తిరుమల, జనవరి 24 : కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 10 కంపార్టుమెంట్లలో భక్తులు వేచియున్నారు. టోకెన్లు లేని భక్తులకు 18 గంటల్లో దర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. సోమవారం స్వామివారిని 70,413 మంది భక్తులు దర్శించుకోగా 32,206 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 3.37 కోట్లు వచ్చిందని తెలిపారు. తిరుపతిలో వెలసిన శ్రీ కపిలేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 11 నుంచి 20వ తేదీ వరకు వైభవంగా జరగనున్నాయి.
ఇందులో భాగంగా ఫిబ్రవరి 10న శాస్తోక్త్రగా అంకురార్పణ జరుగనుంది. ప్రతిరోజూ ఉదయం 8 నుంచి 10 గంటల వరకు, తిరిగి రాత్రి 8 నుంచి 10 గంటల వరకు వాహనసేవలు జరుగనున్నాయి.11న ఉదయం ధ్వజారోహణం(నలగ్నం) హంస వాహనం, 12న సూర్యప్రభ వాహనం, చందప్రభ వాహనం,13న భూత వాహనం, సింహ వాహనం, 14 మకర వాహనం,శేష వాహనం సేవలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. 15 న తిరుచ్చి ఉత్సవం, అధికారనంది వాహనం 16న వ్యాఘ్ర వాహనం,గజ వాహనం, 17 న కల్పవృక్ష వాహనం,అశ్వ వాహనం,18న రథోత్సవం (భోగితేరు),నందివాహనం సేవలు కొనసాగుతాయన్నారు. 19న పురుషామృగవాహనం కల్యాణోత్సవం,తిరుచ్చి ఉత్సవం,20 న త్రిశూలస్నానం ధ్వజావరోహణం, రావణాసుర వాహనంపై బ్రహోత్సవాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.