దశాబ్దాలుగా పోలవరం నిర్మాణ పనులు

  • నిర్వాసితులకు పరిహారం చెల్లింపులో నిర్లక్ష్యం
  • వరదలు వచ్చి నిండా మునిగినా పట్టించుకోని పాలకులు

ఏలూరు,జూలై 29 : దశాబ్దాలుగా పోలవరం ప్రాజెక్టు అనేక పార్టీలకు ఎన్నికల హాగా ఉంటోంది. గత ప్రభుత్వం కూడా 2019 నాటికే ప్రాజెక్టు పూర్తి చేస్తామని అసెంబ్లీ సాక్షిగా చెప్పింది. కానీ దానికి తగ్గట్టుగా పనులు చేయలేకపోయింది. రెండేళ్లు దాటిన వైసిపి ప్రభుత్వం కూడా 2021 నాటికే పోలవరం ప్రాజెక్టు నుంచి నీళ్లిస్తామని చెప్పింది. కానీ ఇప్పుడు దానిని మరో ఏడాదికి పొడిగించింది. ఇవన్నీ ఒక ఎత్తయితే పునరావాస ప్యాకేజీ పెద్ద సమస్యగా మారింది. వీరికి పరిహారం ఇస్తే ఖాళీ చేయడానికి పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులు సిద్దంగా ఉన్నారు. ప్యాకేజీ ఇవ్వకుండా ఖాళీ చేయకూడదని ఎ.పి హైకోర్టు కూడా ఆదేశించింది. ప్రభుత్వం మాత్రం ఆగష్టు నాటికే 48 గ్రామాలను ఖాళీ చేయిస్తామని చెబుతోంది. మొత్తంగా పోలవరం ప్రాజెక్టు వ్యవహారం పెద్ద ప్రహసనంగా మారుతోంది. కేంద్ర ప్రభుత్వం చేతులు దులుపుకోవడానికి యత్నిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం దానిని నిలదీసి, నిధులు రాబట్టడంలో విఫలమవుతోంది. బాధితులు మాత్రం నిలువు నీళ్లలో, ఇప్పుడు వరదల సమయంలో చీకట్లో కాలం వెళ్లదీయాల్సి వస్తోంది. ఆర్‌ అం‌డ్‌ ఆర్‌ ‌ప్యాకేజీ సంగతి ఆ తర్వాత ప్రస్తుతం వరదల సమయంలో సహాయక చర్యలు చేపడదామనే ఆలోచన కూడా ప్రభుత్వాలకు రావడం లేదు. దీంతో మూడేళ్లుగా కొద్దిపాటి వరదలకే ఊళ్లన్నీ జలమయమవుతున్నాయి.

ఈ ఏడాది కాఫర్‌ ‌డ్యామ్‌ ‌మూసేశాక బ్యాక్‌ ‌వాటర్‌ ‌మూలంగా వంద గ్రామాలు జలదిగ్బంధంలో ఇరుక్కున్నాయి. మాట తప్పిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరు మూలంగా మన్యం వాసులు బాధితులుగా మిగిలారు. పిల్లలు, వృద్ధులు, మహిళలు సహా అందరూ నానా ఇబ్బందులు పడుతున్నారు. సహజంగా జులై మధ్య నుంచి ఆగస్టు ఆఖరు వరకూ గోదావరికి ఉధృతంగా వరద తాకిడి ఉంటుంది. ఈసారి సీజన్‌ ‌ప్రారంభంలోనే వరదల ప్రభావం కనిపిస్తోంది. ఇది రాబోయే నెల రోజుల పాటు మరింత తీవ్రంగా ఉండే ప్రమాదం ఉంది. అదే జరిగితే నిర్వాసితులు అనేక అవస్థలు పడాల్సి వస్తుంది. గతంలో గోదావరికి పెద్ద వరదలన్నీ ఆగస్టులోనే వచ్చాయి. కాబట్టి వచ్చే నెల పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు అత్యంత కష్టకాలం. ఇప్పటికే అవకాశం ఉన్నవారంతా ఒడ్డుకు చేరారు. కానీ గిరిజనలకు మాత్రం కాలనీలు సిద్ధం చేయక, ప్యాకేజీ అందక వరదల్లోనే గడపాల్సిన దుస్థితి దాపురించింది. ఇప్పుడు వరదల్లో వారికి రవాణా సదుపాయాలు కూడా లేవు. నిత్యావసర సరుకులు కూడా అందుబాటులో ఉంచలేదు. గత ఏడాది ప్రభుత్వ నిర్లక్ష్యం మూలంగా ఏర్పడిన సమస్యలపై ముంపు బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. అప్పట్లో అధికారులు తప్పిదాన్ని అంగీకరించారు. ఈసారి కూడా గత ఏడాది అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకున్నట్టు లేదు. ఉద్దేశపూర్వకంగానే ఇలా వ్యవహరిస్తున్నారు.

ఆహార పదార్థాలు, కిరోసిన్‌ ‌వంటివి అందుబాటులో ఉంచడం ద శ్రద్ధ పెట్టలేదు. ఇప్పటికైనా యంత్రాం గం కదలాలి. నిర్వాసితులకు నిత్యావసరాలు పంపిణీ చేయాలి. పడవలు ఏర్పాటు చేసి రవాణా సదుపాయం కల్పించాలి. వరద సహాయక చర్యలు సమగ్రంగా చేపట్టాలి. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో పునరావాస ప్యాకేజీ అమలుకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలి.

దానికి భిన్నంగా సాగితే పోలవరం నిర్వాసితుల ఆగ్రహాన్ని ప్రభుత్వం చవిచూడాల్సి ఉంటుంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయం మొత్తం కేంద్రమే భరించాలి. చట్ట ప్రకారం జాతీయ •దా ఉన్న ప్రాజెక్టుని నిర్మాణ వ్యయంపై పరిమితులు విధించడం మానుకోవాలి. కేంద్రం నుంచి నిధులు తీసుకురావడానికి ముఖ్యమంత్రి చిత్తశుద్ధితో ప్రయత్నిం చాలి. భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక స్థాయి దాటినా వరద చూడని గ్రామాలు కూడా ఇప్పుడు మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయిలో నీటిమయమయ్యాయి. కాఫర్‌ ‌డ్యామ్‌ ‌కారణంగా ఇలాంటి ముప్పు ఉంటుందని ప్రభుత్వాలకు తెలిసినా స్పందించలేదు.

వామపక్షాలు, ఇతర నేతలు వరద బాధలను, నిర్వాసితులను ఆదుకోవాల్సిన అవసరం గురించి మొత్తుకుంటున్నా పాలకులు మిన్నకున్నారు. గత ఏడాది వరదల్లో ఆహారం, కిరోసిన్‌ ‌వంటివి కూడా అందించడానికి ఏర్పాట్లు చేయలేదు. అంతకుముందు 2019 వరదల సమయంలో ముఖ్యమంత్రి ప్రకటించిన వరద సహాయం 2020 వరదలు వెళ్లిన తర్వాత చెల్లించారంటే బాధితుల పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధి స్పష్టమవుతోంది. ఈసారి కాఫర్‌ ‌డ్యామ్‌ ‌పూర్తిగా మూసేసిన తర్వాత వరద తాకిడి మరింత ఎక్కువ ఉంటుందని అధికారికంగానే వెల్లడించారు. అందుకు అనుగుణంగా సహాయక చర్యలు మాత్రం చేపట్టలేదు. ప్రస్తుతం వరదల్లో చిక్కుకున్న గ్రామాల ప్రజలు స్వచ్ఛందంగా ఇళ్ళు వదిలిపోయేలా చేసే పన్నాగంలో ఉన్నట్టు ఇట్టే అర్థమవుతోంది. ప్యాకేజీ చెల్లించి, నిర్వాసిత కాలనీలు సిద్ధం చేసి బాధితులందరినీ తరలించాల్సి ఉండగా దానికి భిన్నంగా ఏ దారి లేని నిర్వాసితులంతా ఊళ్లు వదిలిపోయేలా చేస్తున్నారు. చట్టాన్ని ప్రభుత్వమే యథేచ్ఛగా ఉల్లంఘిస్తూ రాష్ట్ర ప్రజల అవసరాల కోసం సర్వం వదిలిపోతున్న వారి జీవితాలతో ఆడుకుంటున్నట్టు కనిపిస్తోంది. అందుకే ఈసారి వరదలను ఊహించిన నిర్వాసితులు కొండలపై తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేసుకుంటున్నా అడ్డుకునే యత్నం చేశారు. వరదలు వస్తే తినడానికి అవసరమైన నిత్యావసర సరుకుల కోసం సంతకు వస్తే తిరిగి వెళ్లేందుకు పడవలను కూడా అనుమతించకుండా అమానుషంగా ప్రవర్తించారు.

breaking updates nowconstruction worksheadlines nowPolavaram constructionshortnews in teluguToday telangana news
Comments (0)
Add Comment