊటకై
క్షణంకై.. క్షణం..
ఎదురు సూసే దృక్కులు
నీరులేని గుoతలైనవి..
బాబుగారు..
బాంచెన్,నీకడుపు సళ్లగుండ
పదాలు దండకాలైన
చీదరిసస్తూ కరిగిపోతున్న కాలం.
వారి ప్రయత్నం ముందు
సిగ్గుతో ఆలస్యంగా అస్తమించే తరుణం .
నిజంగా …
మనసుని ద్రవించే సన్నివేశం.
ఒక్కరైనా సంక బరువును
దించక పోతారా?
ఆ సంక దు:ఖం తీర్చే సాయంగా
జేబులోనీ మా చిన్నోడి నోటిని
తృప్తి చేసే కాగితం..
బరువు మోస్తున్న చేతి గిన్నెలో
ఆకలి తీర్చే. ఆసరా కావడం..
ఆ పూట.
నా ఎదకు సంతృప్తి తొవ్వ దొరికింది..

నాగరాజు. మద్దెల
6301993211

prajatantra newstelangana updatestelugu kavithaluToday Hilights
Comments (0)
Add Comment