ప్రకృతి ముంగిట్లో…

ఇక తెలియదు
ఆ ఎంతగానో వికసించిన నిమిత్తమాత్రునికి
అది అపోహ మాత్రమే ఒకవైపు మాత్రమే కదా
సృష్టిలో కొన్ని సూత్రాలు నడుస్తాయ్‌ అం‌టూ
కొన్ని ఆకారాలు వెతుక్కున్నాడు
అవెక్కడైనా ఒకేలాగా నడుస్తూ ఉంటాయ్‌
ఒక చెట్టు ఒక రెక్క ఒక నడక ఏదైనా…
కాల్పనిక ప్రపంచంలో
సంబంధబాంధవ్యాల్లో వ్యవహారాల్లో కూడా
పనిచేసుంటే బావుణ్ణు కదా!
జయాపజయాల్లో సుఖంలో ఆపదల్లో…
మెదడు పూర్తిగా పనిచేసిన్నాడు తడుతుంది అది
ఈ విశ్వం మనకోసం వేచి చూస్తూనే ఉంది
సిసలైన బతుకులు ఏవో మరి ఇప్పటికీ బోధపడలే!
అమూల్యమైన శక్తిని మాత్రం వృధా చేస్తూనే
వ్యర్థపరుస్తూనే దుర్వినియోగపరుస్తునే
కాలం కానిస్తున్నాడు పశ్చాత్తాపడుతూ…
విప్లవాత్మక మానవుడు లోపలినుంచి లేచినప్పుడు
అడపా దడపా జరిగిన పెను మార్పులే
ఇప్పుడున్న ఈ ఆవిష్కరణలు…
అవసరం పీడన ఏమీలేని తనంలోంచే
ఒక ఎరుక పుట్టేది!
చావు మన పీకపట్టుకున్నప్పుడే మనకు తోచేది
పరిస్థితి మన ఎదపై కూర్చున్నప్పుడే కదా
ఒక నిర్ణయం తీసుకునేది
యుద్ధాల నుంచి ప్రణాళికలవరకు ఇంతే
అభివృద్ది రెండు కత్తులు దూసుకుంటే తప్ప
కుదరలేదు కదా విచిత్రంగా!!
మరణం మన వాకిట్లో ఎదురుచూస్తోంది
దాన్ని కాసేపు ఆపి నీ పని ముగించెయ్‌
‌చేయాల్సినవి వాయిదాలు కుప్పలుకుప్పలు
ఇంకెప్పుడనిపించుకుంటావ్‌
ఎప్పుడు వికసిస్తావ్‌ ‌చెప్పు
సరిగ్గా నీ సామర్థ్యాన్ని ఉపయోగిస్తే
ప్రపంచం నీ ముందు బృందగానం ఆలపిస్తది!
తడబాటే పోలేదు ఇంకా నీకు
ముందు స్థిమితంగా కూర్చోవడం నేర్చుకో
చూడడం వినడం మట్లాడడం ఇవి ఆ తర్వాత
విర్రవీగే స్థితి నుంచి విరిగే స్థితి వరకు
కాలే స్థితి నుంచి కరిగే స్థితి వరకు
ఎదిగిపోయి-
ఒక అందమైన రాలిన ఎండిన ఆకులా
పరుచుకుని ఉంటావ్‌ ‌ప్రకృతి ముంగిట్లో…

– రఘు వగ్గు

Comments (0)
Add Comment