నేడు మర్రి చెన్నారెడ్డి జయంతి
‘‘ఆంధ్రప్రదేశ్ లోని తెలంగాణ ప్రజలు సాంఘిక ఆర్ధిక విద్యా రంగాలలో వెనుకబడి యుండడాన్ని డాక్టరు చెన్నారెడ్డి సహించలేక పోయారు. ఏప్రిల్ 1968 లో కేంద్ర మంత్రివర్గం నుండి రాజీనామా చేసారు. 1968లో ఢిల్లీ నుండి హైదరా బాదుకు తిరిగి రాగానే ‘‘తెలంగాణ ప్రజా సమితి’’ అనే పార్టీని నెలకొల్పి, ప్రత్యేక తెలంగాణ నిర్మాణం కొరకు పోరాటం సాగించారు. ఉద్యమాన్ని రాజకీయం చేసేందుకు చెన్నారెడ్డి తెలంగాణ ప్రజాసమితి అధ్యక్షుడయ్యారు.’’
మర్రి చెన్నారెడ్డి (జనవరి 13, 1919 – డిసెంబర్ 2, 1996) భారత జాతీయ కాంగ్రేసు పార్టీకి చెందిన రాజకీయ నాయకుడు. 1978 నుండి 1980 వరకు, 1989 నుండి 1990 వరకు రెండు పర్యా యాలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఉత్తర ప్రదేశ్ గవర్నర్‌గా (1974-1977), పంజాబ్ గవర్నర్ (1982-1983), గవర్నర్‌గా కూడా పనిచేశారు. ఫిబ్రవరి 1992 నుండి మే 1993 వరకు రాజస్థాన్, 1993 నుండి ఆయన మరణించే వరకు తమిళనాడు గవర్నర్‌గా ఉన్నారు. అతను ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. అతి పిన్న వయస్కుడైన మంత్రులలో ఒకరైన ఘనత కూడా ఆయనకు ఉంది. 30 సంవత్సరాల వయస్సులో ఆంధ్ర ప్రదేశ్ మంత్రి కావడం కూడా విశేషం. చెన్నారెడ్డి జనవరి 13, 1919న ప్రస్తుత వికారాబాదు జిల్లా, వికారాబాదు తాలూకాలోని మార్పల్లి మండలం లోని సిరిపురం గ్రామములో శంకరమ్మ, లక్ష్మారెడ్డి దంపతులకు జన్మించారు. హైస్కూలు విద్యార్ధిగా వున్న రోజులలో, ఉపన్యాస పోటీలను ఏర్పాటు చేయడం, గ్రంధాల యాలను స్థాపించడం, సేవాకార్య క్రమాలను నిర్వహించి, తోటి విద్యార్థులను ఉత్తేజ పరిచేవారు.
కాలేజీలో చదువుతున్న రోజులలో సాంఘిక సేవా దళాలను ఏర్పాటు చేసి వాటికి నాయకత్వం వహించ డమో, లేదా నిజాం పరిపాలనకు వ్యతిరేకంగా జరిగే రాజకీయ మహా సభలలో ప్రతినిధిగా పాల్గొనడమో చేస్తూ ఉండేవారు.
చిన్ననాటినుండి వైద్యవృత్తిని చేబట్టాలనే ఆకాంక్ష బలంగా ఉండేది. చివరకు తన 22వ ఏట ఉస్మానియా మెడికల్ కాలేజీలో ఎం.బి.బి.యస్ పట్టా తీసుకొనడం ద్వారా ఆయన ఆశయం సిద్ధించింది. రాష్ట్ర ప్రభుత్వ శాఖలో వైద్యులుగా నియమింప బడ్డారు. ఉద్యోగంలో ప్రవేశించిన రెండు నెలలలోనే ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి హైదరాబాదు లో స్వతంత్రంగా రెండు వైద్యాల యాలను నెలకొల్పి వైద్యం చేయడం ప్రారంభించారు. రెండు సంవత్సరాలకు ఆ రెండు చికిత్సాలయాలను మూసివేసి, తన జీవితాన్ని పూర్తిగా దేశ రాజకీయాలకు అంకితం చేశారు. గాంధీజీ పిలుపు మేరకు 1935లో ఆంధ్రమహాసభలో పాల్గొన్నారు. అది ఆయన రాజకీయ అరంగేట్రం. కార్యకర్తగా, సమావేశకర్తగా, ఖాదీ ప్రచారకులుగా, గాంధేయులుగా, విద్యార్థి నాయకులుగా, ఆంధ్ర విద్యార్థి కాంగ్రెస్ వ్యవస్థాపకులుగా అనేక స్థాయిల్లో పనిచేసి అనుభవాన్ని సంపాదించారు. 1938లో జైలు శిక్షను అనుభ వించారు. చెన్నారెడ్డి 1941లో ఎం.బి.బి.ఎస్ డిగ్రీ పొందారు. వరంగల్ లోని గాంధీ ఆసుపత్రిలో డాక్టర్ గా పని చేశారు. తర్వాత రోజుల్లో ఆంధ్ర యువజన సమితి, విద్యార్థి కాంగ్రెసును స్థాపించారు. అనేక విద్యార్థి, యువత, విద్యా, అక్షరాస్యత, సాంస్కృతిక సంస్థలలో చురుకుగా పాల్గొనే వారు. ఒక వారపత్రికకు రెండు సంవత్సరాల పాటు సంపాద కత్వము వహించారు. అనేక పత్రికలలో వ్యాసాలు కూడా ప్రచురించారు. చెన్నారెడ్డి అప్పటి హైదరాబాదు రాష్ట్రములోని స్వాతంత్య్రోద్యమములో పాల్గొన్నారు. 1942లో ఆంధ్ర మహాసభ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు.
1946 లో జరిగిన రాష్ట్ర స్టేట్ కాంగ్రెసు మహాసభకు చెన్నారెడ్డి ఆహ్వాన సంఘ కార్యదర్శిగా ఎన్నుకోబడ్డారు. చివరకు ఈ స్టేట్ కాంగ్రెసు అధ్వర్యాన్నే, హైదరాబాద్ ప్రజలు నిజాం నిరంకుశ పరిపాలనను ఎదుర్కొని పోరాడారు. నిజాం మీద సాగించిన ఈ పోరాటాన్ని అహింసాయుత పద్ధతిని సాగించాలని డాక్టరు చెన్నారెడ్డి అభిమతం. ఆ సందర్భంలో ఆయన ఢిల్లీ వెళ్ళి పండిట్ జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ తదితరులను కలుసుకుని వచ్చారు. మహాత్మాగాంధీ. ఆశీస్సులను కూడా పొందారు. ఆయన అనేక సంవత్సరాలు ఆంధ్రా ప్రావిన్స్ కాంగ్రెస్ కమిటీకి ప్రధాన కార్యదర్శిగా, 30 సంవత్సరాలు పిసిసి వర్కింగ్ కమిటీ సభ్యునిగా ఉన్నారు. హైదరాబాదు స్వతంత్య్ర పోరాటం ఉధృత రూపం దాల్చడంతో, నిజాం ప్రభుత్వం నాయకులందరినీ అరెస్టు చేసింది. అరెస్టు అయిన నాయకులలో చిన్నవాడైన చెన్నారెడ్డి కూడా ఉన్నారు. చర్చల ఫలితంగా విడుదలై, స్టేట్ కాంగ్రెస్ నాయకులందరు హైదరాబాదు. రాష్ట్ర సరిహద్దు ప్రాంతాలకు వలస వెళ్ళి, అక్కడనుండి ఉద్యమం సాగించారు. ఆ సమయంలో చెన్నారెడ్డి విజయవాడ వచ్చి, ‘‘హైదరాబాదు’’ అనే వారపత్రికను నిర్వహిస్తూ, హైదరాబాదు ప్రజలు సాగిస్తున్న స్వాతంత్య్ర పోరాటాన్ని ఉధృత పరిచారు.
ఆ సమయంలో భారత ప్రభుత్వం కలుగజేసుకుని నిజాంపై పోలీసు చర్యలను తీసుకుని, హైదరాబాదు సంస్థానాన్ని ఇండియాలో అంతర్భాగంగా విలీనం చేసింది. దానితో ఇండియా పార్లమెంటుకు హైదరాబాదు రాష్ట్రంలోని కొందరిని ప్రజా ప్రతినిధులుగా భారత ప్రభుత్వం తీసుకొనడం జరిగింది. ఆనాటి పార్లమెంటు సభ్యులలో చెన్నారెడ్డి కూడా ఒకరు. పార్ల మెంటులో హైదరాబాదు లోని విషమ సంఘటనలను, పరిస్థితులను గురించి చెన్నారెడ్డి చేసిన ప్రసంగాలు నెహ్రూ, రాజాజీల వంటి వారిని ఆకర్షించాయి. పర్యవసానంగా చెన్నారెడ్డి కాంగ్రెస్ పార్టీ విప్ గా ఎన్నుకో బడ్డారు.
ఇంతలో 1952లో దేశమంతటా ప్రప్రధమంగా వయోజన వోటింగు పద్ధతిని జనరలు ఎన్నికలు జరిగాయి. చెన్నారెడ్డి హైదరాబాదు రాష్ట్ర శాసన సభకు ఎన్నుకో బడ్డారు. తర్వాత బూర్గుల మంత్రివర్గంలో ఆహార, వ్యవసాయ శాఖలమంత్రిగా తీసుకోబడి, ఇండియన్ డెలిగేషనుకు నాయకత్వం వహించి, 1953, 1955 సంవత్సరాలలో విదేశాలు పర్యటించారు. ఆంధ్రప్రదేశ్ అవతరణ జరిగిన తర్వాత సంజీవరెడ్డి, బ్రహ్మానందరెడ్డి మంత్రి వర్గాలలో కూడా చెన్నారెడ్డి మంత్రిగా పనిచేశారు. ఆంధ్ర రాష్ట్రంతో తెలంగాణ విలీనాన్ని వ్యతిరేకించారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పెద్ద మనుషుల ఒప్పందంపై సంతకం చేసిన తెలంగాణ ప్రాంత నేతలలో ఒకరు . డాక్టర్ రెడ్డి 1967 లో ఇందిరా గాంధీ కేంద్ర మంత్రివర్గంలో ఉక్కుశాఖా మంత్రిగా తీసుకో బడ్డారు.
ఆంధ్రప్రదేశ్ లోని తెలంగాణ ప్రజలు సాంఘిక ఆర్ధిక విద్యా రంగాలలో వెనుకబడి యుండడాన్ని డాక్టరు చెన్నారెడ్డి సహించలేక పోయారు. ఏప్రిల్ 1968 లో కేంద్ర మంత్రివర్గం నుండి రాజీనామా చేసారు. 1968లో ఢిల్లీ నుండి హైదరా బాదుకు తిరిగి రాగానే ‘‘తెలంగాణ ప్రజా సమితి’’ అనే పార్టీని నెలకొల్పి, ప్రత్యేక తెలంగాణ నిర్మాణం కొరకు పోరాటం సాగించారు. ఉద్యమాన్ని రాజకీయం చేసేందుకు చెన్నారెడ్డి తెలంగాణ ప్రజాసమితి అధ్యక్షుడయ్యారు. విభజనకు మద్దతిచ్చే ఆ పార్టీ 11 లోక్‌సభ స్థానాలను (14 స్థానాల్లో) గెలుచు కోవడం ద్వారా ప్రజా ఆదరణ పొందింది. ఉత్తర ప్రదేశ్ (1970ల మధ్యలో రాష్ట్రపతి పాలన సమయంలో), రాజస్థాన్, పంజాబ్, తమిళనాడు మరియు పాండిచ్చేరి గవర్నర్‌గా కూడా ఉన్నారు. 1971లో సిక్స్ పాయింట్ ఫార్ములా రూపొందించిన ఘనత ఆయనదే. 1972లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు జరిగినప్పుడు కాంగ్రెస్ మేనిఫెస్టోలో ‘న్యూ డీల్ ఫర్ తెలంగాణ’గా చేర్చారు.
డాక్టరు చెన్నారెడ్డి శక్తి సామర్థ్యా లను గుర్తించిన ఇందిరా గాంధీ, ఆయనను ఉత్తరప్రదేశ్ గవర్నరుగా నియమించగా, 1974 అక్టోబరు 24వ తేదీన పదవీ స్వీకారం చేశారు.1977 అక్టోబరులో గవర్నరు పదవివి రాజీనామా చేసి హైదరాబాదుకు తిరిగి వచ్చారు. దేశ పరిస్థితులను, వివిధ రాజకీయ పక్షాల తీరు తెన్నులను పరిశీలిం చారు. చివరకు కాంగ్రేసు (ఐ) పార్టీని తమ పార్టీ గా నిర్ణయించు కున్నారు. 1978 జనవరి 18 వ తేదీని రాష్ట్రకాంగ్రేసు (ఐ) అధ్యక్ష పదవిని స్వీకరించారు. 1978 ఫిబ్రవరిలో జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో డాక్టరు చెన్నారెడ్డి కృషి వలన కాంగ్రెస్ (ఐ) పార్టీ 180 స్థానాలు గెలుచు కొన్నది. అత్యధిక సంఖ్యాబలం గల కాంగ్రేస్ (ఐ) పార్టీ తరుపున డాక్టరు చెన్నారెడ్డి గారు 1978 మార్చి 6వ తేదీని ముఖ్యమంత్రి పదవిని అలంక రించారు. డిసెంబర్ 2,1996న చెన్నారెడ్డి మరణించారు. చెన్నారెడ్డి సమాధి హైదరాబాదులో ఇందిరా పార్కు ఆవరణలో ఉంది.
– రామ కిష్టయ్య సంగన భట్ల…
9440595494.