సెలవులు వద్దు….. స్కూళ్లే ముద్దు

తెలంగాణ రాష్ట్రం అంతటా సంక్రాంతికి సెలవులు ఇచ్చి మళ్లీ పాఠశాలలు తెరవాల్సిన సమయంలో కొరోనా, ఒమిక్రాన్ వ్యాప్తి అంటూ ప్రభుత్వం మళ్లీ సెలవు లను పొడిగించింది. ఉపాధ్యాయ సంఘాలతో,తల్లిదండ్రుల తో, యాజమాన్యాలతో చర్చించకుండా ఏకపక్ష నిర్ణయం తీసుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. పైగా లైవ్ క్లాసులు జరపాలా? వద్దా? అని తేల్చకుండా 13రోజులు సెలవులు అంటే విద్యార్థులు ఈ సెలవుల్లో ఏం చేయాలో చెప్పనేలేదు. అసలే కొరోనా కారణంగా రెండేండ్లు ఇంటికే పరిమిత మైనప్పటికీ విద్యార్థులు అభ్యసనం పట్ల ఆసక్తి చూపక అలసత్వంతో ఉన్నారు. ఆఫ్ లైన్లో చదవడం, వ్రాయడం పై ఉపాధ్యాయులు మళ్లీ నేర్పుతున్నప్పటికీ ఇప్పుడిప్పుడే గాడిలో పడుతున్న విద్యార్థులకు ఈ సెలవుల పెంపు శాపంగా తగిలింది. జ్ఞానం, స్మృతి,ధారణ, సృజనాత్మకత, పరిశీలన, వంటి అంశాలు లోపించి చదువు పై అనాసక్తి పెరిగింది.

మన రాష్ట్రంలో చదువు విషయానికి వస్తే ఒక అడుగు ముందుకు రెండడుగులు వెనక్కి తీరుగా మారింది. తల్లిదండ్రుల కు కూడా తమ పిల్లల చదువు విషయం,భవిష్యత్తు పై బెంగ పట్టుకుంది. తమ పిల్లలు ఫోన్ లో గేములకు అలవాటు పడి చదువును అశ్రద్ధ చేస్తున్నారని ఏం చేయాలో తోచక మానసిక వైద్యులను సంప్రదిస్తున్నారు. ఇలాగే పరిస్థితి ఉంటే విద్యార్థులు జాతీయ, అంతర్జాతీయ పోటీ పరీక్షలకు ఎలా సంసిద్ధులౌతారని వాళ్ళకు భయం పట్టుకుంది. ఇప్పటికే విద్యార్థులు చదవడం, వ్రాయడం పై పట్టు కోల్పోయారు. తరగతి గదిలో టీచర్ పాఠాలు బోధిస్తున్నప్పుడు అర్థం అయి, అర్థంకాని స్థితి. దీనికంతటికీ కారణం రెండేళ్లుగా భౌతికంగా పాఠాలు వినకపోవడమేనని అందరికీ అర్థం అయిన విషయమే.

దేశ భవిష్యత్తు తరగతి గదిలో నిర్మితమవుతుందన్న మాటల్ని నిజం చేసే టీచర్స్ పాఠాలు బోధించడానికి సిద్ధంగా ఉంటే విద్యాశాఖ, ప్రభుత్వం మాత్రం అడ్డు పడుతుంది. పిల్లల భవిష్యత్తు గురించి ఏ మాత్రం ఆలోచించకుండా వాళ్ళను విద్యకు దూరం చేస్తున్నది. రేపటి పోటీ పరీక్షలను ఎదుర్కోలేక వాళ్లంతా నిరుద్యోగులుగా మారే అవకాశం లేక పోలేదు. అప్పుడు సమాజం మెుత్తం బాధపడాల్సి వస్తుంది. భౌతికంగా తరగతులకు హాజరైనప్పటి నుండీ ఏ ఒక్క పాఠశాల తీవ్రంగా కొరోనా కు గురి కాలేదు.పైగా టీచర్సందరూ 100% వ్యాక్సినేటెడ్. ప్రభుత్వానికంటే టీచర్సే విద్యార్థుల గురించి ఎక్కువ బాధ్యత తీసుకుంటారు. సమాజ నిర్మాతలు అని పేరు కే గాని వాళ్ళ కు ఉన్నంత అంకితభావం, బాధ్యత మరెవరికీ లేవు ఇది స్పష్టం.

మన రాష్ట్రంలో థియేటర్లలో, పబ్బుల్లో, మాల్స్ లో ,రాజకీయ మీటింగ్స్ లో రాని కరోనా, ఒమిక్రాన్ కేవలం స్కూళ్లలో వస్తుందని భ్రమించడం హాస్యాస్పదం. లేదంటే దీనిని శాస్త్రీయంగా నిరూపించగలరా! వ్యాప్తిని అరికట్టలేని , నియంత్రించలేని వైద్యశాలను ఒకరకంగా అవమానించడమే అవుతుంది. ఇంటర్ విద్యార్థుల చేత భంగపడిన ప్రభుత్వం. మరో భంగపాటుకు రెడీగా ఉందేమో! లేకుంటే పేద విద్యార్థులు చదువుకునే పాఠశాలలు ఎందుకు పనికి రాకుండా పోతాయి. ఒక తరం విద్యకు దూరమౌతుంది.నేటి పాలకులు గత నిజాం ను గుర్తు చేస్తుందన్నంత నిజం లేక పోలేదు.
-కాళేశ్వరం కృష్ణమూర్తి, ప్రైవేట్ టీచర్, 9705196097

No holidays likes school
Comments (0)
Add Comment