- సిఎం కెసిఆర్‌కు రాఖీ కట్టిన అక్కలు
- కెటిఆర్‌కు కట్టిన సోదరి కవిత
- హరీష్ రావుకు మహిళా నేతల రాఖీ
- రేవంత్‌కు రాఖీ కట్టిన సీతక్క
- సోమవారం ప్రగతి భవన్ లో రక్షాబంధన్ పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు
- అక్కలు వినోదమ్మ, సకలమ్మ, లలితమ్మ, లక్ష్మీబాయిలు రాఖీలు కట్టి ఆశీర్వదిస్తున్న దృశ్యం.
రాఖీ పౌర్ణమి సందర్భంగా సోదరీమణులు తమ సోదరుడికి అప్యాయంగా రాఖీ కడుతూ పండుగను జరుపుకున్నారు. సిఎం కెసిఆర్‌కు ప్రగతి భవన్‌లో ఆయన అక్కలు వినోదమ్మ, సకలమ్మ, లలితమ్మ, లక్ష్మీబాయిలు రాఖీలు కట్టారు. మంత్రి కేటీఆర్‌కు ఆయన సోదరి, మాజీ ఎంపీ కవిత రాఖీ కట్టారు. ప్రగతి భవన్‌కు వెళ్లిన వెళ్లిన కవిత తన సోదరుడు కేటీఆర్‌కు రాఖీ శుభాకాంక్షలు తెలిపి, రాఖీ కట్టి ఆశీర్వాదం తీసుకున్నారు. అలాగే రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కు కూడా ఆమె రాఖీ కట్టారు. అన్నా, చెల్లెళ్ళు, అక్కా, తమ్ముళ్ళ అనుబంధానికి ప్రతీక అయిన రక్షా బంధన్ పురస్కరించు కొని గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ప్రగతి భవన్‌లో ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్, రాజ్య సభ సభ్యుడు, గ్రీన్ ఛాలెంజ్ రూపకర్త సంతోష్ కుమార్‌లకు రాఖీ కట్టి మిఠాయి తినిపించారు. రాష్ట్ర ప్రజలకు రక్షా బంధన్ శుభాకంక్షలు తెలిపారు. కొండాపూర్‌లోని తన నివాసంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావుకు టీఆర్‌ఎస్ మహిళా విభాగం నేతలు రాఖీ కట్టి, స్వీటు తినిపించారు.
ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ రక్షా బంధన్ పర్వదినం సోదర సోదరీమణులు ఆత్మీయ అనుబంధానికి ప్రతీక అన్నారు. వేడుకలను ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని సూచించారు. కొరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో స్వీయ రక్షణ చర్యలు పాటించాలని కోరారు. సోదరుడు నరసింహా రెడ్డికి రాఖీ కట్టి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలంగాణ ప్రజలకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. అన్నా, చెల్లెళ్లు, అక్కా తమ్ముళ్ల అపురూప అనుబంధానికి ప్రతీక రక్షా బంధన్ అన్నారు. తనకు రక్షణగా ఉండాలని, ఆప్యాయతతో ప్రతి సోదరి తన సోదరుడికి రాఖీ కడుతుందని మంత్రి చెప్పారు. అందుకు ప్రతిగా సోదరి క్షేమం కోరుతూ అండగా ఉండటమే రక్ష బంధన్ అని పేర్కొన్నారు. అక్కా, చెల్లెళ్లు, రాఖీ పౌర్ణమిని అందరూ ఆనందోత్సహాల మధ్య జరుపు కోవాలని మంత్రి ఆకాంక్షిం చారు. పలువురు మంత్రులు కూడా రాఖీ శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డికి ఆ పార్టీ ఎమ్మెల్యే సీతక్క రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఆమెతో పాటు పలువురు మహిళా నేతలు కూడా రేవంత్‌కి రాఖీ కట్టారు. ఆయనకు స్వీట్లు తినిపించారు. ఈ కార్యక్రమంలో రేవంత్ కుటుంబసభ్యులు పాల్గొన్నారు.