భారతీయ జనతాపార్టీ తెలంగాణరాష్ట్ర అధ్యక్షుడిగా కొత్తగా ఎంపికైన కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు బండి సంజయ్ అప్పుడే దూకుడు పెంచాడు. రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌ను గద్దె దించడమే తన లక్ష్యంగా ఆయన ప్రరటించడం చూస్తుంటే, అధిష్టానం అదే లక్ష్యంగా ఆయన్ను ఎంపిక చేసినట్లు కనిపిస్తున్నది. పార్టీ అధ్యక్షపదవి విషయంలో ఇటు రాష్ట్రంలో,అటు కేంద్రంలో చాలాకాలంగా తర్జనబర్జనలు కొనసాగాయి. ఈ పదవికోసం అనేకమంది పోటీ పడ్డారు.చివరకు నిన్నటివరకు కొనసాగిన లక్ష్మణ్‌కే తిరిగి అవకాశం కల్పిస్తామనుకున్నారు. ఆయన అధ్యక్షతన నాలుగు పార్లమెంటు స్థానాలను గెలుచుకోవడం ఆ పార్టీ తెలంగాణలో తామనుకున్న లక్ష్యానికి చేరువగా ఉన్నట్లుగా ఆ పార్టీ భావించడంతో లక్ష్మణ్‌కే ఆ పదవి దక్కుతుందనుకున్నారు. కాని, బిజెపి అధిష్టానం అనూహ్యంగా బండి సంజయ్‌ని తెరపైకి తెచ్చింది. తనపేరు ప్రకటించిన తర్వాత ఢిల్లీనుండి హైదరాబాద్ విచ్చేసిన సందర్భంగా ఆయనకు అపూర్వస్వాగతం లభించింది. పెద్దఎత్తున ర్యాలీ నిర్వహించేందుకు పార్టీ చేసుకున్న సన్నాహాలకు కరోనా అడ్డుపడినప్పటికీ ఆయన దూకుడుకు మాత్రం అడ్డులేకుండాపోయింది.
ఆయన హైదరాబాద్‌లో అడుగు పెడుతూనే చెప్పినమాట ఏంటంటే, త్వరలో గోలకొండ కోటపైన కాషాయ జంఢా ఎగురుతుందన్నది. తాను పెట్టుకున్న ఏకైక లక్ష్యంకూడా తెలంగాణలో బిజెపి అధికారంలోకి రావ లన్నదే. అధిష్టానం కూడా అధ్యక్ష మార్పిడినికూడా అదే లక్ష్యంగా చేసినట్లు తెలుస్తున్నది. సంజయ్ కరుడుగట్టిన ఆర్‌ఎస్‌ఎస్ వాదిగా పేరున్నవ్యక్తి. చిన్నప్పటినుండీ ఒకే మూసలో పెరిగిన వ్యక్తి. సామాన్యకుటుంబంలో జన్మించిన సంజయ్‌ని బడిపంతులైన ఆయన తండ్రి సరస్వతీ శిశుమందిర్‌లోనే ఆక్షరాభాస్యం చేయించడంతో ఆయన••న్నీ అవేలక్షణాలబ్బాయి. ఆర్‌ఎస్‌ఎస్‌లో చురుకైన పాత్రపోషించడంద్వారా ఘటన్ నాయక్, ముఖ్యశిక్షక్‌గా చిన్నప్పుడే పనిచేశాడు. తర్వాత కాలంలో అభిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబివిపి),బిజెవైఎం పట్టణస్థాయినుండి రాష్ట్రస్థాయివరకు అనేక పదవులను చేపట్టాడు.బిజెపిలో చేరినప్పటినుండి జాతీయస్థాయిలోకూడా గుర్తుంపు తెచ్చుకున్నాడు. కేరళ,తమిళనాడులలో పార్టీ ఇన్‌చార్జిగా పనిచేశాడు.బిజెపి అగ్రనాయకుడు అద్వాని దేశవ్యాప్తంగా రథయాత్ర చేసినప్పుడు ఆయన వాహన శ్రేణికి ఇన్‌ఛార్జిగా,అలాగే ఢిల్లీ సెంట్రల్ ఆఫీసులో సహాయక్‌గా పనిచేసినవ్యక్తి. తాజాగా జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో తెరాస అగ్రనాయకుల్లో ఒకరైన మాజీ ఎంపి బి.వినోద్‌కుమార్‌పై ఎనభై ఏడువేల ఓట్ల మెజార్టీతో గెలుపొందిన వ్యక్తి కావడంవల్లే అధిష్టానం ఆయనకు తెలంగాణరాష్ట్ర బాధ్యతలను అప్పగించింది. తెలంగాణ ఏర్పడినప్పటినుండీ కాషాయ పార్టీ తెలంగాణలో తమ ప్రభుత్వాన్ని స్థాపించాలని ఉర్రూతలూగుతోంది.
టిఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయంగా బిజెపియే అన్నవిషయాన్ని నిజంచేసేందుకు సరైన నాయకుడిని ఎంపికకు తీవ్ర కసరత్తుచేసిన బిజెపి చివరకు సంయజ్‌కే బాధ్యతలను అప్పగించింది.ఎందరో యువకుల బలిదానాలతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో అడ్డగోలుపాలన జరుగుతున్నదంటున్న సంజయ్,ప్రత్యమ్నాయంగా ఎదిగే తమపార్టీ కార్యకర్తలపైన ప్రభుత్వం కక్షసాధింపు దోరణితో వ్యవహరిస్తే ఊరుకునేది లేదంటూ,తమ కార్యకర్తలపైన ఒక్క లాఠీ దెబ్బపడినా రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ గుండెల్లో నిద్రపోతానంటూ హెచ్చరించినతీరు ఆయన భవిష్యత్‌లో ఎంతదూకుడిగా వ్యవహరించనున్నారన్నది స్పష్టంచేస్తున్నది. కెసిఆర్‌ను గద్దెదించడమే లక్ష్యంగా తాను పనిచేస్తానంటూ ఆయన చేసిన ప్రకటన చూస్తుంటే బిజెపి అధిష్టానం సంజయ్‌కి మంచి గీతోపదేశంచేసే పంపించినట్లు కనిపిస్తున్నది. రాష్ట్రంలో టిఆర్‌ఎస్ గాలి బలంగా వీస్తున్న సందర్భంలోనే ఆయన ఘనవిజయం సాధించడంతోపాటు,రాష్ట్రప్రభుత్వంపైన వివిధ విషయాలపై పోరాటం చేయడంలో ఏమాత్రం వెనుకాడని ఆయన తత్వాన్ని చూసే ఆపదవికి ఆయనైతేనే వన్నెతెస్తాడని అధిష్టానం ఊహించి ఉంటుంది. ప్రధానంగా కేంద్రం నిధుల విషయంలో కొంతకాలంగా కేంద్ర, రాష్ట్ర నాయకులమధ్య తీవ్రస్థాయిలో చర్చ జరుగుతున్నది. సంజయ్ దాన్నే ప్రధానాంశంగా తీసుకుని తెరాస సర్కార్‌పై ధ్వజమెత్తనున్నాడు. రాష్ట్ర ప్రజలకోసం కేంద్రం అందిస్తున్న నిధులన్నిటినీ కెసిఆర్ రాష్ట్ర నిధులుగా వ్యయంచేస్తున్నట్లు ప్రచారం చేసుకుని లబ్ధిపొందాలనుకుంటున్న విషయాన్ని ప్రజలముందుకు తీసుకువచ్చే విషయంలో తనకు సహకరించాల్సిందిగా, అధ్యక్ష పదవీబాధ్యతలను చేపట్టిన సందర్భంగా ఆయన కార్యకర్తలకు ఉపదేశించారు.ప్రజలకోసమే పనిచేయాలని…ప్రజలకోసమే త్యాగంచేయాలనికూడా ఆయన ఈ సందర్భంగా కార్యకర్తలకాయన సూచించాడు. కాగా సంజయ్‌కి త్వరలోనే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల పరీక్ష ఎదురుకానుంది. ఈ ఎన్నికల్లో మజ్లిస్- టిఆర్‌ఎస్ దోస్తీని విచ్చిన్నంచేస్తే తప్ప తమ గెలుపు సులభంకాదన్న భావన బిజెపికి మొదటినుండీ ఉంది. ఇప్పుడు సంజయ్ పాచిక ఈ ఎన్నికల్లో ఏమేరకు పనిచేస్తుందో వేచిసూడాల్సిందే.
Tags: Bandy Sanjay, Member of Parliament of Karimnagar, newly elected as President of bjp Telangana