భారత్, చైనా సరిహద్దుల్లోని తూర్పు లడక్ ప్రాంతంలోని గాల్వన్‌లోయలో రెండు దేశాల సైనికుల మధ్య జరిగిన దాడిలో మనదేశానికి చెందిన లెఫ్టెనెంట్ కల్నల్‌తో పాటు ఇరవై మంది సైనికులు మృతి చెందడంతో యావత్ భారత ప్రజానీకం తీవ్రంగా గర్హిస్తున్నది. ఒక వైపు స్నేహం నటిస్తూనే మరోవైపు సైన్యంపై దాడులు చేయడం, భారత భూభాగాన్ని ఆక్రమించడమన్నది చైనాకు నిత్యకృత్యమైందంటూ, ఇక భారత్ కూడా శాంతి వచనాలకు స్వస్తిచెప్పి తగిన బుద్ది చెప్పాల్సిన అవసరముందంటున్నారు. అలాగే ఆ దేశాన్ని ఆర్థికంగా బలహీనం చేయాల్సిన అవసరముందని ప్రజలంతా ఏకకంఠంగా చెబుతున్నమాట. దాదాపు ప్రపంచ వ్యాప్తంగా చైనా తన వ్యాపార మార్కెట్‌ను విస్తరించింది. చైనా వస్తువులు కొనుగోలు చేయని దేశ ప్రజలు లేకుండా పోయారంటే అతిశయోక్తికాదు. కాని, తన మార్కెట్‌ను ఎలా విస్తరించుకుంటూ పోతున్నదో, అలాగే తన ఆధిపత్యాన్నికూడా విస్తరించుకునే కుట్రతో ఆదేశం ముందుకు సాగుతోంది. ఇవ్వాళ ప్రపంచాన్నే గడగడలాడిస్తున్న కొరోనా వైరస్‌కు పుట్టినిల్లు చైనా అనే భావిస్తున్నారు. ఈ వైరస్ ప్రపంచవ్యాప్తంగా విస్తరించే విషయంలో చైనా కుయుక్తి ఉందన్న వార్తలు వొస్తున్నాయి. దీనివల్ల ప్రపంచ దేశాలను ఆర్థికంగానే కాకుండా మానసికంగా కృంగదీయాలన్న కుశ్చిత ఆలోచన ఆ దేశానికుందన్నమాట సర్వత్రా వినిపిస్తున్నది. ప్రధానంగా అగ్రరాజ్యంగా కొనసాగుతున్న అమెరిస్థాయిని తగ్గించాలన్న ఆలోచన కూడా చైనాకు లేకపోలేదంటున్నారు. కొరోనా వైరస్‌ను తీసుకుని అమెరికా కూడా ఇప్పుడు చైనా పైన గుర్రుగానే ఉంది. చైనాను ఏకాకిని చేయాలన్న ఆమెరికా ఆలోచనలో భారతదేశాన్ని భాగస్వామ్యం చేస్తున్నదన్న కోపం చైనాకుంది. దాదాపు స్వాతంత్య్రనుండి ఇప్పటివరకు అనగా ఏడు దశాబ్ధాల కాలంగా చైనా ఏదో ఒక సాకుతో భారత్‌పై ప్రత్యక్షంగానో,పరోక్షంగానో దాడులు చేస్తూనే ఉంది.
గతంలో జరిగిన యుద్దంలో భారత ప్రభుత్వం చైనాను తిప్పికొట్టకలిగింది. నేటికీ ఆ సత్తా తమకుందని భారత్ సైన్యం ప్రకటిస్తున్నదికూడా. అయితే యుద్దమన్నది ఇరు దేశాలకు వాంఛనీయం కాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరే విధంగా బుద్ధి చెప్పవచ్చన్న విషయంలో అందరూ ఒకే మాట చెబుతున్నారు. చైనా ఆర్థిక సామ్రాజ్యాన్ని కట్టడి చేయడం ద్వారా ఆదేశం తోకముడిచే చర్యలు చేపట్టాలంటున్నారు. ఇప్పటికే వాణిజ్య సంస్థ అయిన కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ట్రేడర్స్ (సిఏఐటి) బహిష్కరించాల్సిన అయిదు వందల వస్తువుల జాబితాను సిద్దం చేసింది కూడా. ‘ఇండియన్ గూడ్స్ – మా అభిమానం’ అన్న పిలుపుతో క్యాట్ తన ప్రచారాన్ని ప్రారంభించింది. చైనా వస్తువుల బహిష్కరణల నేపథ్యం లో ఆ స్థానంలో భారతీయ వస్తువుల వాడకాన్ని పెంచాలన్నది క్యాట్ చేస్తున్న ప్రచారం. చైనా నుండి ప్రతీఏటా దిగుమతి చేసుకునే బిలియన్ల డాలర్ల వాణిజ్య లోటును తీర్చుకోవాలని క్యాట్ లక్ష్యంగా పెట్టుకుంది. క్యాట్ తయారు చేసిన జాబితాలో రోజువారీగా మనం వాడుకునే వస్తువులు, పిల్లల ఆట బొమ్మలనేకమున్నాయి. అలాగే బిల్డింగ్ హార్డ్‌వేర్, వంటగది సామానులు, పాదరక్షలు, వస్త్రాలు, కాస్మటిక్స్, ఎలక్ట్రిక్, ఎలక్ట్రానిక్ వస్తువులు, ఫర్నీచర్స్, ఆటోలు, సెల్లు, కంటి అద్దాలు, గడియారాలు, ఆహార వస్తువులుకూడా ఉన్నాయి. తాజా సంఘటనతో విహెచ్పీ, భజరంగ్ దళ్ కూడా ఈ వస్తువులను బహిష్కరించాలని ప్రజలకు పిలుపునిచ్చాయి.
చాలామంది నెటిజన్స్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. గుజరాత్, సూరత్‌లలో చైనా వస్తువులను ధ్వంసం చేస్తున్నట్లు వార్తలు వొస్తున్నాయి. తన ఇంట్లో ఉన్న చైనా టివీని కిందపడేసి ఓ వ్యక్తి బద్దలు కొట్టినట్లు కూడా సోషల్ మీడియాలో చోటుచేసుకుంది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న బిఎస్ఎన్ఎల్ కూడా ముందుంది. 4జీ అప్‌గ్రేడ్ సేవలకు చైనా వస్తువులను వాడకూడదని నిర్ణయం తీసుకుంది. మిలటరీ అధికారులు చైనా యాప్‌లను వాడకూడదన్న నిర్ణయం తీసుకున్నారు. అయితే భారత ప్రభుత్వమే చైనా వస్తువులన్నిటిని ఎందుకు నిషేదించకూడదన్న ప్రశ్న వినిపిస్తున్నది. చైనా మొబైల్ ఫోన్లు, యాప్‌ల వల్ల భారతదేశానికి నష్టంకలుగుతున్నదన్న విషయాన్ని చాలా కాలంగా చాలామంది సాంకేతిక నిపుణులు చెబున్నాతూనేఉన్నారు. ఈ ఫోన్లద్వారా ఇక్కడి సమాచారాన్ని చైనా సంగ్రహించే అవకాశం ఉందని చెబుతున్నప్పటికీ వాటి వాడకాన్ని అటు ప్రభుత్వాలు ఇంతకాలంగా నిషేదించకపోగా, ఢిల్లీ మీరట్ ఆర్ఆర్టిఎస్ (రీజినల్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్) భూగర్భ సొరంగ మార్గ విస్తరణ ప్రాజెక్ట్ నిర్మాణం కోసం ఒక చైనా సంస్థకు కాంట్రాక్ట్ మంజూరు చేసిన వార్తాపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది.ఈ టెండర్లు ఖరారు పై వ్యతిరేకత వ్యక్తం అవుతున్న నేపథ్యంలో కేంద్రప్రభుత్వం పత్రిక ప్రకటన విడుదల చేసింది. దీని ప్రకారం ఇంకా టెండర్ ప్రక్రియ కొనసాగుతుంది .. చైనా కంపెనీతో కాంట్రాక్టు ఇంకా ఖరారు కాలేదు. అని తెలుపుతూ %•ణదీ%, ప్రపంచ బ్యాంక్ , మల్టీ-లాటరల్ ప్రొక్యూర్మెంట్ మార్గదర్శకాల ప్రకారం సంస్థల లేదా దేశాల మధ్య వివక్షగా వ్యవహరించడానికి భారత్ కి అనుమతి లేదని కూడా గమనించాలి అని కేంద్రం ప్రకటన విడుదల చేసింది.
ప్రజలుకూడా ఎక్కువ సౌకర్యవంతంగా ఉన్నాయన్న ఆలోచనతో వాటినే కొనుగోలు చేస్తున్నారు. చైనాకు సంబంధించిన యాప్స్ వాడితే డేటా చైనాకు తరలిపోతున్నాయంటూ తాజాగా 50కి పైగా యాప్‌లను భారత ఇంటలిజన్స్ వర్గాలు బహిర్ఘతం చేసినట్లు తెలుస్తున్నది. వాటిల్లో జూమ్, టిక్‌టాక్, యూసీ బ్రౌజర్, షేర్ఇట్, క్లీన్ మాస్టర్ లాంటివనేకం వున్నట్లుగా చెబుతున్నప్పటికీ ఇంకా వాటితీరును పరిశీలించే పనిలోనే ఉన్నట్లు తెలుస్తున్నది. దేశం ఇలా నిర్లప్తతగా ఉండడానికి ఆ స్థాయిలో భారత్ తన ఉత్పత్తి రంగాన్ని మెరుగుపర్చుకోకపోవడమే నంటున్నారు. ఎందుకంటే పైన చెప్పిన వస్తువులతోపాటు వైద్య, వ్యవసాయరంగ పరికరాలతోపాటు చివరకు ఎరువులను కూడా చైనా నుండి దిగుమతిచేసుకుంటున్న పరిస్థితిలో ప్రజలే తప్ప ప్రభుత్వం ఇప్పట్లో బహిష్కరించే అవకాశాలుండవన్నది స్పష్టమవుతున్నది.