దేశ వ్యాప్తంగా పివి శత జయంతి జరపాలి

దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ చరిత్రలో నిష్కలంకుడు దేశ రాజకీయాలపై చెరగని ముద్ర వేసిన తెలుగు జాతి రత్నం తెలంగాణ బిడ్డ మాజీ ప్రధాని పీవీ నరసింహారావు గారి శత జయంతిని ఘనంగా నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించి తదనుగుణంగా ఆయన శత జయంతి ఉత్సవాలను జూన్‌ 28 ‌వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌ ‌ఘనంగా ప్రారంభించి, ఉత్సవాలను నిర్వహిస్తున్నారు.

బహుముఖ ప్రజ్ఞాశాలి దేశంలో  సరికొత్త ఆర్థిక సంస్కరణలకు నాందిపలికిన గొప్ప వ్యక్తి పీవీ నరసింహారావు. రాజకీయాలను నడపడంలో పాలనను నిర్వహించడంలో ఆయన చూపించిన నేర్పు రాజనీతిజ్ఞత , రాజకీయాలంటే తరతరాల వారసుల కోసం ఆస్తులు సంపాదించడం కాదు. రాజకీయాలంటే దేశ సేవ అని విశ్వసించి నిరూపించిన గొప్ప నాయకుడు మన పివి నరసింహారావు.

బహు భాషా పరిజ్ఞానం తో సాహిత్య సాంగత్యం, పుస్తక పఠనం, గ్రంధ రచన, జర్నలిజం, న్యాయవాదం, ఆధ్యాత్మికం, రాజకీయం ఇలా అన్నింటినీ అవపోశనపట్టి దేశ పరిస్థితి అత్యంత క్లిష్టంగా ఉన్న సమయంలో ప్రధానిగా బాధ్యతలు చేపట్టి సంక్షోభం నుండి దేశాన్ని గట్టెక్కించిన రాజకీయ దురంధరుడు మన పి.వి.
ఆయన శత జయంతి ఉత్సవాలను ఏడాది పాటు ఘనంగా నిర్వహించాలి. తెలంగాణలోనే కాదు దాదాపు 51 దేశాల్లో ఉత్సవాలు నిర్వహించాలని నిర్ణయించడం స్వాగతించాల్సిన అంశం. పీవీ నరసింహారావు గారికి భారతరత్న ఇవ్వాలని పార్లమెంటులో ఆయన చిత్రపటం పెట్టాలని ప్రత్యేక పోస్టల్‌ ‌స్టాంప్‌ ‌విడుదల చేయాలని, హైదరాబాద్‌ ‌సెంట్రల్‌ ‌యూనివర్సిటీ ఆయన పేరు పెట్టాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌డిమాండ్‌ ‌చేశారు.

తన  గ్రామం నుంచి రాష్ట్రం, దేశం ఇలా మొత్తం ప్రపంచానికి విజ్ఞానాన్ని అందించిన మహోన్నత వ్యక్తి పీవీ. అలాంటి గొప్ప వ్యక్తి కి లభించాల్సిన అంత గౌరవం లభించలేదు. ఆత్మవిశ్వాసం విజ్ఞానం అనుభవమే పెట్టుబడులుగా అంచెలంచెలుగా ఎదిగిన నిరాడంబర జీవి మన పి.వి. అటువంటి గొప్ప వ్యక్తి శతజయంతి ఉత్సవాలు నిర్వహించడం స్వాగతించాల్సిన విషయం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించిన ఈ సత్కార్యానికి స్వాగతించాల్సిన వారు ఎందుకు మౌనంగా ఉంటున్నారు. పీవీ నరసింహారావు కేవలం తెలంగాణకే పరిమితం అయిన నాయకుడా? కేవలం తెలంగాణా ప్రభుత్వమే ఉత్సవాలు నిర్వహించాలా? దేశ ప్రధానిగా మన దేశానికి పీవీ చేసిన సేవలు చిరస్మరణీయం. నూతన ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టి క్లిష్ట పరిస్థితుల్లో దేశ ఆర్థిక వ్యవస్థను కొత్త పుంతలు తొక్కించిన భరత జాతి ఆణిముత్యం. బహుభాషా కోవిదుడు నిరాడంబరతకు నిలువెత్తు నిదర్శనం మన పీవీ నరసింహారావు సేవలు  ఈ సమయంలో కేంద్ర ప్రభుత్వానికి గుర్తుకు రావడం లేదా? దేశ ప్రయోజనాలు, రాజ్యాంగం పరమోత్కృష్టమైనవని నమ్మిన పీవీ నరసింహారావు ఆశ్రిత పక్షపాతానికి బంధుప్రీతి కి దూరంగా ఉంటూ స్వ  ప్రయోజనాల కన్నా జాతి ప్రయోజనాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చిన నేటి భారత ఆర్థిక వ్యవస్థకు ఆనాడే రూపకల్పన చేసిన పూర్వ ప్రధాని పీవీ నరసింహారావు శతజయంతి ఉత్సవాలను నిర్వహించాలనే కనీస ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి రాకపోవడం దురదృష్టకరం. దక్షిణాది నేతలు హస్తినలో చక్రం తిప్ప లేరనే అభిప్రాయం తప్పని ఆయన నిరూపించారు. మైనార్టీ ప్రభుత్వాన్ని ఆయన నడిపించి ధైర్యంగా ఆర్థిక సంస్కరణలను అమలు చేసిన పీవీ నరసింహారావు ను స్మరించుకోవడానికి కేంద్ర ప్రభుత్వ పెద్దలకు కనీస సమయం దొరకలేదా? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మన్‌ ‌కీ బాత్‌ ‌లో కొద్దిసేపు ప్రస్తావించడం మినహా ఎక్కడ కూడా కేంద్ర ప్రభుత్వం ఆయన శత జయంతి సందర్భంగా స్మరించ లేదు. మరోవైపు కాంగ్రెస్‌ ‌పార్టీ పెద్దలు కూడా పివి గారిని విస్మరించడం దారుణం.

కాంగ్రెస్‌ ‌పార్టీతో రాజకీయ జీవితాన్ని ప్రారంభించి చివరి శ్వాస వరకు ఆ పార్టీలోనే కొనసాగి రాష్ట్ర మంత్రి ముఖ్యమంత్రి ప్రధానమంత్రిగా ఏఐసీసీ అధ్యక్షుడిగా ఎన్నో అత్యుత్తమ పదవులు నిర్వహించి పార్టీకి ప్రభుత్వానికి సేవ చేసిన పీవీ నరసింహారావు ను కాంగ్రెస్‌ ‌పార్టీ విస్మరించడం పలు విమర్శలకు దారి తీస్తోంది. ప్రధానిగా ఏఐసీసీ అధ్యక్షుడిగా ఐదు సంవత్సరాలు పని చేసి రాజీవ్‌ ‌గాంధీ మరణానంతరం మునిగిపోతున్న కాంగ్రెస్‌ ‌నావను ఒడ్డుకు చేర్చిన ధీశాలి పీవీని ఆయన చివరి రోజుల్లో అవమానించడం, ఆయన చనిపోయిన తర్వాత కనీస మర్యాద లేకుండా ప్రవర్తించిన తీరు బాధాకరం.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి ఆయన శతజయంతిని ఘనంగా నిర్వహించాలని నిర్ణయించిన తర్వాత పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి పీవీ శతజయంతి ఉత్సవాల కమిటీ అని కొద్ది మంది నాయకుల పేర్లు ప్రకటించారు. ఒకవైపు కెసిఆర్‌ ఆదేశాల మేరకు టిఆర్‌ఎస్‌ ‌పార్టీ దేశవిదేశాల్లో పివి శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తుండగా కాంగ్రెస్‌ ‌పార్టీ శ్రేణుల లో కనీస కదలిక లేకపోవడం శోచనీయం. పి.వి తెలంగాణ ఠీవీటగా కెసిఆర్‌ ‌ఢంకా బజాయించి చెబుతూ ఒకవైపు ప్రభుత్వపరంగా పార్టీపరంగా ఉత్సవాలను జరుపుతుంటే కాంగ్రెస్‌ ‌పార్టీ ఆ స్థాయిలో  స్పందించక పోవడం బాధాకరం. తప్పనిసరి పరిస్థితులలో సోనియాగాంధీ ఆయనను నామమాత్రంగా ప్రస్తావించడం తెలుగు ప్రజలు గమనించారు.

పీవీ నరసింహారావు తెలంగాణ బిడ్డ. తెలుగు  జాతిరత్నం. దేశ ప్రధానిగా పని చేసిన ఏకైక తెలుగు వ్యక్తి. కేంద్రమంత్రిగా సుదీర్ఘకాలం పనిచేసిన రాజకీయ దురంధరుడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ‌ముఖ్యమంత్రిగా భూసంస్కరణలు ప్రవేశపెట్టిన ఘనత పీవీ నరసింహా రావు గారిది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ‌మంత్రిగా ముఖ్యమంత్రిగా ఆయన కేవలం తెలంగాణా ప్రాంతానికే  కాదు,  సీమాంధ్ర ప్రాంతానికి కూడా ఎంతో సేవ చేశారు. ఆయన అభిమానులు అనుచరులు మిత్రులు శిష్యులు ఎందరో ఆంధ్ర ప్రదేశ్‌ ‌ప్రాంతంలో కూడా ఉన్నారు. అన్నింటికన్నా ముఖ్యంగా ఆయన ప్రాతినిధ్యం వహించింది నంద్యాల పార్లమెంట్‌ ‌స్థానం నుండి. అటువంటివి పీవీ నరసింహారావు గారి శతజయంతి ఉత్సవాలను నేటి ఆంధ్రప్రదేశ్‌ ‌ప్రభుత్వం జరుపక పోవడం, కనీసం ఆయనను స్పందించకపోవడం అత్యంత బాధాకరం. పీవీ నరసింహారావు రాజకీయాలకు అతీతమైన కర్మయోగి. అసాధారణ స్థాయిలో విద్వత్తు పాండిత్యం చాతుర్యం భాషా నైపుణ్యం వ్యక్తీకరణ సామర్థ్యం తత్వజ్ఞానం అద్భుతమైన లక్షణాలు కలిగిన అపర చాణక్యుడిని ఆంధ్రప్రదేశ్‌ ‌ప్రభుత్వం విస్మరించడం కనీసం స్మరించుకోవడం దారుణం బాధాకరం. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలలో పీవీ శతజయంతి ఉత్సవాలు జరపాలని ఆదేశాలు జారీ చేయాలి. బహుముఖ ప్రజ్ఞాశాలి పీవీ నరసింహారావు కు భారతరత్న అవార్డును వెంటనే ప్రకటించాలి.

సురేష్‌ ‌కాలేరు

Comments (0)
Add Comment