ధనం చుట్టూ మూగుతున్న జనం…

వర్తమాన, రాజకీయ, ఆర్థిక,సామాజిక స్థితిగతులను పరిశీలించి, విశ్లేషణ చేస్తే, చాలా బాధాకరమైన విషయాలు బయట పడతాయి. రాజకీయాలు ప్రజాసేవకు కాకుండా ప్రజలపై అధికారం చెలాయించడానికి, అవినీతికి రాచబాటలా మారుతున్నాయి. చిత్తం విత్తం మీద  కేంద్రీకరించబడిన సమాజంలో మానవ  సంబంధాలన్నీ ఆర్ధిక చట్రంలో ఇరుక్కుపోయాయి. ధనం చుట్టూ జనం మూగుతున్నారు. డబ్బును బట్టి చుట్టరికాలు పుట్టుకొ స్తున్నాయి. మనిషి గుణగణాలు కరెన్సీ కట్టల ముందు విలవిలలాడు తున్నాయి. రాజకీయం, కులం, మతం అన్నీ ఆర్ధిక కోణంలోనే పరిభ్రమిస్తున్నాయి. మనిషి ఎంత ఎత్తుకు ఎదిగినా, విజ్ఞానం వికసించినా ఇంగిత జ్ఞానం ఇసుమంతైనా కానరావడం లేదు. అవకాశం రాకకొందరు నిర్లిప్తంగా ఉన్నా, అవకాశమొస్తే శివుని శిరస్సుపై తాండవమాడే శివగంగలా చెలరేగి పోవడానికి సంసిద్ధులే అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మానవుల ఆశకు అంతం అనేది లేకుండా పోయింది. అత్యాశకు ఆకాశమే హద్దుగా మారింది. స్వార్ధం పడగవిప్పి బుసలు కొడుతున్నది.కాసుల వేటలో పడి మానవత్వాన్నే అమ్మేసే ప్రబుద్ధులు కొందరైతే, అత్యాశతో  అలవికాని కోర్కెలతో అరాచకవాదం వైపు పయనిస్తున్న వారు మరికొందరు.

పంచభూతాలను పరమాన్నంలా   భోంచేస్తున్న వారు కొందరైతే,వీలైతే ఇతర గ్రహాలను సైతం తమ ఆధిపత్యం లోకి తెచ్చుకుని, తిష్ఠవేయాలనే దురాశ కొందరిది. దురాశతో దూరాలోచన మరచి, విజ్ఞత క్షీణించి,వివేకాన్ని కాటికి సాగనంపి,విచక్షణ కోల్పోయి,అహంకార మదంతో చెలరేగి పోయే మానవ మస్తిష్కాలకు రాబోయే విపత్కర పరిణామాల గురించి యోచన చేసే తీరికెక్కడిది? శాస్త్ర,సాంకేతిక పరిజ్ఞానంతో సుఖవంతమైన జీవితాన్ని ఆస్వాదించే  మానవజాతి ఇంకా ఏదో సాధించాలనే తపనతో తనను తానే వంచించుకుని,హింసించుకునే  హీన స్థితికి దిగజారింది. ఆకాశహర్మ్యాలలో విహరిస్తూ, చంచల స్వభావచిత్తులై   నేలవిడిచి సాము చేస్తున్న స్వార్ధ మానవలోకంలో మనిషి విలువ క్షీణించింది.మనిషి మనిషికీ సంబంధాలు లేవు. మనుషుల  మనసుల్లో మాలిన్యం పెరిగిపోయింది. ఒకరిపై మరొకరికి ఈర్ష్యా ద్వేషాలు పెరిగి పోయాయి. విశాలమైన ప్రపంచం దగ్గరైనా, మనుషుల్లో మాత్రం దూరం పెరిగిపోయింది.మనిషి హృదయంలో  అసంతృప్తి జ్వాలలు కార్చిచ్చులా దహిస్తున్నాయి.ఇతర గ్రహరాశుల గమనం గురించి అధ్యయనం చేస్తూ, గ్రహదోషాలను సవరించడానికి ప్రయత్నిస్తున్న మానవుడు తనకు పట్టిన అనైతిక దోషాన్ని నిలువరించలేకపోవడం విడ్డూరం.
ఏదో సాధించాలనే తపనతో తనను తానే వేధించుకుతినే స్థితికి మానవుడు దిగజారి పోయాడు.‘‘స్వార్ధంలో పరమార్ధం- సూక్ష్మంలో మోక్షం’’ వెదుకులాటలో పడి తన అస్థిత్వాన్ని కోల్పోతున్నాడు.

కోట్లకోసం కుమ్ములాటలు… ఆస్తుల కోసం ఆరాటాలు… అలవికాని కోరికల కోసం పోరాటాలు…ఇదే మానవనైజం.’’తన స్వార్ధమే తనకు రక్ష ‘‘అనే రీతిలో సమాజహితాన్ని గాలికొదిలి, స్వప్రయోజ నాలకోసం విలువలకు తిలోదకాలిచ్చి, హీనంగా జీవిస్తూ, హీనత్వంలోనే శిఖరాగ్రమంత ఉన్నతిని గాంచి ఊహల్లో ఊరేగుతున్న ‘మనిషి’  మానసిక పతనం సమాజానికి శాపం. స్వార్ధం, ద్వేషం, అసూయ, అహంకారం, అవినీతి వంటి మనో జాఢ్యాలు వైద్యపరిభాషకు అందనంత ఎత్తులో తిష్ఠవేశాయి.మనిషి పెరిగాడు – డబ్బుకు దాసోహ మయ్యాడు. మనసు తరిగింది. మానవతత్వం మారింది- మానవత్వం నశించింది. విజ్ఞానం పెరిగింది.వికాసం క్షీణించింది. మనిషి విజ్ఞాని,మానసికంగా అజ్ఞాని.సంస్కారం లోపించింది- సహనం  నశించింది. తాను సంపాదించిన ధనంతో తృప్తిపడక, ధనమదంతో ఇతరులను వేధించుకుతినే పైశాచికత్వం మనిషిని అధఃపాతాళానికి దిగజార్చింది.ఆధునిక మనిషిలో అసలు మనిషి అదృశ్యమై,మనసులేని రాతిమనిషి, ప్రాణమున్న మరమనిషి  ఉద్భవించాడు.స్వచ్ఛమైన మనసు స్థానంలో కృత్రిమమైన మనసు మొలకెత్తింది. కడుపులో కత్తులు పెట్టుకుని, మనసులో కాఠిన్యం నింపుకుని, వదనంలో అరువు తెచ్చిన చిరుదరహాసాన్ని ధరించి కృత్రిమ కౌగిలింతలతో నటనా కౌశలం ప్రదర్శిస్తూ, మహానటులను తలపించే  రీతిలో ఆత్మవంచనతో బ్రతికేస్తున్నాడు నేటి మనిషి.కోట్లకు పడగలెత్తినా గుప్పెడు మెతుకులకు నోచుకోడు. అనారోగ్యంతో ఆసుపత్రుల వెంట పరుగులు… వైద్యుల చికిత్సకు లొంగని రోగాలు…

ఆకలి దహిస్తున్నా తినలేని దుస్థితి. లెక్కలేని ధనం అక్కరకు రాని చుట్టంలా వెక్కిరిస్తుంటే భోషాణాల్లో మూలుగుతున్న నల్లధనానికి  రెక్కలొచ్చి  ఎగిరిపోకుండా అహర్నిశలు కాపలా కాస్తూ అందులోనే పరమానందం పొందే లోభగుణం సకల దుర్గుణాల్లో  మహాచెడ్డగుణం.ధనార్జనకే జీవితమన్నట్టు బ్రతికేస్తే ఆ జీవితానికి అర్ధం నిఘంటువుల్లో భూతద్దంతో వెదకినా దొరకదు.శక్తియుక్తులన్నీ స్వార్ధానికి ఖర్చయిపోయే ఇంధనంలా మారిపోతే, వ్యాపారవ్యూహాల్లో,స్వార్ధ చింతనలో తలమనకలై నిజమైన ఆనందాన్ని వదిలేస్తే,చివరికి మనశ్శాంతి కరువై, తన మనసుకు తానే బరువై తనువు చాలించే కోటీశ్వరుల కథలన్నీ కన్నీటి కావ్యాలే- మానసిక వేదనలే.భూగోళమంతా భగ్గుమంటున్నది. కాలుష్య భారంతో జనవాహిని అల్లాడిపోతున్నది. కల్తీ సరుకులతో  మానవారోగ్యం మంచంపై పడిరది.

పీల్చేగాలి, త్రాగే నీరు, తినే తిండి  విషతుల్యమైపోయింది.భూ ఉష్ణోగ్రత లు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. పర్యావరణం  ప్రమాదం లో పడిరది. ప్రకృతి ప్రకోపానికి మానవాళి కకావికలమైపోతున్నది. భూగర్భజలాలు అడుగంటు తున్నాయి. బంగారు బాతు గుడ్డు లాంటి భూగర్భసంపద   స్వార్ధపూరితమైన ఆలోచనలతో కొల్లగొట్టబడుతున్నది. ఇంధన వనరులు తరిగిపోతున్నాయి. పాడి పంటలన్నీ విచ్ఛిన్నమైపోతున్నాయి.మనిషికి నిలువ నీడకూడా దొరకని పరిస్థితులు దాపురిస్తున్నాయి.  భూగోళం నిర్జీవమైపోతే మానవగతి ఏమౌతుంది? ఇతర గ్రహాలు నివాసయోగ్యమా? ఇది సాధ్యమా? భవిష్య పరిణామాలు ఎంత తీవ్రంగా ఉండబోతున్నాయో తెలిసి కూడా  చెట్టు కొమ్మపై సుఖనిద్ర పోయే మనిషి నిర్లిప్తత, నిర్లక్ష్య ధోరణి విభ్రాంతి కలిగిస్తున్నది. రాబోయే కాలంలో మానవ మనుగడ దుర్లభమని తెలిసినా, మనిషిలో స్వార్ధ చింతన పోలేదు. కాసుల కక్కుర్తి కోసం విలువలను చంపేసి,సాటి మనుషుల బ్రతుకులను దుర్భరం చేసి, పైశాచికానందం పొందుతూ జీవించడం ఆత్మహత్యాసదృశమే.
సుంకవల్లి సత్తిరాజు
(సామాజిక విశ్లేషకులు, మోటివేషనల్‌ స్పీకర్‌)
సంగాయగూడెం, దేవరపల్లి మండలం,
తూ.గో.జిల్లా, ఆంధ్రప్రదేశ్‌
9704903463

Breaking News NowPeople who are silent around moneyprajatantra newstelangana updatestelugu kavithaluToday Hilights
Comments (0)
Add Comment