హలాల కరాలకు సలాం జేద్దాం

అతడు
నాగలి కర్రుకు నడక నేర్పి
బీడుబడ్డ భూముల్లో పచ్చదనాన్ని నింపి
మానవాళి జిహ్వకు ఆకలిరుచి అంటకుండా ఐదు వేళ్ళు అన్నాన్ని ముద్దాడటానికి
అలిసిపోని యుద్ధం జేస్తున్నోడు

యంత్ర వాసన అంటని  ఎట్టి బతుకుల కాలములోను మట్టిని నమ్ముకొని
మొక్కలు మ్రోడువారకుండా మోటలుగొట్టి
బాధలు దిగమింగుతూ
బతుకు పూలు వికసింపజేసినోడు

గుండెలను మెలిపెట్టే తండ్లాటలను తమాయించుకొని
పొరలు పొరలుగా దట్టంగా అల్లుకున్న దుఃఖ తిమిరాలను చేధించి వెలుగులు పంచినోడు

అక్షరాలు రాని అమాయకత్వం పై మిడుతల దండులా మీదపడి
దోచుకతిన్న దళారుల దగాకోరు తనాన్ని
పంటి బిగువున భరించినోడు

నేడు రాజ్యం
బతుకు సమరంలో పచ్చి పుండైన దేహంపై
కర్కష చట్టాల కారం జల్లి చోద్యం చూస్తుంది

దేహ బాధ దేశం నలుమూలలను తాకి
తోలు మందం అధికారానికి అంకుశం లా మారింది.

ఎంత మదగజమైనా మావటి వానికి లొంగాల్సిందే కదా
నరాలను కదిలించే చలిలో స్వరాలనెత్తి సమరం చేస్తున్న
హలాల కరాలకు సలాం జేద్దాం
సరి జోడవుదాం
– గన్‌ ‌రెడ్డి ఆదిరెడ్డి
9494789731

Comments (0)
Add Comment