జీవగర్ర

కొన్నాళ్ళు పోయాక మనందరికీ
ఓ కర్ర సాయం అవసరం
ఈ దేహానికి- ఒక చేతుకు
ఒక కర్ర అవసరం
అత్యవసరం
ఆ కర్రను మోపడానికి
ఓ తలం
అది మన బరువును
భరించడానికి సత్తువ
రెక్కలున్నంతవరకూ
విర్రవీగుతాం
ఆపై కూడా వీగుతూనే
వుంటాం లోలోపల
చూపులు శ్వాస చప్పుళ్ళు
తెలుపుతాయి
అహపు పరిమాణాన్ని
ఆపై పరిణామాల్ని
మన చేతులు
మట్టిని పిసికుంటే
మన కాళ్ళు
వానలో తడిసుంటే
మన దేహం
ఇసుకలో మమేకమైవుంటే
మనల్ని మనం ఒక రేణువులా
పరిగణించుకుంటాం
అప్పుడా కర్రను సరిగ్గా ప్రేమిస్తాం
ఆహ్వానిస్తాం మనలోకి
దాంతో ఆడుకుంటాం
మాటాడతాం
దాన్ని ఆసరాగా చేసుకుని
కొన్ని పనులు ఆవిష్కరిస్తాం
కొన్ని పరిచయాలు
కొన్ని సంగతులు
కొన్ని మంచి మాటలు
ఆ కర్ర సాయంతోనే సాధిస్తాం
ఒకానొకరోజు దాన్ని
ఒంటరిని చేసి పోతాం
నిజం!
అది మనతో వుండీ వుండీ
మనం పోయింతర్వాత
మనలా రోదిస్తుంది
ఓ మూలనో ఏ అటక మీదనో
మిగిలిపోతుంది స్థబ్దుగా…
– రఘు వగ్గు,                          తాటికొండ

prajatantra newsTelangana news updatestelugu short newstelugu vaarthalutoday breaking updates
Comments (0)
Add Comment