ఉస్మానియా దవాఖానా…. కొత్త భవనానికి మోక్షం ఎప్పుడో…

  • సీఎం కేసీఆర్‌ ‌హామీకి ఆరేళ్లు
  • మంత్రి లక్ష్మారెడ్డి హయాంలో మాస్టర్‌ ‌ప్లాన్‌
  • ఐనా…కొత్త భవనం నిర్మాణానికి పడని ముందడుగు
  • ఇంకా పురాతన భవనంలోనే వైద్య చికిత్సలు

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర ప్రతినిధి: తెలంగాణ రాష్ట్రంలోనే అత్యంత పురాతన, అతి పెద్దదైన ఉస్మానియా హాస్పి•ల్‌కు కొత్త భవనం నిర్మాణం ఎప్పుడనేది మిలియన్‌ ‌డాలర్ల ప్రశ్నగా మిగిలింది. వందేళ్ల చరిత్ర కలిగిన ఈ భవనం పెచ్చులూడి పూర్తి శిథిలావస్థకు చేరినప్పటికీ ప్రభుత్వం దీనిపై శ్రద్ద వహించడం లేదనే ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఈ దవాఖానాలో ఎప్పుడు ఏం జరుగుతుందో అనే భయాందోళనతో వైద్యులు రోగులకు చికిత్సలు అందిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం నుంచే కాకుండా సమీపంలోని మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రం నుంచి ప్రతీ రోజు దాదాపు 1500 వందల నుంచి 2000 మంది వరకు రోగులు వైద్య చికిత్సల కోసం వొస్తుంటారు. ఈ దవాఖానాలో ఎప్పటికీ దాదాపు 1000 మంది దాకా ఇన్‌పేషెంట్లు ఉంటారు. దాదాపు వందేళ్ల క్రితం నిర్మించిన భవనం కావడం, ప్రతీ రోజూ వేల సంఖ్యలో వొచ్చే రోగులకు సరిపోకపోవడంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన వెంటనే 2014లో టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ దవాఖానాను పూర్తి స్థాయిలో పునరుద్ధరించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా స్వయంగా సీఎం కేసీఆర్‌ ఈ ‌దవాఖానాను ఉన్నతాధికారులతో కలసి పరిశీలించారు.

ఇప్పుడు దవాఖానాను కూల్చివేసి ఆధునిక వసతులు, మౌలిక సౌకర్యాలతో ట్విన్‌ ‌టవర్లుగా కడతామని ప్రకటించారు. అయితే, ఉస్మానియా దవాఖాన హెరిటేజ్‌ ‌భవనాల కిందికి వొస్తుందని దీనిని కూల్చివేయవద్దని కొందరు కోర్టును ఆశ్రయించారు. దీంతో పురాతన భవనాన్ని కూల్చకుండానే కొత్త భవన నిర్మాణం కోసం వైద్య నిపుణులు ప్రత్యామ్నాయ మార్గాలను సూచించారు. అయినప్పటికీ ప్రభుత్వం ఆ దిశగా ఎలాంటి చర్యలు చేపట్టలేదు. హైకోర్టు కూడా హెరిటేజ్‌ ‌బిల్డింగ్‌ ‌మినహా మిగిలిన బిల్డింగ్‌లను కూల్చి కొత్త భవనం నిర్మించడానికి అభ్యంతరం ఏమిటని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. సీఎం కేసీఆర్‌ ‌హామీ ఇచ్చి దాదాపు ఆరేళ్లు పూర్తయినప్పటికీ ఉస్మానియా దవాఖానాకు కొత్త భవనం నిర్మించే దిశగా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. గతంలో వైద్యారోగ్య శాఖ మంత్రిగా పనిచేసిన లక్ష్మారెడ్డి ఉస్మానియా దవాఖానాను సందర్శించి కొత్త భవన నిర్మాణం కోసం మాస్టర్‌ ‌ప్లాన్‌ ‌రూపొందించాలని ఆదేశించారు.

మంత్రి ఆదేశాల మేరకు మాస్టర్‌ ‌ప్లాన్‌ ‌రూపొందించి ఓ కన్సల్టెన్సీకి నిర్మాణ బాధ్యతలు కూడా అప్పగించారు. 5 లక్షల చదరపు గజాల విస్తీర్ణంలో కొత్త భవనం నిర్మాణానికి ప్రతిపాదనలను కన్సల్టెన్సీ నిర్వాహకులు ప్రతిపాదనలు చేయగా అది కూడా అటకెక్కింది. కాగా, గత వర్షాకాలంలో ఉస్మానియా దవాఖానా భవనం పెచ్చులూడి పైభాగం బాగా దెబ్బతిన్నది. వర్షపు నీరు దవాఖానాలోకి ప్రవేశించి రోగులు ఇబ్బంది పడటంతో దవాఖానా అధికారులు వారిని పక్క భవనంలోని తరలించారు. ఉస్మానియా దవాఖానాలో విధులు నిర్వర్తించే వైద్యులు సైతం హెల్మెట్‌లు ధరించి రోగులకు వైద్య సేవలు అందించి ప్రభుత్వానికి తమ నిరసనను తెలిపారు. కాగా, 24 డిపార్ట్‌మెంట్లు ఉన్న ఉస్మానియా దవాఖానా పురాతన భవనం స్థానంలో వెంటనే కొత్త భవనం నిర్మించి ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని రోగులు, వైద్యులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.

new buildingOsmania Hospitalprajatantra newstelangana updatestelugu kavithaluToday Hilights
Comments (0)
Add Comment