పి వి మానస పుత్రికే ఇంటర్ విద్య

“విద్యాయా అమృతే మశ్నుతే”విద్య అమరత్వాన్ని ప్రసాదిస్తుంది అనే పి వి చింతనా  చిహ్నంతో 1969లో ఇంటర్ విద్య బోర్డ్ ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో ప్రారంభమైంది.ఇప్పుడు తెలంగాణ ఇంటర్ విద్యా మండలి “విద్యా వినయేన శోభతే”అనే సూక్తిని చేర్చుకుని వినయంను విద్యను విస్తరించుకుంటూ పోతున్నది.1969-70 లో పి వి నరసింహరావు చేతుల మీదుగా ఇంటర్ విద్యా సంవత్సరం ప్రారంభించబడింది.ఆనాటి నుండి అప్రతిహతంగా అజేయంగా కొనసాగుతూ 2020 లో స్వర్ణోత్సవ వసంతంలోకి సగర్వంగా ప్రవేశించింది.”

ప్రపంచమంటే యూరప్ అమెరికా ఖండాలే కాదు అని ద్విధ్రువ ప్రపంచానికి ప్రత్యమ్నాయంగా తనదైన విదేశాంగ విధానంతో ప్రపంచ ప్రధాన రాజ్యాల శ్రేణిలో భారతదేశాన్ని నిలబెట్టినవారు భారత ప్రియపుత్రుడు, తెలంగాణ ధాత్రి నుండి ఎగిసిన శాంత విప్లవస్వరూపుడు పి వి నరసింహరావు.తన మేధో హృదయంతో ,మానవ విమోచన కోసం తపించే ఉదాత్తత ,రైతు గుండెల కొరకు రగిలే మనసు కలిగి ఉన్నందున కారణంగానే స్వతంత్రానికి పూర్వం తర్వాత ఈ దేశ గ్రామీణ రైతాంగం” భూమి” సమస్యతో నిర్వహించిన పోరాటాలకు తన పటిష్ట భూసంస్కరణ చట్టాలతో భూపంపకానికి మార్గం వేసాడు.పి వి ఏ శాఖను నిర్వహించిన అద్భుత ఫలితాలను సాధించి అందరికి ప్రేమపాత్రుడు అయ్యాడు.ఇదే క్రమంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రజాతంత్ర విద్య ను అందించడం కోసం విద్యారంగములో కీలక సంస్కరణలకు ఆద్యుడిగా ఉండి గొప్ప ముందడుగు వేయించాడు.దేశంలోని ఎక్కడ లేని ఇంటర్ విద్య ను,గురుకులాలను తెలుగు రాష్ట్రంలో ప్రవేశపెట్టారు. “విద్యాయా అమృతే మశ్నుతే”విద్య అమరత్వాన్ని ప్రసాదిస్తుంది అనే పి వి చింతనా చిహ్నంతో 1969లో ఇంటర్ విద్య బోర్డ్ ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో ప్రారంభమైంది.ఇప్పుడు తెలంగాణ ఇంటర్ విద్యా మండలి “విద్యా వినయేన శోభతే”అనే సూక్తిని చేర్చుకుని వినయంను విద్యను విస్తరించుకుంటూ పోతున్నది.1969-70 లో పి వి నరసింహరావు చేతుల మీదుగా ఇంటర్ విద్యా సంవత్సరం ప్రారంభించబడింది.ఆనాటి నుండి అప్రతిహతంగా అజేయంగా కొనసాగుతూ 2020 లో స్వర్ణోత్సవ వసంతంలోకి సగర్వంగా ప్రవేశించింది.

స్వతంత్ర భారతంలో వ్యవసాయ పారిశ్రామిక ఆర్ధిక రంగాలలో స్వయం స్వాలంబన సాధించడంలో విద్య పాత్రను గ్రహించిన నెహ్రు విద్యా ప్రగతి కోసం సెకండరీ విద్య కమిషన్,యూనివర్సిటీ విద్య కమిషన్ లాంటి అనేక కమిషన్ లను నియమించి వాటి ప్రతిపాదనలను యుద్ధ ప్రాతిపదికన అమలు చేసింది.సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం పాఠశాల స్థాయిలో సాధారణ విషయాలతో పాటు సాంకేతిక ,వృత్తి విద్యా కరికులం లో విద్యార్థులు తమకు నచ్చిన విషయాలను అధ్యయనం చేయడానికి సెకండరీ పాఠశాలలను మల్టిపర్పస్ పాఠశాలలుగా మార్చింది.అయితే ఈ బడులలో ప్రత్యేక శిక్షణ పొందిన టీచర్లు లేకపోవడం,మౌళిక సౌకర్యాల లేమి కారణంగా అనుకున్న ఫలితాలు రాలేదు.దీనిని అధ్యయనం చేయడం కోసం ,దేశీయ విద్యా విధానమును సమూలంగా ప్రక్షాళన చేయడం కోసం ప్రధాని నెహ్రూ డి యస్ కొఠారి అధ్యర్యంలో జాతీయ విద్యా కమిషన్ ను ఏర్పాటు చేశారు.ఈ కమిషన్ మల్టిపర్పస్ విద్యా విధానమును రద్దు పరిచి 10+2+3 విధానాన్ని సిఫార్సు చేసింది.విద్యా సంస్థలు ప్రభుత్వ ఆధీనంలో ఉండాలని ,పేద ధనిక వర్గాల అని తేడా లేకుండా అందరికీ ఒకే రకమైన విద్యను అందించే సామాన్య విద్యా వ్యవస్థ ను ఏర్పాటు చేయాలని సూచిందింది.దీనిని అప్పటి సమైక్య రాష్ట్రంలో అమలు చేయడానికి సాధ్య అసాధ్యాలను పరిశీలన అధ్యయనం చేయడానికి ,అంబేద్కర్, నెహ్రూ ల ప్రజాతంత్ర విద్య ను మరింతగా ముందుకు తీసుకపోవడం కోసం 1967-71 వరకు విద్యా శాఖమంత్రిగా పని చేసిన విద్యావేత్త పి వి నర్సింహారావు స్వీయ పర్యవేక్షణలో విద్యా ముఖ్య కార్యదర్శి యమ్. వి రాజగోపాల్ నేతృత్వంలో కమిటీని వేశారు.వీరు అనేక ఐరోపా ,తూర్పు ఆసియా దేశాలను పర్యటించి పని అనుభవ ప్రాతిపదికన,ప్రత్యేక శిక్షణ పొందిన భోధకులతో నడుస్తున్న మాధ్యమిక విద్య విధానాన్ని అధ్యయనం చేశారు.రాజగోపాల్ సూచనల మేరకు విద్యా శాఖ మంత్రి పని చేసిన తెలంగాణ బిడ్డ పి వి నర్సింహారావు పాఠశాల విద్యలో భాగంగా ఉన్న పి యు సి కోర్స్ ను రద్దు చేసి ప్రభుత్వ ఉన్నత విద్యలో భాగంగా ఇంటర్ విద్యను అందించే జూనియర్ కళాశాలలను ప్రారంభించారు.కాంపోజిట్ గా ఉన్న డిగ్రీ కళాశాలల్లో కుడా ఇంటర్ విద్య ను భాగంగా చేశారు.పి వి చొరవతోనే తెలుగు అకాడెమి, గురుకుల పాఠశాలలు, జునియర్ ,డిగ్రీ కళాశాలలు ప్రారంభమయ్యాయి.జాతీయ స్థాయిలో అనేక రాష్ట్రాలలో +2 విద్యను హయ్యర్ సెకండరీ విద్యగా పరిగణిస్తున్నారు.ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లో మాత్రమే ఉన్నత విద్యలో భాగంగా ఉంటూ ప్రత్యేక భోధకులను కలిగి ఉండి ఉన్నత విశ్వ విద్యాలయ కోర్సులకు ,స్వయం ఉపాధి,వ్యాపారం,పరిశ్రమల లలో పాల్గొనదానికి దోహదం చేసే కోర్సులను,పాలిటెక్నిక్ ,ఇంజనీరింగ్ కోర్సులకు భిన్నమైన ఇంజనీరింగ్ వృత్తి విద్యా కోర్సులకు,ఇంకా అనేక ప్రభుత్వ ఉద్యోగాల ప్రవేశానికి దేశానికి ఒక నమూనా గా ఉండి పి వి దార్శనికత వెలుగులో అనేక విజయాలను సొంతము చేసుకుంటూపోతున్నది. జ్ఞాన విస్ఫొటనతో త్వరితగతిన మారుతున్న శాస్త్ర సాంకేతిక సామాజిక శాస్త్రాలు, సమాజ అవసరాలకు అనుగుణంగా కరికులం ఏర్పాటు కోర్సుల రూపకల్పన ,పరీక్షల నిర్వహణ మూల్యాంకనంల కోసం స్వయం ప్రతిపత్తి గల ఇంటర్ విద్య బోర్డ్ నిరంతరం పనిచేస్తున్నది.NCERT,చార్టెడ్ అకౌంటెన్సీ సంస్థ,సెస్ లతో ఒప్పందాలు కుదుర్చుకుని సిలబస్ రూపకల్పనలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నది.ఇప్పుడు తెలంగాణలో ఉన్న 1200పైగా ఉన్న ప్రభుత్వ,మోడల్ ,గురుకుల సొసైటీ జూనియర్ కళాశాలలు,1800 గా ఉన్న ప్రవేట్ కళాశాలలు ఇంటర్ విద్యా మండలి విధి విధానాల వెలుగులో పనిచేస్తున్నాయి.

ఈ క్రమంలో దేశ ప్రగతికి అవసరమైన శాస్త్ర సాంకేతిక నిపుణులను,సృజనకారులను ,సామాజిక శాస్త్రవేత్తలు,రాజకీయ వేత్తలను,పాలనాధికారులను దేశానికి అందించడంలో ప్రభుత్వ ఇంటర్ విద్య చోదకశక్తిగా పనిచేసింది.ప్రభుత్వ,ప్రభుత్వ సహాయం పొందుతున్న జూనియర్ కళాశాలలో అందించబడిన ఇంటర్ విద్యలో 1990లలో ఉత్పాదక రంగానికి పరిమితమయ్యిన ఉదారవాద సరళీకరణ ఆర్ధిక విధానాలు అవాంఛనీయ రీతిలో విద్యా రంగంలోకి ప్రవేశించింది.సమైక్య రాష్ట్రంలో ప్రభుత్వ ఇంటర్ విద్య పై తీవ్రమైన నిర్లక్ష్య ధోరణులు పాలకులు ప్రదర్శించారు. సమాజ సమిష్టి సంపద జ్ఞానం వ్యాపార వస్తువు అయ్యింది.నూతన కళాశాలల స్థాపన మరచిపోయారు. నీళ్లు నిధులు నియమకాలే కాదు ప్రభుత్వ విద్యారంగ వివక్షత కూడా మాలి దశ తెలంగాణ ఉద్యమానికి కారణమయ్యింది.ఆంధ్రాలో ప్రతి మండలానికి ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉండేది.2001 లో కే సి ఆర్,జయశంకర్, నాయకత్వంలో ఉప్పెన గా ప్రారంభమయిన ఉద్యమ ప్రభావంతో అప్పటి ఆంధ్ర పాలకులు అప్పటికప్పుడు వంద ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఏర్పాటు చేశారు.కనీస మౌళిక సౌకర్యాల కల్పన మరచిపోయారు.ప్రభుత్వ కళాశాలలో ప్రవేశాల సంఖ్య ప్రతిఏటా 20% చొప్పున పడిపోయాయి.

స్వరాష్ట్రం సిద్ధించాక తెలంగాణ పట్టుగొమ్మలు పల్లెలు వ్యవసాయ వికాసానికి అహర్నిశలు శ్రమిస్తూనే విద్యా రంగ సంస్కరణల కు పూనుకున్నారు.ప్రభుత్వ ఇంటర్ విద్య నుండి ఎదిగిన కేసీఆర్ దార్శనికత ,అప్పటి విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి ల కార్యశీలత తో ప్రభుత్వ ఇంటర్ విద్య పునరుత్తేజం పొందినది.ఉత్కృష్ఠ ప్రమాణాలతో నిర్వహించే ఆరు వందల కు పైగా మైనారిటీ,బిసి,సాంఘిక సంక్షేమ, గిరిజన గురుకుల జూనియర్ కళాశాలను ఏర్పాటు చేశారు.194 మోడల్ సొసైటీ కళాశాలకు తోడు గా 100 కస్తూర్భా బడులను జూనియర్ కళాశాలలుగా అప్ గ్రేడ్ చేసారు. వీటిలో గల వేల సంఖ్యలో ఉన్న సీట్లకు లక్షల్లో సంఖ్యలో పోటి పడుతున్నారు.ప్రజా విద్యా సంస్థల నిర్వహణ ప్రమాణాలకు ,కేసీఆర్ విద్యా తాత్వికతకు ప్రజలలో కలుగుతున్న నమ్మకానికి , అందిస్తున్న మద్దతుకు ఇది సజీవ తార్కాణం. మార్చ్ 2020 ఇంటర్ ఫలితాల ఉత్తీర్ణత శాతంలోను,మార్కుల సాధనలో ప్రవేట్ కార్పొరేట్ ల ను మించి ఫలితాలను సాధించాయి.

ఇంటర్ విద్యా మండలి ప్రత్యక్షంగా నిర్వహిస్తున్న 404 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఏటికి ఎదురీది సాధిస్తున్న అపూర్వ విజయాల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.2014 లో అరవై వేలు గా ఉన్న ప్రవేశాలు ప్రతి ఏటా 20% పెరుగుతూపోయి ఈ రోజు రెండు లక్షలకు చేరుకున్నాయి.కేసీఆర్ గారు అందించిన 400 కోట్లతో అన్ని కళాశాలలో అవస్థాపన సౌకర్యాలు ఏర్పడ్డాయి.పూర్తి ఉచిత ప్రవేశాలు,పాఠ్యపుస్తకాలు అందచేశారు.సాంకేతిక రంగంలో కొత్త పుంతలు తొక్కుతున్న నేపథ్యంలో ICT (information and communication technology )లో భాగంగా ప్రతి కళాశాలకు ఆధునిక కంప్యూటర్ లను అందించి డిజిటల్ తరగతి గదులను ఏర్పరచారు.గురుకుల సొసైటీలలో కేంబ్రిడ్జ్ తరహాలో న్యూ క్వాలిటీ పాలసీ లో భోధకుల విషయ పరిజ్ఞానం,నైపుణ్యాల పై తరచుగా మూల్యాంకనం జరుగుతూ శిక్షణ తరగతులను నిర్వహిస్తారు.సమైక్య రాష్ట్రంలో నిద్రాణంగా ఉన్న వృత్యంతర అధ్యాపక శిక్షణ సంస్థను జయశంకర్ సంస్థగా మార్చి 2014 నుండి ఇప్పటి వరకు నాలుగు సార్లు విషయ నిపుణలతో ఓరియంటేషన్ కార్యక్రమాలను నిర్వహించారు.దేశంలో అత్యున్నత సంస్థ ప్రాంతీయ విద్యా కేంద్రం మైసూర్ లో తెలంగాణ ప్రభుత్వ అధ్యాపకులకు ప్రత్యేక శిక్షణ ఇప్పించారు.ప్రిన్సిపాల్స్ కు మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో శిక్షణ ఇప్పిస్తున్నారు.ఇవన్నీ అధ్యాపకుల సహజ నైపుణ్యాలకు పదును పెడుతూ ,కొత్త ఆలోచనలను రగిలిస్తూ పాఠాలు భోదించగల సామర్ధ్యాలను కలిగించాయి.విద్యార్థులందరికీ ఒకే సారి వీక్షించే లైవ్ స్ట్రీమింగ్ తరగతులను కూడా నిర్వహిస్తున్నది.స్వయం ఉపాధి,తక్షణ ఉపాధి కి తోడ్పడే 80 రకాల ఓకేషనల్ కోర్సులను అందిస్తూ యువత జీవితాల్లో వెలుగులను నింపుతున్నది.

ప్రభుత్వ జూనియర్ కళాశాలల అసాధారణ విజయంలో అధ్యాపకుల కృషి ప్రంశసనీయం.750 రెగ్యులర్ అధ్యాపకులు,3750 ఒప్పంద అధ్యాపకులు1500 అతిథి అధ్యాపకులు తమ జీవికకు, హోదా కు భద్రత కు కారణమైన ఇంటర్ విద్యా వ్యవస్థ పరిరక్షణకు కు అహర్నిశలు కృషిచేస్తున్నారు.ఇంటర్ విద్య కు ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహాలను గ్రామ గ్రామాన తీసుకెళుతున్నారు.అదనపు పనిగంటలు,రెమిడియల్ తరగతులను నిర్వహిస్తూ కంటి కి రెప్పలా తమ మాతృవ్యవస్థను కాపాడుకుంటున్నారు.తమ జీతంలో కొంత భాగాన్ని నిరు పేద విద్యార్థుల వికాసానికి సహాయంగా అందిస్తున్నారు.అంతే గాకుండా పేద వర్గాలతో పాటు మధ్య తరగతి పిల్లల కు చక్కటి విద్య ను అందిస్తున్న తల్లి వంటి వ్యవస్థను కార్పొరేట్ ,విచ్చిన్న కర శక్తులతో మిలాఖత్ అయ్యి ఇంటర్ విద్యా వ్యవస్థను అప్రతిష్ట పాలు చేయడానికి ప్రయత్నించిన దళారులను కుట్రలను ఛేదించారు.దేశంలోనే ఆరు దశల వడపోతతో ,జాగ్రత్తలతో, అత్యున్నత ప్రమాణాలతో ఇంటర్ మూల్యాంకన ప్రక్రియ జరుగుతుంది.ఇంటర్ బోర్డ్ అమలు చేస్తున్న సాంకేతికతకు 2014 నుండి అనేక సార్లు జాతీయ ,అంతర్జాతీయ ప్రతిష్టాత్మక స్కొచ్ పురస్కారాలను పొందినది.ఇలాంటి ఇంటర్ బోర్డ్ ను కట్టుకథలతో అభాసుపాలు చేసి ఈ వ్యవస్థలో పని చేసే వేలాది అధ్యాపకుల పొట్టగొట్టే ప్రయత్నం చేసి, విద్యార్థుల అసహజ మరణాలకు కారణమయిన వారి స్వరూపాన్ని బట్టబయలు చేసారు. తెలంగాణ ఇంటర్ విద్య ఎప్పటికి ప్రకాశించే వెలుగు అని స్వర్ణోత్సవ కానుకగా అద్భుతమైన ఫలితాలను అందించారు.

ఈ విజయాలు గుణాత్మక ఉచిత విద్యను అందించి జ్ఞాన సమాజ నిర్మాణానికి కట్టుబడి ఉన్న ప్రభుత్వ వైఖిరి స్పష్టమవుతున్నది .
2020 ఇంటర్ విద్య స్వర్ణోత్సవ సంవత్సరం, అలాగే ఇంటర్ విద్య కు ఆద్యుడు పితామహుడు తెలంగాణ ముద్దుబిడ్డ భారత ప్రియ పుత్రుడు మాజీ ప్రధాని పి వి నర్సింహారావు శతజయంతి కూడా.ఈ సందర్భంగా ప్రభుత్వము ప్రభుత్వ ఇంటర్ విద్య పెరగడానికి అనేక ఉద్దీపనలు ప్రకటించాలని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం ఇంటర్ విద్య విభాగం,విద్య పరిరక్షణ సమితి కోరుతున్నది.ఇంటర్ విద్యా మండలి ఇంటర్ విద్య యాభై వసంతాన్ని,పి వి శత జయంతి వేడుకలను స్ఫూర్తిదాయకంగా నిర్వహించాలి.సేవాభావముతో పని చేసే విద్యా సంస్థలను మాత్రమే అనుమతించాలి. ఒప్పంద అధ్యాపకుల క్రమబద్దీకరణ కోసం ప్రభుత్వ సంకల్పానికి అడ్డు తగులుతున్న వివాదాలను తొలగించాలి.అలాగే ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులను భర్తీ చేయాలి.అప్పటి వరకు ప్రస్తుతం పని చేస్తున్న అతిధి అధ్యాపకులను కొనసాగించాలి.ప్రభుత్వ సహకారం,ఉద్యోగ స్వామ్య అంకితభావం తో స్వరాష్ట్రంలోగత అరేళ్లలో ఇంటర్ విద్య ఆనందంలో కొనసాగుతున్నది.స్వర్ణోత్సవ కానుకలుగా మరింత సహాయాన్ని అందించాలి.పి వి దీక్షతో సంకల్ప బలంతో ఆరంభించిన జూనియర్ కళాశాలలను రెసిడెన్షియల్ విధానంలోకి మార్చాలి. వ్యవసాయ రంగంలోనే కాదు,విద్యా రంగంలో కూడా యావత్ దేశానికి తెలంగాణ మార్గదర్శకంగా ,దీపస్థంభంగా మారుతుంది.

అస్నాల శ్రీనివాస్
తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం (ఇంటర్ విద్య)
Asnala SrinivasBCICTinformation and communication technologyInter EducationMinorityNCERTSocial WelfareTelangana Gazetted Officers AssociationTribal Gurukul Junior College
Comments (0)
Add Comment